Times Higher Education
-
టైమ్స్ హయ్యర్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో కేఐఐటీ
కోల్‌కతా: టైమ్స్ హయ్యర్ వరల్డ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ర్యాకింగ్స్–2019లో కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ(కేఐఐటీ)కి తొలిసారి చోటుదక్కింది. ప్రపంచంలోని 1001 అత్యుత్తమ విశ్వవిద్యాలయాలతో ఈ నెల 26న విడుదల అయిన జాబితాలో తూర్పు భారత్ నుంచి ఈ ఘనత దక్కించుకున్న ఏకైక సెల్ఫ్ ఫైనాన్సింగ్ యూనివర్సిటీ కేఐఐటీనే కావడం విశేషం. వర్సిటీ వ్యవస్థాపకురాలు ప్రొ. అచ్యుతా సమంత తమకు దక్కిన ర్యాంక్‌పై హర్షం వ్యక్తం చేస్తూ..దేవుడి ఆశీస్సులు, సిబ్బంది కృషి వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. 1997లో ఓ అద్దె భవనంలో కళాశాలగా ప్రారంభమైన కేఐఐటీ 2004లో డీమ్డ్ యూనవర్సిటీ హోదా దక్కించుకుంది. -
బోధనలో మన ఐఐటీలు మేటి
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల్లో బోధన భేష్ అని మరోసారి రుజువైంది. ఏటేటా బోధనను మెరుగుపరుచుకుం టూ ముందుకు సాగుతున్నట్లు తేలింది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రకటించిన వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో ఈ విషయం స్పష్టమైంది. గురువారం వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్– 2019 నుంచి టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 1,250 యూనివర్సిటీలకు వాటిల్లో బోధన, ప్రమాణాలను బట్టి ర్యాంకింగ్‌లను ఇచ్చింది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ చేసిన సర్వేలో బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)లో బోధనకు ఈసారి 56.7 పాయింట్ల స్కోర్ లభించింది. అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బాంబేకు బోధనలో 44.3 పాయింట్ల స్కోర్ లభించింది. ఇలా మన ఐఐటీలు ఏటా బోధనను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతున్నట్లు వెల్లడైంది. మళ్లీ ఐఐఎస్సీనే టాప్.. ఇక మన దేశానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1,250 ఉత్తమ యూనివర్సిటీల జాబితాలో మన దేశానికి చెందిన 49 విద్యా సంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఇందులో ఎప్పటిలాగే బెంగళూరులోని ఐఐఎస్సీ 251–300 ర్యాంకుతో మన దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. గతేడాది కూడా ఐఐఎస్సీనే అదే ర్యాంకుతో దేశంలో మొదటి స్థానంలో ఉంది. 2018 ర్యాంకింగ్‌లో రెండో స్థానంలో ఉన్న 351–400 ర్యాంకుతో రెండో స్థానంలో ఉన్న ఐఐటీ బాంబే 2019 ర్యాంకింగ్‌లో మాత్రం కొంత వెనుకబడింది. 401–500 ర్యాంకుతో మూడో స్థానంలో నిలిచింది. ఈసారి 351–400 ర్యాంకుతో ఐఐటీ ఇండోర్ రెండో స్థానంలో నిలవడం విశేషం. ఆసియా యూనివర్సిటీల పరంగా చూస్తే ఐఐఎస్సీ 29వ స్థానంలో నిలిచింది. తొలిసారిగా ఈ జాబితాలో ఐఐటీ ఇండోర్ దేశంలో రెండో స్థానాన్ని దగ్గించుకుంది. ఈసారి ఐఐటీ హైదరాబాద్‌కు స్థానం.. వరల్డ్ యూనివర్సిటీల ర్యాకింగ్‌లో ఈసారి ఐఐటీ హైదరాబాద్‌కు స్థానం దక్కింది. 601–800 ర్యాంకుతో ఐఐటీ హైదరాబాద్ స్థానం దక్కించుకుంది. ఇక ఉస్మానియా యూనివర్సిటీ గతేడాదిలాగే ఈసారి కూడా 801–1,000 ర్యాంకుతో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. వీటితోపాటు ఐఐటీ భువనేశ్వర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పుణే, కోల్‌కతా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాగార్జున యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీలకు ఈ ఏడాది ర్యాంకింగ్ జాబితాలో చోటు లభించింది. -
బెస్ట్ యూనివర్సిటీల్లో ఇండియా సూపర్
ఆసియాలో ఇండియన్ యూనివర్సిటీలు దుమ్మురేపుతున్నాయి. ఆసియాలో బెస్ట్ యూనివర్సిటీల జాబితాల్లో భారత యూనివర్సిటీలు గతేడాది కంటే రెట్టింపయ్యాయి. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ బుధవారం విడుదల చేసిన ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2017 జాబితాలో భారత్ నుంచి 33 యూనివర్సిటీలు టాప్-300లో నిలిచాయి. వీటిలో 17 యూనివర్సిటీలు కొత్తగా చోటు దక్కించుకోగా, మరో 16 చివరి ఏడాది నుంచి టాప్-300లో కొనసాగుతున్నాయి. టాప్-100లో ఎనిమిది భారత్ వే ఉన్నాయని టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ తెలిపింది. ఈ ర్యాంకింగ్స్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ 27 స్థానంలో ఉండగా.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-బొంబాయి 42, వెల్‌టెక్ యూనివర్సిటీ 43 స్థానంతో టాప్-50లో ఉన్నాయి. రెండో ఏడాది కూడా సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ, చైనా పెకింగ్ యూనివర్సిటీలే మొదటి, రెండో స్థానాలను సొంతం చేసుకున్నాయి. 69 యూనివర్సిటీలతో ర్యాంకింగ్స్ లో ఎక్కువ ప్రాతినిధ్యం వహించినప్పటికీ కేవలం రెండు జపనీస్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే టాప్-20లో ఉన్నాయి. తర్వాత చైనా టాప్-20లో ఆరు యూనివర్సిటీలను కలిగి ఉంది. ఆసియాలో బెస్ట్ యూనివర్సిటీల జాబితాలో భారత్ రెండింతలు రెట్టింపు చేసుకోవడం గుడ్ న్యూస్ అని టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఎడిటర్ తెలిపారు. దీంతో ర్యాంకింగ్స్ లో భారత్ మూడో అతిపెద్ద దేశంగా నిలిచిందని పేర్కొన్నారు. -
ఐఐఎస్సీకి ప్రపంచ ఎనిమిదో ర్యాంకు
న్యూఢిల్లీ: యూకేకు చెందిన టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్ఈ) ప్రకటించిన ఉత్తమ యూనివర్సిటీల ర్యాంకింగ్స్‌లో ఒక భారతీయ విద్యాసంస్థకు తొలిసారి టాప్ 10లో స్థానం దక్కింది. 2017లో ‘ఉత్తమ చిన్న విశ్వవిద్యాలయాలు’ విభాగంలో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) 8వ ర్యాంకు సాధించింది. 5 వేల మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న విశ్వవిద్యాలయాలను చిన్న వర్సిటీలుగా పరిగణిస్తారు. టాప్ వర్సిటీల్లో కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (అమెరికా), ఎకోలే నార్మలే సుపీరియర్ (ఫ్రాన్స్ ), పొహంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (దక్షిణ కొరియా)లు ఉన్నాయి. 2015–16లో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగంలో టీహెచ్ఈ ప్రకటించిన టాప్ 100 వర్సిటీల్లో దేశం నుంచి మొదటి సారి ఐఐఎస్సీ చోటుదక్కించుకొని 99వ స్థానంలో నిలిచింది. -
ఆ వర్సిటీ డిగ్రీలకు.. డిమాండ్ కొంచెం ఎక్కువ..
కాలిఫోర్నియా: ఎంతో కష్టపడి డిగ్రీ పట్టాను పొందడం ఒక ఎత్తైతే, ఆ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందడం నేటి యువతకు మరో సవాలే. అయితే కళాశాల్లో విద్యాబోధనే కాకుండా వృత్తి విషయాల్లో నైపుణ్యాన్ని కూడా పెంపొందిస్తూ ఉద్యోగ కల్పనలో కూడా ముందున్న టాప్ 10 యూనివర్సిటీల జాబితాను టైమ్స్ హైయ్యర్ ఎడ్యుకేషన్ వెల్లడించింది. ప్రపచవ్యాప్తంగా గ్రాడ్యుయేషన్ పూర్తవ్వగానే వెంటనే ఉద్యోగం లభించే ఉత్తమ టాప్ యూనివర్సిటీలను 'గ్లోబల్ యూనివర్సిటీ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్ 2016' పేరిట జాబితాను విడుదల చేసింది. 20 దేశాల్లోని టాప్ 2500 సంస్థల యాజమాన్యాల ఒపీనియన్ ఆధారంగా, 34 దేశాల్లోని 150 యూనివర్సిటీల్లో విద్యనభ్యసించిన విద్యార్థుల ఉద్యోగ అవకాశాలను పరిగణలోకి తీసుకొని జాబితాను తయారు చేశారు. తమ సంస్థల్లో ఉద్యోగం చేస్తూ ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న వారు డిగ్రీ పట్టా పొందిన యూనివర్సిటీ వివరాలను పరిగణలోకి తీసుకొని యాజమాన్యాలు ఈ ఒపీనియన్ పోల్‌లో పాల్గొన్నాయి. ఈ జాబితాలో టాప్ 3 ర్యాంకులను అమెరికా కైవసం చేసుకుంది. ఏకంగా టాప్ 10 జాబితాలో 6 యూనివర్సిటీలు యూఎస్‌కు చెందినవి ఉండటం విశేషం. ఈ జాబితాలో తొలి మూడు స్థానాల్లో అమెరికాకు చెందిన కాలిఫోర్నియా ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ), హార్వర్డ్ యూనివర్సిటీలు నిలిచాయి. యూకేకు చెందిన రెండు జపాన్, జర్మనీకి చెందిన చెరో యూనివర్సిటీలకు ఈ జాబితాలో చోటు దక్కింది.ఇక, టాప్ 20లో చైనా, సింగపూర్, కెనడా, ఫ్రాన్స్‌లకు చెందిన యూనివర్సిటీలకు చోటు దక్కింది. ఉద్యోగాల కల్పనలో టాప్ 10 యూరివర్సిటీలు 1.కాలిఫోర్నియా ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యూఎస్ 2.మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ), యూఎస్ 3.హార్వర్డ్ యూనివర్సిటీ, యూఎస్ 4.యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, యూకే 5.స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ, యూఎస్ 6.యేల్ యూనివర్సిటీ, యూఎస్ 7.యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్, యూకే 8.యూనివర్సిటీ ఆప్ మ్యూనిచ్ 9.ప్రిన్స్టన్ యూనివర్సిటీ 10.యూనివర్సిటీ ఆఫ్ టోక్యో -
యూరోప్‌లో బ్రిటన్‌దే హవా..
లండన్: యూరోప్‌లో బ్రిటన్ హవా కొనసాగుతోంది. యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు రావడంతో ఇప్పుడు అందరి దృష్టి బ్రిటన్ పైనే ఉంది. ఈ పరిణామంతో లాభపడ్డది ఎవరు నష్టపోయింది ఎవరు అంటూ ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. అయితే దేశాభివృద్ధిలో ఉన్నత విద్య పాత్ర కీలకమైంది. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదల చేసిన టైమ్స్ హైయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకుల జాబితాలో యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ తొలి స్థానం కైవసం చేసుకుంది. టైమ్స్ హైయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకుల్లో బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీకీ మొదటి స్థానం రావడం ఇదే ప్రథమం. ప్రపంచ వ్యాప్తంగా 980 టాప్ యూనివర్సిటీల జాబితాను ఎంపిక చేయగా, 148 యూనివర్సిటీలతో అమెరికా తొలి స్థానంలో నిలిస్తే, 91 యూనివర్సిటీలతో యూకే రెండో స్థానంలో నిలిచింది. టైమ్స్ హైయ్యర్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన టాప్ 10 యూరోపియన్ యూనివర్సిటీలు( బ్రాకెట్లో ప్రపంచ ర్యాంకు): 1) యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్, యూకే( 1) 2) యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, యూకే( 4 ) 3) ఇంపీరియల్ కాలేజ్ లండన్, యూకే( 8 ) 4) ఈటీహెచ్ జ్యూరిచ్, స్విడ్జర్‌ల్యాండ్( 9) 5) యూనివర్సిటీ కాలేజ్ లండన్, యూకే( 15) 6) లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్, యూకే( 25 ) 7) యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్, యూకే( 27 ) 8) కరోలిన్స్కా ఇన్స్‌స్టిట్యూట్, స్వీడన్( 28 ) 9) ఈకోలే పాలిటెక్నిక్ ఫెడరల్ డె లసాన్నె, స్విడ్జర్‌ల్యాండ్( 30 ) 10) ఎల్ఎంయూ మ్యూనిచ్, జర్మనీ( 30 ) యూరోప్‌లోని యూనివర్సిటీల్లో ఆక్స్ఫర్డ్ మొదటి స్థానం కైవసం చేసుకోగా, తర్వాతి స్థానంలో కేంబ్రిడ్జ్ నిలిచింది. వీటితో పాటూ బ్రిటన్‌కు చెందిన ఇంపీరియల్ కాలేజ్ ఆ తరువాతి స్థానంలో నిలిచి యూరోప్‌లో తొలి మూడు స్థానాలను బ్రిటన్ కైవసం చేసుకుంది. అంతే కాకుండా యూరోప్‌లో టాప్ 10 జాబితాలో ఏకంగా బ్రిటన్‌కు చెందిన ఆరు యూనివర్సిటీలకు చోటు దక్కింది. స్విడ్జర్ల్యాండ్కు చెందిన రెండు, స్వీడన్, జర్మనీకి చెందిన ఒక్కో యూనివర్సిటీలకు యూరోప్ టాప్ 10 యూనివర్సిటీల జాబితాలో చోటు దక్కింది. యూరోప్ టాప్ 10 యూనివర్సిటీల జాబితాలో బ్రిటన్ ఆధిపత్యం అప్రతిహాతంగా కొనసాగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక బ్రిటన్ లేని యూరోప్ టాప్ 10 జాబితాను పరిశీలిస్తే.. 1) ఈటీహెచ్ జ్యూరిచ్, స్విడ్జర్‌ల్యాండ్( 9) 2) కరోలిన్స్కా ఇన్స్‌స్టిట్యూట్, స్వీడన్( 28) 3)ఈకోలే పాలిటెక్నిక్ ఫెడరల్ డె లసాన్నె, స్విడ్జర్‌ల్యాండ్( 30 ) 4)ఎల్ఎంయూ మ్యూనిచ్, జర్మనీ( 30 ) 5)కేయూ ల్యూవెన్, బెల్జియం( 40 ) 6)హిడెల్ బర్గ్ యూనివర్సిటీ, జర్మనీ( 43) 7)టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్, జర్మనీ( 46) 8)హంబోల్ట్ యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్, జర్మనీ( 57 ) 9)డెఫ్ట్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, నెదర్లాండ్( 59) 10) యూనివర్సిటీ ఆఫ్ ఆమ్స్స్టర్డ్యాంమ్, నెదర్లాండ్( 63 ) బ్రిటన్ను పక్కన పెడితే ప్రపంచ టాప్ యూనివర్సిటీల జాబితాలో యూరోప్ టాప్ 10 జాబితాలో చిట్ట చివరన నిలిచిన యూనివర్సిటీ ర్యాంకు 63కు పడిపోయింది. ఈ మార్పుతో జర్మనీకి చెందిన మూడు యూనివర్సిటీలు, బెల్జియంకు చెందిన ఒక్కటి, డచ్‌కు చెందిన రెండు యూనివర్సిటీలు టాప్ 10 జాబితాలో చోటు సంపాదించాయి. పరిశోధనల్లో మెరుగైన ప్రతిభ కనబరుస్తూ జర్మనీ యూనివర్సీటీలు ముందంజలో నిలిచాయి. అయితే మిగతా యూరోపియన్ యూనివర్సిటీలు మాత్రం తమ ప్రాభవాన్ని కోల్పోయాయి. ముఖ్యంగా ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్లతో పాటూ మధ్య, తూర్పు యూరోప్‌లోని దేశాలను వెనక్కు నెట్టి ఆసియాకు చెందిన యూనివర్సిటీలు ముందుకు దూసుకొస్తున్నాయని టైమ్స్ హైయ్యర్ ఎడ్యుకేషన్ వెల్లడించింది. -
ప్రపంచంలో టాప్ 10 యూనివర్సిటీలు..
తాజాగా విడుదైలైన టాప్ విశ్వవిద్యాలయాల జాబితాలో బ్రిటన్, అమెరికాకు చెందిన యూనివర్సిటీల హవా కొనసాగింది. ప్రపంచంలో వివిధ ప్రాంతాలకు చెందిన 10వేల మంది స్కాలర్ల నుంచి తీసుకున్న ఒపీనియన్ పోల్స్ ఆధారంగా టైమ్స్ హైయ్యర్ ఎడ్యుకేషన్ ఈ ర్యాంకులను విడుదల చేసింది. టాప్ 10 జాబితాలో 8 స్థానాలను అమెరికాకు చెందిన విశ్వవిద్యాలయాలు, మిగతా రెండింటిలో బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీలు ఉన్నాయి. 2015-16 ఏడాదికి గానూ టైమ్స్ హైయ్యర్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన టాప్ 10 యూనివర్సిటీలు 1. హార్వర్డ్ యూనివర్సిటీ, యూఎస్ 2. మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ), యూఎస్ 3. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ, యూఎస్ 4. యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, యూకే 5. యనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్, యూకే 6. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బెర్క్లే, యూఎస్ 7. ప్రిన్స్టన్ యూనివర్సిటీ, యూఎస్ 8. యేల్ యూనివర్సిటీ, యూఎస్ 9. కొలంబియా యూనివర్సిటీ, యూఎస్ 10. కాలిఫోర్నియా ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యూఎస్ టాప్ 100 యూనివర్సిటీలలో 43 అమెరికాకు చెందిన యూనివర్సిటీలకు చోటు దక్కింది. హార్వర్డ్ తన మొదటి స్థానాన్ని పదిలంగా ఉంచుకుంటే, ఎంఐటీ, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలు ర్యాంకుల జాబితాలో కేంబ్రిడ్జి, ఆక్స్ఫర్డ్ యూనిర్సిటీలను అధిగమించాయి. టాప్ 10లో మిగతావి గత ర్యాంకులలో మాదిరిగా తమపాత స్థానాల్లోనే అలానే కొనసాగాయి. గత ర్యాంకుల జాబితాల్లో టాప్10లో నిలిచిన ఆసియాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ టోక్యో ఈ జాబితాలో 12వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. ఆసియాకు చెందిన 18 యూనివర్సిటీలు టాప్ 100 జాబితాలో చోటు సంపాదించగా, భారత్‌కు చెందిన ఒక్క యూనివర్సిటీ కూడా ఈ జాబితాలో చోటు దక్కలేదు.