వణికించిన రోను! | District Widespread rains! | Sakshi
Sakshi News home page

వణికించిన రోను!

Published Sat, May 21 2016 12:59 AM | Last Updated on Mon, Sep 4 2017 12:32 AM

District Widespread rains!

జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
మూడు రోజుల పాటు భయపెట్టిన తుపాను
ఒడిశా వైపు పయనంతో తప్పిన పెనుముప్పు
శుక్రవారం ఒక్కరోజే 2,611.2 మి.మీ వర్షపాతం
30 మీటర్లు ముందుకొచ్చిన సముద్ర అలలు
అపరాలు, మిరప, అరటి, బొప్పాయి పంటలపై ప్రభావం
ఉప్పు, ఇటుక పరిశ్రమలకు తీరని నష్టం
కాలిపోయిన 187 విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్లు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/శ్రీకాకుళం పాత బస్టాండ్: అనూహ్యంగా దిశ మార్చుకొని జిల్లావైపు దూసుకొచ్చిన తుపాను రోను మూడు రోజుల పాటు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది.

అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించింది. తెరలు తెరలుగా విరుచుకుపడి జిల్లా అంతటినీ ముద్ద చేసింది.  ఈ వర్షాలతో జిల్లా మొత్తం మీద 3,690.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఒక్క శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ 2,611.2 మిల్లీమీటర్ల మేర రికార్డయ్యిందంటే పరిస్థితి ఊహించవచ్చు. జిల్లాలోని మొత్తం 38 మండలాలకు 29 మండలాలపై తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది. వాటిలోని 11 తీర ప్రాంత మండలాల్లో కుండపోత వర్షాలు పడ్డాయి. నష్టం కూడా ఈ మండలాల్లోనే ఎక్కువగా ఉంది. మొక్కజొన్న, మిరప, పెసర, మినుము పంటలకు, మామిడి, అరటి తోటలకు నష్టం జరిగింది.

వజ్రపుకొత్తూరు, నౌపడ, బందరువానిపాలెం ప్రాంతాల్లో ఉప్పు పరిశ్రమకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. ఒక్క వజ్రపుకొత్తూరు ప్రాంతంలోనే దాదాపు రూ.30 లక్షల వరకూ ఉప్పు రైతులు నష్టపోయారు. పాతపట్నం, గార తదితర మండలాల్లోని ఇటుక పరిశ్రమలు దెబ్బతిన్నాయి. చివరకు రోను తుపాను ఒడిశా వైపు పయనించడంతో శుక్రవారం సాయంత్రానికి వానలు తెరిపిచ్చాయి.
     
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రోను తుపానుగా మారిన ప్రభావంతో బుధవారం నుంచి జల్లులు మొదలయ్యాయి. గురు, శుక్రవారాల్లో మాత్రం కుండపోత వర్షాలు పడ్డాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకూ అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 3,611.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శుక్రవారం అత్యధికంగా కంచిలి మండలంలో 92.4 మి.మీ, అత్యల్పంగా పొందూరు, సంతకవిటి, టెక్కలి మండలాల్లో 9.4 మి.మీ చొప్పున నమోదైంది. శ్రీకాకుళం నగరంతో పాటు ఇచ్ఛాపురం, పలాస, రణస్థలం, టెక్కలి తదితర ప్రాంతాల్లో వీధులు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల ఇళ్లలోకి వరదనీరు చొచ్చుకొచ్చింది. ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని ఇద్దిపానిపాలెం గ్రామం వద్ద సుమారు 30 మీటర్ల ముందుకు సముద్రం నీరు పోటెత్తడంతో గ్రామస్థులు ఆందోళన చెందారు.  
 
కూలిన పూరిళ్లు...
రణస్థలం మండలం కొచ్చెర్ల, సూరంపేటలలో రెండు,  జలుమూరు మండలంలో రెండు, వజ్రపుకొత్తూరు మండలం కొమరల్తాడ గ్రామంలో ఒక పూరిల్లు కూలిపోయాయి. పొందూరులో నిర్మాణంలో ఉన్న చర్చిగోడ పడిపోయింది. టెక్కలి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉన్న చెట్టు కూలిపోవడంతో ఓ రిక్షా కార్మికుడు గాయపడ్డాడు.
 
చేతికొచ్చిన పంట వర్షార్పణం...
లావేరు, రణస్థలం మండలాల్లో మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. పాతపట్నం ప్రాంతంలో మామిడికాయలు నేలరాలాయి. మిరపమొక్కలు నేలకొరిగాయి. పెసర, మినుము, నువ్వు వంటి తృణధాన్యాల పంటలు నీట మునిగిపోయాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో అరటి, బొప్పాయి తదితర ఉద్యాన పంటలకు నష్టం జరిగింది. ఈ నష్టాన్ని అధికారులు పూర్తిస్థాయిలో లెక్కించాల్సి ఉంది.
 
ఉప్పు, ఇటుక పరిశ్రమలకు నష్టం...
వజ్రపుకొత్తూరు మండలంలోని కొండూరు, నగరాంపల్లి, పూండిగల్లి, తేరపల్లి, నువ్వులరేవు ప్రాంతాల్లోని 250 మంది ఉప్పు రైతులకు రూ.30 లక్షల వరకు నష్టం ఏర్పడింది. మడుల్లోని ఉప్పు వర్షాలకు కరిగిపోయింది. అలాగే నౌపడ, బందరువానిపేట ప్రాంతంలోని ఉప్పు పరిశ్రమపైనా వర్ష ప్రభావం తీవ్రంగానే ఉంది.
 
విద్యుత్‌పైనే ఎఫెక్ట్...
రోను తుపాను ప్రభావం వల్ల రెండు రోజుల్లో విద్యుత్ శాఖకు రూ.57 లక్షల మేర నష్టం వాటిల్లిందని ఏపీఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ జి.శరత్‌బాబు తెలిపారు. తీరప్రాంత మండలాలైన నరసన్నపేట, సోంపేట, ఇచ్ఛాపురం, పలాస, మందసతోపాటు మైదాన ప్రాంతంలోని ఆమదాలవలస మండలంలో అత్యధికంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయన్నారు. ఇంతవరకూ పిడుగులు, ఈదురుగాలుల ప్రభావంతో 187 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు పాడైపోయినట్టు గుర్తించామన్నారు. 65 విద్యుత్ స్తంభాలు గాలికి విరిగిపోయాని తెలిపారు.  చాలాచోట్ల వైర్లు తెగిపడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అత్యవసర పనులు చేపట్టి చాలాచోట్ల పునరుద్ధరించారు.
 
నేతలు, అధికారుల పర్యటన...
వర్షప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం సహా రెవెన్యూ, విద్యుత్ తదితర అన్ని విభాగాల అధికారులు పర్యటించారు. సహాయ చర్యలు తీసుకోవడంతో యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి, స్పెషల్ బ్రాంచి డీఎస్పీ వివేకానంద తుపాను ప్రభావిత మండలాల్లో పర్యటించారు. మంత్రి అచ్చెన్నాయుడు టెక్కలిలో జలదిగ్భందమైన ఎన్టీఆర్ కాలనీని పరిశీలించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, నియోజకవర్గ ఇన్‌చార్జి దువ్వాడ శ్రీనివాస్ కూడా ఎన్టీఆర్ కాలనీని సందర్శించి అక్కడి పరిస్థితి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement