మహామనిషి.. మరువలేం..
జిల్లా అంతటా ఘనంగా వైఎస్ జయంతి
మచిలీపట్నం : ప్రజల మనిషి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 65వ జయంతి వేడుకలను మంగళవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పలు ప్రాంతాల్లో వైఎస్ విగ్రహాలకు క్షీరాభిషేకం నిర్వహించి నివాళులర్పించారు. భారీగా సేవా కార్యక్రమాలు చేపట్టారు.
గుడివాడ నెహ్రూచౌక్ సెంటరులోని వైఎస్ విగ్రహానికి ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) క్షీరాభిషేకం చేశారు. వైఎస్సార్ సీపీ కార్యాలయంలోనూ వైఎస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి అందించటంలో వైఎస్ ఎంతగానో కృషిచేశారని కొనియాడారు.
పేదల సొంతింటి కలను నెరవేర్చడం, రైతుల సంక్షేమం కోసం రుణాలను మాఫీ చేయటం, రుణాలు చెల్లించిన రైతులకు ప్రోత్సాహకాలు ఇప్పించటం, ఆరోగ్యశ్రీ, 108, 104, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. మునిసిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ నందివాడ మండల కన్వీనరు పెయ్యల ఆదాం, పలువురు నాయకులు పాల్గొన్నారు.
విజయవాడలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి కేపీ సారథి, ఎమ్మెల్యేలు మేకా ప్రతాప్ అప్పారావు, జలీల్‌ఖాన్, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ తదితరులు వైఎస్‌కు ఘనంగా నివాళులర్పించారు. ప్రజాసంక్షేమం కోసం వైఎస్ చేసిన సేవలను కొనియాడారు.
నందిగామలోని గాంధీ సెంటరులో ఉన్న వైఎస్ విగ్రహానికి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు క్షీరాభిషేకం నిర్వహించారు. చందర్లపాడులో కోట బుచ్చయ్యచౌదరి, ఎంపీపీ కె.రవిబాబు, కంచికచర్లలో బండి జానకిరామయ్య, వీరులపాడులో కె.ముత్తారెడ్డి తదితరులు వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నూజివీడులో వైఎస్ విగ్రహానికి మునిసిపల్ చైర్మన్ బసవ రేవతి, వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ బసవ భాస్కరరావు, లాం ప్రసాదరావు, మునిసిపల్ వైస్‌చైర్మన్ అన్నే మమత తదిత రులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మైలవరంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో, పశువుల ఆస్పత్రి సెంటర్, హనిమరెడ్డి కాంప్లెక్స్ వద్ద ఉన్న వైఎస్ విగ్రహాలకు ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. జి.కొండూరు మండలం వెలగలేరు, కుంటుముక్కల తదితర ప్రాంతాల్లో కూడా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు అప్పిడి సత్యనారాయణరెడ్డి, పామర్తి శ్రీనివాసరావు, ఎం.విజయబాబు, జి.కొండూరు ఎంపీపీ వేముల తిరుపతయ్య, జెడ్పీటీసీ సభ్యుడు కాజ బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
అవనిగడ్డ ప్రధాన సెంటరులో ఉన్న రాజశేఖరరెడ్డి విగ్రహానికి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేకనూరులో వైఎస్సార్ సీపీ నాయకుడు గుడివాక శివరాం ఆధ్వర్యంలో వైఎస్ జయంతి కార్యక్రమాలను నిర్వహించారు. వైఎస్సార్ సీపీ చల్లపల్లి, ఘంటసాల, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల కన్వీనర్లు చండ్ర వెంకటేశ్వరరావు, వెంకట్రావు, దాసి దేవదానం, విశ్వనాథపల్లి సత్యనారాయణ, పరిసే మాధవరావు, పలువురు ఎంపీటీసీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జగ్గయ్యపేట వైఎస్సార్ సర్కిల్‌ల్లో రాజశేఖరరెడ్డి విగ్రహానికి వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు సామినేని విశ్వనాథం, మునిసిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కైకలూరులో 23 అడుగుల వైఎస్ విగ్రహానికి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు పాలాభిషేకం నిర్వహించారు.
మచిలీపట్నం జిల్లా కోర్టుసెంటరు, బైపాస్‌రోడ్డు, హౌసింగ్‌బోర్డు పార్కులోని వైఎస్‌ఆర్ విగ్రహాలకు వైఎస్సార్ సీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ షేక్ సలార్‌దాదా, జిల్లా అధికార ప్రతినిధి మాదివాడ రాము, పట్టణ మహిళా విభాగం కన్వీనరు తాడిబోయిన విజయలక్ష్మి, పాల పద్మ, కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు పాల్గొన్నారు.
పామర్రు పాలకంపెనీ, వైఎస్సార్ సీపీ కార్యాలయంలో రాజశేఖరరెడ్డి విగ్రహాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పామర్రు సర్పంచ్ దేవరకొండ రోహిణి తదితరులు పాల్గొన్నారు.