సాంకేతిక కౌశలానికి.. సామాజిక కోణం | IIT-Gandhinagar recent MA | Sakshi
Sakshi News home page

సాంకేతిక కౌశలానికి.. సామాజిక కోణం

Published Thu, Aug 7 2014 2:51 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 AM

సాంకేతిక కౌశలానికి.. సామాజిక కోణం

సాంకేతిక కౌశలానికి.. సామాజిక కోణం

ఐఐటీ-గాంధీనగర్ ఇటీవల ఎంఏ (సొసైటీ అండ్ కల్చర్) అనే కోర్సును కొత్తగా ప్రారంభించింది. ఇలా హ్యుమానిటీస్-సోషల్ సెన్సైస్ కోర్సులను అందించడం కేవలం ఒక్క గాంధీనగర్ ఐఐటీకే పరిమితం కాలేదు. దాదాపు అన్ని ఐఐటీలు ఏదో ఒక విధానంలో హ్యుమానిటీస్-సోషల్ సెన్సైస్ కోర్సులను బోధిస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా విభాగాలను కూడా ఏర్పాటు చేశాయి. సంప్రదాయ యూనివర్సిటీల మాదిరిగా ప్రత్యేకంగా కొన్ని కోర్సులను కూడా ప్రవేశపెట్టాయి.
 
 మార్పు దిశగా:

 ఐఐటీలను మొదట ప్రారంభించినప్పుడు.. దేశం ఒక అత్యున్నత సాంకేతిక సమాజంగా రూపుదిద్దుకోవాలని అప్పటి విధాన నిర్ణేతలు భావించారు. కాబట్టి అప్పట్లో ఐఐటీల్లో హ్యుమానిటీస్ కోర్సులకు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. సమాజ అవసరాలకు, సమస్యలను అవగాహన చేసుకోవడం, వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించడంలో సోషల్ సెన్సైస్ కోర్సుల పాత్ర కీలకం. అందుకే ఐఐటీలు ఈ కోర్సులకు ప్రాధాన్యతనిస్తున్నాయి. దాంతో ఈ కోర్సులను బోధించాల్సిన అవసరం ఏర్పడింది. అంతేకాకుండా అన్ని విభాగాలకు చెందిన విద్యార్థులకు ఐఐటీని చేరువ చేయాలనే ఉద్దేశం కూడా ఈ నిర్ణయం వెనక దాగి ఉంది.
 
 ప్రేరణ:
 మన ఐఐటీలకు అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ప్రేరణ అనే వాదన ఉంది. అక్కడి మాదిరిగానే ఇక్కడి అన్ని ఐఐటీల్లో హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ డిపార్ట్‌మెంట్లు ఉన్నాయి. కాకపోతే యథాతథంగా ఎంఐటీ విధానాన్నే అనుసరించలేదు. మన మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఆలోచనల మేరకు.. సామాజిక అభివృద్ధి కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సూత్రాన్ని పాటిస్తున్నాయి. అదే సమయంలో ఇంజనీర్‌గా సమాజంపై తన ప్రభావాన్ని చూపే ఐఐటీయన్‌కు మన చరిత్ర ఏమిటి? చుట్టూ ఉన్న ప్రజలతో మనకున్న సంబంధం? సామాజిక బాధ్యత? ఒక సమాజంగా ఏవిధంగా మనుగడ సాగించాలి? ఆర్థిక, అభివృద్ధి వంటి అంశాల్లో అవగాహన ఉండటం ఎంతైనా అవసరం. ఆ మేరకు ఐఐటీలు హ్యుమానిటీస్- సోషల్ సెన్సైస్ బోధిస్తున్నాయి.
 
 బ్యాచిలర్ :
 ఐఐటీలు హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్‌కు సంబంధించి బ్యాచిలర్, ఎంటెక్, ఎంఫిల్, పీహెచ్‌డీ స్థాయిలో వివిధ కోర్సులను అందిస్తున్నాయి. వీటిలో ఎకనామిక్స్, లాంగ్వేజెస్, ఫిలాసఫీ, సైకాలజీ, సోషియాలజీ తదితర కోర్సులను బోధిస్తున్నాయి. ఈ కోర్సులను ఇంటర్‌డిసిప్లినరీ, పూర్తి స్థాయి కోర్సులుగా నిర్వహిస్తున్నాయి.
 
 అన్ని ఐఐటీల్లో:
 అన్ని ఐఐటీలు బీటెక్ కరిక్యులంలో భాగంగా హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్ అంశాలను ఇంటర్‌డిసిప్లినరీ విధానంలో బోధిస్తున్నాయి. కొన్ని ఐఐటీలు హ్యుమానిటీస్ అంశాలను రెగ్యులర్ కరిక్యులంలో తప్పనిసరిగా చేస్తే.. కొన్ని అంశాలను మాత్రం ఐచ్ఛికంగా ఆఫర్ చేస్తున్నాయి. ఉదాహరణకు ఐఐటీ-ఢిల్లీ.. ఎకనామిక్స్, ఇంగ్లిష్ లిటరేచర్, లింగ్విస్టిక్స్, ఫిలాసఫీ, సైకాలజీ, సోషియాలజీ అంశాలను బీటెక్ కరిక్యులంలో చేర్చింది. ఇవి ఐచ్ఛికం. ఐఐటీ-బాంబే బ్యాచిలర్ బీటెక్ కోర్సులో భాగంగా.. ఎకనామిక్స్, ఫిలాసఫీ, సైకాలజీ, సోషియాలజీ తదితర అంశాలను బోధిస్త్తోంది.
 
 ప్రత్యేక కోర్సులు:
 కొన్ని ఐఐటీలు హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్‌కు సంబంధించి ప్రత్యేకంగా పూర్తిస్థాయి కోర్సులను నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా హిస్టరీ, ఎకనామిక్స్, డెవలప్‌మెంట్ స్టడీస్, లాంగ్వేజెస్, ఫిలాసఫీ, లిటరేచర్, లా, సోషియాలజీ, రిలీజియన్, కల్చర్, ఆర్ట్స్, ఆంత్రోపాలజీ, కమ్యూనికేషన్, సైకాలజీ వంటి సబ్జెక్ట్‌లను బోధిస్తున్నాయి. ఉదాహరణకు ఐఐటీ-మద్రాస్ ఇంటిగ్రేటెడ్ ఎంఏ (డెవలప్‌మెంట్ స్టడీస్),  ఎంఏ (ఇంగ్లిష్ స్టడీస్) కోర్సులను అందిస్తోంది. అదేవిధంగా ఐఐటీ-కాన్పూర్ బ్యాచిలర్ స్థారుులో ప్రత్యేకంగా బీఎస్-ఎకనామిక్స్ కోర్సును ఆఫర్ చేస్తుంది.
 
 కెరీర్‌పరంగా కూడా:
 గ్లోబలైజేషన్ ఫలితంగా కెరీర్ పరంగా కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. కేవలం చదివిన కోర్సుకే పరిమితమైతే..అవకాశాలను దక్కించుకోవడం కష్టం. ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులు. ఎంఎన్‌సీలలో పని చేయాలంటే టెక్నికల్ నాలెడ్జ్‌తోపాటు సంబంధిత ఆర్థిక అంశాలపై అవగాహన ఉండటం తప్పనిసరి. ఈ క్రమంలో ఎకనామిక్స్, మైక్రో ఎకనామిక్స్, మాక్రోఎకనామిక్స్, మేనేజీరియల్ ఎకనామిక్స్ వంటి అంశాలను బోధిస్తున్నారు. విభిన్న రకాల వ్యక్తులతో కలిసి పని చేయాలి. కాబట్టి వారి నస్తత్వాలకనుగుణంగా వ్యవహరించడానికి తోడ్పడేలా సోషియాలజీ, సైకాలజీ అంశాలకు కరిక్యులంలో చోటు కల్పించారు. ఉద్యోగాల కోసం ఎల్లలు దాటి వెళ్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం ఇంగ్లిష్ భాషపై అవగాహన ఉంటే సరిపోదు. అందుకే విదేశీ భాషలను కూడా బోధిస్తున్నాయి. అన్నిటి కంటే ముఖ్యంగా చుట్టూ ఉన్న సమాజాన్ని, మానవ సంబంధాలు, సామాజిక బాధ్యతలపై అవగాహన అవసరం. ఇందుకోసం ఫిలాసఫీని కూడా బోధిస్తున్నారు.
 
 మా ఇన్‌స్టిట్యూట్‌లో హ్యుమానిటీస్-సోషల్ సెన్సైస్ (హెచ్‌ఎస్‌ఎస్) కోర్సులకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. బీటెక్ కరిక్యులంలో 20 శాతం అంశాలు హెచ్‌ఎస్‌ఎస్ ఆధారంగా ఉండడమే దీనికి నిదర్శనం. అదే కోవలో వివిధ నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులకు సామాజిక అంశాల పట్ల వారికి ఉన్న ఆసక్తిని అన్వేషించే ఉద్దేశంతోనే ఎంఏ (సొసైటీ అండ్ కల్చరల్) కోర్సును ప్రవేశపెట్టాం. కోర్సులో భాగంగా విద్యార్థులు చరిత్ర, సాహిత్యం, సోషియాలజీ, రాజనీతి శాస్త్రం, ప్రజాఆరోగ్యం వంటి అంశాల్లో పరిశోధనలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా దేశంలో ఇంజనీర్లు, ఇతర వృత్తినిపుణులు సామాజిక సమస్యలు, సంస్కృతి పట్ల అవగాహనను పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి హెచ్‌ఎస్‌ఎస్ కోర్సులను బోధించడం తప్పనిసరి. అంతేకాకుండా భావి నాయకులను తయారు చేయాలంటే టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లు హెచ్‌ఎస్‌ఎస్ కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వాల్సి అవసరం ఎంతో ఉంది.
 
 హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్ (హెచ్‌ఎస్‌ఎస్) కోర్సులకు ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలు అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ స్థాయిలో ఈ కోర్సులకు చోటు కల్పించాయి. ఎంఐటీ, స్టాన్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలు కూడా వీటికి పెద్ద పీట వేస్తున్నాయి. ఆర్థిక సరళీకరణ, టెక్నాలజీ ఆధారంగా ప్రపంచం అభివృద్ధి దిశగా శరవేగంగా పయనిస్తున్న ప్రస్తుత తరుణంలో మానవీయ విలువలను అవగాహన చేసుకునే విద్యను అందించడం ఇంజనీరింగ్ విద్యార్థులకు చాలా అవసరం. మన దేశంలో పేదరికం, అసమానతలు, సామాజిక వైరుధ్యాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో అభివృద్ధి వంటి అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలంటే సాంకేతిక పరిధి దాటి ఆలోచించాల్సి ఉంటుంది.
 
  అందుకు హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్ కోర్సులు దోహదం చేస్తాయి. అంతేకాకుండా ప్రభుత్వాలు రూపొందించిన అభివృద్ధి పథకాలను గుడ్డిగా ఆమోదించకుండా అందులోని సున్నితమైన, కీలకమైన అంశాలను విశ్లేషించడానికి కూడా ఈ కోర్సులు ఉపయోగపడతాయి. మన ఐఐటీలను మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ప్రేరణగా తీర్చిదిద్దారు. కాకపోతే పూర్తిగా ఎంఐటీ విధానాలనే అనుసరించకుండా సామాజిక అభివృద్ధి కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సూత్రాన్ని ఐఐటీలు అమలు చేస్తున్నాయి. దేశ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సామాజిక, ఆర్థిక అంశాల పట్ల  అవగాహన కలిగిన ఇంజనీరింగ్ విద్యార్థులను తయారు చేయాలని ఐఐటీలు భావిస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement