ప్రస్తుతం ప్రశ్నలు సమకాలీన పరిణామాల ఆధారంగా వస్తున్నాయి. అందువల్ల ఒక అంశంపై మీడియాలో ఎలా చర్చ జరుగుతుందో చూడగలగాలి. దాన్ని విశ్లేషించే సామర్థ్యం ఉండాలి. ప్రిపరేషన్‌కు ఉపయోగపడే వెబ్‌సైట్లను గుర్తించాలి. ఇలాచేస్తే విజయం తథ్యం.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) వంటి ప్రముఖ సంస్థల్లో చదివిన వారే సివిల్స్ సాధించగలరు! ఈ అభిప్రాయం సత్యదూరం. గత పదేళ్ల సివిల్స్ ఫలితాలు, శిక్షణ కేంద్రాల్లోని అభ్యర్థులను పరిశీలిస్తే అన్ని రకాల విద్యాసంస్థల అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. ప్రఖ్యాత ఇన్‌స్టిట్యూట్‌ల దగ్గరి నుంచి మారుమూల ప్రాంతాల్లోని విద్యాసంస్థల్లో చదువుకున్న వారు సైతం సక్సెస్‌ను అందుకుంటున్నారు. ఇటీవలి పరిణామాలను చూస్తే దూరవిద్య ద్వారా చదువుకున్న వారు కూడా సర్వీస్ సాధించిన వారిలో ఉన్నారు.
ఒక్క ఇంజనీరింగ్‌కు సంబంధించిన వారే కాదు.. లా, సీఏ, మేనేజ్‌మెంట్, సైన్స్ ఇలా విభిన్న నేపథ్యాల అభ్యర్థులు సివిల్స్‌లో నెగ్గుతున్నారు. విజయం సాధించిన వారిలో ఐఐటీ, ఐఐఎంలలో చదువుకున్న వారుంటే వారికి ఎక్కువ ప్రచారం లభిస్తోంది. దీనివల్ల ఈ సంస్థల్లో చదువుకున్న వారికే సివిల్స్ అనే అపోహ ఉంది.కొత్తగా ప్రవేశపెట్టిన సిలబస్, రెండు ఆప్షన్లను ఒక ఆప్షన్‌కు తగ్గించడం, మారిన ప్రశ్నల సరళి నేపథ్యంలో ఏ అకడమిక్ నేపథ్యం అయినా, ఏ సంస్థలో చదువుకున్నా ప్రణాళికాబద్ధంగా సిద్ధమైతే సివిల్స్ సర్వీస్‌ను చేజిక్కించుకోవచ్చు.
మొదట్నుంచి ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్న వారే సివిల్స్‌లో విజయం సాధించగలరు?
సివిల్స్ రాసేవారిలో ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులు ఎక్కువగా ఉంటున్న మాట వాస్తవమేగానీ, కేవలం ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులు మాత్రమే పరీక్షలో సక్సెస్‌ను సొంతం చేసుకోగలరు అనేది అవాస్తవం. పరీక్ష రాసే వారిలో ఆంగ్ల మాధ్యమం అభ్యర్థులు ఎక్కువ ఉంటున్నారు కాబట్టి విజయం సాధించిన వారిలో ఎక్కువ మంది వారు ఉండొచ్చు. పూర్తిగా తెలుగు మీడియంలో రాసిన వారు, తెలుగు లిటరేచర్ ఆప్షన్‌తో పరీక్ష రాసిన వారు చాలా మంది విజయం సాధించారు.తెలుగు మీడియం అభ్యర్థులు కోచింగ్ సెంటర్‌లో చేరినప్పుడు, అక్కడ ఫ్యాకల్టీ ఇంగ్లిష్‌లో చెప్పే పాఠాలను అర్థం చేసుకోవడంలో ఇబ్బందిపడుతున్నారు. ఇలాంటి వారు కొంత శ్రమిస్తే తేలిగ్గానే సమస్యను అధిగమించగలరు.
ఒకవేళ సివిల్స్ రాస్తే ఐఏఎస్ సాధించాలి. లేదంటే మరేదైనా ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగం చూసుకోవడం మేలు.
సాధారణంగా సివిల్ సర్వీస్ అనగానే అందరికీ ఐఏఎస్, ఐపీఎస్ కనిపిస్తాయి. కొద్ది మందికి ఇండియన్ ఫారెన్ సర్వీస్‌పై అవగాహన ఉంటుంది. ఆలిండియా సర్వీసులుగా పేర్కొనే వీటిపై అందరికీ కొద్దోగొప్పో అవగాహన ఉందిగానీ, మిగిలిన సర్వీసుల గురించి అంతగా తెలియదు. 23 సర్వీసుల్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ కాకుండా మిగిలిన సర్వీసుల్లో గ్రూప్ ఏ, గ్రూప్ బీ సర్వీసులున్నాయి. ప్రస్తుత ప్రపంచీకరణ పరిస్థితుల్లో ఈ సర్వీసులకు కూడా ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పుడు ప్రభుత్వ పాలనలో ఆర్థిక సుపరిపాలన కీలకమవుతోంది. మొత్తం అభివృద్ధి అంతా ఆర్థికాభివృద్ధి చుట్టూ తిరుగుతోంది. ఈ క్రమంలో ఇండియన్ పీ అండ్ టీ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్స్ అండ్ ఎక్సైజ్), ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐటీ) వంటి వాటికి ప్రాధాన్యం పెరిగింది. కొందరైతే ఐఆర్‌ఎస్‌కు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం పలు కీలక స్థానాల్లో ఈ సర్వీసు అధికారులకు స్థానం కల్పిస్తోంది.
గ్రూప్ ఏ సర్వీసుల్లో ఉన్నవారు అనేక రంగాల్లోకి డిప్యుటేషన్‌పై వెళ్తుంటారు. ఉదాహరణకు ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్‌కి చెందిన వారికి వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థల్లో అవకాశం లభిస్తుంటుంది. కొత్తగా వచ్చిన ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్‌కు కూడా నెమ్మదిగా ప్రాధాన్యం పెరగొచ్చు. అందువల్ల సివిల్స్‌లో ఇతర సర్వీసుల్లోనూ అద్భుతమైన కెరీర్ ఉంటుందన్న వాస్తవాన్ని గుర్తించాలి.
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై తీవ్ర రాజకీయ ఒత్తిడి ఉంటుంది. అందువల్ల అటువైపు వెళ్లకపోవడం మంచిది?
ప్రభుత్వ పాలన అనేది కచ్చితంగా సామాజిక, రాజకీయ వాతావరణంలో ఉంటుంది. ఇది తప్పదు. ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే ఒత్తిడిని నెగిటివ్‌గా కాకుండా సకారాత్మకంగా (పాజిటివ్)గా చూడాలి. అప్పుడే సమర్థవంతమైన అధికారిగా ఎదగగలరు. నియమనిబంధనలకు అనుగుణంగా, నేర్పరితనంతో విధులను నిర్వహిస్తూ కెరీర్‌ను అద్భుతంగా మలచుకోవాలి. తమ పనుల్లో రాజకీయ నేతలు ‘ఇంటర్‌ఫియర్’ అవుతున్నారనుకోకుండా ఇంటరాక్షన్ అవుతున్నారనుకోవాలి. ఇప్పడు రాజకీయ వ్యవస్థలో పరిపక్వత వచ్చింది. అందువల్ల యువత ప్రభుత్వ సర్వీసుల్లోకి వెళ్లి, విధుల నిర్వహణను సవాలుగా తీసుకొని భవిష్యత్తు వైపు అడుగులేయాలి.
సివిల్స్‌లో విజయం సాధించాలంటే రోజుకు 17 గంటలు చదవాలి.
సివిల్స్ ఒక్కటే కాదు.. ఏ పోటీ పరీక్షలోనైనా విజయం సాధించాలంటే పట్టుదల, కృషి అవసరం. అయితే రోజుకు 17 గంటలు చదవితేనే సివిల్స్ సాధించగలం అనేది అపోహ మాత్రమే. మారిన పరీక్ష విధానంలో సమాధానాల గుర్తింపునకు బట్టీ పద్ధతి పనికి రాదు. ప్రాథమిక అంశాలు తెలిసుండి, వాస్తవ సమాజానికి దగ్గరగా ఉండి, మంచి విశ్లేషణా దృక్పథం ఉంటే ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు రాయొచ్చు. ఏడాది పాటు ప్రణాళికాబద్ధంగా సిద్ధమైతే విజయం సాధించేలా ప్రస్తుత పరీక్ష విధానం, ప్రశ్నల సరళి ఉంది.
సివిల్స్‌లో విజయం సాధించాలంటే ఢిల్లీలో కోచింగ్ తీసుకోవాల్సిందే!
సివిల్స్‌లో విజయం సాధించిన వారందరూ ఢిల్లీలో కోచింగ్ తీసుకున్న వారే కాదు కదా! ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటున్న వారందరూ విజయం సాధించడం లేదు కదా! కోచింగ్ అనేది ప్రిపరేషన్ సమయాన్ని తగ్గించేందుకు ఉపకరిస్తుంది. ప్రస్తుతం సివిల్స్ శిక్షణ కేంద్రాలు మారిన సిలబస్‌కు అనుగుణంగా బోధనా వసతులను మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయి. విజయానికి అభ్యర్థి స్వీయ సామర్థ్యం ముఖ్యం. తర్వాతే కోచింగ్. ఢిల్లీలోనే కాదు.. తమకున్న వనరులు ఆధారంగా ఎక్కడైనా కోచింగ్ సెంటర్‌ను ఎంపికచేసుకోవచ్చు.
మొదట ప్రిలిమ్స్‌పై దృష్టి సారించి, తర్వాత అందులో విజయం సాధిస్తే మెయిన్స్ ప్రిపరేషన్‌ను ప్రారంభిస్తే మంచిది.
ఈ రకమైన భావన విజయావకాశాలను పూర్తిగా దెబ్బతీస్తుంది. యూపీఎస్సీ 2015 కేలండర్ ప్రకారం సివిల్స్ ప్రిలిమ్స్‌ను ఆగస్టు 23న నిర్వహిస్తారు. మెయిన్స్ డిసెంబర్ 18 నుంచి ప్రారంభమవుతుంది. దీన్నిబట్టి చూస్తే రెండింటికీ మధ్య తక్కువ వ్యవధి ఉంది. ఈ స్వల్ప వ్యవధిలో మెయిన్స్‌కు ప్రిపరేషన్‌ను పూర్తిచేయడం కష్టం. అందువల్ల సిలబస్‌ను సమగ్రంగా పరిశీలించి, ప్రిలిమ్స్‌కు సమాంతరంగా మెయిన్స్‌కు సిద్ధంకావాలి.
డిగ్రీలో చదివిన సబ్జెక్టునే ఆప్షనల్‌గా ఎంపిక చేసుకోవాలి!
ఆప్షనల్ సబ్జెక్టు, జనరల్ ఎస్సేల్లో ప్రతిభ కనబరిచిన వారు ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. అందువల్ల ఆప్షనల్ ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అయితే డిగ్రీలో చదివిన సబ్జెక్టునే ఆప్షనల్‌గా తీసుకోవాలని లేదు. దీనికి పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు.. తీసుకున్న ఆప్షనల్ సబ్జెక్టు ప్రిపరేషన్.. జనరల్ స్టడీస్ పేపర్లకు ఉపయోగపడుతుందా? లేదా? అనేది చూడటం; స్వీయ వైఖరి; మంచి ఫ్యాకల్టీ గెడైన్స్ ఏ సబ్జెక్టుకు అందుబాటులో ఉంది; అకడమిక్ నేపథ్యం. ప్రస్తుతం జాగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్స్‌ను మంచి ఆప్షనల్స్‌గా చెప్పుకోవచ్చు. వీటి ప్రిపరేషన్ జనరల్ స్టడీస్ పేపర్లకు బాగా ఉపయోగపడుతుంది.
బెస్ట్ ఆఫ్ లక్
విశ్లేషణతో విజయ గమ్యానికి..
Published Thu, Apr 30 2015 12:32 AM | Last Updated on Sun, Sep 3 2017 1:07 AM
Advertisement
Advertisement