ఖమ్మం, న్యూస్‌లైన్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో జిల్లాలోని వందలాది గ్రామాలను నీట ముంచడాన్ని వ్యతిరేకిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో గురువారం తలపెట్టిన జిల్లా బంద్ విజయవంతమైంది. సీపీఎం, సీపీఐ, సీసీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ, టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. ప్రధాన రహదారులపై రాస్తారోకో చేశారు. విద్యార్థి సంఘాలు, ఆయా పార్టీలకు చెందిన మహిళా, యువజన విభాగాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు, మోటార్‌సైకిల్ ర్యాలీలు చేపట్టారు.
భద్రాచలం, పాల్వంచ డివిజన్ల పరిధిలోని ముంపు ప్రాంతాల ప్రజలు, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో జలదీక్షలు చేశారు. బస్సులు బయటకు రాకుండా బస్టాండ్, డిపోల ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆందోళనకారులకు పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. తెలంగాణ జేఏసీ అనుబంధ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలోనూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. పలువురు ఉద్యోగులు భోజన విరామ సమయంలో కార్యాలయాల ఎదుట నిరసన తెలిపారు.
పలు చోట్ల ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలను మూసివేశారు. జిల్లా వ్యాప్తంగా వ్యాపార సముదాయాలు తెరుచుకోకపోవడంతో ని త్యం కలకళలాడే వ్యాపార కూడళ్లు వెలవెలబోయాయి. పెట్రోల్ బంక్‌లు తెరుచుకోలేదు. బ్యాంకులు మూసివేయడంతో కోట్ల రూపాయల లావాదేవీలు స్తంభించిపోయాయి.
ఖమ్మంలో సీపీఎం, సీపీఐ, టీఆర్‌ఎస్, న్యూడెమోక్రసీ కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించి దుకాణాలను బంద్ చేయించారు. పోలవరం డిజైన్ మార్చాలని, భద్రాచలం, పాల్వంచ డివిజన్‌లలోని మండలాలను ఖమ్మం జిల్లాలో ఉంచాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, మహిళా సంఘం కార్యకర్తలు బస్టాండ్ ఎదుట ధర్నా చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో ఐద్వా నాయకురాలు గట్టు రమాదేవికి స్వల్ప గాయాలయ్యాయి. సీపీఎం నాయకులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీపీఐ ఆధ్వర్యంలోనూ మోటార్‌సైకిల్ ప్రదర్శన చేశారు.
నగరంలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ పోలవరం ముంపు ప్రాంతాలను తెలంగాణలోనే కొనసాగించాలని నినాదాలు చేశారు. న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఖమ్మం బస్ డిపో వద్ద ధర్నా, అనంతరం నగరంలో ప్రదర్శన నిర్వహించారు. వీరికి మద్దతుగా టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు కూరపాటి రంగరాజు ప్రదర్శనలో పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఖమ్మంలో ప్రదర్శన నిర్వహించి పలు దుకాణాలను బంద్ చేయించారు. అనంతరం అఖిలపక్ష పార్టీలతో కలిసి మోటార్‌సైకిల్‌ర్యాలీ నిర్వహించారు.
భద్రాచలం డివిజన్‌లో బంద్ సంపూర్ణంగా జరిగింది. టీజేఏసీ డివిజన్ అధ్యక్షుడు చల్లగుళ్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. దీంతో డివిజన్ వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు పడ్డాయి. బంద్ విజయవంతం కోసం సీపీఎం, సీపీఐ, టీడీపీ, న్యూడెమోక్రసీ, టీఆర్‌ఎస్ కార్యకర్తలు వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించారు. తుడుందెబ్బ ఆధ్వర్యంలో గోదావరి నదిలో జలదీక్ష చేపట్టారు. రాష్ట్రపతి పాలన ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సులను అడ్డుకోవటం, రాస్తారోకో, ధర్నాలు చేయడం తగదని పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేశారు. సీపీఎం నాయకులు అంబేద్కర్ సెంటర్లో ఆర్టీసీ బస్సుకు గాలి తీసేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డగించారు.
కొత్తగూడెం నియోజకవర్గంలో బంద్ విజయవంతమైంది. బ్యాంకులు, వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఉదయమే రోడ్లపైకి వచ్చిన సీపీఎం శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. బంద్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పాల్వంచలో కొన్ని చోట్ల వ్యాపార సముదాయాలు తెరిచే ఉంచారు.
పినపాక నియోజకవర్గంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, గుండాల మండల కేంద్రాల్లో అన్ని విద్యాసంస్థలు, వ్యాపార వర్గాలు బంద్‌లో పాల్గొని బంద్‌ను విజయంతం చేశాయి.
సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి, పెనుబల్లి, తల్లాడ, కల్లూరు మండలాలలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు బ్యాంకులను అఖిలపక్ష నాయకులు బంద్ చేయించారు. సీపీఐ, సీపీఎం, టీఆర్‌ఎస్, న్యూడెమోక్రసీ నాయకులు పట్టణంలో ప్రదర్శనలు చేశారు.
వైరా, కారేపల్లి, జూలూరుపాడు, ఏన్కూరు, కొణిజర్ల మండలాల్లో బంద్ సంపూర్ణంగా జరిగింది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతో పాటు వ్యాపార సంస్థలు, అన్ని విద్యాసంస్థలు మూతబడ్డాయి. సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, టీఆర్‌ఎస్ నాయకులు బంద్‌లో పాల్గొన్నారు.
ఇల్లెందు నియోజకవర్గంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. పట్టణంలో ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. సబ్‌డివిజన్ వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు పడ్డాయి. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట, ముల్కలపల్లి మండలాల్లో బంద్ జరగలేదు. ముల్కలపల్లి మండలంలో సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించగా, మిగిలిన అన్ని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
పాలేరు నియోజకవర్గంలో బంద్ విజయవంతమైంది. ఖమ్మం రూరల్ మండలంలో సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేశారు.
నేలకొండపల్లి మండలంలో టీఆర్‌ఎస్, సీపీఎం, న్యూ డెమోక్ర సీ, టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వ కార్యాలయాలను, వాణిజ్య సముదాయాలను మూసివేయించారు. కూసుమంచి మండలంలో సీపీఎం, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలను మూసి వేయించారు. తిరుమలాయపాలెం మండలంలో న్యూడెమోక్రసి, సీపీఎం, సీపీఐ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు.
బంద్ విజయవంతం
Published Fri, Mar 7 2014 1:35 AM | Last Updated on Wed, Oct 17 2018 3:43 PM
Advertisement
Advertisement