క్యాంపస్ ప్లేస్‌మెంట్స్.. గెలుపు మంత్రం! | Campus placements | Sakshi
Sakshi News home page

క్యాంపస్ ప్లేస్‌మెంట్స్.. గెలుపు మంత్రం!

Published Mon, Nov 21 2016 11:52 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM

క్యాంపస్ ప్లేస్‌మెంట్స్.. గెలుపు మంత్రం!

క్యాంపస్ ప్లేస్‌మెంట్స్.. గెలుపు మంత్రం!

ఏ కంపెనీ అయినా ముందుగా వందల మంది విద్యార్థుల నుంచి అనర్హులను
 వడపోయడానికి మొదట స్క్రీనింగ్ టెస్ట్/ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తుంది.
 ఇందులో ప్రతిభ ఆధారంగా ఆయా కంపెనీలు తమకు అవసరమున్న
 ఖాళీల సంఖ్యకు 1:5 లేదా 1:6 నిష్పత్తిలో విద్యార్థులను తదుపరి దశల్లోకి
 అనుమతిస్తాయి. ప్రాంగణ నియామకాలైనా, ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అయినా..
 చాలామంది వివిధ కారణాల వల్ల మొదటి దశ ఆప్టిట్యూడ్ టెస్ట్‌ను
 అధిగమించలేక పోతున్నారు. కాబట్టి ఇందులో రాణించాలంటే ఏయే అంశాలపై 
 దృష్టి సారించాలి? ఏయే అంశాలపై ప్రశ్నలుంటాయో తెలుసుకుందాం..
 
 ఇంజనీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులకు ఆయా విద్యా సంస్థలు ప్రస్తుతం ప్రాంగణ నియామకాలు  నిర్వహిస్తున్నాయి. గత మూడేళ్ల నుంచి చదివిన చదువుకూ, నేర్చుకున్న స్కిల్స్‌కు ఫలితం తేలే సమయం. ఇన్ని రోజులు కుస్తీపట్టిన పుస్తకాలు, అలవర్చుకున్న కమ్యూనికేషన్ స్కిల్స్‌తో కొలువుదీరే అవకాశం కల్పిస్తున్నాయి ప్రాంగణ నియమాకాలు. కంపెనీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో భాగంగా ఆప్టిట్యూడ్ టెస్ట్/టెక్నికల్ ఇంటర్వ్యూ/హెచ్‌ఆర్ ఇంటర్వ్యూ/సిస్టమ్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నాయి. మరికొన్ని కంపెనీల ప్లేస్‌మెంట్స్ ప్రక్రియలో బృంద చర్చలు, జామ్ (జస్ట్ ఎ మినిట్) సెషన్స్ కూడా ఉంటున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) లాంటి కంపెనీలైతే మరో అడుగు ముందుకేసి మేనేజీరియల్ రౌండ్ కూడా నిర్వహిస్తున్నాయి. కొన్ని సంస్థలు టెక్నికల్ దశలోనే రెండు మూడు రౌండ్లు జరుపుతున్నాయి. సాధారణంగా ఆప్టిట్యూడ్ టెస్ట్ 45 నిమిషాలు లేదా గంట పాటు నిర్వహిస్తారు. ఇందులో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, వెర్బల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
 
 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
 ఈ విభాగంలో టైమ్ అండ్ వర్క్, ప్రాబబిలిటీ, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, సగటు, నంబర్ సిస్టమ్స్, నిష్పత్తులు, లాభనష్టాలు, ట్రైన్స్, లాగారిథమ్, కసాగు, గసాభా మొదలైన అంశాలపై ఎక్కువ శాతం ప్రశ్నలు అడుగుతున్నారు. వీటితోపాటుగా వడ్డీలపై ప్రశ్నలు, భాగస్వామ్యం, ఎత్తు - దూరం తదితర అంశాలపై ప్రశ్నలడిగే అవకాశం ఉంది. వీటితోపాటు డేటా ఇంటర్‌ప్రిటేషన్‌కు సంబంధించి బార్‌గ్రాఫ్, లైన్ గ్రాఫ్, పై చార్టులు, నెట్ డయాగ్రమ్స్, ట్యాబులర్ డేటా ఇచ్చి సమస్యలు పరిష్కరించమని కోరుతున్నారు.
 
 లాజికల్ రీజనింగ్
 ఈ విభాగం నుంచి కోడింగ్ డీకోడింగ్, డెరైక్షన్స్, క్లాక్స్, పజిల్స్, డేటా సఫిషియన్సీ, లాజికల్ ప్రాబ్లమ్స్, క్యాలెండర్స్, క్యూబ్స్, వెన్ డయాగ్రమ్స్, అనాలజీస్, బ్లడ్ రిలేషన్స్, నాన్ వెర్బల్ తదితర విభాగాల్లో విద్యార్థుల ప్రతిభ పరీక్షిస్తారు.
 
 వెర్బల్ ఎబిలిటీ
 వోకాబులరీ, సినానిమ్స్, యాంటానిమ్స్, అనాలజీస్, సెంటెన్స్ కంప్లీషన్, సెంటెన్స్ కరెక్షన్, గ్రామర్ కాన్సెప్ట్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. 
 
 ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో విజయానికి..
 ప్రాంగణ నియామకాల్లో విజయం సాధించాలంటే విద్యార్థులు సదరు కంపెనీలు గతంలో నిర్వహించిన  ప్రశ్నపత్రాలను సేకరించుకొని ప్రాక్టీస్ చేయాలి. వివిధ వెబ్‌సైట్లల్లో గత సంస్థలు నిర్వహించిన ప్రశ్నపత్రాలను పొందొచ్చు.
 
 పరీక్ష విధానం, దానికి కేటాయించే సమయం కంపెనీని బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి విద్యార్థులు తాము హాజరు కాబోయే కంపెనీ అనుసరించే పరీక్ష విధానాన్ని ముందుగానే తెలుసుకోవాలి.
 
 థర్డ్ ఇయర్‌లో ఉన్న విద్యార్థులు ఇప్పటి నుంచే ఆప్టిట్యూడ్ టెస్ట్ ప్రాక్టీస్ చేయడం లాభిస్తుంది.
 
 సమస్యను సాధించడం, పజిల్ టెస్టులకు కంపెనీలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి.
 
 కాలేజీలో నిర్వహించే క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ (సీఆర్‌టీ) తరగతులకు తప్పనిసరిగా హాజరవ్వాలి. సందేహాలు వస్తే ఫ్యాకల్టీని అడిగి నివృత్తి చేసుకోవాలి.
 
 సమయపరిమితిని నిర్దేశించుకుని ప్రాక్టీస్ చేయాలి.
 
 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్ల నుంచి సమాధానాలు గుర్తించడం సులువనేది నిపుణుల సూచన. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లను జాగ్రత్తగా పరిశీలిస్తే సమాధానాన్ని గుర్తించవచ్చు.
 
 రిఫరెన్స్ బుక్స్
 ఆర్.ఎస్.అగర్వాల్ (వెర్బల్ ఎబిలిటీ, నాన్ వెర్బల్), వొకాబులరీ కోసం వర్డ్ పవర్ మేడ్ ఈజీ - నార్మన్ లూయీస్, జీఆర్‌ఈ బారోన్స్  పుస్తకాలు ఉపయుక్తంగా ఉంటాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement