బంగారు భవితకు వేదికలు.. | infermation of General Bachelor Degree course,Professional degree course | Sakshi
Sakshi News home page

బంగారు భవితకు వేదికలు..

Published Sun, Nov 16 2014 11:38 PM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM

బంగారు భవితకు వేదికలు.. - Sakshi

బంగారు భవితకు వేదికలు..

నేడు సాధారణ బ్యాచిలర్‌‌స డిగ్రీ కోర్సులకే లక్షల మొత్తం ఖర్చు అవుతోంది! ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సుల ఫీజుల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు!! ఇక.. ఏ కోర్సు అయినా పేరున్న ఇన్‌స్టిట్యూట్‌లో చదవాలంటే ఆ మొత్తం మరింత ఎక్కువే !! ఇలాంటి పరిస్థితుల్లో సైతం...తక్కువ ఖర్చుతో కోర్సులు పూర్తి చేసే అవకాశం ఉంది! నామమాత్రపు ఫీజులు చెల్లిస్తూ.. మరో వైపు స్కాలర్‌షిప్‌లు, స్టైఫండ్‌లు పొందొచ్చు. అంతేకాదు.. ఆయా కోర్సుల ద్వారా ఉజ్వల కెరీర్‌ను సైతం సొంతం చేసుకోవచ్చు. ఇందుకు మార్గం.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పలు రీసెర్చ్ ఓరియెంటెడ్ ఇన్‌స్టిట్యూట్‌లు. ఉన్నత విద్య.. ఉన్నత వర్గాలకే పరిమితం అనేది నిన్నటి మాట. ఇప్పుడు ప్రతిభ, అకడమిక్ నైపుణ్యాలు ఉంటే బ్యాచిలర్స్ డిగ్రీ నుంచి పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ వరకు అన్ని కోర్సులను స్వల్ప వ్యయంతో పూర్తి చేయొచ్చు.వచ్చే విద్యా సంవత్సరానికి ఆయా కోర్సుల ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైన తరుణంలో దేశవ్యాప్తంగా ప్రముఖ విద్యాసంస్థలు, అవి అందించే కోర్సులపై ప్రత్యేక ఫోకస్...
 
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్
దేశంలో సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ విభాగాల్లో దశాబ్దాల చరిత్ర ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(బెంగళూరు) ఇంజనీరింగ్, సైన్స్, మ్యాథమెటిక్స్ కోర్సుల్లో బ్యాచిలర్స్, పీజీ, పీహెచ్‌డీ కోర్సులను అంది స్తోంది. ఆయా కోర్సులకు సంబంధించి జాతీయ స్థాయిలో నిర్వహించే గేట్/యూజీసీ -సీఎస్‌ఐ ఆర్ నెట్/జెస్ట్ తదితర ఎంట్రెన్స్‌లలో ఉత్తీర్ణత ఆధారంగా ప్రవేశం కల్పిస్తోంది. ఆయా కోర్సుల కు ఫీజులు నామమాత్రమే. అంతేకాకుండా స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. దాంతో విద్యార్థు లకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా కోర్సులు అభ్యసించే అవకాశం లభిస్తోంది.
 
కోర్సుల వివరాలు..

 
బ్యాచిలర్‌‌స ఆఫ్ సైన్స్(రీసెర్చ్)
బ్యాచిలర్స్ డిగ్రీ స్థాయి నుంచే విద్యార్థులను రీసెర్చ్ దిశగా నడిపించాలనే ఉద్దేశంతో రూపొందించిన కోర్సు ఇది. నాలుగేళ్ల కోర్సులో విద్యార్థులు బయాలజీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్ మెంటల్ సైన్స్, మెటీరియల్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్‌లలో ఒక సబ్జెక్ట్‌ను మేజర్‌గా ఎంచుకుని రీసెర్చ్ చేయొచ్చు.
 
అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఎంపీసీ/బైపీసీ ఉత్తీర్ణత.
ప్రవేశం: జాతీయస్థాయిలో నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులకు నిర్ణీత సంఖ్యలో వేర్వేరుగా సీట్లు కేటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రవేశం సమయంలో పరిగణనలోకి తీసుకునే అంశాలు:
* కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజనలో అర్హత.
* జేఈఈ-మెయిన్ స్కోరు; జేఈఈ-అడ్వాన్స్‌డ్ స్కోర్, ఏఐపీఎంటీ ర్యాంకు.
ఫీజులు: ప్రతి ఏటా రూ. 20 వేలలోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
 స్కాలర్‌షిప్స్: కేవైపీవై, జేఈఈ(మెయిన్, అడ్వాన్స్‌డ్), ఏఐపీఎంటీ ర్యాంకు పొందినవారికి ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్ లభిస్తుంది. దీని కింద నెలకు రూ.4000 నుంచి రూ.5 వేల వరకు అందిస్తారు.
 
పీజీ కోర్సులు

కోర్సులు: ఎంఈ/ఎంటెక్/మాస్టర్ ఆఫ్ డిజైన్/మాస్టర్ ఆఫ్ మేనేజ్‌మెంట్.
అర్హత: బీఈ/బీటెక్ ఉత్తీర్ణత లేదా ఫిజిక్స్/మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్/కంప్యూటర్ సైన్స్/ఎలక్ట్రానిక్స్‌లో బ్యాచిలర్‌‌స డిగ్రీ/బీఆర్‌‌క/బీడిజైన్ ఉత్తీర్ణత.
ప్రవేశం: గేట్/సీడ్/క్యాట్/జీమ్యాట్‌లలో ర్యాంకు ఆధారంగా.
 
ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్
కోర్సులు: బయలాజికల్ సెన్సైస్; కెమికల్ సెన్సైస్; ఫిజికల్ సెన్సైస్; మ్యాథమెటికల్ సెన్సైస్.
అర్హత: సంబంధిత విభాగంలో ప్రథమ శ్రేణిలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత; బీఈ ఉత్తీర్ణులు మ్యాథమెటికల్ సెన్సైస్ ప్రోగ్రాంకే అర్హులు.
ప్రవేశం: జామ్‌లో ర్యాంకు ఆధారంగా.
 
రీసెర్చ్ ప్రోగ్రామ్స్
కోర్సులు: పీహెచ్‌డీ, ఎమ్మెస్సీ ఇంజనీరింగ్.
అర్హత: సైన్స్/మ్యాథ్స్/స్టాటిస్టిక్స్/కంప్యూటర్ అప్లికేషన్స్/ఫార్మసీ/ వెటర్నరీ సైన్స్/ అగ్రికల్చర్ /హ్యుమానిటీస్‌లో పీజీ లేదా ఎంఈ/ ఎంటెక్/ ఎంఆర్క్ ఉత్తీర్ణత. పీజీ ఔత్సాహికులు నిర్దేశించిన కోర్సుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
ప్రవేశం: సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ లేదా యూజీసీ-నెట్; లేదా డీబీటీ జేఆర్‌ఎఫ్ లేదా ఐసీఎంఆర్ జేఆర్‌ఎఫ్; లేదా జెస్ట్ లేదా గేట్ ఎంట్రెన్స్‌లలో ప్రతిభ ఆధారంగా.
 
కోర్సులవారీగా ఫీజుల వివరాలు
పీహెచ్‌డీ: ఏడాదికి రూ.16,800.
ఎమ్మెస్సీ(ఇంజనీరింగ్), ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ, ఎంఈ/ఎంటెక్/ఎం.డిజైన్: ఏడాదికి రూ.13,300; ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు దాదాపు యాభై శాతం మేరకు రాయితీ ఉంటుంది.
 
స్కాలర్‌షిప్‌లు
* ఇన్‌స్టిట్యూట్‌లోని రీసెర్చ్ ప్రోగ్రామ్‌లలో బీఈ/బీటెక్/ఎమ్మెస్సీ అర్హతతో ప్రవేశించిన వారికి నెలకు రూ.16 వేల నుంచి రూ.18 వేల వరకు; ఎంటెక్/ఎంఈ అర్హతతో ప్రవేశం పొందితే నెలకు రూ.18 వేల నుంచి 20 వేల వరకు స్కాలర్‌షిప్ లభిస్తుంది.
* ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ అభ్యర్థులు వారి అకడమిక్ అర్హతల ఆధారంగా నెలకు రూ.10 వేలు; రూ.16 వేలు; రూ.18 వేలు స్కాలర్‌షిప్ పొందొచ్చు.
* ఎమ్మెస్సీ/ఎంఈ/ఎంటెక్/ఎం.డిజైన్ కోర్సుల విద్యార్థులకు నెలకు రూ.8 వేల స్కాలర్‌షిప్ అందుతుంది.
వెబ్‌సైట్: www.iisc.ernet.in
 

ఐఐఎస్‌ఈఆర్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్).. ప్యూర్ సైన్స్ విభాగంలో విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఇన్‌స్టిట్యూట్‌లివి. దేశవ్యాప్తంగా ఐదు (మొహాలి, తిరువనంతపురం, పుణె, కోల్‌కతా, భోపాల్) క్యాంపస్‌లలో ఇంటర్మీడియెట్ అర్హతతోనే డ్యూయల్ డిగ్రీ కోర్సులు చేసే అవకాశం లభిస్తోంది. వివరాలు..
 
బీఎస్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ
అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతోపాటు కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (ఎస్‌ఏ స్ట్రీమ్) అర్హత లేదా జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణత. ఈ రెండు అర్హతలు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వారు ఐఐఎస్‌ఈఆర్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో ర్యాంకు సాధించాలి.
వ్యవధి: ఐదేళ్లు
 ఫీజు: జనరల్ కేటగిరీ అభ్యర్థులు మొదటి సెమిస్టర్‌లో రూ. 21,200 చెల్లించాలి. తర్వాత నుంచి ప్రతి సెమిస్టర్‌కు రూ.13,200 చెల్లిస్తే సరిపోతుంది. ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు 50 శాతం మేర ఫీజు రాయితీ లభిస్తుంది.
స్కాలర్‌షిప్: ఇన్‌స్పైర్ లేదా కేవైపీవై స్కీం ద్వారా నెలకు రూ. 5 వేల స్కాలర్‌షిప్ అందుతుంది.

ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ
స్పెషలైజేషన్స్: బయలాజికల్ సెన్సైస్; కెమికల్ సెన్సైస్; మ్యాథమెటికల్ సెన్సైస్; ఫిజికల్ సెన్సైస్.
అర్హత: సంబంధిత సబ్జెక్ట్‌లను బ్యాచిలర్స్ డిగ్రీలో చదివి ఉండటంతోపాటు 6 సీజీపీఏ లేదా 55 శాతం మార్కులు పొందాలి. ఫిజికల్ సెన్సైస్ ఔత్సాహికులు జెస్ట్‌లో కూడా ఉత్తీర్ణత సాధించాలి.
ప్రవేశం: ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఫీజు: జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఫస్ట్ సెమిస్టర్‌లో రూ.20,575, తర్వాత నుంచి ప్రతి సెమిస్టర్‌కు రూ.15,075 చెల్లించాలి.
స్కాలర్‌షిప్స్: నెలకు రూ.10వేల చొప్పున స్కాలర్‌షిప్ లభిస్తుంది.
 
పీహెచ్‌డీ: బయలాజికల్ సెన్సైస్, కెమికల్ సెన్సైస్, మ్యాథమెటికల్ సెన్సైస్ తదితర విభాగాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్ట్‌లు స్పెషలైజేషన్స్‌గా పీజీలో 6.5 సీజీపీఏ లేదా 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. వీటితోపాటు సీఎస్‌ఐఆర్, యూజీసీ- జేఆర్‌ఎఫ్/గేట్/ఇన్‌స్పైర్ పీహెచ్‌డీ ఫెలోషిప్/ఎన్‌బీహెచ్‌ఎం ఫెలోషిప్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
ప్రవేశం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఫీజు: మొదటి సెమిస్టర్‌కు రూ.15,340, రెండు నుంచి ఆరో సెమిస్టర్ వరకు రూ. 10,840.
స్కాలర్‌షిప్స్: నెలకు రూ. 16 వేల నుంచి రూ. 18 వేల వరకు జేఆర్‌ఎఫ్ లభిస్తుంది.
వెబ్‌సైట్: www.iiser-admissions.in
 
జేఎన్‌సీఏఎస్‌ఆర్ - బెంగళూరు
జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్ (జేఎన్‌సీఏఎస్‌ఆర్).. సైన్స్ రంగంలో అకడమిక్, రీసెర్చ్‌పరంగా దశాబ్దాల ఘనత పొందిన ఇన్‌స్టిట్యూట్. ఈ విద్యా సంస్థ స్వల్ప మొత్తం ఫీజులతో బ్యాచిలర్స్ డిగ్రీ అర్హతగా పలు కోర్సులు అందిస్తూ.. స్కాలర్‌షిప్‌ల పేరిట ఆర్థిక చేయూత కల్పిస్తోంది.
 
ఎంఎస్ (ఇంజనీరింగ్), ఎంఎస్ (రీసెర్చ్)
అర్హత: బీఈ, బీటెక్, ఎమ్మెస్సీ, ఎంటెక్, ఎంబీబీఎస్ కోర్సుల్లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
ప్రవేశం: గేట్, యూజీసీ, సీఎస్‌ఐఆర్-నెట్- జేఆర్ ఎఫ్, ఐసీఎంఆర్-జేఆర్‌ఎఫ్, డీబీటీ-జేఆర్‌ఎఫ్, జెస్ట్, ఇన్‌స్పైర్‌లలో ఏదో ఒక పరీక్షలో ఉత్తీర్ణతతో పాటు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ఫీజు: ఏడాదికి రూ. 3 వేల నుంచి రూ. 3.5 వేలు.
స్కాలర్‌షిప్స్: నెలకు రూ.16 వేలు.
 
ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ: మెటీరియల్ సైన్స్, కెమికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో బీఎస్సీ/బీఈ /బీటెక్ ఉత్తీర్ణత.
ప్రవేశం: జేఎన్‌సీఏఎస్‌ఆర్ నిర్వహించే రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఫీజు: ఏడాదికి రూ. 2 వేల నుంచి రూ. 3 వేల లోపు
స్కాలర్‌షిప్స్: మొదటి మూడేళ్లు నెలకు రూ.10 వేల చొప్పున స్టైఫండ్ లభిస్తుంది. ఆ తర్వాత పీహెచ్‌డీకి లభించే ఫెలోషిప్‌లకు అర్హులవుతారు.
 
పీహెచ్‌డీ
ప్రస్తుతం ఇన్‌స్టిట్యూట్ 20కు పైగా విభాగాల్లో పీహెచ్‌డీలను అందిస్తోంది.
ఫీజు: ఏడాదికి రూ. 4 వేల నుంచి రూ.5 వేల లోపు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌తో మాస్టర్స్ డిగ్రీ.
స్కాలర్‌షిప్స్: మొదటి రెండేళ్లు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పేరిట నెలకు రూ. 16 వేలు; మూడో ఏడాది నుంచి మూడేళ్లపాటు నెలకు రూ. 18 వేలు సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ లభిస్తుంది.
వెబ్‌సైట్: www.jncasr.ac.in
 
టీఐఎఫ్‌ఆర్- టీసీఐఎస్

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్‌ఆర్).. ఇంటర్‌డిసిప్లినరీ విభాగాల్లో పరిశోధనలను ప్రోత్సహించే ఉద్దేశంతో పీహెచ్‌డీ కోర్సులను అందిస్తోంది.
అర్హత: సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ/ఎంటెక్/బీఈ/ బీటెక్/ఎంఎస్ ఉత్తీర్ణత.
స్కాలర్‌షిప్స్: నెలకు రూ. 16 వేలు చొప్పున, సదరు సబ్జెక్ట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశాక నెలకు రూ.18 వేలు.
ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ అర్హత: బీఎస్సీ/ఎమ్మెస్సీ/బీఈ/బీటెక్/ ఎంబీబీఎస్/బీఫార్మసీ ఉత్తీర్ణత.
ప్రవేశం: గేట్/జెస్ట్/సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్‌లలో ఉత్తీర్ణత సాధించినవారికి టీఐఎఫ్‌ఆర్ నిర్వహించే రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
స్కాలర్‌షిప్స్: మొదటి రెండేళ్లు నెలకు రూ.16 వేలు చొప్పున, మూడో ఏడాది నుంచి నెలకు రూ.18 వేల చొప్పున స్కాలర్‌షిప్
 లభిస్తుంది.
తాజా నోటిఫికేషన్: జనవరి 2015 నుంచి ప్రారంభమయ్యే పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీల్లో మిడ్ టర్మ్ ప్రవేశాలకు ప్రస్తుతం ప్రకటన వెలువడింది.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 21, 2014.
వెబ్‌సైట్: http://gsadmissions.tifrh.res.in/
 
హరీశ్ చంద్ర రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్
ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌ల్లో పరిశోధనలు, ఇతర అకడమిక్ నైపుణ్యాలను పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా అలహాబాద్‌లో ఏర్పాటైన హెచ్‌ఆర్‌ఐ  ఫిజిక్స్‌లో పలు స్థాయిలలో కోర్సులను ఆఫర్ చేస్తోంది. వివరాలు..
 
ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ-పీహెచ్‌డీ (ఫిజిక్స్)
అర్హత: సైన్స్ లేదా ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక: ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే ప్రవేశ పరీక్షలో ర్యాంకు ఆధారంగా.
 
పీహెచ్‌డీ (ఫిజిక్స్)
అర్హత: ఫిజిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. ఎంపిక: జెస్ట్ ఉత్తీర్ణులకు ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే ప్రవేశ పరీక్ష ఆధారంగా.
 
ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ-పీహెచ్‌డీ (మ్యాథమెటిక్స్)
అర్హత: సైన్స్ లేదా ఇంజనీరింగ్‌లో 55 శాతం మార్కులతో బ్యాచిలర్‌‌స డిగ్రీ ఉత్తీర్ణత. ప్రవేశం: పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా.
 
పీహెచ్‌డీ (మ్యాథమెటిక్స్)
అర్హత: 55 శాతం మార్కులతో ఎమ్మెస్సీ ఉత్తీర్ణత.
ప్రవేశం: పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా. స్కాలర్‌షిప్స్: తొలి రెండేళ్లు నెలకు రూ.16 వేలు చొప్పున; తర్వాత నుంచి నెలకు రూ.18 వేలు చొప్పున స్కాలర్‌షిప్ లభిస్తుంది. వెబ్‌సైట్: www.hri.res.in
 
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్- భువనేశ్వర్
కేంద్ర ప్రభుత్వంలోని అణు శక్తి శాఖ, ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్.. హై
ఎనర్జీ ఫిజిక్స్, కండెన్స్‌డ్ మ్యాటర్ ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్‌ల్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లను అందిస్తోంది.
అర్హత: ఫిజిక్స్ స్పెషలైజేషన్‌తో ఎమ్మెస్సీ.
ప్రవేశం: జెస్ట్‌లో ఉత్తీర్ణతతోపాటు ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా.
స్కాలర్‌షిప్స్: మొదటి ఏడాది నెలకు రూ. 16 వేల చొప్పున; తర్వాత నుంచి నెలకు రూ. 18 వేల చొప్పున స్కాలర్‌షిప్ లభిస్తుంది.
వెబ్‌సైట్: www.iopb.res.in
 
సైన్స్ ఔత్సాహికులకు సమున్నత ఇన్‌స్టిట్యూట్‌లు
సైన్స్‌లో ఉన్నత కోర్సులు చదవాలనుకునేవారికి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నో ఇన్‌స్టిట్యూట్‌లు అందుబాటులోకి వచ్చాయి. గతంలో పీహెచ్‌డీ, పోస్ట్ డాక్టోరల్ కోర్సులను అందించడానికే పరిమితమైన ఇన్‌స్టిట్యూట్‌లు.. యంగ్ టాలెంట్‌ను కూడా సెన్సైస్ వైపు ప్రోత్సహించేలా  బ్యాచిలర్స్, మాస్టర్స్ డిగ్రీ అర్హతతో పలు కోర్సులు అందిస్తున్నాయి.

సైన్స్‌లో డిగ్రీ అంటే బీఎస్సీ/ఎమ్మెస్సీ అనే పరిమిత ఆలోచనకు స్వస్తి పలకాలి. అకడమిక్ అవకాశా లతోపాటు, క్షేత్రస్థాయి నైపుణ్యాలు, పరిశోధన సౌకర్యాలు కల్పించే ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్న విషయాన్ని తెలుసుకుంటే మంచి భవిష్యత్తు సొంతమవుతుంది.
- ప్రొఫెసర్ చిల్ల మల్లారెడ్డి, కెమికల్ సెన్సైస్ డిపార్‌‌టమెంట్, ఐఐఎస్‌ఈఆర్-కోల్‌కతా
 
మొబిలిటీ దృక్పథంతో అవకాశాలు మెరుగవుతాయి
ప్రస్తుతం ఎందరో విద్యార్థులు ఉన్నత విద్య, ఆ దిశగా డిగ్రీ, పీజీ వంటి కోర్సుల వైపు దృష్టి సారిస్తున్నారు. కానీ సమస్య అంతా.. వారు తమకు తాము పరిధులు విధించుకుంటున్నారు. తమ సమీపంలోని ఇన్‌స్టిట్యూట్‌లు, కళాశాలల్లో లభించే కోర్సుల గురించే ఆలోచిస్తున్నారు. కానీ.. తమ ప్రతిభ ఆధారంగా ప్రవేశం లభిస్తుందనుకుంటే.. ఇన్‌స్టిట్యూట్ ఎంత దూరంలో ఉన్నా వెళ్లడానికి సిద్ధమవ్వాలి. ఫలితంగా మెరుగైన విద్యతోపాటు భవిష్యత్తులో రాణించడానికి అవసరమయ్యే ఇతర అన్ని నైపుణ్యాలు (ఇంటర్ కల్చరల్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్) లభిస్తాయి.
- ప్రొఫెసర్ కె.వి.రమణాచారి, టీఐఎఫ్‌ఆర్-టీసీఐఎస్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement