బంగారు భవితకు గేట్‌వే!
నేషనల్ కోఆర్డినేషన్ బోర్డు (ఎన్‌సీబీ)-గేట్ తరఫున గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)ను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఏడు ఐఐటీల ఆధ్వర్యంలో ఏటా నిర్వహిస్తారు. ఈ పరీక్షలో సాధించిన స్కోర్‌తో ఐఐటీలు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగళూరు)లతో పాటు ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు, డాక్టోరల్ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు. ఇటీవలి కాలంలో గేట్‌లో సాధించిన స్కోర్ ఆధారంగా ప్రభుత్వరంగ సంస్థలు ఎంట్రీ లెవల్ రిక్రూట్‌మెంట్స్ చేపడుతుండటంతో గేట్‌కు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. గేట్-2015 నిర్వహణ సంస్థగా ఐఐటీ- కాన్పూర్ వ్యవహరిస్తోంది.గేట్-2012కు 6,86,614 మంది, గేట్-2013కు 9,84,855 మంది హాజరయ్యారు. గేట్-2014 పరీక్షకు 8,89,156 మంది హాజరయ్యారు.
అర్హత:
ఇంజనీరింగ్/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్(10+2తర్వాత నాలుగేళ్లు)లలో బ్యాచిలర్ డిగ్రీ. లేదా మ్యాథ్స్/సైన్స్/ స్టాటిస్టిక్స్/కంప్యూటర్ అప్లికేషన్ లేదా తత్సమాన విభాగంలో మాస్టర్ డిగ్రీ.చివరి సంవత్సరం విద్యార్థులు కూడా గేట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఈ/బీటెక్/బీఆర్‌కలకు సమానమైన ప్రొఫెషనల్ సొసైటీ పరీక్షలలో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష విధానం:
మొత్తం 22 పేపర్లకు ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.
అభ్యర్థి తన బ్రాంచ్/విభాగానికి అనుగుణంగా ఏదో ఒక పేపర్‌కు మాత్రమే పరీక్షకు హాజరు కావాలి. మొత్తం 65 ప్రశ్నలకు మూడు గంటల్లో సమాధానాలను గుర్తించాలి. మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.
గేట్-2015 ప్రశ్నపత్రంలో మల్టిపుల్ చాయిస్ టైప్, న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ టైప్ ప్రశ్నలకు ఆప్షన్లు ఇస్తారు. అదే న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలకు ఆప్షన్లు ఇవ్వరు. వర్చువల్ కీ ప్యాడ్‌ను ఉపయోగించి సమాధానం పూరించాలి. ఏరోస్పేస్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, బయెటెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ సెన్సైస్ తదితర పేపర్లలో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ (దాదాపు 15 శాతం మార్కులు); జనరల్ ఆప్టిట్యూడ్ (15 శాతం మార్కులు); సబ్జెక్టు (70 శాతం మార్కులు)లకు సంబంధించిన ప్రశ్నలుంటాయి.ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, కెమిస్ట్రీ, ఎకాలజీ అండ్ ఎవల్యూషన్, లైఫ్ సెన్సైస్ తదితర పేపర్లలో జనరల్ ఆప్టిట్యూడ్ (15 శాతం మార్కులు), సబ్జెక్టు (85 శాతం మార్కులు)లకు సంబంధించిన ప్రశ్నలుంటాయి.ఒక మార్కు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులు; రెండు మార్కుల మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు ప్రతి తప్పు సమాధానానికి 2/3 మార్కులు కోత విధిస్తారు. న్యూమరికల్ సమాధాన ప్రశ్నలకు రుణాత్మక మార్కులు లేవు.
స్కోర్ ప్రాధాన్యత, ఆర్థిక సహాయం:
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ), ఇతర ప్రభుత్వ సంస్థల మద్దతుతో నడిచే ఇన్‌స్టిట్యూట్‌లలో ఇంజనీరింగ్/ టెక్నాలజీ/ ఆర్కిటెక్చర్, సైన్స్ సబ్జెక్టులకు సంబంధించిన పీజీ, డాక్టోరల్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు ఆర్థిక సహాయం అందుకోవడానికి గేట్ స్కోర్ ను పరిగణనలోకి తీసుకుంటారు. కోర్సు చేస్తున్న సమయంలో నెలకు రూ.8 వేల వరకు ఉపకార వేతనం అందుతుంది. కొన్ని ప్రభుత్వ సంస్థలు సైంటిస్ట్/ ఇంజనీర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గేట్ స్కోర్‌ను తప్పనిసరి చేస్తున్నాయి.
నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (సింగపూర్), జర్మనీలోని కొన్ని సాంకేతిక విశ్వవిద్యాలయాలు.. మాస్టర్స్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల సందర్భంలో విద్యార్థి ప్రతిభను అంచనా వేసేందుకు గేట్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నాయి.నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ (ఎన్‌ఐటీఐఈ-ముంబై).. గేట్ స్కోర్ ఆధారంగా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమాను ఆఫర్ చేస్తోంది.గేట్ స్కోర్ ఆధారంగా ఐఐఎంలలో ఫెలో ప్రోగ్రామ్ (మేనేజ్‌మెంట్)లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్య తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం:
సెప్టెంబర్ 1, 2014.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి
చివరి తేదీ: అక్టోబర్ 1, 2014.
ఆన్‌లైన్‌లో అడ్మిట్ కార్డులు అందుబాటు:
డిసెంబర్ 17, 2014.
పరీక్ష తేదీలు: ఆన్‌లైన్‌లో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు; మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు పరీక్షలు జరుగుతాయి. జనవరి 31, 2015; ఫిబ్రవరి 1, 7, 8, 14 తేదీల్లో నిర్వహిస్తారు.
ఫలితాల వెల్లడి: మార్చి 12, 2015.
దరఖాస్తు రుసుం:
పురుష అభ్యర్థులు(జనరల్/ఓబీసీ):రూ.1500.
మహిళా అభ్యర్థులు: రూ.750
ఇతర అభ్యర్థులు (జనరల్/ఓబీసీ): రూ.1500.
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు: రూ.750.
చెల్లింపు విధానం: ఆన్‌లైన్ నెట్ బ్యాంకింగ్;
ఎస్‌బీఐ ఐ-కలెక్ట్; యాక్సిస్ బ్యాంకు ఐ-కనెక్ట్; ఈ-చలాన్.
దరఖాస్తు విధానం:
గేట్-2015 నిర్వహణ సంస్థ ఐఐటీ కాన్పూర్ లేదా ఇతర జోనల్ గేట్ కార్యాలయాల వెబ్‌సైట్‌లో లాగిన్ అయి ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్‌తో అనుసంధానం కావొచ్చు. తర్వాత రిజిస్టర్ చేసుకొని, దరఖాస్తును పూరించాలి. ఈ సమయంలో అభ్యర్థులు తప్పనిసరిగా తమ ఫొటో, సంతకాన్ని, అవసరమైన ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాలి.
వెబ్‌సైట్: www.iitk.ac.in
గేట్ పేపర్లు
ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్
బయెటెక్నాలజీ
కెమికల్ ఇంజనీరింగ్
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
కెమిస్ట్రీ
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
ఎకాలజీ, ఎవల్యూషన్
జియాలజీ అండ్ జియోఫిజిక్స్
ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్
మ్యాథమెటిక్స్
మెకానికల్ ఇంజనీరింగ్
మైనింగ్ ఇంజనీరింగ్
మెటలర్జికల్ ఇంజనీరింగ్
ఫిజిక్స్
{పొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్
టెక్స్‌టైల్ ఇంజనీరింగ్ అండ్ ఫైబర్ సైన్స్
ఇంజనీరింగ్ సెన్సైస్
లైఫ్ సెన్సైస్.
ప్రధాన అంశాలు:
గేట్ ప్రశ్నపత్రంలో బహుళైచ్చిక ప్రశ్నలతో పాటు సంఖ్యాపరమైన సమాధాన ప్రశ్నలు (ూఠఝ్ఛటజీఛ్చి ్చటఠ్ఛీట ్ఞఠ్ఛట్టజీౌట) ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలు 20 నుంచి 25 వరకు వస్తాయి. అందువల్ల ఏ అంశాన్ని చదివినా కచ్చితత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలి. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే కొన్ని అంశాలకు వెయిటేజీ ఏటా మారుతున్నట్లు గమనించవచ్చు. కొన్ని కోర్ అంశాలకు మాత్రం ఎప్పుడూ సమాన ప్రాధాన్యం ఉంటుంది. ఇలాంటి వాటిపై నిర్లక్ష్యం చూపకుండా పూర్తిస్థాయిలో ప్రిపరేషన్ కొనసాగించాలి. ఉదాహరణకు థర్మోడైనమిక్స్, ప్రొడక్షన్ టెక్నాలజీ/మ్యానుఫ్యాక్చరింగ్ సైన్స్ అంశాలను చెప్పుకోవచ్చు. థర్మోడైనమిక్స్ నుంచి కనీసం 12 మార్కులకు ప్రశ్నలు రావొచ్చు.
విశ్లేషణ:
ఏ సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్ అయినా వందశాతం పూర్తిచేయడం కష్టం. ఎన్ని టాపిక్స్‌ను పూర్తిచేశామనే దానికన్నా ఎన్ని టాపిక్స్‌ను క్షుణ్నంగా, విశ్లేషణాత్మకంగా చదివామనేది ముఖ్యం. ఓ అంశంపై ప్రశ్న ఏ కోణంలో ఇచ్చినా సమాధానం గుర్తించేలా అధ్యయనం చేయాలి.
సొంత నోట్స్:
పరీక్షకు ఆర్నెల్లకు పైగా సమయం అందుబాటులో ఉంది కాబట్టి ఔత్సాహికులు సొంతంగా నోట్స్‌ను రూపొందించుకోవాలి. ముఖ్యమైన సూత్రాలను నోట్స్‌లో రాసుకోవడం వల్ల వీలైనన్ని ఎక్కువ సార్లు పునశ్చరణకు వీలవుతుంది. అన్ని అంశాల్లోని ప్రాథమిక భావనలను సమగ్రంగా అధ్యయనం చేయాలి. వీటిలోని ముఖ్యమైన వాటిని నోట్స్‌లో పొందుపరచుకోవచ్చు.
పుస్తకాలు:
థర్మో డైనమిక్స్‌కు పి.కె.నాగ్; స్ట్రెంథ్ ఆఫ్ మెటీరియల్స్‌కు రామామృతం పుస్తకాలు బాగా ఉపయోగపడతాయి.
- అల్లూరి సునీల్‌వర్మ (గేట్-2014 మెకానికల్ 5వ ర్యాంకు).
ప్రధాన అంశాలు:
ఆన్‌లైన్‌లో పరీక్షలు జరుగుతుండటం వల్ల ముఖ్యమైన అంశాలు ఏమిటనేవి చెప్పలేకపోతున్నాం. ఒక్కో స్లాట్‌లో ఒక్కో దానికి ఎక్కువ వెయిటేజీ ఉంటున్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు గేట్-2014లో నా స్లాట్‌లో అనలాగ్ సర్క్యూట్స్‌పై ఎక్కువ ప్రశ్నలు రాగా, తర్వాతి స్లాట్‌లో ఎలక్ట్రానిక్ డివెసైస్‌పై అధిక ప్రశ్నలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఔత్సాహికులు సొంత ప్రిపరేషన్ ప్రణాళికను అమలు చేసుకోవాలి. టెక్నికల్ సబ్జెక్టులు అన్నీ ముఖ్యమైనవేనని గుర్తించి, చక్కని సమయపాలనతో క్షుణ్నంగా చదవాలి. అన్ని ప్రశ్నలూ కాన్సెప్టు ఆధారితంగానే ఉంటున్నాయి కాబట్టి మొదట థియరీని బాగా చదివి, తర్వాత కాన్సెప్టులను బాగా ప్రాక్టీస్ చేయాలి.
శిక్షణ:
గేట్‌కు కోచింగ్ తీసుకోవడం వల్ల అదనపు ప్రయోజనం ఉంటుందని చెప్పొచ్చు. కాలేజీలో రోజువారీ తరగతుల్లో బోధన, అభ్యసన ఎక్కువగా అకడమిక్ పరంగా ఉంటుంది. దీంతో కొన్ని కాన్సెప్టులపై లోతుగా అవగాహన ఏర్పడదు. శిక్షణ కేంద్రంలో అయితే ప్రత్యేకంగా గేట్ కోణంలో బోధన ఉంటుంది. కాలేజీలో బీటెక్ స్థాయిలో చదివిన అంశాలపై అప్లికేషన్ కోణంలో శిక్షణ లభిస్తుంది కాబట్టి ప్రయోజనం ఉంటుంది.
నమూనా పరీక్షలు:
అన్ని సబ్జెక్టులకు ఆన్‌లైన్ మాక్‌టెస్ట్‌లకు హాజరవడం వల్ల ప్రిపరేషన్‌కు సంబంధించిన బలాలు, బలహీనతలు తెలుస్తాయి. అయితే సిలబస్‌ను పూర్తిచేసిన తర్వాత మాత్రమే ఈ టెస్ట్‌లు రాయాలి. అకడమిక్‌గా బీటెక్ స్థాయిలో చదివిన అంశాలను అప్లికేషన్ కోణంలో ప్రాక్టీస్ చేయాలి.
- కె.కె.శ్రీనివాస్, (గేట్-2014 ఈసీఈ 4వ ర్యాంకు).
ప్రధాన అంశాలు:
గత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేస్తే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ఏ అంశాల నుంచి అధిక ప్రశ్నలు వస్తున్నాయో తెలుస్తుంది. నెట్‌వర్క్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ అంశాలు చాలా ముఖ్యమైనవి. ఎక్కువగా సమస్య సాధన (ఞటౌఛ్ఛఝ టౌఠిజీజ) ప్రశ్నలు వస్తున్నాయి. అందువల్ల ప్రిపరేషన్‌లో ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
ప్రణాళిక:
డిసెంబర్ నాటికి సిలబస్‌ను పూర్తిచేయాలి. అప్పటి నుంచి పరీక్ష తేదీ వరకు అందుబాటులో ఉన్న సమయాన్ని పునశ్చరణకు, ఆన్‌లైన్ మాక్ టెస్ట్‌లు రాయడానికి కేటాయించాలి. ఈ రెండింటికి సమ ప్రాధాన్యం ఇవ్వాలి. కొన్ని శిక్షణ సంస్థలు దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ మాక్ టెస్ట్‌లను నిర్వహించి ఆలిండియా ర్యాంకులు ఇస్తోంది. సబ్జెక్టుల వారీగా కూడా మార్కులు ప్రకటిస్తోంది. దీనివల్ల అభ్యర్థులు తమను తాము అంచనా వేసుకొని, ప్రిపరేషన్ ప్రణాళికలో మార్పులు చేసుకునేందుకు వీలుంటుంది. నిర్దేశ సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడం అలవడుతుంది. మొత్తం సిలబస్‌కు సంబంధించి 15-20 టెస్ట్‌లు రాయడం మంచిది.
సొంత నోట్స్:
ప్రతి సబ్జెక్టులోని ముఖ్య అంశాలు, సూత్రాలతో సొంతంగా నోట్స్ రూపొందించుకోవాలి. ఇది రివిజన్‌కు బాగా ఉపయోగపడుతుంది.
- రాపోలు జయప్రకాశ్
(గేట్-2014 ఎలక్ట్రికల్ 9వ ర్యాంకు).
ప్రిపరేషన్ వ్యూహాలు
సిలబస్‌లోని కాన్సెప్ట్‌లను గుర్తించి వాటి ప్రాధాన్యాన్ని విశ్లేషించుకుంటూ చదవాలి. వివిధ వనరుల నుంచి రకరకాల ప్రశ్నలను సేకరించి వాటిని క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. వివిధ సమస్యలకు తేలిగ్గా సమాధానం గుర్తించే మార్గాలను(షార్ట్‌కట్స్)ను సొంతంగా ఆవిష్కరించాలి. ఈ వి ధానం అభ్యర్థులను విజయం ముంగిటకు చేరుస్తుంది.గేట్ పరీక్ష ప్రధానంగా సంబంధిత బ్రాంచ్‌లో అభ్యర్థిలోని ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షిస్తుంది. సబ్జెక్ట్‌లోని బేసిక్స్, ఫండమెంటల్స్‌పై అవగాహన స్థాయిని తెలుసుకునే విధంగా ప్రశ్నలు వస్తాయి. అందువల్ల సరైన ప్రామాణిక పుస్తకాలను ఎంపిక చేసుకొని చదవాలి.
ఈసీఈ:
నెట్‌వర్క్స్, ఎలక్ట్రానిక్ డివెసైస్, అనలాగ్ సర్క్యూట్స్, డిజిటల్ సర్క్యూట్స్, సిగ్నల్ అండ్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రోమ్యాగ్నటిక్స్ అంశాల భావనలపై పట్టు సాధిస్తే గేట్‌లో మంచి స్కోర్ సాధించవచ్చు. మ్యాథమెటిక్స్ నేపథ్యం ఉన్నవారికి ఈసీఈలోని అంశాలను ఒంటబట్టించుకోవడం తేలికవుతుంది. గేట్‌లో నెట్‌వర్క్స్‌పై ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. దీనికి సంబంధించి ప్రామాణిక పుస్తకాల్లోని సమస్యలను సాధన చేయాలి. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్‌లో ignal to noise ratio of AM, FM; superheterodyne receiver, Fundamentals of information theory, PCM, CPCM, matched filter receiversË$ ముఖ్యమైన వాటిలో కొన్ని.డిజిటల్ సర్క్యూట్లలో లాజిక్ గేట్స్, లాజిక్ ఫ్యామిలీస్, కాంబినేషనల్ అండ్ సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్, మైక్రోప్రాసెసర్స్‌లోని సమస్యలను సాధన చేయాలి.
సీఎస్ అండ్ ఐటీ:
థియరీ ఆఫ్ కంప్యుటేషన్, ఆపరేటింగ్ సిస్టమ్స్, సీ అండ్ డేటా స్ట్రక్చర్స్, డీబీఎంఎస్ అండ్ కంప్యూటర్ నెట్‌వర్క్స్ వంటి అంశాలపై పట్టు సాధిస్తే గేట్‌లో మంచి స్కోర్ సాధించడంతో పాటు సాఫ్ట్‌వేర్ పరిశ్రమలో రాణించడానికి ఉపయోగపడతాయి.
మెకానికల్ ఇంజనీరింగ్:
మెకానికల్ కోర్ సబ్జెక్టులైన థర్మోడైనమిక్స్, స్ట్రెంథ్ ఆఫ్ మెటీరియల్స్, డిజైన్ ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంశాలు మంచి స్కోర్ సాధించేందుకు కీలకమైనవి. వీటిలోని సమస్యల సాధనపై దృష్టిసారించాలి.
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్:
పవర్ సిస్టమ్స్, మెషీన్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెజర్‌మెంట్స్ తదితర అంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి. వీటిలోని ఈక్వేషన్స్‌పై పట్టు సాధించాలి.
ఆన్‌లైన్ మాక్ పరీక్షలు:
ఆన్‌లైన్ మాక్ పరీక్షలకు హాజరు కావడం ద్వారా టైమ్ మేనేజ్‌మెంట్ అలవడుతుంది. ఎంత సమయంలో ఎన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలుగుతున్నారో తెలుస్తుంది. ప్రిపరేషన్ పరంగా బలాలు-బలహీనతలు తెలుస్తాయి. పరీక్ష విధానం అలవాటవుతుంది. శిక్షణ సంస్థలు కొంత మొత్తాన్ని వసూలు చేసి, ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్‌లను నిర్వహిస్తుంటాయి. వీటికి హాజరవ్వాలి. కొన్ని సంస్థలు స్టడీ మెటీరియల్, మాక్ టెస్ట్‌లు, గత ప్రశ్నపత్రాలు తదితరాలు అందుబాటులో ఉండే ట్యాబ్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి.