సివిల్స్ లో మెరిసిన క్రాంతి | karthi reddy Civil toppers | Sakshi
Sakshi News home page

సివిల్స్ లో మెరిసిన క్రాంతి

Published Wed, May 11 2016 1:00 AM | Last Updated on Sun, Sep 3 2017 11:48 PM

సివిల్స్ లో మెరిసిన క్రాంతి

సివిల్స్ లో మెరిసిన క్రాంతి

 కుటుంబ నేపథ్యం..
నాన్న డాక్టర్ వెంకట రంగారెడ్డి.. గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్. అమ్మ లక్ష్మి కర్నూలు మెడికల్ కాలేజ్‌లో సైకాలజీ ప్రొఫెసర్. సోదరి ఎండీ చేసి ప్రస్తుతం యూఎస్‌లో ఉంది. ఇవన్నీ నేను అకడమిక్‌గా ముందుండటానికి తోడ్పడ్డాయి. హైస్కూల్‌లో ప్రతి తరగతిలోనూ జిల్లా స్థాయిలో టాపర్‌గా నిలిచాను. ఎన్‌టీఎస్‌ఈ స్కాలర్‌షిప్ కూడా లభించింది. పదో తరగతి కర్నూలులో, ఇంటర్మీడియెట్ హైదరాబాద్‌లో చదివాను.
 
 ఐఐటీ ర్యాంకుతో ఢిల్లీలో అడుగు
 2008లో ఐఐటీలో 839వ ర్యాంకు వచ్చింది. దాంతో ఐఐటీ ఢిల్లీలో మెకానికల్ ఇంజనీరింగ్‌లో చేరాను. 2012లో బీటెక్ పూర్తయ్యాక సివిల్స్ ఆలోచన వచ్చింది. వాస్తవానికి బీటెక్ పూర్తికాగానే ఐఐఎంలో మేనేజ్‌మెంట్ పీజీ చేయాలనే ఉద్దేశంతో క్యాట్ రాశాను. కానీ.. ఢిల్లీలో చూసిన వాతావరణం, సివిల్ సర్వీసెస్ గురించి తెలియడంతో సమాజానికి నేరుగా సేవ చేసే అవకాశం లభిస్తుందనే ఆశయంతో సివిల్స్‌పై దృష్టిసారించాను. బీటెక్ పూర్తికాగానే ఫ్లిప్‌కార్ట్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీగా ఆఫర్ వచ్చింది. కానీ అప్పటికే సివిల్స్ సాధించాలనే లక్ష్యం బలంగా ఉండటం వల్ల ఆఫర్‌ను వదులుకుని కోచింగ్‌లో చేరాను.
 
 2013లో తొలి ప్రయత్నం
 2012 జూలైలో కోచింగ్‌లో చేరాను. మ్యాథమెటిక్స్ ఆప్షనల్ తీసుకున్నాను. 2013లో 562వ ర్యాంకుతో ఐఆర్‌టీఎస్ వచ్చింది. ఐఏఎస్ లక్ష్యంగా 2014లో మరో ప్రయత్నం చేశాను. అప్పుడు కూడా కొంత నిరాశ.. 230వ ర్యాంకుతో ఐఆర్‌ఎస్ వచ్చింది. ప్రస్తుతం ఎన్‌ఏడీటీలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కం ట్యాక్స్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను.
 
 సాకారమైన స్వప్నం
 ఓవైపు ఐఆర్‌ఎస్ శిక్షణ తీసుకుంటూనే సివిల్స్ 2015కు ప్రిపరేషన్ సాగించాను. అప్పటికే రెండేళ్లుగా ప్రిపరేషన్ సాగించడం వల్ల సమయం పరంగా ఎలాంటి ఇబ్బంది కలగలేదు. మ్యాథమెటిక్స్ ఆప్షనల్‌తోనే మూడోసారి కూడా సివిల్స్‌కు హాజరయ్యాను. ఎట్టకేలకు 65వ ర్యాంకుతో ఐఏఎస్ కల సాకారమైంది. నాన్న 1990లోనే సివిల్స్ మెయిన్స్‌లో విజయం సాధించారు. కానీ ఇంటర్వ్యూలో కొద్ది తేడాతో నిరాశ ఎదురైంది. ఆయన అనుభవం, అందించిన సూచనలు ఎంతో ఉపయోగపడ్డాయి.
 
 సమాజానికి సేవ చేయడమే లక్ష్యం
 ఐఏఎస్ అధికారిణిగా నా పరిధిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. ముఖ్యంగా మహిళా సాధికారత, మహిళా సమస్యల పరిష్కారంపై దృష్టిసారిస్తా.
 
 దృఢ సంకల్పం.. సరైన ప్రిపరేషన్
 సివిల్స్ ఔత్సాహికులకు లక్ష్యాన్ని సాధించాలన్న దృఢ సంకల్పం ఉండాలి. ప్రిపరేషన్ తీరుతెన్నులపై నిరంతరం ఆత్మపరిశీలన చేసుకోవాలి. కేవలం సబ్జెక్టు పరిజ్ఞానాన్ని పెంచుకోవడమే కాకుండా.. ఆ పరిజ్ఞానాన్ని పరీక్షలో అడిగిన ప్రశ్నకు సూటిగా, స్పష్టంగా అన్వయించే విధంగా నైపుణ్యాలు పెంచుకోవాలి. ఇందుకోసం ప్రిపరేషన్ సాగిస్తున్నప్పుడే రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. కొంతమంది చేసే పొరపాటు.. తొలి ప్రయత్నంలో విజయం రాకపోతే ఆప్షనల్‌ను మార్చుకోవడం. అలాంటి విధానం సరికాదు. తొలి ప్రయత్నంలో విజయం లభించకపోయినా.. నిరుత్సాహానికి గురి కాకుండా ముందుకు సాగితే కచ్చితంగా లక్ష్యం చేరుకోవచ్చు. చిన్నప్పటి నుంచి నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం. అందుకే దాన్ని ఆప్షనల్‌గా ఎంపిక చేసుకున్నాను.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement