ఏపీ, తెలంగాణ ఐఐటీ సీట్లకు కోత
ఏపీ నుంచి 776 మంది, తెలంగాణ నుంచి 770 మందికి సీట్లు
మొత్తం 9,974 సీట్లలో 1,965 మంది రాజస్తాన్ నుంచే
రెండో స్థానంలో యూపీ 25 శాతం సీట్లు గ్రామీణులకే.
కోట(రాజస్తాన్): దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో ఈ ఏడాది ప్రవేశాల్లో ఏపీ, తెలంగాణలకు సీట్ల సంఖ్య బాగా తగ్గింది. ఈ ఏడాది అత్యధిక సీట్లను దక్కించుకున్న రాష్ట్రంగా రాజస్తాన్ అగ్రస్థానంలో నిలి చింది. గతేడాది తొలి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్‌ను వెనక్కి నెట్టేసింది. ఐఐటీ ముంబై రూపొందించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ 2015 నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న 18 ఐఐటీలలో మొత్తం 9,974 సీట్లు ఉండగా అందులో ఈసారి రాజస్తాన్ నుంచి 1,965మంది విద్యార్థులు సీట్లు సాధిం చారు. 1,259 మంది విద్యార్థులతో యూపీ రెండోస్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈసారి 776 మంది విద్యార్థులు ప్రవేశాలు సాధించగా తెలంగాణ నుంచి 770 మంది ప్రవేశాలు పొందారు. ఈ ఏడాది ప్రవేశాల్లో విద్యార్థుల విద్య, కుటుంబ నేపథ్యాలను పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. అవి ఏమిటంటే...
►ఈ ఏడాది సీట్లు పొందిన విద్యార్థుల్లో 25 శాతం మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు. వారంతా హిందీ మీడియంలో ప్రాథమికోన్నత చదువు పూర్తి చేసిన వారున్నారు.
►ఈ ఏడాది 900మంది విద్యార్థినులు ఐఐటీలలో సీట్లు పొందారు.
►సీట్లు సాధించిన విద్యార్థుల్లో 888 మంది విద్యార్థుల త ండ్రులు వ్యవసాయదారులుకాగా, 466మంది తండ్రులు ఇంజనీర్లు, 232మంది తండ్రులు డాక్టర్లు, 1,588 మంది తండ్రులు వ్యాపారస్తులు.
► 6,690 మంది విద్యార్థుల తల్లులు ఓ మోస్తరుగా చదువుకున్న గృహిణులు.
►2,989 మంది విద్యార్థుల తండ్రులు ప్రభుత్వోద్యోగులు కాగా 479 మంది విద్యార్థుల తండ్రులు టీచర్లు.
►1,600 మందికిపైగా విద్యార్థుల తండ్రుల వార్షికాదాయం రూ. లక్ష లోపే ఉంది.
► 1,100 మంది విద్యార్థుల తండ్రులు 10వ తరగతి వరకే చదువుకోగా మరో 250 మంది విద్యార్థుల తండ్రులు, 900 మంది విద్యార్థుల తల్లులు నిరక్షరాస్యులు.