ఐఐఎస్సీకి ప్రపంచ ఎనిమిదో ర్యాంకు
న్యూఢిల్లీ: యూకేకు చెందిన టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్‌ఈ) ప్రకటించిన ఉత్తమ యూనివర్సిటీల ర్యాంకింగ్స్‌లో ఒక భారతీయ విద్యాసంస్థకు తొలిసారి టాప్ 10లో స్థానం దక్కింది. 2017లో ‘ఉత్తమ చిన్న విశ్వవిద్యాలయాలు’ విభాగంలో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) 8వ ర్యాంకు సాధించింది.
5 వేల మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న విశ్వవిద్యాలయాలను చిన్న వర్సిటీలుగా పరిగణిస్తారు. టాప్ వర్సిటీల్లో కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (అమెరికా), ఎకోలే నార్మలే సుపీరియర్ (ఫ్రాన్స్ ), పొహంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (దక్షిణ కొరియా)లు ఉన్నాయి. 2015–16లో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగంలో టీహెచ్‌ఈ ప్రకటించిన టాప్ 100 వర్సిటీల్లో దేశం నుంచి మొదటి సారి ఐఐఎస్సీ చోటుదక్కించుకొని 99వ స్థానంలో నిలిచింది.