డిజైనింగ్ కెరీర్‌కు బెస్ట్.. సీడ్ | Designing a career best seed | Sakshi
Sakshi News home page

డిజైనింగ్ కెరీర్‌కు బెస్ట్.. సీడ్

Published Wed, Aug 13 2014 11:07 PM | Last Updated on Sat, Sep 2 2017 11:50 AM

డిజైనింగ్ కెరీర్‌కు బెస్ట్..  సీడ్

డిజైనింగ్ కెరీర్‌కు బెస్ట్.. సీడ్

కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ డిజైన్ (సీడ్).. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో డిజైనింగ్ విభాగంలో పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష. ఈ పరీక్షను ఐఐటీ-బాంబే పర్యవేక్షిస్తుంది. సీడ్ ద్వారా ఆర్కిటెక్చర్, మెకానికల్ తదితర విభాగాల్లో డిజైన్ సంబంధిత కోర్సులు అభ్యసించవచ్చు.
 
 రెండు భాగాలుగా:
 సీడ్ ప్రశ్నపత్రం ఇంగ్లిష్ భాషలో పార్ట్-ఎ, పార్ట్-బి అనే రెండు భాగాలు ఉంటుంది. పార్ట్-ఎలో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. పార్ట్-బిలో డిజైన్, హ్యాండ్ డ్రాయింగ్ ప్రశ్నలు ఉంటాయి. పార్ట్-ఎ స్క్రీనింగ్ టెస్ట్. ఇందులో నిర్దేశించిన అర్హత సాధించాల్సి ఉంటుంది. అప్పుడే పార్ట్-బి స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుని మెరిట్ జాబితా రూపొందిస్తారు.
 
 పార్ట్-ఎ ఆబ్జెక్టివ్:
 పార్ట్-ఎలో 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున 50 మార్కులు కేటాయించారు. సమాధానాలను గుర్తించడానికి గంట సమయం ఉంటుంది. ఇందులో జనరల్ ఆప్టిట్యూడ్, జీకే-కరెంట్ అఫైర్స్, అనలిటికల్ ఎబిలిటీ వంటి విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. అంతేకాకుండా ప్రముఖ కట్టడాలు, వ్యక్తులు, ఆర్కిటెక్చర్, కళలు వంటి అంశాలపై కూడా ప్రశ్నలు ఇస్తారు. జీకే-కరెంట్ అఫైర్స్ విభాగాల నుంచి వచ్చే ప్రశ్నలు కూడా డిజైన్, కట్టడాలు సంబంధిత నేపథ్యంగా ఉంటాయి. ఉదాహరణకు గతేడాది పరీక్షలో ఉత్తరాఖండ్‌లో 2013లో సంభవించిన వరదల కారణంగా దెబ్బతిన్న ఆలయమేది? అదేవిధంగా వాస్తు, శిల్ప కళలు, ఫోటోగ్రిఫీ, ప్రింటింగ్ తదితర రంగాల్లో కాలక్రమేణా చోటు చేసుకున్న మార్పులపై కూడా ప్రశ్నలు అడుగుతారు. అంతేకాకుండా చిత్రాలు ఇచ్చి అందులోని వ్యక్తులను లేదా కట్టడాలను గుర్తించడం, వివిధ సంస్థల లోగోలు, సరైన డిజైన్‌ను ఎంచుకోవడం వంటి ప్రశ్నలు కూడా ఉంటాయి. జనరల్ ఇంగ్లిష్, జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్ వంటి అంశాల నుంచి కూడా ప్రశ్నలు ఇస్తారు.
 
 ఆలోచనలను ప్రతిబింబించే:
 పార్ట్-బిలో మీలోని ఆలోచనలను చిత్రం, కథల రూపంలో వివరించాల్సి ఉంటుంది. ఈ విభాగానికి రెండు గంటల సమయం కేటాయించారు. ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగం తప్పనిసరి, రెండో విభాగం ఐచ్ఛికం (ఆప్షనల్). మొదటి విభాగంలో  స్కెచింగ్, క్రియేటివిటీ అండ్ ఇమాజినేషన్ అంశాలు ఉంటాయి. ఈ విభాగానికి 50 మార్కులు కేటాయించారు. స్కెచింగ్‌లో ఏదైనా నేపథ్యం ఆధారంగా డ్రాయింగ్ వేయాల్సి ఉంటుంది. దీనికి 20 మార్కులు. డిజైన్లను ప్రెజెంట్ చేయడం, ఇచ్చిన డిజైన్‌కు ప్రత్యామ్నాయ డిజైన్లను చిత్రించాల్సిన విధంగా ప్రశ్నలు ఉంటాయి. ఇచ్చిన డిజైన్‌లో లోపాలను గుర్తించి- దానికి గల కారణాలను విశ్లేషించడంతోపాటు సరైన డిజైన్ ను సూచించడం వంటి ప్రశ్నలను కూడా ఈ విభాగం నుంచి అడుగుతారు. క్రియేటివిటీ అండ్ ఇమాజినేషన్ విభాగంలో.. ఇచ్చిన చిత్రం నేపథ్యాన్ని కథ రూపంలో వివరించాలి. ఈ ప్రశ్నకు 15 మార్కులు కేటాయించారు. తర్వాత ప్రశ్నలో ఏదో ఒక వస్తువునిచ్చి దాని ప్రత్యామ్నాయా ఉపయోగాలను పేర్కొనమనంటారు. దీనికి 15 మార్కులు. రెండో విభాగంలో విజువల్ కమ్యూనికేషన్ అండ్ ఇంటారక్షన్, ప్రొడక్ట్ డిజైన్, యానిమేషన్ డిజైన్ వంటి అంశాలు ఉంటాయి. ఇందులో ఇచ్చిన సందర్భాన్ని గ్రాఫికల్ యూజర్ ఇంటర్‌ఫేస్, యానిమేషన్, ప్రొడక్ట్ డిజైన్ నమూనాను చిత్రించాలి.
 
 నైపుణ్యాల పరీక్ష:
 సీడ్‌లో అకడమిక్ అంశాల కంటే అభ్యర్థిలోని నైపుణ్యాలను పరీక్షించడానికి ప్రాధాన్యతనిస్తారు. ఈ క్రమంలో అభ్యర్థిలోని దృశ్యగ్రాహ్యత సామర్థ్యం (విజువల్ పర్సెప్షన్ ఎబిలిటీ), సృజనాత్మకత, తార్కిక విశ్లేషణ, డ్రాయింగ్, కమ్యూనికేషన్ వంటి నైపుణ్యాలను అంచనా వేస్తారు. కాబట్టి ఆ దిశగా ప్రిపరేషన్ సాగించాలి. గత పేపర్లను పరిశీలిస్తూ అన్ని ప్రశ్నలకు సమాధానాలను ప్రాక్టీస్ చేయాలి (సీడ్ వెబ్‌సైట్‌లో గత ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉంటాయి). పరీక్షలో లభించే సమయం ప్రకారం వాటిని ప్రాక్టీస్ చేయడం వల్ల టైం మేనేజ్‌మెంట్‌కు వీలవుతుంది. డ్రాయింగ్ నైపుణ్యాలపై దృష్టిపెట్టాలి. ఈ క్రమంలో షేడ్, లైన్స్, సృజనాత్మకత, తార్కిక వివేచన వంటి అంశాలు కీలకపాత్ర పోషిస్తాయి.
 
 ఒక డిజైన్‌ను చూసిన వెంటనే.. లోపాలు గుర్తించే సామర్థ్యం, కారణాలను విశ్లేషించే నైపుణ్యం, ప్రత్యామ్నాయ డిజైన్‌లను రూపొందించే సృజనాత్మకత ఉండాలి. అంతేకాకుండా పండ్లు, కూరగాయలు ఇలా మీ దైనందిన జీవితంలో ఉపయోగించే ప్రతి వస్తువును వివిధ కోణాల్లో చిత్రించేందుకు ప్రయత్నించాలి. అదేక్రమంలో వివిధ రకాల డిజైన్లపై అవగాహన పెంచుకోవాలి. తద్వారా డ్రాయింగ్ సామర్థ్యాలు పెరుగుతాయి. అంతేకాకుండా వాటికి సంబంధించిన విభిన్న ఉపయోగాల గురించి కూడా ఆలోచించాలి. వాటిని ఒక క్రమ పద్ధతిలో రాయడం, చిత్రం ఆధారంగా కథను వివరించడం వంటి అంశాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి.
 
 రెండేళ్లపాటు:
 ఫలితాలు వెల్లడించిన రోజు నుంచి రెండేళ్లపాటు సీడ్ స్కోర్ చెల్లుబాటులో ఉంటుంది. సీడ్ కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఈ స్కోర్ ఆధారంగా ఆయా కోర్సులను అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు నిర్దేశించే అర్హత ప్రమాణాలు, ప్రవేశ ప్రక్రియలు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి దరఖాస్తు చేసుకునే  ముందు ఆయా ఇన్‌స్టిట్యూట్‌ల వెబ్‌సైట్ల నుంచి సంబంధిత సమాచారాన్ని పొందడం మంచిది.
 
 ప్రవేశం:ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు సీడ్ స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ లేదా రాత పరీక్ష నిర్వహించి పీజీ కోర్సుల్లో ప్రవేశాన్ని ఖరారు చేస్తున్నాయి. ఈ క్రమంలో వివిధ ఇన్‌స్టిట్యూట్‌లు అనుసరించే విధానం..
 
 నోటిఫికేషన్ సమాచారం:
 అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్/ ఆర్కిటెక్చర్/ డిజైన్/ ఇంటీరియర్ డిజైన్/ తత్సమానం లేదా ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ డిజైన్ (10+2 తర్వాత నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ లేదా సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ అండ్ ప్లానింగ్ టెక్నాలజీ లేదా తత్సమాన హోదా ఉన్న ఇన్‌స్టిట్యూట్ నుంచి నాలుగేళ్ల కోర్సు) లేదా బీఎఫ్ ఏ (10+2 తర్వాత నాలుగేళ్ల కోర్సు) లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్/సైన్స్/కంప్యూటర్ ఆప్లికేషన్స్ (10+2+3 తర్వాత రెండేళ్ల కోర్సు) లేదా గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఆర్ట్ (10వ తరగతి తర్వాత ఐదేళ్ల కోర్సు)తోపాటు సంబంధిత రంగంలో ఏడాది అనుభవం.
 
     దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
     రదఖాస్తు ఫీజు: రూ. 2,000 (ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ మహిళ అభ్యర్థులకు రూ.1,000)
     దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 1, 2014.
     పరీక్ష కేంద్రాల ఎంపిక వ్యవధి: అక్టోబర్ 15-30 వరకు.
     రాతపరీక్ష తేదీ: డిసెంబర్ 7, 2014.
     ఫలితాల వెల్లడి: జనవరి 15, 2014
     వివరాలకు: www.gate.iitb.ac. in /ceed-2015
 
 ఇన్‌స్టిట్యూట్    ప్రవేశప్రక్రియ
 ఐఐఎస్‌సీ-బెంగళూరు    సీడ్ స్కోర్, ఇంటర్వ్యూ
 ఐఐటీ-బాంబే    సీడ్ స్కోర్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ మూడు దశలు
 ఐఐటీ-కాన్పూర్    సీడ్/గేట్ స్కోర్, ఇంటర్వ్యూ, రాత పరీక్ష
 ఐఐటీ-హైదరాబాద్    సీడ్ స్కోర్, ఇంటర్వ్యూ
 ఐఐటీ-గౌహతి    సీడ్ స్కోర్, క్రియేటివ్ ఇంటరాక్టివ్ సెషన్, ఇంటర్వ్యూ.
 పీహెచ్‌డీ కోర్సుల్లో పీహెచ్‌డీ ప్రపొజల్, పబ్లికేషన్స్, ప్రొఫైల్, డిపార్ట్‌మెంట్ ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశం కల్పిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement