Indian Institute of Science
-
ఐఐటీ–మద్రాస్ అత్యుత్తమం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో అత్యుత్తుమ విద్యా సంస్థల జాబితాలో ఐఐటీ–మద్రాస్ వరసగా నాలుగో ఏడాది తొలి స్థానంలో నిలిచింది. ఉత్తమ విశ్వవిద్యాలయాల విభాగంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)–బెంగళూరు తొలి స్థానం దక్కించుకుంది. ఫార్మసీ విభాగంలో నైపర్–హైదరాబాద్ రెండో ర్యాంకు, న్యాయ విద్యలో హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా నాలుగో ర్యాంకు సాధించాయి. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) కింద 11 విభాగాల్లో ర్యాంకుల జాబితాను కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం విడుదల చేశారు. 2016 నుంచి కేంద్ర విద్యా శాఖ ఈ ర్యాంకులను ప్రకటిస్తోంది. విశ్వవిద్యాలయాల విభాగంలో ఉస్మానియా యూనివర్సిటీకి 22వ ర్యాంకు, ఆంధ్ర యూనివర్సిటీ 36వ ర్యాంకు లభించింది. టాప్–100 ఇంజనీరింగ్ కాలేజీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 9 కాలేజీలున్నాయి. టాప్–100 ఫార్మసీ కాలేజీల్లో రెండు రాష్ట్రాలకు చెందిన 15 కాలేజీలున్నాయి. పరిశోధన విభాగంలో ఐఐటీ–హైదరాబాద్ 12వ ర్యాంకు సాధించింది. మెడికల్ విభాగంలో 50 ర్యాంకులు ప్రకటించగా తెలంగాణ, ఏపీలోని కళాశాలలకు స్థానం దక్కలేదు. ఓవరాల్ ర్యాంకింగ్ ఐఐటీ–మద్రాస్ (87.59 స్కోరు) తొలిస్థానంలో నిలవగా, 83.57 స్కోరుతో ఐఐఎస్సీ–బెంగళూరు రెండోస్థానంలో 82.35 స్కోరుతో ఐఐటీ–బాంబే మూడో స్థానంలో నిలిచాయి. ఐఐటీ–హైదరాబాద్ 62.86 స్కోరుతో 14వ ర్యాంకు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 59.67 స్కోరుతో 20వ ర్యాంకు, ఎన్ఐటీ–వరంగల్ 50.61 స్కోరుతో 45వ ర్యాంకు, ఉస్మానియా యూనివర్సిటీ 50.60 స్కోరుతో 46వ ర్యాంకు సాధించాయి. కాలేజీల విభాగంలో ఆంధ్రా లయోలా కాలేజ్ (విజయవాడ) 52.38 స్కోరుతో 94వ ర్యాంకు సాధించింది. ఇంజినీరింగ్ ఐఐటీ మద్రాస్ 90.94 స్కోరుతో తొలిస్థానం, ఐఐటీ న్యూఢిల్లీ 88.12 స్కోరుతో రెండో స్థానం, ఐఐటీ బాంబే 83.96 స్కోరుతో మూడో స్థానంలో నిలిచాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐఐటీ హైదరాబాద్ 68.03 స్కోరుతో తొమ్మిదో స్థానం, ఎన్ఐటీ వరంగల్ 60 స్కోరుతో 21వ ర్యాంకు, కేఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ 44వ ర్యాంకు, ఐఐటీ తిరుపతి 48.16 స్కోరుతో 56వ ర్యాంకు, ఐఐఐటీ–హైదరాబాద్ 46.41 స్కోరుతో 62వ ర్యాంకు, జేఎన్టీయూ–హైదరాబాద్ 42.77 స్కోరుతో 76వ ర్యాంకు సాధించాయి. మేనేజ్మెంట్ ఐఐఎం–అహ్మదాబాద్ 83.35 స్కోరుతో తొలి ర్యాంకు, ఐఐఎం–బెంగళూరు 82.62 స్కోరుతో 2వ ర్యాంకు, ఐఐఎం–కలకత్తా 78.64 స్కోరుతో మూడో ర్యాంకు సాధించాయి. ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్–హైదరాబాద్ 54.88 స్కోరుతో 32వ ర్యాంకు, ఐఐఎం–విశాఖపట్నం 54.36 స్కోరుతో 33వ ర్యాంకు, కేఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 51.27 స్కోరుతో 47వ ర్యాంకు సాధించాయి. ఫార్మసీ జామియా హమ్దర్ద్–న్యూఢిల్లీ 79.50 స్కోరుతో తొలి ర్యాంకు, నైపర్–హైదరాబాద్ 79.46 స్కోరుతో రెండో ర్యాంకు సాధించగా, హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ 47.38 స్కోరుతో 44వ ర్యాంకు సాధించింది. -
అగ్నికి ఆహుతైన 20 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. కేంద్రం కన్నెర్ర?
పెట్రోలు ధరల నుంచి అతి పెద్ద ఉపశమనంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రజలు భావిస్తున్న తరుణంలో ఊహించని ప్రమాదాలు ఇటు ప్రజలను అటు ఈవీ తయారీదారులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. మార్చి మధ్య నుంచి దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు అకస్మాత్తుగా తగలబడి పోతున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని నాసిక్‌లో జితేంద్ర ఈవీ కంపెనీకి చెందిన 20 ఎలక్ట్రిక స్కూటర్లు 2022 ఏప్రిల్ 12న మంటల్లో చిక్కుకుని కాలిపోయాయి. ఫ్యాక్టరీ నుంచి స్కూటర్లను రవాణా చేసేందుకు తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వరుసగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అగ్నికి ఆహుతి అవుతుండటంపై కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఏ కారణం చేత ఇలా వాహనాలు తగలబడిపోతున్నాయో విచారణ జరపాల్సిందిగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరుకు ఆదేశాలు జారీ చేసింది. అంతకంటే ముందే పూనేలో ఓలా స్కూటర్ తగలబడిపోయిన ఘటనపై కేంద్రం స్పందించింది. ఉన్నట్టుండి ఈవీ స్కూటర్లు ఎందుకు మంటల్లో చిక్కుకుంటున్నాయో కనిపెట్టాలంటూ సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్‌ప్లోజివ్ అండ్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ (సీఎఫ్ఈఈఎస్)కు సూచింంచింది. ఈ విచారణ కొనసాగుతుండగానే మరో ప్రమాదం చోటు చేసుకోవడంతో కేంద్రం విచారణ బాధ్యతలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు వంటి ప్రతిష్టాత్మక సంస్థకి అప్పగించింది. ఇండియాలో ఈవీ వెహికల్స్ మార్కెట్ పుంజుకుంటోంది. 2020-21 ఏడాదిలో దేశవ్యాప్తంగా 1,34,821 ఈవీలు అమ్ముడవగా 2021-22 ఏడాదిలో 4,29,417 ఈవీలు అమ్ముడయ్యాయి. ఇలా నాలుగింతలు మార్కెట్ పెరిగిన తరుణంలో ప్రమాదాలు కలవరం కలిగిస్తున్నాయి. నాసిక్‌లో తాజాగా చోటు చేసుకున్న ఘటన ఈవీ స్కూటర్లకు సంబంధించి అతి పెద్ద ప్రమాదంగా నమోదు అయ్యింది. చదవండి: కాలిపోతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు..కారణం ఏంటంటే? -
అక్కడి నుంచే భారత్‌లోకి కరోనా
సాక్షి, బెంగళూరు : కరోనా మన దేశానికి యూరప్, దక్షిణ ఆసియా దేశాల నుంచి వచ్చి ఉంటుందని బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ తాజా అధ్యయనం వెల్లడించింది. దేశంలోని 294 కరోనా వైరస్ జన్యుక్రమాలపై కుమార్ సోమసుందరం, మైనక్ మండల్, అంకిత లావార్డ్‌లతో కూడిన ఐఐఎస్సీ బృందం చేసిన అధ్యయనం గుర్తించిన విషయాల్లో ఇది ఒక అంశం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సార్స్–కోవిడ్–2 వైరస్‌కీ, భారతదేశంలోని వైరస్‌కీ మధ్య ఉన్న జన్యుపరమైన తేడాలను నిర్ధారించడంలో భాగంగా ఈ అధ్యయనం నిర్వహించారు. భారత్‌తో ఎక్కువ రాకపోకలు జరిగే, కోవిడ్ విస్త్రుతంగా వ్యాప్తి చెందిన దేశాలైన యూరప్, తూర్పు మధ్య ఒషియేనా, దక్షిణ ఆసియా ప్రాంతాల నుంచి మన దేశంలోకి ఈ వైరస్ వచ్చి ఉండొచ్చన్నది పరిశోధకుల అభిప్రాయం. (చైనాలో ఆగస్టులోనే కరోనా విజృంభణ!) ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు పీపీఈ కిట్లు న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. దళంలోని ప్రతి సభ్యుడికి ఐదేసి పీపీఈ కిట్లు అందజేస్తామని ఎన్డీఆర్ఎఫ్ డీజీ ఎస్.ఎన్. ప్రధాన్ తెలిపారు. వీటిలో రెండు కోవిడ్‌కు, మిగతా మూడు ఎండ, ఇతర కలుషితాలు సోకకుండా రక్షణ కల్పించేవన్నారు. రక్షణ, సహాయక చర్యల్లో పాల్గొనే బృంద సభ్యులకు పీపీఈ కిట్లు, హైడ్రో క్లోరోక్విన్ మాత్రలు అందించడంతోపాటు వ్యాధినిరోధక శక్తి పెంపునకు ఆయుష్ శాఖ సూచించిన విధంగా చర్యలు తీసుకుంటా మని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో ఇటీవల సంభవించిన అంఫన్ తుపాను సహాయక చర్యల్లో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిలో 51మందికి కరోనా పాజిటివ్ అని తేలిందన్నారు. వీరిలో ఎవరికీ కోవిడ్ లక్షణాలు లేనందున, మరిన్ని పరీక్షలు నిర్వహించనున్నామన్నారు. 15 రాష్ట్రాలకు కేంద్ర బృందాలు సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కేసుల ప్రభావం అధికంగా ఉన్న 15 రాష్ట్రాల్లోని 50కి పైగా జిల్లాలు, మున్సిపాలిటీలకు కేంద్ర ఆరోగ్య శాఖ కేంద్ర బృందాలను పంపింది. అత్యధిక కేసులు ఉన్న ప్రాంతాలు, అధికంగా వ్యాప్తి ఉన్న ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు సాయంగా హైలెవల్ మల్టీ డిసిప్లినరీ సెంట్రల్ టీమ్స్ పనిచేస్తాయి. తెలంగాణకు నాలుగు, మహారాష్ట్రకు 7, తమిళనాడుకు 7, రాజస్తాన్‌కు 5, అసోంకు 6, హరియాణాకు 4, గుజరాత్‌కు 3, కర్ణాటకకు 4, ఉత్తరాఖండ్‌కు 3, మధ్యప్రదేశ్‌కు 5, పశ్చిమబెంగాల్‌కు 3, ఢిల్లీకి 3, బిహార్‌కు 4, యూపీకి 4, ఒడిశాకు 5 బృందాలను పంపినట్టు తెలిపింది. ప్రతీ త్రిసభ్య బృందంలో ఇద్దరు ఆరోగ్య నిపుణులు, ఒక సీనియర్ సంయుక్త కార్యదర్శి స్థాయి నోడల్ అధికారి ఉంటారు. -
టాప్ 200లో 49 భారతీయ వర్సిటీలు
లండన్: టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్ఈ) 2019 సంవత్సరానికి విశ్వవిద్యాలయాలకు ర్యాంకింగ్‌లు ప్రకటించింది. 43 దేశాలకు చెందిన 450 విశ్వవిద్యాలయాలకు ర్యాంకింగ్‌లు ప్రకటించగా భారత్‌కు చెందిన 49 వర్సిటీలు టాప్ 200లో స్థానం సంపాదించాయి. ర్యాంకింగ్స్‌లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగుళూరు) 14వ స్థానం, ఐఐటీ (బొంబాయి) 27వ స్థానం, ఐఐటీ (రూర్కీ) 35వ స్థానం, ఐఐటీ (ఇండోర్) 61వ స్థానం, జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 64వ స్థానంలో నిలిచాయి. సావిత్రిబాయి ఫూలే పూణే యూనివర్సిటీ, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, అమృతా యూనివర్సిటీ ఈసారి టాప్ 150లో స్థానం సంపాదించాయి. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పూణే, ఐఐటీ(హైదరాబాద్) తొలిసారిగా ర్యాంకింగ్‌లో చోటు సంపాదించాయి. 2018లో భారత్ నుంచి 42 వర్సిటీలు స్థానం సంపాదించగా ఈసారి అది 49కి పెరిగింది. టాప్‌లో చైనా వర్సిటీలు చైనాకు చెందిన నాలుగు వర్సిటీలు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. జాబితాలో మొత్తం 72 వర్సిటీలతో చైనా అగ్రస్థానంలో ఉంది. భారత వర్సిటీల్లో విద్యాబోధన మెరుగుపడినా ప్రమాణాలతో పోలిస్తే వెనకబడే ఉన్నాయని టీహెచ్ఈ ఎడిటర్ ఎల్లీ బోత్వెల్ తెలిపారు. -
టాప్ 250లో లేని భారత యూనివర్సిటీలు
లండన్ : ‘ది టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్’ వరల్డ్ యూనివర్సిటీ ర్యాకింగ్స్లో భారత్ నుంచి ఒక్క విశ్వవిద్యాలయం కూడా చోటు దక్కించుకోలేదు. కాగా, బుధవారం విడుదలైన ఈ జాబితాలో ప్రపంచ అత్యుత్తమ యూనివర్సీటీగా ఆక్స్ఫర్డ్ తన స్థానాన్ని పదిలం చేసుకోగా.. కేంబ్రిడ్జ్, స్టాన్ఫోర్డ్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. మాసాచుసెట్స్ నాలుగో స్థానంలో ఉంది. 2019కి సంవత్సరానికి గాను ప్రపంచవ్యాప్తంగా 250 యూనివర్సీటీలకు టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాకింగ్స్ ఇచ్చింది. ఇదిలాఉండగా.. భారత్‌లోని అన్ని యూనివర్సిటీల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-బెంగుళూరు టాప్‌లో నిలిచింది. ఐఐటీ-ఇండోర్, ఐఐటీ-బాంబే యూనివర్సిటీలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే, ప్రపంచ అత్యుత్తమ యూనివర్సిటీల జాబితాలో చోటు దక్కించుకోని భారత్.. గతేడాదికంటే కొంత మెరుగు పడింది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ జాబితాలో భారత్‌నుంచి పోయిన సంవత్సరం 42 యూనివర్సీలు ఉండగా.. తాజాగా ఆ సంఖ్య 49కి చేరింది. దీంతో 250పైన ర్యాంకులు గల దేశాల జాబితాలో ఇండియా అయిదో స్థానంలో నిలిచింది. ఐఐఎస్సీ బెంగుళూరు 251-300 ర్యాంకింగ్స్‌లో కొనసాగుతోంది. -
అత్యుత్తమ వర్సిటీ.. ఐఐఎస్సీ
జాతీయ స్థాయిలో యూనివర్సిటీల ర్యాంకులు విడుదల చేసిన హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ: ప్రపంచ ర్యాంకుల్లో అత్యుత్తమ స్థానాలు సాధిస్తున్న బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) మరోసారి సత్తా చాటింది. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) సోమవారం విడుదల చేసిన వార్షిక ర్యాంకుల్లో ఓవరాల్ విభాగంలోని టాప్ 100 యూనివర్సిటీల్లో ఐఐఎస్సీ ప్రథమ స్థానంలో నిలిచింది. రెండో స్థానాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మద్రాస్) దక్కించుకుంది. -
బెస్ట్ యూనివర్సిటీల్లో ఇండియా సూపర్
ఆసియాలో ఇండియన్ యూనివర్సిటీలు దుమ్మురేపుతున్నాయి. ఆసియాలో బెస్ట్ యూనివర్సిటీల జాబితాల్లో భారత యూనివర్సిటీలు గతేడాది కంటే రెట్టింపయ్యాయి. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ బుధవారం విడుదల చేసిన ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2017 జాబితాలో భారత్ నుంచి 33 యూనివర్సిటీలు టాప్-300లో నిలిచాయి. వీటిలో 17 యూనివర్సిటీలు కొత్తగా చోటు దక్కించుకోగా, మరో 16 చివరి ఏడాది నుంచి టాప్-300లో కొనసాగుతున్నాయి. టాప్-100లో ఎనిమిది భారత్ వే ఉన్నాయని టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ తెలిపింది. ఈ ర్యాంకింగ్స్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ 27 స్థానంలో ఉండగా.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-బొంబాయి 42, వెల్‌టెక్ యూనివర్సిటీ 43 స్థానంతో టాప్-50లో ఉన్నాయి. రెండో ఏడాది కూడా సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ, చైనా పెకింగ్ యూనివర్సిటీలే మొదటి, రెండో స్థానాలను సొంతం చేసుకున్నాయి. 69 యూనివర్సిటీలతో ర్యాంకింగ్స్ లో ఎక్కువ ప్రాతినిధ్యం వహించినప్పటికీ కేవలం రెండు జపనీస్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే టాప్-20లో ఉన్నాయి. తర్వాత చైనా టాప్-20లో ఆరు యూనివర్సిటీలను కలిగి ఉంది. ఆసియాలో బెస్ట్ యూనివర్సిటీల జాబితాలో భారత్ రెండింతలు రెట్టింపు చేసుకోవడం గుడ్ న్యూస్ అని టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఎడిటర్ తెలిపారు. దీంతో ర్యాంకింగ్స్ లో భారత్ మూడో అతిపెద్ద దేశంగా నిలిచిందని పేర్కొన్నారు. -
ఐఐఎస్సీకి ప్రపంచ ఎనిమిదో ర్యాంకు
న్యూఢిల్లీ: యూకేకు చెందిన టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్ఈ) ప్రకటించిన ఉత్తమ యూనివర్సిటీల ర్యాంకింగ్స్‌లో ఒక భారతీయ విద్యాసంస్థకు తొలిసారి టాప్ 10లో స్థానం దక్కింది. 2017లో ‘ఉత్తమ చిన్న విశ్వవిద్యాలయాలు’ విభాగంలో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) 8వ ర్యాంకు సాధించింది. 5 వేల మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న విశ్వవిద్యాలయాలను చిన్న వర్సిటీలుగా పరిగణిస్తారు. టాప్ వర్సిటీల్లో కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (అమెరికా), ఎకోలే నార్మలే సుపీరియర్ (ఫ్రాన్స్ ), పొహంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (దక్షిణ కొరియా)లు ఉన్నాయి. 2015–16లో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగంలో టీహెచ్ఈ ప్రకటించిన టాప్ 100 వర్సిటీల్లో దేశం నుంచి మొదటి సారి ఐఐఎస్సీ చోటుదక్కించుకొని 99వ స్థానంలో నిలిచింది. -
బెంగళూరు భేష్
‘ఐటీ హబ్’ మాత్రమే కాదు.. సైన్స్ హబ్‌గానూ రాణింపు అనేక ప్రముఖ పరిశోధనా సంస్థలు ఇక్కడే యువ శాస్త్రవేత్తలకు ఈ సదస్సు చాలా ఉపయుక్తం సీఎన్ రావు వంటి శాస్త్రవేత్తను చూసి దేశం గర్వపడుతోంది ‘కామన్వెల్త్ సైన్స్ కాన్ఫరెన్స్’ ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరు ఐటీ హబ్‌గానే కాక సైన్స్ హబ్‌గా కూడా అభివృద్ధి చెందుతోందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభివర్ణించారు. దేశంలోనే ఎంతో ఉత్తమమైన పరిశోధనా సంస్థలు బెంగళూరులో ఉన్నాయని, ఈ సంస్థల నుంచే దేశానికే గర్వకారణమైన చాలా మంది శాస్త్రవేత్తలు భారత్‌కు లభించారని పేర్కొన్నారు. అలాంటి బెంగళూరు నగరం మొట్టమొదటి కామన్వెల్త్ దేశాల సైన్స్ కాన్ఫరెన్స్‌కు ఆతిథ్యమివ్వడం చాలా సంతోషంతో పాటు గర్వకారణంగా కూడా ఉందని తెలిపారు. మంగళవారమిక్కడి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్ ప్రాంగణంలోని జేఎన్ టాటా ఆడిటోరియంలో ‘కామన్వెల్త్ సైన్స్ కాన్ఫరెన్స్’ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. కామన్వెల్త్ దేశాలకు చెందిన యువ శాస్త్రవేత్తలకు ఈ సమావేశం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. భారత పరిశోధనా రంగంలో ఒక తారలా మెరిసిన ప్రముఖ శాస్త్రవేత్త సీఎన్ఆర్ రావును చూసి భారతదేశం చాలా గర్వపడుతోందని తెలిపారు. ఆయన ఆలోచన ఈ విధంగా కార్యరూపం దాల్చడం ఎంతైనా అభినందనీయమని పేర్కొన్నారు. ఇక భారత్‌లో శాస్త్ర, సాంకేతిక రంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. ఇందులో భాగంగానే ‘ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్ష్యూ ఫర్ ఇన్స్పైర్డ్ రీసర్చ్’(ఐఎన్ఎస్పీఐఆర్ఈ-ఇన్స్పైర్) పేరిట శాస్త్ర సాంకేతిక రంగంలోని విద్యార్థులకు అవార్డులను అందజేస్తున్నట్లు తెలిపారు. కామన్వెల్త్ దేశాల మధ్య సంబంధాలు మరింత దృఢం కావడంతో పాటు పరిశోధనలకు సంబంధించిన సమాచార వినిమయానికి ఈ సదస్సు దోహదపడుతుందని పేర్కొన్నారు. అనంతరం ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు మాట్లాడుతూ...తన జీవితంలో అధికభాగం సైన్స్ ఆక్రమించిందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సమానత్వాన్ని రూపొందించేందుకు, శాంతి, సామరస్యాలు నెలకొల్పేందుకు సైతం సైన్స్‌ను వినియోగించాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్థన్, కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ రుడాభాయ్ వాలా, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ది రాయల్ సొసైటీ ప్రసిడెంట్ సర్ పాల్ నర్స్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కూడా నిద్రేనా.... కామన్వెల్త్లోని 30కి పైగా దేశాలకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు, ప్రతినిధుల మధ్య కామన్వెల్త్ దేశాల చరిత్రలోనే మొట్టమొదటి సైన్స్ కాన్ఫరెన్స్‌లో దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి ప్రసంగిస్తుంటే అందరూ ఎంతో నిబద్ధతతో ప్రసంగాన్ని వింటున్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రం నిద్రలోకి జారుకున్నారు. అది వేదికపైనే.. రాష్ర్టపతి పక్కనుండగానే.. ఆయన మరెవరో కాదు మన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే. అవును, కామన్వెల్త్ సైన్స్ కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవ వేదికపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పక్కనే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆసీనులయ్యారు. సమావేశం ప్రారంభమైనప్పటి నుంచే ఆయన కాస్తంత నిద్రలోకి జారుతూ, మళ్లీ మేలుకుంటూ కనిపించారు. ఇక రాష్ట్రపతి ప్రసంగం ప్రారంభం కాగానే సిద్ధరామయ్య పూర్తిగా నిద్రలోకి జారుకున్నారు. దీన్ని గమనించిన వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు సిద్ధరామయ్య తీరును గురించి వింతగా మాట్లాడుకోవడం కనిపించింది. ఇక మీడియా మిత్రులైతే ‘సిద్ధరామయ్యకిది మామూలేగా’ అంటూ నవ్వుకున్నారు. -
బంగారు భవితకు వేదికలు..
నేడు సాధారణ బ్యాచిలర్‌స డిగ్రీ కోర్సులకే లక్షల మొత్తం ఖర్చు అవుతోంది! ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సుల ఫీజుల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు!! ఇక.. ఏ కోర్సు అయినా పేరున్న ఇన్స్టిట్యూట్లో చదవాలంటే ఆ మొత్తం మరింత ఎక్కువే !! ఇలాంటి పరిస్థితుల్లో సైతం...తక్కువ ఖర్చుతో కోర్సులు పూర్తి చేసే అవకాశం ఉంది! నామమాత్రపు ఫీజులు చెల్లిస్తూ.. మరో వైపు స్కాలర్షిప్లు, స్టైఫండ్లు పొందొచ్చు. అంతేకాదు.. ఆయా కోర్సుల ద్వారా ఉజ్వల కెరీర్‌ను సైతం సొంతం చేసుకోవచ్చు. ఇందుకు మార్గం.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పలు రీసెర్చ్ ఓరియెంటెడ్ ఇన్స్టిట్యూట్లు. ఉన్నత విద్య.. ఉన్నత వర్గాలకే పరిమితం అనేది నిన్నటి మాట. ఇప్పుడు ప్రతిభ, అకడమిక్ నైపుణ్యాలు ఉంటే బ్యాచిలర్స్ డిగ్రీ నుంచి పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ వరకు అన్ని కోర్సులను స్వల్ప వ్యయంతో పూర్తి చేయొచ్చు.వచ్చే విద్యా సంవత్సరానికి ఆయా కోర్సుల ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైన తరుణంలో దేశవ్యాప్తంగా ప్రముఖ విద్యాసంస్థలు, అవి అందించే కోర్సులపై ప్రత్యేక ఫోకస్... ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ దేశంలో సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ విభాగాల్లో దశాబ్దాల చరిత్ర ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(బెంగళూరు) ఇంజనీరింగ్, సైన్స్, మ్యాథమెటిక్స్ కోర్సుల్లో బ్యాచిలర్స్, పీజీ, పీహెచ్డీ కోర్సులను అంది స్తోంది. ఆయా కోర్సులకు సంబంధించి జాతీయ స్థాయిలో నిర్వహించే గేట్/యూజీసీ -సీఎస్ఐ ఆర్ నెట్/జెస్ట్ తదితర ఎంట్రెన్స్లలో ఉత్తీర్ణత ఆధారంగా ప్రవేశం కల్పిస్తోంది. ఆయా కోర్సుల కు ఫీజులు నామమాత్రమే. అంతేకాకుండా స్కాలర్షిప్లను అందిస్తోంది. దాంతో విద్యార్థు లకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా కోర్సులు అభ్యసించే అవకాశం లభిస్తోంది. కోర్సుల వివరాలు.. బ్యాచిలర్‌స ఆఫ్ సైన్స్(రీసెర్చ్) బ్యాచిలర్స్ డిగ్రీ స్థాయి నుంచే విద్యార్థులను రీసెర్చ్ దిశగా నడిపించాలనే ఉద్దేశంతో రూపొందించిన కోర్సు ఇది. నాలుగేళ్ల కోర్సులో విద్యార్థులు బయాలజీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్ మెంటల్ సైన్స్, మెటీరియల్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్‌లలో ఒక సబ్జెక్ట్‌ను మేజర్‌గా ఎంచుకుని రీసెర్చ్ చేయొచ్చు. అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఎంపీసీ/బైపీసీ ఉత్తీర్ణత. ప్రవేశం: జాతీయస్థాయిలో నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులకు నిర్ణీత సంఖ్యలో వేర్వేరుగా సీట్లు కేటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రవేశం సమయంలో పరిగణనలోకి తీసుకునే అంశాలు: * కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజనలో అర్హత. * జేఈఈ-మెయిన్ స్కోరు; జేఈఈ-అడ్వాన్స్డ్ స్కోర్, ఏఐపీఎంటీ ర్యాంకు. ఫీజులు: ప్రతి ఏటా రూ. 20 వేలలోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. స్కాలర్షిప్స్: కేవైపీవై, జేఈఈ(మెయిన్, అడ్వాన్స్డ్), ఏఐపీఎంటీ ర్యాంకు పొందినవారికి ఇన్స్పైర్ స్కాలర్షిప్ లభిస్తుంది. దీని కింద నెలకు రూ.4000 నుంచి రూ.5 వేల వరకు అందిస్తారు. పీజీ కోర్సులు కోర్సులు: ఎంఈ/ఎంటెక్/మాస్టర్ ఆఫ్ డిజైన్/మాస్టర్ ఆఫ్ మేనేజ్మెంట్. అర్హత: బీఈ/బీటెక్ ఉత్తీర్ణత లేదా ఫిజిక్స్/మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్/కంప్యూటర్ సైన్స్/ఎలక్ట్రానిక్స్‌లో బ్యాచిలర్‌స డిగ్రీ/బీఆర్‌క/బీడిజైన్ ఉత్తీర్ణత. ప్రవేశం: గేట్/సీడ్/క్యాట్/జీమ్యాట్లలో ర్యాంకు ఆధారంగా. ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ ప్రోగ్రామ్ కోర్సులు: బయలాజికల్ సెన్సైస్; కెమికల్ సెన్సైస్; ఫిజికల్ సెన్సైస్; మ్యాథమెటికల్ సెన్సైస్. అర్హత: సంబంధిత విభాగంలో ప్రథమ శ్రేణిలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత; బీఈ ఉత్తీర్ణులు మ్యాథమెటికల్ సెన్సైస్ ప్రోగ్రాంకే అర్హులు. ప్రవేశం: జామ్‌లో ర్యాంకు ఆధారంగా. రీసెర్చ్ ప్రోగ్రామ్స్ కోర్సులు: పీహెచ్డీ, ఎమ్మెస్సీ ఇంజనీరింగ్. అర్హత: సైన్స్/మ్యాథ్స్/స్టాటిస్టిక్స్/కంప్యూటర్ అప్లికేషన్స్/ఫార్మసీ/ వెటర్నరీ సైన్స్/ అగ్రికల్చర్ /హ్యుమానిటీస్‌లో పీజీ లేదా ఎంఈ/ ఎంటెక్/ ఎంఆర్క్ ఉత్తీర్ణత. పీజీ ఔత్సాహికులు నిర్దేశించిన కోర్సుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. ప్రవేశం: సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ లేదా యూజీసీ-నెట్; లేదా డీబీటీ జేఆర్ఎఫ్ లేదా ఐసీఎంఆర్ జేఆర్ఎఫ్; లేదా జెస్ట్ లేదా గేట్ ఎంట్రెన్స్లలో ప్రతిభ ఆధారంగా. కోర్సులవారీగా ఫీజుల వివరాలు పీహెచ్డీ: ఏడాదికి రూ.16,800. ఎమ్మెస్సీ(ఇంజనీరింగ్), ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ, ఎంఈ/ఎంటెక్/ఎం.డిజైన్: ఏడాదికి రూ.13,300; ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు దాదాపు యాభై శాతం మేరకు రాయితీ ఉంటుంది. స్కాలర్షిప్లు * ఇన్స్టిట్యూట్లోని రీసెర్చ్ ప్రోగ్రామ్‌లలో బీఈ/బీటెక్/ఎమ్మెస్సీ అర్హతతో ప్రవేశించిన వారికి నెలకు రూ.16 వేల నుంచి రూ.18 వేల వరకు; ఎంటెక్/ఎంఈ అర్హతతో ప్రవేశం పొందితే నెలకు రూ.18 వేల నుంచి 20 వేల వరకు స్కాలర్షిప్ లభిస్తుంది. * ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ అభ్యర్థులు వారి అకడమిక్ అర్హతల ఆధారంగా నెలకు రూ.10 వేలు; రూ.16 వేలు; రూ.18 వేలు స్కాలర్షిప్ పొందొచ్చు. * ఎమ్మెస్సీ/ఎంఈ/ఎంటెక్/ఎం.డిజైన్ కోర్సుల విద్యార్థులకు నెలకు రూ.8 వేల స్కాలర్షిప్ అందుతుంది. వెబ్సైట్: www.iisc.ernet.in ఐఐఎస్ఈఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్).. ప్యూర్ సైన్స్ విభాగంలో విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఇన్స్టిట్యూట్లివి. దేశవ్యాప్తంగా ఐదు (మొహాలి, తిరువనంతపురం, పుణె, కోల్‌కతా, భోపాల్) క్యాంపస్‌లలో ఇంటర్మీడియెట్ అర్హతతోనే డ్యూయల్ డిగ్రీ కోర్సులు చేసే అవకాశం లభిస్తోంది. వివరాలు.. బీఎస్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతోపాటు కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (ఎస్ఏ స్ట్రీమ్) అర్హత లేదా జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణత. ఈ రెండు అర్హతలు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వారు ఐఐఎస్ఈఆర్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో ర్యాంకు సాధించాలి. వ్యవధి: ఐదేళ్లు ఫీజు: జనరల్ కేటగిరీ అభ్యర్థులు మొదటి సెమిస్టర్లో రూ. 21,200 చెల్లించాలి. తర్వాత నుంచి ప్రతి సెమిస్టర్‌కు రూ.13,200 చెల్లిస్తే సరిపోతుంది. ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు 50 శాతం మేర ఫీజు రాయితీ లభిస్తుంది. స్కాలర్షిప్: ఇన్స్పైర్ లేదా కేవైపీవై స్కీం ద్వారా నెలకు రూ. 5 వేల స్కాలర్షిప్ అందుతుంది. ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ స్పెషలైజేషన్స్: బయలాజికల్ సెన్సైస్; కెమికల్ సెన్సైస్; మ్యాథమెటికల్ సెన్సైస్; ఫిజికల్ సెన్సైస్. అర్హత: సంబంధిత సబ్జెక్ట్‌లను బ్యాచిలర్స్ డిగ్రీలో చదివి ఉండటంతోపాటు 6 సీజీపీఏ లేదా 55 శాతం మార్కులు పొందాలి. ఫిజికల్ సెన్సైస్ ఔత్సాహికులు జెస్ట్‌లో కూడా ఉత్తీర్ణత సాధించాలి. ప్రవేశం: ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా. ఫీజు: జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఫస్ట్ సెమిస్టర్లో రూ.20,575, తర్వాత నుంచి ప్రతి సెమిస్టర్‌కు రూ.15,075 చెల్లించాలి. స్కాలర్షిప్స్: నెలకు రూ.10వేల చొప్పున స్కాలర్షిప్ లభిస్తుంది. పీహెచ్డీ: బయలాజికల్ సెన్సైస్, కెమికల్ సెన్సైస్, మ్యాథమెటికల్ సెన్సైస్ తదితర విభాగాలు. అర్హత: సంబంధిత సబ్జెక్ట్‌లు స్పెషలైజేషన్స్‌గా పీజీలో 6.5 సీజీపీఏ లేదా 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. వీటితోపాటు సీఎస్ఐఆర్, యూజీసీ- జేఆర్ఎఫ్/గేట్/ఇన్స్పైర్ పీహెచ్డీ ఫెలోషిప్/ఎన్బీహెచ్ఎం ఫెలోషిప్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. ప్రవేశం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. ఫీజు: మొదటి సెమిస్టర్‌కు రూ.15,340, రెండు నుంచి ఆరో సెమిస్టర్ వరకు రూ. 10,840. స్కాలర్షిప్స్: నెలకు రూ. 16 వేల నుంచి రూ. 18 వేల వరకు జేఆర్ఎఫ్ లభిస్తుంది. వెబ్సైట్: www.iiser-admissions.in జేఎన్సీఏఎస్ఆర్ - బెంగళూరు జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ (జేఎన్సీఏఎస్ఆర్).. సైన్స్ రంగంలో అకడమిక్, రీసెర్చ్‌పరంగా దశాబ్దాల ఘనత పొందిన ఇన్స్టిట్యూట్. ఈ విద్యా సంస్థ స్వల్ప మొత్తం ఫీజులతో బ్యాచిలర్స్ డిగ్రీ అర్హతగా పలు కోర్సులు అందిస్తూ.. స్కాలర్‌షిప్‌ల పేరిట ఆర్థిక చేయూత కల్పిస్తోంది. ఎంఎస్ (ఇంజనీరింగ్), ఎంఎస్ (రీసెర్చ్) అర్హత: బీఈ, బీటెక్, ఎమ్మెస్సీ, ఎంటెక్, ఎంబీబీఎస్ కోర్సుల్లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ప్రవేశం: గేట్, యూజీసీ, సీఎస్ఐఆర్-నెట్- జేఆర్ ఎఫ్, ఐసీఎంఆర్-జేఆర్ఎఫ్, డీబీటీ-జేఆర్ఎఫ్, జెస్ట్, ఇన్స్పైర్లలో ఏదో ఒక పరీక్షలో ఉత్తీర్ణతతో పాటు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఫీజు: ఏడాదికి రూ. 3 వేల నుంచి రూ. 3.5 వేలు. స్కాలర్షిప్స్: నెలకు రూ.16 వేలు. ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ: మెటీరియల్ సైన్స్, కెమికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్ అర్హత: కనీసం 55 శాతం మార్కులతో బీఎస్సీ/బీఈ /బీటెక్ ఉత్తీర్ణత. ప్రవేశం: జేఎన్సీఏఎస్ఆర్ నిర్వహించే రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. ఫీజు: ఏడాదికి రూ. 2 వేల నుంచి రూ. 3 వేల లోపు స్కాలర్షిప్స్: మొదటి మూడేళ్లు నెలకు రూ.10 వేల చొప్పున స్టైఫండ్ లభిస్తుంది. ఆ తర్వాత పీహెచ్‌డీకి లభించే ఫెలోషిప్‌లకు అర్హులవుతారు. పీహెచ్డీ ప్రస్తుతం ఇన్స్టిట్యూట్ 20కు పైగా విభాగాల్లో పీహెచ్‌డీలను అందిస్తోంది. ఫీజు: ఏడాదికి రూ. 4 వేల నుంచి రూ.5 వేల లోపు. అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌తో మాస్టర్స్ డిగ్రీ. స్కాలర్షిప్స్: మొదటి రెండేళ్లు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పేరిట నెలకు రూ. 16 వేలు; మూడో ఏడాది నుంచి మూడేళ్లపాటు నెలకు రూ. 18 వేలు సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ లభిస్తుంది. వెబ్సైట్: www.jncasr.ac.in టీఐఎఫ్ఆర్- టీసీఐఎస్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్).. ఇంటర్‌డిసిప్లినరీ విభాగాల్లో పరిశోధనలను ప్రోత్సహించే ఉద్దేశంతో పీహెచ్డీ కోర్సులను అందిస్తోంది. అర్హత: సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ/ఎంటెక్/బీఈ/ బీటెక్/ఎంఎస్ ఉత్తీర్ణత. స్కాలర్షిప్స్: నెలకు రూ. 16 వేలు చొప్పున, సదరు సబ్జెక్ట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశాక నెలకు రూ.18 వేలు. ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ అర్హత: బీఎస్సీ/ఎమ్మెస్సీ/బీఈ/బీటెక్/ ఎంబీబీఎస్/బీఫార్మసీ ఉత్తీర్ణత. ప్రవేశం: గేట్/జెస్ట్/సీఎస్ఐఆర్-యూజీసీ నెట్లలో ఉత్తీర్ణత సాధించినవారికి టీఐఎఫ్ఆర్ నిర్వహించే రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. స్కాలర్షిప్స్: మొదటి రెండేళ్లు నెలకు రూ.16 వేలు చొప్పున, మూడో ఏడాది నుంచి నెలకు రూ.18 వేల చొప్పున స్కాలర్షిప్ లభిస్తుంది. తాజా నోటిఫికేషన్: జనవరి 2015 నుంచి ప్రారంభమయ్యే పీహెచ్డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీల్లో మిడ్ టర్మ్ ప్రవేశాలకు ప్రస్తుతం ప్రకటన వెలువడింది. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 21, 2014. వెబ్సైట్: http://gsadmissions.tifrh.res.in/ హరీశ్ చంద్ర రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌ల్లో పరిశోధనలు, ఇతర అకడమిక్ నైపుణ్యాలను పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా అలహాబాద్‌లో ఏర్పాటైన హెచ్ఆర్ఐ ఫిజిక్స్‌లో పలు స్థాయిలలో కోర్సులను ఆఫర్ చేస్తోంది. వివరాలు.. ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ-పీహెచ్డీ (ఫిజిక్స్) అర్హత: సైన్స్ లేదా ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. ఎంపిక: ఇన్స్టిట్యూట్ నిర్వహించే ప్రవేశ పరీక్షలో ర్యాంకు ఆధారంగా. పీహెచ్డీ (ఫిజిక్స్) అర్హత: ఫిజిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. ఎంపిక: జెస్ట్ ఉత్తీర్ణులకు ఇన్స్టిట్యూట్ నిర్వహించే ప్రవేశ పరీక్ష ఆధారంగా. ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ-పీహెచ్డీ (మ్యాథమెటిక్స్) అర్హత: సైన్స్ లేదా ఇంజనీరింగ్‌లో 55 శాతం మార్కులతో బ్యాచిలర్‌స డిగ్రీ ఉత్తీర్ణత. ప్రవేశం: పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా. పీహెచ్డీ (మ్యాథమెటిక్స్) అర్హత: 55 శాతం మార్కులతో ఎమ్మెస్సీ ఉత్తీర్ణత. ప్రవేశం: పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా. స్కాలర్షిప్స్: తొలి రెండేళ్లు నెలకు రూ.16 వేలు చొప్పున; తర్వాత నుంచి నెలకు రూ.18 వేలు చొప్పున స్కాలర్షిప్ లభిస్తుంది. వెబ్సైట్: www.hri.res.in ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్- భువనేశ్వర్ కేంద్ర ప్రభుత్వంలోని అణు శక్తి శాఖ, ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్.. హై ఎనర్జీ ఫిజిక్స్, కండెన్స్డ్ మ్యాటర్ ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్‌ల్లో పీహెచ్డీ ప్రోగ్రామ్‌లను అందిస్తోంది. అర్హత: ఫిజిక్స్ స్పెషలైజేషన్‌తో ఎమ్మెస్సీ. ప్రవేశం: జెస్ట్‌లో ఉత్తీర్ణతతోపాటు ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా. స్కాలర్షిప్స్: మొదటి ఏడాది నెలకు రూ. 16 వేల చొప్పున; తర్వాత నుంచి నెలకు రూ. 18 వేల చొప్పున స్కాలర్షిప్ లభిస్తుంది. వెబ్సైట్: www.iopb.res.in సైన్స్ ఔత్సాహికులకు సమున్నత ఇన్స్టిట్యూట్లు సైన్స్‌లో ఉన్నత కోర్సులు చదవాలనుకునేవారికి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నో ఇన్స్టిట్యూట్లు అందుబాటులోకి వచ్చాయి. గతంలో పీహెచ్డీ, పోస్ట్ డాక్టోరల్ కోర్సులను అందించడానికే పరిమితమైన ఇన్స్టిట్యూట్లు.. యంగ్ టాలెంట్‌ను కూడా సెన్సైస్ వైపు ప్రోత్సహించేలా బ్యాచిలర్స్, మాస్టర్స్ డిగ్రీ అర్హతతో పలు కోర్సులు అందిస్తున్నాయి. సైన్స్‌లో డిగ్రీ అంటే బీఎస్సీ/ఎమ్మెస్సీ అనే పరిమిత ఆలోచనకు స్వస్తి పలకాలి. అకడమిక్ అవకాశా లతోపాటు, క్షేత్రస్థాయి నైపుణ్యాలు, పరిశోధన సౌకర్యాలు కల్పించే ఇన్స్టిట్యూట్లు ఉన్న విషయాన్ని తెలుసుకుంటే మంచి భవిష్యత్తు సొంతమవుతుంది. - ప్రొఫెసర్ చిల్ల మల్లారెడ్డి, కెమికల్ సెన్సైస్ డిపార్టమెంట్, ఐఐఎస్ఈఆర్-కోల్‌కతా మొబిలిటీ దృక్పథంతో అవకాశాలు మెరుగవుతాయి ప్రస్తుతం ఎందరో విద్యార్థులు ఉన్నత విద్య, ఆ దిశగా డిగ్రీ, పీజీ వంటి కోర్సుల వైపు దృష్టి సారిస్తున్నారు. కానీ సమస్య అంతా.. వారు తమకు తాము పరిధులు విధించుకుంటున్నారు. తమ సమీపంలోని ఇన్స్టిట్యూట్లు, కళాశాలల్లో లభించే కోర్సుల గురించే ఆలోచిస్తున్నారు. కానీ.. తమ ప్రతిభ ఆధారంగా ప్రవేశం లభిస్తుందనుకుంటే.. ఇన్స్టిట్యూట్ ఎంత దూరంలో ఉన్నా వెళ్లడానికి సిద్ధమవ్వాలి. ఫలితంగా మెరుగైన విద్యతోపాటు భవిష్యత్తులో రాణించడానికి అవసరమయ్యే ఇతర అన్ని నైపుణ్యాలు (ఇంటర్ కల్చరల్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్) లభిస్తాయి. - ప్రొఫెసర్ కె.వి.రమణాచారి, టీఐఎఫ్ఆర్-టీసీఐఎస్. -
డిజైనింగ్ కెరీర్‌కు బెస్ట్.. సీడ్
కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ డిజైన్ (సీడ్).. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో డిజైనింగ్ విభాగంలో పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష. ఈ పరీక్షను ఐఐటీ-బాంబే పర్యవేక్షిస్తుంది. సీడ్ ద్వారా ఆర్కిటెక్చర్, మెకానికల్ తదితర విభాగాల్లో డిజైన్ సంబంధిత కోర్సులు అభ్యసించవచ్చు. రెండు భాగాలుగా: సీడ్ ప్రశ్నపత్రం ఇంగ్లిష్ భాషలో పార్ట్-ఎ, పార్ట్-బి అనే రెండు భాగాలు ఉంటుంది. పార్ట్-ఎలో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. పార్ట్-బిలో డిజైన్, హ్యాండ్ డ్రాయింగ్ ప్రశ్నలు ఉంటాయి. పార్ట్-ఎ స్క్రీనింగ్ టెస్ట్. ఇందులో నిర్దేశించిన అర్హత సాధించాల్సి ఉంటుంది. అప్పుడే పార్ట్-బి స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుని మెరిట్ జాబితా రూపొందిస్తారు. పార్ట్-ఎ ఆబ్జెక్టివ్: పార్ట్-ఎలో 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున 50 మార్కులు కేటాయించారు. సమాధానాలను గుర్తించడానికి గంట సమయం ఉంటుంది. ఇందులో జనరల్ ఆప్టిట్యూడ్, జీకే-కరెంట్ అఫైర్స్, అనలిటికల్ ఎబిలిటీ వంటి విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. అంతేకాకుండా ప్రముఖ కట్టడాలు, వ్యక్తులు, ఆర్కిటెక్చర్, కళలు వంటి అంశాలపై కూడా ప్రశ్నలు ఇస్తారు. జీకే-కరెంట్ అఫైర్స్ విభాగాల నుంచి వచ్చే ప్రశ్నలు కూడా డిజైన్, కట్టడాలు సంబంధిత నేపథ్యంగా ఉంటాయి. ఉదాహరణకు గతేడాది పరీక్షలో ఉత్తరాఖండ్‌లో 2013లో సంభవించిన వరదల కారణంగా దెబ్బతిన్న ఆలయమేది? అదేవిధంగా వాస్తు, శిల్ప కళలు, ఫోటోగ్రిఫీ, ప్రింటింగ్ తదితర రంగాల్లో కాలక్రమేణా చోటు చేసుకున్న మార్పులపై కూడా ప్రశ్నలు అడుగుతారు. అంతేకాకుండా చిత్రాలు ఇచ్చి అందులోని వ్యక్తులను లేదా కట్టడాలను గుర్తించడం, వివిధ సంస్థల లోగోలు, సరైన డిజైన్‌ను ఎంచుకోవడం వంటి ప్రశ్నలు కూడా ఉంటాయి. జనరల్ ఇంగ్లిష్, జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్ వంటి అంశాల నుంచి కూడా ప్రశ్నలు ఇస్తారు. ఆలోచనలను ప్రతిబింబించే: పార్ట్-బిలో మీలోని ఆలోచనలను చిత్రం, కథల రూపంలో వివరించాల్సి ఉంటుంది. ఈ విభాగానికి రెండు గంటల సమయం కేటాయించారు. ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగం తప్పనిసరి, రెండో విభాగం ఐచ్ఛికం (ఆప్షనల్). మొదటి విభాగంలో స్కెచింగ్, క్రియేటివిటీ అండ్ ఇమాజినేషన్ అంశాలు ఉంటాయి. ఈ విభాగానికి 50 మార్కులు కేటాయించారు. స్కెచింగ్‌లో ఏదైనా నేపథ్యం ఆధారంగా డ్రాయింగ్ వేయాల్సి ఉంటుంది. దీనికి 20 మార్కులు. డిజైన్లను ప్రెజెంట్ చేయడం, ఇచ్చిన డిజైన్‌కు ప్రత్యామ్నాయ డిజైన్లను చిత్రించాల్సిన విధంగా ప్రశ్నలు ఉంటాయి. ఇచ్చిన డిజైన్‌లో లోపాలను గుర్తించి- దానికి గల కారణాలను విశ్లేషించడంతోపాటు సరైన డిజైన్ ను సూచించడం వంటి ప్రశ్నలను కూడా ఈ విభాగం నుంచి అడుగుతారు. క్రియేటివిటీ అండ్ ఇమాజినేషన్ విభాగంలో.. ఇచ్చిన చిత్రం నేపథ్యాన్ని కథ రూపంలో వివరించాలి. ఈ ప్రశ్నకు 15 మార్కులు కేటాయించారు. తర్వాత ప్రశ్నలో ఏదో ఒక వస్తువునిచ్చి దాని ప్రత్యామ్నాయా ఉపయోగాలను పేర్కొనమనంటారు. దీనికి 15 మార్కులు. రెండో విభాగంలో విజువల్ కమ్యూనికేషన్ అండ్ ఇంటారక్షన్, ప్రొడక్ట్ డిజైన్, యానిమేషన్ డిజైన్ వంటి అంశాలు ఉంటాయి. ఇందులో ఇచ్చిన సందర్భాన్ని గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, యానిమేషన్, ప్రొడక్ట్ డిజైన్ నమూనాను చిత్రించాలి. నైపుణ్యాల పరీక్ష: సీడ్లో అకడమిక్ అంశాల కంటే అభ్యర్థిలోని నైపుణ్యాలను పరీక్షించడానికి ప్రాధాన్యతనిస్తారు. ఈ క్రమంలో అభ్యర్థిలోని దృశ్యగ్రాహ్యత సామర్థ్యం (విజువల్ పర్సెప్షన్ ఎబిలిటీ), సృజనాత్మకత, తార్కిక విశ్లేషణ, డ్రాయింగ్, కమ్యూనికేషన్ వంటి నైపుణ్యాలను అంచనా వేస్తారు. కాబట్టి ఆ దిశగా ప్రిపరేషన్ సాగించాలి. గత పేపర్లను పరిశీలిస్తూ అన్ని ప్రశ్నలకు సమాధానాలను ప్రాక్టీస్ చేయాలి (సీడ్ వెబ్సైట్లో గత ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉంటాయి). పరీక్షలో లభించే సమయం ప్రకారం వాటిని ప్రాక్టీస్ చేయడం వల్ల టైం మేనేజ్మెంట్కు వీలవుతుంది. డ్రాయింగ్ నైపుణ్యాలపై దృష్టిపెట్టాలి. ఈ క్రమంలో షేడ్, లైన్స్, సృజనాత్మకత, తార్కిక వివేచన వంటి అంశాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఒక డిజైన్‌ను చూసిన వెంటనే.. లోపాలు గుర్తించే సామర్థ్యం, కారణాలను విశ్లేషించే నైపుణ్యం, ప్రత్యామ్నాయ డిజైన్లను రూపొందించే సృజనాత్మకత ఉండాలి. అంతేకాకుండా పండ్లు, కూరగాయలు ఇలా మీ దైనందిన జీవితంలో ఉపయోగించే ప్రతి వస్తువును వివిధ కోణాల్లో చిత్రించేందుకు ప్రయత్నించాలి. అదేక్రమంలో వివిధ రకాల డిజైన్లపై అవగాహన పెంచుకోవాలి. తద్వారా డ్రాయింగ్ సామర్థ్యాలు పెరుగుతాయి. అంతేకాకుండా వాటికి సంబంధించిన విభిన్న ఉపయోగాల గురించి కూడా ఆలోచించాలి. వాటిని ఒక క్రమ పద్ధతిలో రాయడం, చిత్రం ఆధారంగా కథను వివరించడం వంటి అంశాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. రెండేళ్లపాటు: ఫలితాలు వెల్లడించిన రోజు నుంచి రెండేళ్లపాటు సీడ్ స్కోర్ చెల్లుబాటులో ఉంటుంది. సీడ్ కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఈ స్కోర్ ఆధారంగా ఆయా కోర్సులను అందిస్తున్న ఇన్స్టిట్యూట్లకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆయా ఇన్స్టిట్యూట్లు నిర్దేశించే అర్హత ప్రమాణాలు, ప్రవేశ ప్రక్రియలు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి దరఖాస్తు చేసుకునే ముందు ఆయా ఇన్స్టిట్యూట్ల వెబ్సైట్ల నుంచి సంబంధిత సమాచారాన్ని పొందడం మంచిది. ప్రవేశం:ఆయా ఇన్స్టిట్యూట్లు సీడ్ స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ లేదా రాత పరీక్ష నిర్వహించి పీజీ కోర్సుల్లో ప్రవేశాన్ని ఖరారు చేస్తున్నాయి. ఈ క్రమంలో వివిధ ఇన్స్టిట్యూట్లు అనుసరించే విధానం.. నోటిఫికేషన్ సమాచారం: అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్/ ఆర్కిటెక్చర్/ డిజైన్/ ఇంటీరియర్ డిజైన్/ తత్సమానం లేదా ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ డిజైన్ (10+2 తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ లేదా సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ అండ్ ప్లానింగ్ టెక్నాలజీ లేదా తత్సమాన హోదా ఉన్న ఇన్స్టిట్యూట్ నుంచి నాలుగేళ్ల కోర్సు) లేదా బీఎఫ్ ఏ (10+2 తర్వాత నాలుగేళ్ల కోర్సు) లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్/సైన్స్/కంప్యూటర్ ఆప్లికేషన్స్ (10+2+3 తర్వాత రెండేళ్ల కోర్సు) లేదా గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఆర్ట్ (10వ తరగతి తర్వాత ఐదేళ్ల కోర్సు)తోపాటు సంబంధిత రంగంలో ఏడాది అనుభవం. దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా రదఖాస్తు ఫీజు: రూ. 2,000 (ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ మహిళ అభ్యర్థులకు రూ.1,000) దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 1, 2014. పరీక్ష కేంద్రాల ఎంపిక వ్యవధి: అక్టోబర్ 15-30 వరకు. రాతపరీక్ష తేదీ: డిసెంబర్ 7, 2014. ఫలితాల వెల్లడి: జనవరి 15, 2014 వివరాలకు: www.gate.iitb.ac. in /ceed-2015 ఇన్స్టిట్యూట్ ప్రవేశప్రక్రియ ఐఐఎస్సీ-బెంగళూరు సీడ్ స్కోర్, ఇంటర్వ్యూ ఐఐటీ-బాంబే సీడ్ స్కోర్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ మూడు దశలు ఐఐటీ-కాన్పూర్ సీడ్/గేట్ స్కోర్, ఇంటర్వ్యూ, రాత పరీక్ష ఐఐటీ-హైదరాబాద్ సీడ్ స్కోర్, ఇంటర్వ్యూ ఐఐటీ-గౌహతి సీడ్ స్కోర్, క్రియేటివ్ ఇంటరాక్టివ్ సెషన్, ఇంటర్వ్యూ. పీహెచ్డీ కోర్సుల్లో పీహెచ్డీ ప్రపొజల్, పబ్లికేషన్స్, ప్రొఫైల్, డిపార్ట్మెంట్ ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. -
బంగారు భవితకు గేట్‌వే!
నేషనల్ కోఆర్డినేషన్ బోర్డు (ఎన్సీబీ)-గేట్ తరఫున గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఏడు ఐఐటీల ఆధ్వర్యంలో ఏటా నిర్వహిస్తారు. ఈ పరీక్షలో సాధించిన స్కోర్‌తో ఐఐటీలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగళూరు)లతో పాటు ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు, డాక్టోరల్ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు. ఇటీవలి కాలంలో గేట్లో సాధించిన స్కోర్ ఆధారంగా ప్రభుత్వరంగ సంస్థలు ఎంట్రీ లెవల్ రిక్రూట్మెంట్స్ చేపడుతుండటంతో గేట్‌కు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. గేట్-2015 నిర్వహణ సంస్థగా ఐఐటీ- కాన్పూర్ వ్యవహరిస్తోంది.గేట్-2012కు 6,86,614 మంది, గేట్-2013కు 9,84,855 మంది హాజరయ్యారు. గేట్-2014 పరీక్షకు 8,89,156 మంది హాజరయ్యారు. అర్హత: ఇంజనీరింగ్/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్(10+2తర్వాత నాలుగేళ్లు)లలో బ్యాచిలర్ డిగ్రీ. లేదా మ్యాథ్స్/సైన్స్/ స్టాటిస్టిక్స్/కంప్యూటర్ అప్లికేషన్ లేదా తత్సమాన విభాగంలో మాస్టర్ డిగ్రీ.చివరి సంవత్సరం విద్యార్థులు కూడా గేట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఈ/బీటెక్/బీఆర్కలకు సమానమైన ప్రొఫెషనల్ సొసైటీ పరీక్షలలో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష విధానం: మొత్తం 22 పేపర్లకు ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థి తన బ్రాంచ్/విభాగానికి అనుగుణంగా ఏదో ఒక పేపర్‌కు మాత్రమే పరీక్షకు హాజరు కావాలి. మొత్తం 65 ప్రశ్నలకు మూడు గంటల్లో సమాధానాలను గుర్తించాలి. మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. గేట్-2015 ప్రశ్నపత్రంలో మల్టిపుల్ చాయిస్ టైప్, న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ టైప్ ప్రశ్నలకు ఆప్షన్లు ఇస్తారు. అదే న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలకు ఆప్షన్లు ఇవ్వరు. వర్చువల్ కీ ప్యాడ్‌ను ఉపయోగించి సమాధానం పూరించాలి. ఏరోస్పేస్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, బయెటెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ సెన్సైస్ తదితర పేపర్లలో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ (దాదాపు 15 శాతం మార్కులు); జనరల్ ఆప్టిట్యూడ్ (15 శాతం మార్కులు); సబ్జెక్టు (70 శాతం మార్కులు)లకు సంబంధించిన ప్రశ్నలుంటాయి.ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, కెమిస్ట్రీ, ఎకాలజీ అండ్ ఎవల్యూషన్, లైఫ్ సెన్సైస్ తదితర పేపర్లలో జనరల్ ఆప్టిట్యూడ్ (15 శాతం మార్కులు), సబ్జెక్టు (85 శాతం మార్కులు)లకు సంబంధించిన ప్రశ్నలుంటాయి.ఒక మార్కు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులు; రెండు మార్కుల మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు ప్రతి తప్పు సమాధానానికి 2/3 మార్కులు కోత విధిస్తారు. న్యూమరికల్ సమాధాన ప్రశ్నలకు రుణాత్మక మార్కులు లేవు. స్కోర్ ప్రాధాన్యత, ఆర్థిక సహాయం: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఆర్డీ), ఇతర ప్రభుత్వ సంస్థల మద్దతుతో నడిచే ఇన్స్టిట్యూట్లలో ఇంజనీరింగ్/ టెక్నాలజీ/ ఆర్కిటెక్చర్, సైన్స్ సబ్జెక్టులకు సంబంధించిన పీజీ, డాక్టోరల్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు ఆర్థిక సహాయం అందుకోవడానికి గేట్ స్కోర్ ను పరిగణనలోకి తీసుకుంటారు. కోర్సు చేస్తున్న సమయంలో నెలకు రూ.8 వేల వరకు ఉపకార వేతనం అందుతుంది. కొన్ని ప్రభుత్వ సంస్థలు సైంటిస్ట్/ ఇంజనీర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గేట్ స్కోర్‌ను తప్పనిసరి చేస్తున్నాయి. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (సింగపూర్), జర్మనీలోని కొన్ని సాంకేతిక విశ్వవిద్యాలయాలు.. మాస్టర్స్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాల సందర్భంలో విద్యార్థి ప్రతిభను అంచనా వేసేందుకు గేట్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నాయి.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ (ఎన్ఐటీఐఈ-ముంబై).. గేట్ స్కోర్ ఆధారంగా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమాను ఆఫర్ చేస్తోంది.గేట్ స్కోర్ ఆధారంగా ఐఐఎంలలో ఫెలో ప్రోగ్రామ్ (మేనేజ్మెంట్)లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్య తేదీలు ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: సెప్టెంబర్ 1, 2014. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: అక్టోబర్ 1, 2014. ఆన్లైన్లో అడ్మిట్ కార్డులు అందుబాటు: డిసెంబర్ 17, 2014. పరీక్ష తేదీలు: ఆన్లైన్లో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు; మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు పరీక్షలు జరుగుతాయి. జనవరి 31, 2015; ఫిబ్రవరి 1, 7, 8, 14 తేదీల్లో నిర్వహిస్తారు. ఫలితాల వెల్లడి: మార్చి 12, 2015. దరఖాస్తు రుసుం: పురుష అభ్యర్థులు(జనరల్/ఓబీసీ):రూ.1500. మహిళా అభ్యర్థులు: రూ.750 ఇతర అభ్యర్థులు (జనరల్/ఓబీసీ): రూ.1500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు: రూ.750. చెల్లింపు విధానం: ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్; ఎస్బీఐ ఐ-కలెక్ట్; యాక్సిస్ బ్యాంకు ఐ-కనెక్ట్; ఈ-చలాన్. దరఖాస్తు విధానం: గేట్-2015 నిర్వహణ సంస్థ ఐఐటీ కాన్పూర్ లేదా ఇతర జోనల్ గేట్ కార్యాలయాల వెబ్సైట్లో లాగిన్ అయి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్‌తో అనుసంధానం కావొచ్చు. తర్వాత రిజిస్టర్ చేసుకొని, దరఖాస్తును పూరించాలి. ఈ సమయంలో అభ్యర్థులు తప్పనిసరిగా తమ ఫొటో, సంతకాన్ని, అవసరమైన ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలి. వెబ్సైట్: www.iitk.ac.in గేట్ పేపర్లు ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ బయెటెక్నాలజీ కెమికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కెమిస్ట్రీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎకాలజీ, ఎవల్యూషన్ జియాలజీ అండ్ జియోఫిజిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ మెకానికల్ ఇంజనీరింగ్ మైనింగ్ ఇంజనీరింగ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ {పొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ టెక్స్టైల్ ఇంజనీరింగ్ అండ్ ఫైబర్ సైన్స్ ఇంజనీరింగ్ సెన్సైస్ లైఫ్ సెన్సైస్. ప్రధాన అంశాలు: గేట్ ప్రశ్నపత్రంలో బహుళైచ్చిక ప్రశ్నలతో పాటు సంఖ్యాపరమైన సమాధాన ప్రశ్నలు (ూఠఝ్ఛటజీఛ్చి ్చటఠ్ఛీట ్ఞఠ్ఛట్టజీౌట) ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలు 20 నుంచి 25 వరకు వస్తాయి. అందువల్ల ఏ అంశాన్ని చదివినా కచ్చితత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలి. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే కొన్ని అంశాలకు వెయిటేజీ ఏటా మారుతున్నట్లు గమనించవచ్చు. కొన్ని కోర్ అంశాలకు మాత్రం ఎప్పుడూ సమాన ప్రాధాన్యం ఉంటుంది. ఇలాంటి వాటిపై నిర్లక్ష్యం చూపకుండా పూర్తిస్థాయిలో ప్రిపరేషన్ కొనసాగించాలి. ఉదాహరణకు థర్మోడైనమిక్స్, ప్రొడక్షన్ టెక్నాలజీ/మ్యానుఫ్యాక్చరింగ్ సైన్స్ అంశాలను చెప్పుకోవచ్చు. థర్మోడైనమిక్స్ నుంచి కనీసం 12 మార్కులకు ప్రశ్నలు రావొచ్చు. విశ్లేషణ: ఏ సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్ అయినా వందశాతం పూర్తిచేయడం కష్టం. ఎన్ని టాపిక్స్‌ను పూర్తిచేశామనే దానికన్నా ఎన్ని టాపిక్స్‌ను క్షుణ్నంగా, విశ్లేషణాత్మకంగా చదివామనేది ముఖ్యం. ఓ అంశంపై ప్రశ్న ఏ కోణంలో ఇచ్చినా సమాధానం గుర్తించేలా అధ్యయనం చేయాలి. సొంత నోట్స్: పరీక్షకు ఆర్నెల్లకు పైగా సమయం అందుబాటులో ఉంది కాబట్టి ఔత్సాహికులు సొంతంగా నోట్స్‌ను రూపొందించుకోవాలి. ముఖ్యమైన సూత్రాలను నోట్స్‌లో రాసుకోవడం వల్ల వీలైనన్ని ఎక్కువ సార్లు పునశ్చరణకు వీలవుతుంది. అన్ని అంశాల్లోని ప్రాథమిక భావనలను సమగ్రంగా అధ్యయనం చేయాలి. వీటిలోని ముఖ్యమైన వాటిని నోట్స్‌లో పొందుపరచుకోవచ్చు. పుస్తకాలు: థర్మో డైనమిక్స్‌కు పి.కె.నాగ్; స్ట్రెంథ్ ఆఫ్ మెటీరియల్స్‌కు రామామృతం పుస్తకాలు బాగా ఉపయోగపడతాయి. - అల్లూరి సునీల్‌వర్మ (గేట్-2014 మెకానికల్ 5వ ర్యాంకు). ప్రధాన అంశాలు: ఆన్లైన్లో పరీక్షలు జరుగుతుండటం వల్ల ముఖ్యమైన అంశాలు ఏమిటనేవి చెప్పలేకపోతున్నాం. ఒక్కో స్లాట్‌లో ఒక్కో దానికి ఎక్కువ వెయిటేజీ ఉంటున్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు గేట్-2014లో నా స్లాట్‌లో అనలాగ్ సర్క్యూట్స్‌పై ఎక్కువ ప్రశ్నలు రాగా, తర్వాతి స్లాట్‌లో ఎలక్ట్రానిక్ డివెసైస్పై అధిక ప్రశ్నలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఔత్సాహికులు సొంత ప్రిపరేషన్ ప్రణాళికను అమలు చేసుకోవాలి. టెక్నికల్ సబ్జెక్టులు అన్నీ ముఖ్యమైనవేనని గుర్తించి, చక్కని సమయపాలనతో క్షుణ్నంగా చదవాలి. అన్ని ప్రశ్నలూ కాన్సెప్టు ఆధారితంగానే ఉంటున్నాయి కాబట్టి మొదట థియరీని బాగా చదివి, తర్వాత కాన్సెప్టులను బాగా ప్రాక్టీస్ చేయాలి. శిక్షణ: గేట్‌కు కోచింగ్ తీసుకోవడం వల్ల అదనపు ప్రయోజనం ఉంటుందని చెప్పొచ్చు. కాలేజీలో రోజువారీ తరగతుల్లో బోధన, అభ్యసన ఎక్కువగా అకడమిక్ పరంగా ఉంటుంది. దీంతో కొన్ని కాన్సెప్టులపై లోతుగా అవగాహన ఏర్పడదు. శిక్షణ కేంద్రంలో అయితే ప్రత్యేకంగా గేట్ కోణంలో బోధన ఉంటుంది. కాలేజీలో బీటెక్ స్థాయిలో చదివిన అంశాలపై అప్లికేషన్ కోణంలో శిక్షణ లభిస్తుంది కాబట్టి ప్రయోజనం ఉంటుంది. నమూనా పరీక్షలు: అన్ని సబ్జెక్టులకు ఆన్లైన్ మాక్‌టెస్ట్‌లకు హాజరవడం వల్ల ప్రిపరేషన్‌కు సంబంధించిన బలాలు, బలహీనతలు తెలుస్తాయి. అయితే సిలబస్‌ను పూర్తిచేసిన తర్వాత మాత్రమే ఈ టెస్ట్‌లు రాయాలి. అకడమిక్‌గా బీటెక్ స్థాయిలో చదివిన అంశాలను అప్లికేషన్ కోణంలో ప్రాక్టీస్ చేయాలి. - కె.కె.శ్రీనివాస్, (గేట్-2014 ఈసీఈ 4వ ర్యాంకు). ప్రధాన అంశాలు: గత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేస్తే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ఏ అంశాల నుంచి అధిక ప్రశ్నలు వస్తున్నాయో తెలుస్తుంది. నెట్వర్క్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ అంశాలు చాలా ముఖ్యమైనవి. ఎక్కువగా సమస్య సాధన (ఞటౌఛ్ఛఝ టౌఠిజీజ) ప్రశ్నలు వస్తున్నాయి. అందువల్ల ప్రిపరేషన్లో ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రణాళిక: డిసెంబర్ నాటికి సిలబస్‌ను పూర్తిచేయాలి. అప్పటి నుంచి పరీక్ష తేదీ వరకు అందుబాటులో ఉన్న సమయాన్ని పునశ్చరణకు, ఆన్లైన్ మాక్ టెస్ట్‌లు రాయడానికి కేటాయించాలి. ఈ రెండింటికి సమ ప్రాధాన్యం ఇవ్వాలి. కొన్ని శిక్షణ సంస్థలు దేశవ్యాప్తంగా ఆన్లైన్ మాక్ టెస్ట్‌లను నిర్వహించి ఆలిండియా ర్యాంకులు ఇస్తోంది. సబ్జెక్టుల వారీగా కూడా మార్కులు ప్రకటిస్తోంది. దీనివల్ల అభ్యర్థులు తమను తాము అంచనా వేసుకొని, ప్రిపరేషన్ ప్రణాళికలో మార్పులు చేసుకునేందుకు వీలుంటుంది. నిర్దేశ సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడం అలవడుతుంది. మొత్తం సిలబస్‌కు సంబంధించి 15-20 టెస్ట్‌లు రాయడం మంచిది. సొంత నోట్స్: ప్రతి సబ్జెక్టులోని ముఖ్య అంశాలు, సూత్రాలతో సొంతంగా నోట్స్ రూపొందించుకోవాలి. ఇది రివిజన్‌కు బాగా ఉపయోగపడుతుంది. - రాపోలు జయప్రకాశ్ (గేట్-2014 ఎలక్ట్రికల్ 9వ ర్యాంకు). ప్రిపరేషన్ వ్యూహాలు సిలబస్‌లోని కాన్సెప్ట్‌లను గుర్తించి వాటి ప్రాధాన్యాన్ని విశ్లేషించుకుంటూ చదవాలి. వివిధ వనరుల నుంచి రకరకాల ప్రశ్నలను సేకరించి వాటిని క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. వివిధ సమస్యలకు తేలిగ్గా సమాధానం గుర్తించే మార్గాలను(షార్ట్‌కట్స్)ను సొంతంగా ఆవిష్కరించాలి. ఈ వి ధానం అభ్యర్థులను విజయం ముంగిటకు చేరుస్తుంది.గేట్ పరీక్ష ప్రధానంగా సంబంధిత బ్రాంచ్‌లో అభ్యర్థిలోని ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షిస్తుంది. సబ్జెక్ట్‌లోని బేసిక్స్, ఫండమెంటల్స్‌పై అవగాహన స్థాయిని తెలుసుకునే విధంగా ప్రశ్నలు వస్తాయి. అందువల్ల సరైన ప్రామాణిక పుస్తకాలను ఎంపిక చేసుకొని చదవాలి. ఈసీఈ: నెట్వర్క్స్, ఎలక్ట్రానిక్ డివెసైస్, అనలాగ్ సర్క్యూట్స్, డిజిటల్ సర్క్యూట్స్, సిగ్నల్ అండ్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రోమ్యాగ్నటిక్స్ అంశాల భావనలపై పట్టు సాధిస్తే గేట్లో మంచి స్కోర్ సాధించవచ్చు. మ్యాథమెటిక్స్ నేపథ్యం ఉన్నవారికి ఈసీఈలోని అంశాలను ఒంటబట్టించుకోవడం తేలికవుతుంది. గేట్లో నెట్‌వర్క్స్‌పై ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. దీనికి సంబంధించి ప్రామాణిక పుస్తకాల్లోని సమస్యలను సాధన చేయాలి. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్‌లో ignal to noise ratio of AM, FM; superheterodyne receiver, Fundamentals of information theory, PCM, CPCM, matched filter receiversË$ ముఖ్యమైన వాటిలో కొన్ని.డిజిటల్ సర్క్యూట్లలో లాజిక్ గేట్స్, లాజిక్ ఫ్యామిలీస్, కాంబినేషనల్ అండ్ సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్, మైక్రోప్రాసెసర్స్లోని సమస్యలను సాధన చేయాలి. సీఎస్ అండ్ ఐటీ: థియరీ ఆఫ్ కంప్యుటేషన్, ఆపరేటింగ్ సిస్టమ్స్, సీ అండ్ డేటా స్ట్రక్చర్స్, డీబీఎంఎస్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ వంటి అంశాలపై పట్టు సాధిస్తే గేట్లో మంచి స్కోర్ సాధించడంతో పాటు సాఫ్ట్వేర్ పరిశ్రమలో రాణించడానికి ఉపయోగపడతాయి. మెకానికల్ ఇంజనీరింగ్: మెకానికల్ కోర్ సబ్జెక్టులైన థర్మోడైనమిక్స్, స్ట్రెంథ్ ఆఫ్ మెటీరియల్స్, డిజైన్ ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంశాలు మంచి స్కోర్ సాధించేందుకు కీలకమైనవి. వీటిలోని సమస్యల సాధనపై దృష్టిసారించాలి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్: పవర్ సిస్టమ్స్, మెషీన్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెజర్మెంట్స్ తదితర అంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి. వీటిలోని ఈక్వేషన్స్‌పై పట్టు సాధించాలి. ఆన్లైన్ మాక్ పరీక్షలు: ఆన్లైన్ మాక్ పరీక్షలకు హాజరు కావడం ద్వారా టైమ్ మేనేజ్మెంట్ అలవడుతుంది. ఎంత సమయంలో ఎన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలుగుతున్నారో తెలుస్తుంది. ప్రిపరేషన్ పరంగా బలాలు-బలహీనతలు తెలుస్తాయి. పరీక్ష విధానం అలవాటవుతుంది. శిక్షణ సంస్థలు కొంత మొత్తాన్ని వసూలు చేసి, ఆన్లైన్ టెస్ట్ సిరీస్‌లను నిర్వహిస్తుంటాయి. వీటికి హాజరవ్వాలి. కొన్ని సంస్థలు స్టడీ మెటీరియల్, మాక్ టెస్ట్‌లు, గత ప్రశ్నపత్రాలు తదితరాలు అందుబాటులో ఉండే ట్యాబ్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి. -
‘ఐఐఎస్సీ’లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సులేవి?
‘ఐఐఎస్సీ’లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సులేవి? నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ పూర్తిచేశాను. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్)లో పీహెచ్డీ చేయాలనుకుంటున్నాను. సంస్థ, కోర్సు వివరాలు తెలియజేయగలరు? - అశోక్, నల్గొండ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, పుణె.. బేసిక్ సెన్సైస్‌లో పరిశోధనలకు కేంద్రంగా నిలుస్తోంది. ఈ సంస్థ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ, పీహెచ్డీ ప్రోగ్రామ్‌లను ఆఫర్ చేస్తోంది. సంస్థలో బయలాజికల్/ లైఫ్ సెన్సైస్; కెమికల్ సెన్సైస్; మ్యాథమెటికల్ సెన్సైస్‌లో పీహెచ్డీ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. కెమికల్ సెన్సైస్‌లో పీహెచ్డీ చేయాలనుకుంటే ఫిజికల్, ఇనార్గానిక్, ఆర్గానిక్ విభాగాల్లో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. అర్హత: కెమిస్ట్రీ/ఫిజిక్స్/బయోకెమిస్ట్రీ/మెటీరియల్ సైన్స్/బయోఇన్ఫర్మాటిక్స్/ఫార్మసీలో ఎంఎస్సీ లేదా తత్సమాన కోర్సును పూర్తిచేసి ఉండాలి. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు కనీసం 60 శాతం మార్కులు; ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం మార్కులు వచ్చుండాలి. ఈ కింది అర్హతల్లో తప్పనిసరిగా ఏదో ఒకటి ఉండాలి. సీఎస్ఐఆర్ నెట్-జేఆర్ఎఫ్ లేదా డీబీటీ-జేఆర్ఎఫ్-ఏ లేదా ఐసీఎంఆర్-జేఆర్ఎఫ్. సీఎస్ఐఆర్-ఎల్ఎస్ లేదా డీఏఈ-జెస్ట్ లేదా గేట్లో తగిన స్కోర్. ఐఐఎస్ఈఆర్ బీఎస్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ విద్యార్థులు. ఎంట్రెన్స్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక. వెబ్సైట్: www.iiserpune.ac.in ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌లను ఆఫర్ చేస్తున్న సంస్థలేవి? - శ్రీధర్, నిర్మల్. ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ.. ఔషధాల ఆవిష్కరణ, అభివృద్ధి ప్రక్రియలను వివరిస్తుంది. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి ఔషధాల తయారీ కంపెనీలు, క్లినికల్ రీసెర్చ్, బయో టెక్నాలజీ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలుంటాయి. కోర్సులు: జి.పుల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, హైదరాబాద్.. ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ స్పెషలైజేషన్‌తో ఎం.ఫార్మసీ కోర్సును ఆఫర్ చేస్తోంది. అర్హత: బి.ఫార్మసీ. ఎంట్రెన్స్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.gprcp.ac.in కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సెన్సైస్, ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం.. ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ స్పెషలైజేషన్‌తో ఎం.ఫార్మసీని అందిస్తోంది. అర్హత: బి.ఫార్మసీ. ఎంట్రెన్స్‌లో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.andhrauniversity.edu.in విట్ యూనివర్సిటీ, వెల్లూరు.. ఎంఎస్సీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ కోర్సును ఆఫర్ చేస్తోంది. వెబ్సైట్: www.vit.ac.in బిట్స్ పిలానీ, హైదరాబాద్.. ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ స్పెషలైజేషన్‌తో ఎం.ఫార్మసీని ఆఫర్ చేస్తోంది. అర్హత: బి.ఫార్మసీ. ఎంట్రెన్స్‌లో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.bits-pilani.ac.in/hyderabad ఆర్మీలో డాక్టర్‌గా చేరాలంటే ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేయాలి? - అనిత, రాయదుర్గం. రక్షణ దళాల్లో డాక్టర్‌గా చేరడానికి ఒక మార్గం.. ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్, పుణె. ఇది యూజీ, పీజీ కోర్సుల్లో శిక్షణ ఇస్తోంది. ఎంబీబీఎస్ కాల వ్యవధి నాలుగున్నరేళ్లు. తర్వాత ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ ఉంటుంది. అర్హత: ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణత. సైన్స్ సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులు రావాలి. ఇంగ్లిష్‌లో 50 శాతం మార్కులుండాలి. వయోపరిమితి: వయసు 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. అవివాహితులై ఉండాలి. కోర్సు చేస్తున్న సమయంలో వివాహానికి అనుమతించరు. ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. ఏఎఫ్ఎంసీలో ఎంబీబీఎస్ కోర్సులో చేరేముందు సాయుధ దళాల మెడికల్ సర్వీసెస్‌లో కమిషన్డ్ ఆఫీసర్స్‌గా ఏడేళ్లపాటు విధులు నిర్వహిస్తామని అంగీకార పత్రం అందజేయాల్సి ఉంటుంది. సంబంధిత బాండ్ అగ్రిమెంట్‌పై అభ్యర్థి తల్లిదండ్రులు/ గార్డియన్ సంతకం చేయాలి. వెబ్సైట్: www.afmc.nic.in ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా హోల్డర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ హోల్డర్స్ కూడా సైన్యంలోని మెడికల్ సర్వీసెస్‌లో చేరొచ్చు. ఈ కోర్సులకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) గుర్తింపు ఉండాలి. వీరు శాశ్వత కమిషన్ లేదా షార్ట్ సర్వీస్ కమిషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్సైట్: afmc.nic.in; indianarmy.nic.in ఐఐఎస్సీ ఆఫర్ చేస్తున్న బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల వివరాలు తెలపగలరు? - మాధవి, విజయవాడ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు.. నాలుగేళ్ల వ్యవధితో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. బయాలజీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, మెటీరియల్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ వంటి కీలక విభాగాల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ప్రధాన సబ్జెక్టులుగా 10+2ను కనీసం 60 శాతం మార్కులతో లేదా తత్సమాన గ్రేడ్‌తో పూర్తిచేసుండాలి. కేవైపీవై-ఎస్ఏ/ కేవైపీవై-ఎస్బీ/ కేవైపీవై-ఎస్ఎక్స్/ ఎస్బీ/ ఐఐటీ-జేఈఈ/ఏఐపీఎంటీలో ప్రతిభ ఆధారంగా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.iisc.ernet.in టి.మురళీధరన్ టి.ఎం.ఐ. నెట్ వర్క్ -
విభజన సెగ..ఐఐఎస్సీ ఔట్..!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : దుర్భిక్ష ‘అనంత’లో కలికితురాయి అవుతుందనుకున్న ఐఐఎస్సీ(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్స్) కర్ణాటక తన్నుకెళ్లింది. కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రులు కేంద్రంపై మూకుమ్మడిగా ఒత్తిడి తెచ్చి హిందూపురం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు కావాల్సిన ఐఐఎస్సీ రెండో క్యాంపస్‌ను చిత్రదుర్గకు తరలించుకుపోయారు. కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా మన రాష్ట్రానికి చెందిన దగ్గుబాటి పురందేశ్వరి ఉన్నా కర్ణాటక ఒత్తిళ్లకే కేంద్రం తలొగ్గింది. రాష్ట్ర విభజనకు ముందే మందబలంతో కర్ణాటక మన జిల్లాకు తీరని అన్యాయం చేసింది. ఇక విభజన జరిగితే పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. దుర్భిక్ష ‘అనంత’లో చదువు ఒక్కటే బతుకును ఇస్తుందని విశ్వసించిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అత్యున్నత విద్యా సంస్థలను మన జిల్లాలో ఏర్పాటుచేయడానికి పూనుకున్నారు. ఆ క్రమంలోనే అనంతపురంలో జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విద్యాలయం(జేఎస్టీయూ)ను ఏర్పాటుచేశారు. దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఐఐఎస్సీ రెండో క్యాంపస్‌ను హిందూపురం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటుచేయాలని 2007 నవంబర్ 9న అప్పటి కేంద్ర మానవనరులశాఖ మంత్రి అర్జున్‌సింగ్‌కు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి లేఖ రాశారు. ఐఐఎస్సీ ప్రధాన కేంద్రం, క్యాంపస్ ఇప్పటికే కర్ణాటక రాజధాని అయిన బెంగుళూరులో ఏర్పాటైన విషయం విదితమే. రెండో క్యాంపస్‌ను హిందూపురం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటుచేయడానికి అప్పట్లో అర్జున్‌సింగ్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రానికి రెండోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఐఐఎస్సీ రెండో క్యాంపస్ ఏర్పాటుపై కేంద్రంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. మహానేత వైఎస్ హఠాన్మరణం చెందిన తర్వాత 2010 ఏప్రిల్ 24న హిందూపురం పరిసర ప్రాంతాల్లో ఐఐఎస్సీ రెండో క్యాంపస్ ఏర్పాటుకుకు అంగీకరిస్తూ అప్పటి కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి కపిల్ సిబల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఉత్తర్వులు జారీచేసిన వెంటనే కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రులు తేరుకున్నారు. రాజకీయాలను పక్కన పెట్టి అప్పట్లో ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో కలిసి ఐఐఎస్సీ రెండో క్యాంపస్‌ను కూడా చిత్రదుర్గలోనే ఏర్పాటుచేయాలని కేంద్రంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఈ ఒత్తిళ్లకు తలొగ్గిన కేంద్రం చిత్రదుర్గలో ఐఐఎస్సీ ప్రయోగశాలను ఏర్పాటుచేయడానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు వెలువడిన నెల రోజుల్లోనే ప్రయోగశాల పనులను చిత్రదుర్గలో ఐఐఎస్సీ యాజమాన్యం ప్రారంభించింది. గతేడాది పనులు కూడా పూర్తవడంతో.. ప్రయోగశాలను ఇప్పటికే లాంఛనంగా ప్రారంభించారు. హిందూపురం పరిసర ప్రాంతాల్లో ఐఐఎస్సీ ఏర్పాటుకు అనువైన భూమి కోసం కేంద్ర బృందం రెండుసార్లు పర్యటించింది. హిందూపురం-చిలమత్తూరు మధ్యలో ఎన్‌హెచ్-44కు సమీపంలో ఉన్న వెయ్యి ఎకరాల భూమిని ఐఐఎస్సీ రెండో క్యాంపస్ ఏర్పాటుకు అనువుగా కేంద్ర బృందం గుర్తించింది. భవన నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభిస్తామని.. 2012 విద్యా సంవత్సరంలో తరగతులు కూడా ప్రారంభిస్తామని కేంద్రం ప్రకటించింది. కానీ.. ఇప్పటిదాకా రెండో క్యాంపస్ నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన కూడా ఐఐఎస్సీ యాజమాన్యం చేయలేదు. రెండో క్యాంపస్ పనులు ప్రారంభించేలా ఐఐఎస్‌సీపై మన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు గానీ, ఎంపీలు గానీ ఒత్తిడి తెచ్చిన దాఖలాలు లేవు. మన రాష్ట్రానికి కేంద్ర మంత్రులు, ఎంపీల నిర్లక్ష్యం ఒక ఎత్తయితే.. వేర్పాటువాదం మరొక ఎత్తు. రాష్ట్రంలో 2009 డిసెంబర్ 9 నుంచి నేటి వరకూ రాజకీయ అనిశ్చితి నెలకొంది. వేర్పాటువాదం.. సమైక్యాంధ్ర ఉద్యమాలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూలై 30న కేంద్రం రాష్ట్ర విభజనకు అనుకూలంగా ప్రకటన చేసింది. ఆ ప్రకటన సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఎగిసేలా చేసింది. ఈ ఉద్యమానికి ‘అనంత’ చుక్కానిలా నిలుస్తోంది. ఇదే సందర్భంలో కర్ణాటకలో బీజేపీ సర్కారు స్థానంలో కాంగ్రెస్ సర్కారు కొలువు తీరింది. మన రాష్ట్రంలో వేర్పాటువాదం వెర్రితలలు వేస్తోన్న నేపథ్యంలో రెండో క్యాంపస్ ఏర్పాటుకు ఐఐఎస్సీ అంగీకరించడం లేదు. ఇది పసిగట్టిన కర్ణాటక సర్కారు, ఆ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కేంద్రంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. చిత్రదుర్గలో ఐఐఎస్సీ ఏర్పాటు చేసిన ప్రయోగశాల స్థానంలోనే రెండో క్యాంపస్‌ను ఏర్పాటుచేయాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గిన కేంద్రం చిత్రదుర్గలో ఐఐఎస్సీ రెండో క్యాంపస్ ఏర్పాటుచేయడానికి సూత్రప్రాయంగా అంగీకరిస్తూ కర్ణాటక సర్కారుకు వర్తమానం పంపింది. ఐఐఎస్సీ కేంద్ర మానవనరుల అభివృద్ధి శాఖ సారధ్యంలోనే పనిచేస్తుంది. ప్రస్తుతం ఆశాఖ మంత్రిగా మన రాష్ట్రానికి చెందిన దగ్గుబాటి పురందేశ్వరి వ్యవహరిస్తున్నారు. కానీ.. హిందూపురంలో ఏర్పాటుకావాల్సిన ఐఐఎస్సీ రెండో క్యాంపస్‌ను కర్ణాటక తన్నుకెళ్తోంటే కనీసం అడ్డుకోలేకపోయారు. రాష్ట్ర విభజన జరగక ముందే ‘అనంత’కు ప్రతిష్ఠాత్మక ఐఐఎస్సీ రెండో క్యాంపస్ దూరమవుతోన్న నేపథ్యంలో.. విభజన జరిగితే మరింత తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇది సమైక్యవాదులను ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయడానికి పురిగొల్పుతోంది. -
పరిశోధనలకు మేటి విద్యా సంస్థ.. ఐఐఎస్సీ
వివిధ యూనివర్సిటీలు, సంస్థలు ప్రపంచంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలేవో తెలుసుకోవడానికి ప్రతి ఏటా నిర్వహించే సర్వేల్లో మన దేశం నుంచి చోటు దక్కించుకుంటున్న ఏకైక విద్యా సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-బెంగళూరు. తాజాగా షాంగై జియావో టాంగ్ యూనివర్సిటీ నిర్వహించిన 2013 టాప్-500 ప్రపంచ విద్యా సంస్థల్లో ఐఐఎస్సీ 301-400 మధ్య స్థానాల్లో నిలిచింది. అదేవిధంగా సబ్జెక్టులవారీగా చూసినప్పుడు కెమిస్ట్రీ విభాగంలో 43వ ర్యాంకు, కంప్యూటర్ సైన్స్‌లో 51-75 మధ్య స్థానాలు దక్కించుకుంది. ఇదేకాకుండా ఇతర సంస్థల సర్వేల్లోనూ ముందు వరుసలో నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ఐఐఎస్సీ అందించే కోర్సులు, అర్హతలు, ప్రవేశ విధానంపై ఫోకస్... సెన్సైస్, ఇంజనీరింగ్‌లలో పరిశోధన కోర్సులందించే సంస్థల్లో ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)-బెంగళూరు. నూరేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ సంస్థ వివిధ విభాగాల్లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ, పీహెచ్డీ, ఎమ్మెస్సీ (ఇంజనీరింగ్) వంటి కోర్సులను అందిస్తోంది. వీటితోపాటు రెండేళ్ల క్రితం నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్) కోర్సును ప్రవేశపెట్టింది. ప్రవేశం లభించిన విద్యార్థులందరికీ నిబంధనలకనుగుణంగా ఫెలోషిప్లను కూడా సంస్థ అందిస్తోంది. ఎప్పటికప్పుడు పరిశ్రమల అవసరాలను గుర్తిస్తూ నూతన కోర్సులను ప్రవేశపెట్టడంలో ఐఐఎస్సీ ముందుంటోంది. ఈ సంస్థ అందించే వివిధ కోర్సుల్లో విద్యనభ్యసిస్తే అత్యుత్తమ కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. శతాబ్దానికిపైగా ఉన్న చరిత్ర, అత్యుత్తమ విద్యార్హతలు ఉన్న ఫ్యాకల్టీ, ప్రముఖ విదేశీ సంస్థల ఫ్యాకల్టీల గెస్ట్ లెక్చర్స్ వల్ల ఐఐఎస్సీ మంచి విద్యా సంస్థగా వినుతికెక్కింది. దేశంలోనే అత్యుత్తమ స్థాయి లేబొరేటరీలు, లైబ్రరీ, విద్యార్థులు- ఫ్యాకల్టీ మధ్య నిష్పత్తి, పరిశోధనలకు పెద్దపీట వేయడం వంటి కారణాల వల్ల ఐఐఎస్సీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఏటా చోటు దక్కించుకుంటోంది. యూజీ కోర్సులు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్: బయాలజీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, మెటీరియల్స్,మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, హ్యుమానిటీస్, ఇంజనీరింగ్. వ్యవధి: నాలుగేళ్లు అర్హత: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్నవారూ అర్హులే. ఎంపిక విధానం: కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై), ఇతర జాతీయ ప్రవేశ పరీక్షల్లో సాధించిన ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది. కోర్సు ప్రోగ్రామ్స్ (ఎంఈ/ఎంటెక్/ఎం.డిజైన్/ఎం.మేనేజ్మెంట్) మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ (ఎంఈ): ఏరోస్పేస్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్, మెటీరియల్స్, మైక్రో ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్, సిగ్నల్ ప్రాసెసింగ్, సిస్టమ్స్ సైన్స్ అండ్ ఆటోమేషన్, టెలి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. అర్హత: సంబంధిత బ్రాంచ్‌తో ద్వితీయ శ్రేణిలో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్/టెక్నాలజీ ఉత్తీర్ణతతోపాటు గేట్లో స్కోర్ సాధించి ఉండాలి. ఎంపిక: గేట్లో సాధించిన స్కోర్ ఆధారంగా మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (ఎంటెక్): క్లైమేట్ సైన్స్, కంప్యూటేషనల్ సైన్స్, ఎర్త్ సైన్స్, ఎల క్ట్రానిక్ సిస్టమ్స్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్, ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్. అర్హత: సంబంధిత బ్రాంచ్‌తో ద్వితీయ శ్రేణిలో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్/టెక్నాలజీ లేదా సైన్స్, ఫిజికల్ సెన్సైస్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, జియాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు గేట్లో స్కోర్ సాధించి ఉండాలి. ఎంపిక విధానం: కొన్ని కోర్సులకు గేట్ స్కోర్‌తోపాటు ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. కొన్ని కోర్సులకు గేట్ స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. మాస్టర్ ఆఫ్ డిజైన్ (ఎండీఈఎస్): ప్రొడక్షన్ డిజైన్ అండ్ ఇంజనీరింగ్ అర్హత: ద్వితీయ శ్రేణి మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్/టెక్నాలజీ/డిజైన్/ఆర్కిటెక్చర్ ఉత్తీర్ణతతోపాటు గేట్/సీడ్లలో స్కోర్లు సాధించి ఉండాలి. ఎంపిక: గేట్/సీడ్లలో వచ్చిన స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. వీరికి డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మాస్టర్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఎం.ఎంజీటీ): అర్హత: ప్రథమ శ్రేణి మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్/టెక్నాలజీ ఉత్తీర్ణతతోపాటు గేట్/ క్యాట్/ జీమ్యాట్‌లో స్కోర్ సాధించి ఉండాలి. ఎంపిక విధానం: గేట్/క్యాట్/జీమ్యాట్‌లో వచ్చిన స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. వీరికి బృంద చర్చలు, మౌఖిక పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు. ఎక్స్టర్నల్ రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్స్ ఈ కోర్సులు వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ఉద్దేశించినవి. వివిధ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్/పరిశ్రమలు, ఇంజనీరింగ్/అగ్రికల్చరల్/ఫార్మాస్యూటికల్/వెటర్నరీ/మెడికల్ కాలేజీలు/యూనివర్సిటీల ఫ్యాకల్టీలు ఈ కోర్సులు చేయడానికి అర్హులు. అయితే వీరు పనిచేసే సంస్థలు వీరిని స్పాన్సర్ చేయాలి. పీహెచ్డీ ఇన్ సైన్స్: న్యూరో సైన్స్, హై ఎనర్జీ ఫిజిక్స్, సాలిడ్ స్టేట్ అండ్ స్ట్రక్చరల్ కెమిస్ట్రీ మినహా అన్ని సైన్స్ డిపార్ట్మెంట్లు. పీహెచ్డీ ఇన్ ఇంజనీరింగ్: న్యూరో సైన్స్, హై ఎనర్జీ ఫిజిక్స్, సాలిడ్ స్టేట్ అండ్ స్ట్రక్చరల్ కెమిస్ట్రీ మినహా అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు. అర్హత లు: రెగ్యులర్ కోర్సులకు నిర్దేశించిన అర్హతా ప్రమాణాలే ఎక్స్టర్నల్ కోర్సులకు కూడా వర్తిస్తాయి. నిర్దేశిత కటాఫ్ తేదీ నాటికి 40 ఏళ్లు మించరాదు. ప్రస్తుతం పనిచేస్తున్న సంస్థలో రెగ్యులర్‌గా రెండేళ్లు సర్వీస్ పూర్తి చేసుకుని ఉండాలి. నిర్దేశిత అర్హతలతోపాటు సీఎస్ఐఆర్-యూజీసీ నెట్, యూజీసీ నెట్, డీబీటీ, ఎన్బీహెచ్ఎం, ఐసీఎంఆర్, గేట్లలో జేఆర్ఎఫ్ సాధించి ఉండాలి. ఎంపిక విధానం: నిర్దేశిత అర్హతలున్నవారిని షార్ట్‌లిస్ట్ చేసి మౌఖిక పరీక్ష నిర్వహించి కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. స్కాలర్షిప్స్ ఐఐఎస్సీలో ప్రవేశం పొందిన విద్యార్థులందరికీ స్కాలర్షిప్స్ లభించడం విశేషం. డీబీటీ/ఐసీఎంఆర్/ ఎన్బీహెచ్ఎం/ సీఎస్ఐఆర్/ యూజీసీ/ ఎంహెచ్ఆర్డీ/ ఏఐసీటీఈ వంటివి అందించే స్కాలర్‌షిప్‌లతోపాటు ఇతర ఏజెన్సీలు, బహుళ జాతి సంస్థలు విద్యార్థులకు ఫెలోషిప్స్ అందిస్తున్నాయి. బీఈ/ బీటెక్/ ఎమ్మెస్సీ అర్హతతో పీహెచ్డీ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు మొదటి రెండేళ్లు నెలకు *16,000, తర్వాత మూడే ళ్లు నెలకు * 18,000, ఎంఈ/ ఎంటెక్ అర్హతలతో పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందినవారికి మొదటి రెండేళ్లు నెలకు * 18,000; తర్వాత మూడేళ్లు నెలకు * 20,000 స్కాలర్షిప్ అందిస్తారు. అదేవిధంగా బీఈ/ బీటెక్/ ఎమ్మెస్సీ అర్హతతో ఎమ్మెస్సీ ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరిన వారికి నెలకు * 8,000, ఎంఈ/ ఎంటెక్/ మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సుల్లో ప్రవేశం పొందినవారికి నెలకు * 8,000 చెల్లిస్తారు. ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ ప్రవేశం లభించిన విద్యార్థులకు నెలకు మొదటి రెండేళ్లు నెలకు *10,000, ఆ తర్వాత రెండేళ్లు నెలకు * 16,000, తర్వాత మూడేళ్లు నెలకు * 18,000 స్కాలర్షిప్ ఇస్తారు. మాస్టర్ ఆఫ్ మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు మాత్రం ఎలాంటి స్కాలర్షిప్ సదుపాయం లభించదు. ప్రవేశాల నోటిఫికేషన్: ప్రతి ఏటా డిసెంబర్ చివరివారం/ జనవరి. వెబ్సైట్: www.iisc.ernet.in ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తోన్న విభాగాలు: బయలాజికల్ సెన్సైస్, ఫిజికల్ సెన్సైస్, కెమికల్ సెన్సైస్, మ్యాథమెటికల్ సెన్సైస్. అర్హత: ప్రథమ శ్రేణి మార్కులతో ఫిజికల్ సెన్సైస్, కెమికల్ సెన్సైస్, బయలాజికల్ సెన్సైస్ (ఫార్మాస్యూటికల్, వెటర్నరీ సెన్సైస్, అగ్రికల్చరల్ సెన్సైస్తో కలిపి), మ్యాథమెటికల్ సెన్సైస్‌లో బీఎస్సీ ఉత్తీర్ణత. బీఈ/బీటెక్ ఉత్తీర్ణులు కేవలం మ్యాథమెటికల్ సెన్సైస్‌కు మాత్రమే అర్హులు. ఎంపిక విధానం: ఐఐటీలు నిర్వహించే జామ్ ప్రవేశపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇందులో ప్రతిభ చూపినవారికి ప్రవేశం కల్పిస్తారు. రీసెర్చ్ ప్రోగ్రామ్స్ (పీహెచ్డీ/ఎంఎస్సీ ఇంజనీరింగ్) వివిధ విభాగాల్లో ఐఐఎస్సీ పరిశోధన కోర్సులను నిర్వహిస్తోంది. ఆ వివరాలు.. పీహెచ్డీ ఇన్ సైన్స్: ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్, బయో కెమిస్ట్రీ, ఎకలాజికల్ సెన్సైస్, హై ఎనర్జీ ఫిజిక్స్, ఇనార్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ, మెటీరియల్స్ రీసెర్చ్, మ్యాథమెటిక్స్, మైక్రో బయాలజీ అండ్ సెల్ బయాలజీ, మాలిక్యులర్ బయో ఫిజిక్స్, మాలిక్యులర్ రీప్రొడక్షన్, డెవలప్మెంట్ అండ్ జెనెటిక్స్, న్యూరో సైన్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, సాలిడ్ స్టేట్ అండ్ స్ట్రక్చరల్ కెమిస్ట్రీ. ఎమ్మెస్సీ (ఇంజనీరింగ్), పీహెచ్డీ ఇంజనీరింగ్: ఏరోస్పేస్ ఇంజనీరింగ్, అట్మాస్ఫియరిక్ అండ్ ఓషియానిక్ సెన్సైస్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఆటోమేషన్, ఎర్త్ సెన్సైస్, ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్, మేనేజ్మెంట్ స్టడీస్, మెటీరియల్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ప్రొడక్ట్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, సస్టైనబుల్ టెక్నాలజీస్, సూపర్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. పీహెచ్డీ ఇన్ ఇంటర్ డిసిప్లినరీ ఏరియాస్: బయో ఇంజనీరింగ్, ఎనర్జీ, మ్యాథమెటికల్ సెన్సైస్, నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్. అర్హత: రీసెర్చ్ కోర్సుల్లో ప్రవేశానికి ఇంజనీరింగ్/ టెక్నాలజీ/ ఆర్కిటెక్చర్/ మెడిసిన్/ అగ్రికల్చర్/ ఫార్మసీ/ వెటర్నరీ సెన్సైస్‌లో ద్వితీయ శ్రేణిలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. లేదా బయో టెక్నాలజీలో ఎమ్మెస్సీ లేదా ఎకనామిక్స్, జాగ్రఫీ, సోషల్ వర్క్, సైకాలజీ, మేనేజ్మెంట్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కామర్స్, ఆపరేషన్స్ రీసెర్చ్, కంప్యూటర్ సైన్స్/ అప్లికేషన్స్‌లో ద్వితీయ శ్రేణితో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. ఎంపిక విధానం: నిర్దేశిత కటాఫ్ తేదీ నాటికి సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ జేఆర్ఎఫ్/యూజీసీ నెట్ జేఆర్ఎఫ్/ డిపార్ట్మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ జేఆర్ఎఫ్/ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ జేఆర్ఎఫ్; జెస్ట్, ఎన్బీహెచ్ఎం లేదా ఐఐఎస్సీ ఎంట్రెన్స్ టెస్ట్ లేదా గేట్లో స్కోర్ సాధించి ఉండాలి. కెరీర్ స్కోప్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్: సంబంధిత విభాగంలో పీహెచ్డీ పూర్తిచేసి.. మూడేళ్ల పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉండి.. 35 ఏళ్లలోపు ఉన్న అభ్యర్థులు అసిస్టెంట్ ప్రొఫెసర్స్.. ఆ పైస్థాయి పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పీబీ-3 కేడర్‌లో ప్రారంభంలో పే స్కేల్ రూ.15,600 - రూ. 39,100తోపాటు గ్రేడ్ పే రూ. 8000,ఇతర అలవెన్స్‌లుంటాయి. మూడేళ్ల సర్వీస్ తర్వాత పీబీ-4 కేడర్‌లో నెలకు రూ. 37,400 - రూ. 67,000లతోపాటు గ్రేడ్ పేగా రూ. 9,000, ఇతర అలవెన్స్‌లు అందిస్తారు. హయ్యర్ పొజిషన్స్: ప్రతిభావంతులైన విద్యార్థులను ఇన్స్టిట్యూట్లో జరిగే వివిధ ప్రతిష్టాత్మక పరిశోధన ప్రాజెక్టుల్లో నియమించడంతోపాటు డాక్టోరల్ కోర్సులు చదువుతున్న వారికి గైడ్‌గా కూడా నియమిస్తారు. పని అనుభవంతో, ప్రతిభతో అసోసియేట్ ప్రొఫెసర్‌గా నియమితులైనవారికి పీబీ-4 కేడర్‌లో నెలకు రూ. 37,400 - రూ. 67,000లతోపాటు నెలకు రూ. 9,500 గ్రేడ్‌పే, ఇతర అలవెన్స్‌లుంటాయి. ప్రొఫెసర్‌గా నియమితులైనవారికి నెలకు రూ. 37,400 - రూ. 67,000 స్కేల్ లభిస్తుంది. గ్రేడ్ పేలో తేడా ఉంటుంది. పరిశోధనలు చేసేవారికి రీసెర్చ్ గ్రాంట్, వివిధ జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొనడానికి ఇతర ఖర్చులు చెల్లిస్తారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్: ఇన్స్టిట్యూట్లో చదివిన విద్యార్థులకు ఇతర ప్రభుత్వ సంస్థలు, బహుళజాతి సంస్థలు, పరిశ్రమలు చక్కని ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. ఇందుకోసం ఐఐఎస్సీ ప్రత్యేకంగా ప్లేస్మెంట్ సెల్‌ను ఏర్పాటు చేసింది. ఈ సెల్ విద్యార్థులకవసరమైన గెడైన్స్‌ను అందించడంతోపాటు వీరికున్న కెరీర్ అవకాశాలను వివరిస్తుంది. సంబంధిత సంస్థల్లో చేరడానికి రిఫరెన్స్ ఇస్తుంది. అంతేకాకుండా వివిధ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్‌తో సంప్రదించి ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది.