సాక్షి ప్రతినిధి, అనంతపురం : దుర్భిక్ష ‘అనంత’లో కలికితురాయి అవుతుందనుకున్న ఐఐఎస్‌సీ(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌స్) కర్ణాటక తన్నుకెళ్లింది. కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రులు కేంద్రంపై మూకుమ్మడిగా ఒత్తిడి తెచ్చి హిందూపురం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు కావాల్సిన ఐఐఎస్‌సీ రెండో క్యాంపస్‌ను చిత్రదుర్గకు తరలించుకుపోయారు. కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా మన రాష్ట్రానికి చెందిన దగ్గుబాటి పురందేశ్వరి ఉన్నా కర్ణాటక ఒత్తిళ్లకే కేంద్రం తలొగ్గింది.
రాష్ట్ర విభజనకు ముందే మందబలంతో కర్ణాటక మన జిల్లాకు తీరని అన్యాయం చేసింది. ఇక విభజన జరిగితే పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. దుర్భిక్ష ‘అనంత’లో చదువు ఒక్కటే బతుకును ఇస్తుందని విశ్వసించిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అత్యున్నత విద్యా సంస్థలను మన జిల్లాలో ఏర్పాటుచేయడానికి పూనుకున్నారు. ఆ క్రమంలోనే అనంతపురంలో జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విద్యాలయం(జేఎస్‌టీయూ)ను ఏర్పాటుచేశారు. దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఐఐఎస్‌సీ రెండో క్యాంపస్‌ను హిందూపురం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటుచేయాలని 2007 నవంబర్ 9న అప్పటి కేంద్ర మానవనరులశాఖ మంత్రి అర్జున్‌సింగ్‌కు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి లేఖ రాశారు.
ఐఐఎస్‌సీ ప్రధాన కేంద్రం, క్యాంపస్ ఇప్పటికే కర్ణాటక రాజధాని అయిన బెంగుళూరులో ఏర్పాటైన విషయం విదితమే. రెండో క్యాంపస్‌ను హిందూపురం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటుచేయడానికి అప్పట్లో అర్జున్‌సింగ్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రానికి రెండోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఐఐఎస్‌సీ రెండో క్యాంపస్ ఏర్పాటుపై కేంద్రంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. మహానేత వైఎస్ హఠాన్మరణం చెందిన తర్వాత 2010 ఏప్రిల్ 24న హిందూపురం పరిసర ప్రాంతాల్లో ఐఐఎస్‌సీ రెండో క్యాంపస్ ఏర్పాటుకుకు అంగీకరిస్తూ అప్పటి కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి కపిల్ సిబల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఉత్తర్వులు జారీచేసిన వెంటనే కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రులు తేరుకున్నారు. రాజకీయాలను పక్కన పెట్టి అప్పట్లో ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో కలిసి ఐఐఎస్‌సీ రెండో క్యాంపస్‌ను కూడా చిత్రదుర్గలోనే ఏర్పాటుచేయాలని కేంద్రంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఈ ఒత్తిళ్లకు తలొగ్గిన కేంద్రం చిత్రదుర్గలో ఐఐఎస్‌సీ ప్రయోగశాలను ఏర్పాటుచేయడానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు వెలువడిన నెల రోజుల్లోనే ప్రయోగశాల పనులను చిత్రదుర్గలో ఐఐఎస్‌సీ యాజమాన్యం ప్రారంభించింది. గతేడాది పనులు కూడా పూర్తవడంతో.. ప్రయోగశాలను ఇప్పటికే లాంఛనంగా ప్రారంభించారు.
హిందూపురం పరిసర ప్రాంతాల్లో ఐఐఎస్‌సీ ఏర్పాటుకు అనువైన భూమి కోసం కేంద్ర బృందం రెండుసార్లు పర్యటించింది. హిందూపురం-చిలమత్తూరు మధ్యలో ఎన్‌హెచ్-44కు సమీపంలో ఉన్న వెయ్యి ఎకరాల భూమిని ఐఐఎస్‌సీ రెండో క్యాంపస్ ఏర్పాటుకు అనువుగా కేంద్ర బృందం గుర్తించింది. భవన నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభిస్తామని.. 2012 విద్యా సంవత్సరంలో తరగతులు కూడా ప్రారంభిస్తామని కేంద్రం ప్రకటించింది. కానీ.. ఇప్పటిదాకా రెండో క్యాంపస్ నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన కూడా ఐఐఎస్‌సీ యాజమాన్యం చేయలేదు.
రెండో క్యాంపస్ పనులు ప్రారంభించేలా ఐఐఎస్‌సీపై మన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు గానీ, ఎంపీలు గానీ ఒత్తిడి తెచ్చిన దాఖలాలు లేవు. మన రాష్ట్రానికి కేంద్ర మంత్రులు, ఎంపీల నిర్లక్ష్యం ఒక ఎత్తయితే.. వేర్పాటువాదం మరొక ఎత్తు. రాష్ట్రంలో 2009 డిసెంబర్ 9 నుంచి నేటి వరకూ రాజకీయ అనిశ్చితి నెలకొంది. వేర్పాటువాదం.. సమైక్యాంధ్ర ఉద్యమాలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూలై 30న కేంద్రం రాష్ట్ర విభజనకు అనుకూలంగా ప్రకటన చేసింది. ఆ ప్రకటన సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఎగిసేలా చేసింది.
ఈ ఉద్యమానికి ‘అనంత’ చుక్కానిలా నిలుస్తోంది. ఇదే సందర్భంలో కర్ణాటకలో బీజేపీ సర్కారు స్థానంలో కాంగ్రెస్ సర్కారు కొలువు తీరింది. మన రాష్ట్రంలో వేర్పాటువాదం వెర్రితలలు వేస్తోన్న నేపథ్యంలో రెండో క్యాంపస్ ఏర్పాటుకు ఐఐఎస్‌సీ అంగీకరించడం లేదు. ఇది పసిగట్టిన కర్ణాటక సర్కారు, ఆ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కేంద్రంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. చిత్రదుర్గలో ఐఐఎస్‌సీ ఏర్పాటు చేసిన ప్రయోగశాల స్థానంలోనే రెండో క్యాంపస్‌ను ఏర్పాటుచేయాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గిన కేంద్రం చిత్రదుర్గలో ఐఐఎస్‌సీ రెండో క్యాంపస్ ఏర్పాటుచేయడానికి సూత్రప్రాయంగా అంగీకరిస్తూ కర్ణాటక సర్కారుకు వర్తమానం పంపింది.
ఐఐఎస్‌సీ కేంద్ర మానవనరుల అభివృద్ధి శాఖ సారధ్యంలోనే పనిచేస్తుంది. ప్రస్తుతం ఆశాఖ మంత్రిగా మన రాష్ట్రానికి చెందిన దగ్గుబాటి పురందేశ్వరి వ్యవహరిస్తున్నారు. కానీ.. హిందూపురంలో ఏర్పాటుకావాల్సిన ఐఐఎస్‌సీ రెండో క్యాంపస్‌ను కర్ణాటక తన్నుకెళ్తోంటే కనీసం అడ్డుకోలేకపోయారు. రాష్ట్ర విభజన జరగక ముందే ‘అనంత’కు ప్రతిష్ఠాత్మక ఐఐఎస్‌సీ రెండో క్యాంపస్ దూరమవుతోన్న నేపథ్యంలో.. విభజన జరిగితే మరింత తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇది సమైక్యవాదులను ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయడానికి పురిగొల్పుతోంది.
విభజన సెగ..ఐఐఎస్‌సీ ఔట్..!
Published Mon, Sep 16 2013 3:48 AM | Last Updated on Fri, Sep 1 2017 10:45 PM
Advertisement
Advertisement