ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం అప్రతిహతంగా కొనసాగుతోంది. ఉద్యోగులు, విద్యార్థులు, పలు సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి నిరసన ప్రదర్శనలతో హోరెత్తిస్తున్నారు. ఉద్యమం ప్రారంభమై 32వ రోజుకు చేరుకున్నా.. ఉద్యమకారులు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. ఇప్పటికైనా రాజకీయ నాయకులు దిగిరాకపోతే వారికి భవిష్యత్తు ఉండదని హెచ్చరిస్తున్నారు. ఉద్యోగుల సమ్మెతో శనివారం 19వ రోజూ ప్రభుత్వ కార్యాలయాల తలుపులు తెరుచుకోలేదు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఉద్యమంలో భాగంగా ఒంగోలు నగరంలో జీవీఎస్ అండ్ జీపీఎస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. కార్యక్రమాన్ని డీఆర్వో రాధాకృష్ణమూర్తి, కొండపి ఎమ్మెల్యే జీవీ శేషు ప్రారంభించారు.
అద్దంకిలో సమైక్యాంధ్ర ఉద్యమం జోరుగా సాగుతోంది. పట్టణంలోని చైతన్య పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు విభిన్న వేషధారణలతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మేదరమెట్ల- నార్కెట్‌పల్లి రహదారిపై విద్యార్థులు కుంగ్ ఫూ, కరాటే ప్రదర్శించారు. బాలికలు సమైక్య నృత్యం ప్రదర్శించి మానవహారం నిర్వహించారు. సోనియా, వీహెచ్, కే సీఆర్ తదితర 10 మంది నాయకుల తలలతో కూడిన విభజన భూతం దిష్టిబొమ్మను విద్యార్థులు కోడిగుడ్లు, టమోటాలతో కొట్టి నిరసన తెలిపారు. బంగ్లా రోడ్‌లో జరుగుతున్న ఏపీటీఎఫ్ రిలే నిరాహార దీక్షలు ఏడో రోజుకు చేరాయి. బంగ్లా రోడ్‌లో ప్రైవేటు పాఠశాలల యజమానుల దీక్షలు 12వ రోజు జరిగాయి. చీరాలలో అన్ని కళాశాలల విద్యార్థినీ, విద్యార్థులు భారీ స్థాయిలో పట్టణంలో ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు. అలాగే ఇంకొల్లులో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. చినగంజాంలో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వికలాంగులు ర్యాలీ నిర్వహించిన అనంతరం నిరాహార దీక్ష చేపట్టారు. దర్శిలో విద్యార్థులు ర్యాలీ చేశారు. కందుకూరు అంబేద్కర్ బొమ్మ సెంటర్‌లో చేపట్టిన ఉద్యోగుల రిలే దీక్షలు శనివారంతో ముగించారు. దీక్షలో దాదాపు 100 మందికిపైగా కూర్చున్నారు. అలాగే ఆర్యవైశ్యులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ కార్మికులు డిపోలో వంటా-వార్పు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు.
వివిధ వర్గాల నిరసన:
కనిగిరిలో శాలివాహనులు, రంగస్థల కళాకారులు, ఆటో కార్మికులు నిరసన ర్యాలీలు నిర్వహించారు. స్థానిక పామూరు బస్టాండ్‌లో మానవహారం చేసి, కుండలు, తొట్లు తయారు చేయగా, రంగస్థల కళాకారులు పద్యాలు పాడి నిరసన ప్రదర్శనలు చేశారు. వైఎస్‌ఆర్ టీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేశారు. అలాగే విద్యార్థులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులు 9వ రోజు రిలే దీక్షలో కూర్చున్నారు. మార్కాపురంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు చేపట్టిన దీక్షలు 8వ రోజుకు చేరాయి. అలాగే ఏపీటీసీఏ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. తర్లుపాడులో ఉద్యోగులు చేపట్టిన దీక్షలు 11వ రోజుకు చేరాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా కొండపిలో ఉద్యోగ, ఉపాధ్యాయ ఐకాస ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆటా-పాటా కార్యక్రమాన్ని చేపట్టి నిరసన తెలిపారు.
జిల్లావ్యాప్తంగా సాగుతున్న ఆందోళన పర్వం
Published Sun, Sep 1 2013 3:07 AM | Last Updated on Fri, Sep 1 2017 10:19 PM
Advertisement
Advertisement