పరిశోధనలకు మేటి విద్యా సంస్థ.. ఐఐఎస్సీ | Indian Institute of Science, Bangalore, Number one institute for research | Sakshi
Sakshi News home page

పరిశోధనలకు మేటి విద్యా సంస్థ.. ఐఐఎస్సీ

Published Thu, Sep 5 2013 1:38 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

Indian Institute of Science, Bangalore, Number one institute for research

వివిధ యూనివర్సిటీలు, సంస్థలు ప్రపంచంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలేవో తెలుసుకోవడానికి ప్రతి ఏటా నిర్వహించే సర్వేల్లో మన దేశం నుంచి చోటు దక్కించుకుంటున్న ఏకైక విద్యా సంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-బెంగళూరు. తాజాగా  షాంగై జియావో టాంగ్ యూనివర్సిటీ నిర్వహించిన 2013 టాప్-500 ప్రపంచ విద్యా సంస్థల్లో ఐఐఎస్సీ 301-400 మధ్య స్థానాల్లో నిలిచింది. అదేవిధంగా సబ్జెక్టులవారీగా చూసినప్పుడు కెమిస్ట్రీ విభాగంలో 43వ ర్యాంకు, కంప్యూటర్ సైన్స్‌లో 51-75 మధ్య స్థానాలు దక్కించుకుంది. ఇదేకాకుండా ఇతర సంస్థల సర్వేల్లోనూ ముందు వరుసలో నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ఐఐఎస్సీ అందించే కోర్సులు, అర్హతలు, ప్రవేశ విధానంపై ఫోకస్...
 
 సెన్సైస్, ఇంజనీరింగ్‌లలో పరిశోధన కోర్సులందించే సంస్థల్లో ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక సంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)-బెంగళూరు. నూరేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ సంస్థ వివిధ విభాగాల్లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ, పీహెచ్‌డీ, ఎమ్మెస్సీ (ఇంజనీరింగ్) వంటి కోర్సులను అందిస్తోంది. వీటితోపాటు రెండేళ్ల క్రితం నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్) కోర్సును ప్రవేశపెట్టింది. ప్రవేశం లభించిన విద్యార్థులందరికీ నిబంధనలకనుగుణంగా ఫెలోషిప్‌లను కూడా సంస్థ అందిస్తోంది. ఎప్పటికప్పుడు పరిశ్రమల అవసరాలను గుర్తిస్తూ నూతన కోర్సులను ప్రవేశపెట్టడంలో ఐఐఎస్సీ ముందుంటోంది.
 ఈ సంస్థ అందించే వివిధ కోర్సుల్లో విద్యనభ్యసిస్తే అత్యుత్తమ కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. శతాబ్దానికిపైగా ఉన్న చరిత్ర, అత్యుత్తమ విద్యార్హతలు ఉన్న ఫ్యాకల్టీ, ప్రముఖ విదేశీ సంస్థల ఫ్యాకల్టీల గెస్ట్ లెక్చర్స్ వల్ల ఐఐఎస్సీ మంచి విద్యా సంస్థగా వినుతికెక్కింది. దేశంలోనే అత్యుత్తమ స్థాయి లేబొరేటరీలు, లైబ్రరీ, విద్యార్థులు- ఫ్యాకల్టీ మధ్య నిష్పత్తి, పరిశోధనలకు పెద్దపీట వేయడం వంటి కారణాల వల్ల ఐఐఎస్సీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఏటా చోటు దక్కించుకుంటోంది.
 
 యూజీ కోర్సులు
 బ్యాచిలర్ ఆఫ్ సైన్స్: బయాలజీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, మెటీరియల్స్,మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, హ్యుమానిటీస్, ఇంజనీరింగ్. వ్యవధి: నాలుగేళ్లు
 అర్హత: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్నవారూ అర్హులే.
 ఎంపిక విధానం: కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై), ఇతర జాతీయ ప్రవేశ పరీక్షల్లో సాధించిన ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
 
 కోర్సు ప్రోగ్రామ్స్
 (ఎంఈ/ఎంటెక్/ఎం.డిజైన్/ఎం.మేనేజ్‌మెంట్)
 మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ (ఎంఈ): ఏరోస్పేస్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్, మెటీరియల్స్, మైక్రో ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్, సిగ్నల్ ప్రాసెసింగ్, సిస్టమ్స్ సైన్స్ అండ్ ఆటోమేషన్, టెలి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్.
 అర్హత: సంబంధిత బ్రాంచ్‌తో ద్వితీయ శ్రేణిలో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్/టెక్నాలజీ ఉత్తీర్ణతతోపాటు గేట్‌లో స్కోర్ సాధించి ఉండాలి.
 ఎంపిక: గేట్‌లో సాధించిన స్కోర్ ఆధారంగా
 మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (ఎంటెక్): క్లైమేట్ సైన్స్, కంప్యూటేషనల్ సైన్స్, ఎర్త్ సైన్స్, ఎల క్ట్రానిక్ సిస్టమ్స్ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్.
 అర్హత: సంబంధిత బ్రాంచ్‌తో ద్వితీయ శ్రేణిలో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్/టెక్నాలజీ లేదా సైన్స్, ఫిజికల్ సెన్సైస్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, జియాలజీ, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు గేట్‌లో స్కోర్ సాధించి ఉండాలి.
 ఎంపిక విధానం: కొన్ని కోర్సులకు గేట్ స్కోర్‌తోపాటు ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. కొన్ని కోర్సులకు గేట్ స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
 మాస్టర్ ఆఫ్ డిజైన్ (ఎండీఈఎస్): ప్రొడక్షన్ డిజైన్ అండ్ ఇంజనీరింగ్
 అర్హత: ద్వితీయ శ్రేణి మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్/టెక్నాలజీ/డిజైన్/ఆర్కిటెక్చర్ ఉత్తీర్ణతతోపాటు గేట్/సీడ్‌లలో స్కోర్లు సాధించి ఉండాలి.
 ఎంపిక: గేట్/సీడ్‌లలో వచ్చిన స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. వీరికి డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
 మాస్టర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఎం.ఎంజీటీ):
 అర్హత: ప్రథమ శ్రేణి మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్/టెక్నాలజీ ఉత్తీర్ణతతోపాటు గేట్/ క్యాట్/ జీమ్యాట్‌లో స్కోర్ సాధించి ఉండాలి.
 ఎంపిక విధానం: గేట్/క్యాట్/జీమ్యాట్‌లో వచ్చిన స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. వీరికి బృంద చర్చలు, మౌఖిక పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు.
 
 ఎక్స్‌టర్నల్ రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్స్
 ఈ కోర్సులు వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ఉద్దేశించినవి. వివిధ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్స్/పరిశ్రమలు, ఇంజనీరింగ్/అగ్రికల్చరల్/ఫార్మాస్యూటికల్/వెటర్నరీ/మెడికల్ కాలేజీలు/యూనివర్సిటీల ఫ్యాకల్టీలు ఈ కోర్సులు చేయడానికి అర్హులు. అయితే వీరు పనిచేసే సంస్థలు వీరిని స్పాన్సర్ చేయాలి.
 
 పీహెచ్‌డీ ఇన్ సైన్స్: న్యూరో సైన్స్, హై ఎనర్జీ ఫిజిక్స్, సాలిడ్ స్టేట్ అండ్ స్ట్రక్చరల్ కెమిస్ట్రీ మినహా అన్ని సైన్స్ డిపార్ట్‌మెంట్‌లు.
 పీహెచ్‌డీ ఇన్ ఇంజనీరింగ్: న్యూరో సైన్స్, హై ఎనర్జీ ఫిజిక్స్, సాలిడ్ స్టేట్ అండ్ స్ట్రక్చరల్ కెమిస్ట్రీ మినహా అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్‌లు.
 
 అర్హత లు:
 రెగ్యులర్ కోర్సులకు నిర్దేశించిన అర్హతా ప్రమాణాలే ఎక్స్‌టర్నల్ కోర్సులకు కూడా వర్తిస్తాయి.
 నిర్దేశిత కటాఫ్ తేదీ నాటికి 40 ఏళ్లు మించరాదు.
 ప్రస్తుతం పనిచేస్తున్న సంస్థలో రెగ్యులర్‌గా రెండేళ్లు సర్వీస్ పూర్తి చేసుకుని ఉండాలి.
 నిర్దేశిత అర్హతలతోపాటు సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్, యూజీసీ నెట్, డీబీటీ, ఎన్‌బీహెచ్‌ఎం, ఐసీఎంఆర్, గేట్‌లలో జేఆర్‌ఎఫ్ సాధించి ఉండాలి.
 ఎంపిక విధానం: నిర్దేశిత అర్హతలున్నవారిని షార్ట్‌లిస్ట్ చేసి మౌఖిక పరీక్ష నిర్వహించి కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.
 
 స్కాలర్‌షిప్స్
 ఐఐఎస్సీలో ప్రవేశం పొందిన విద్యార్థులందరికీ స్కాలర్‌షిప్స్ లభించడం విశేషం. డీబీటీ/ఐసీఎంఆర్/ ఎన్‌బీహెచ్‌ఎం/ సీఎస్‌ఐఆర్/ యూజీసీ/ ఎంహెచ్‌ఆర్‌డీ/ ఏఐసీటీఈ వంటివి అందించే స్కాలర్‌షిప్‌లతోపాటు ఇతర ఏజెన్సీలు, బహుళ జాతి సంస్థలు విద్యార్థులకు ఫెలోషిప్స్ అందిస్తున్నాయి. బీఈ/ బీటెక్/ ఎమ్మెస్సీ అర్హతతో పీహెచ్‌డీ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు మొదటి రెండేళ్లు నెలకు *16,000, తర్వాత మూడే ళ్లు నెలకు * 18,000, ఎంఈ/ ఎంటెక్ అర్హతలతో పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం పొందినవారికి మొదటి రెండేళ్లు నెలకు * 18,000; తర్వాత మూడేళ్లు నెలకు * 20,000 స్కాలర్‌షిప్ అందిస్తారు.
 
 అదేవిధంగా బీఈ/ బీటెక్/ ఎమ్మెస్సీ అర్హతతో ఎమ్మెస్సీ ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరిన వారికి నెలకు * 8,000, ఎంఈ/ ఎంటెక్/ మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సుల్లో ప్రవేశం పొందినవారికి నెలకు * 8,000 చెల్లిస్తారు. ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రవేశం లభించిన విద్యార్థులకు నెలకు మొదటి రెండేళ్లు నెలకు *10,000, ఆ తర్వాత రెండేళ్లు నెలకు * 16,000, తర్వాత మూడేళ్లు నెలకు * 18,000 స్కాలర్‌షిప్ ఇస్తారు. మాస్టర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు మాత్రం ఎలాంటి స్కాలర్‌షిప్ సదుపాయం లభించదు.
 ప్రవేశాల నోటిఫికేషన్: ప్రతి ఏటా డిసెంబర్ చివరివారం/ జనవరి. వెబ్‌సైట్: www.iisc.ernet.in
 
 
 ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్
 ఆఫర్ చేస్తోన్న విభాగాలు: బయలాజికల్ సెన్సైస్, ఫిజికల్ సెన్సైస్, కెమికల్ సెన్సైస్, మ్యాథమెటికల్ సెన్సైస్.
 అర్హత: ప్రథమ శ్రేణి మార్కులతో ఫిజికల్ సెన్సైస్, కెమికల్ సెన్సైస్, బయలాజికల్ సెన్సైస్ (ఫార్మాస్యూటికల్, వెటర్నరీ సెన్సైస్, అగ్రికల్చరల్ సెన్సైస్‌తో కలిపి), మ్యాథమెటికల్ సెన్సైస్‌లో బీఎస్సీ ఉత్తీర్ణత. బీఈ/బీటెక్ ఉత్తీర్ణులు కేవలం మ్యాథమెటికల్ సెన్సైస్‌కు మాత్రమే అర్హులు.
 ఎంపిక విధానం: ఐఐటీలు నిర్వహించే జామ్ ప్రవేశపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇందులో ప్రతిభ చూపినవారికి ప్రవేశం కల్పిస్తారు.
 
 రీసెర్చ్ ప్రోగ్రామ్స్
 (పీహెచ్‌డీ/ఎంఎస్సీ ఇంజనీరింగ్‌)
 వివిధ విభాగాల్లో ఐఐఎస్సీ పరిశోధన కోర్సులను నిర్వహిస్తోంది. ఆ వివరాలు..
 పీహెచ్‌డీ ఇన్ సైన్స్: ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్, బయో కెమిస్ట్రీ, ఎకలాజికల్ సెన్సైస్, హై ఎనర్జీ ఫిజిక్స్, ఇనార్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ, మెటీరియల్స్ రీసెర్చ్, మ్యాథమెటిక్స్, మైక్రో బయాలజీ అండ్ సెల్ బయాలజీ, మాలిక్యులర్ బయో ఫిజిక్స్, మాలిక్యులర్ రీప్రొడక్షన్, డెవలప్‌మెంట్ అండ్ జెనెటిక్స్, న్యూరో సైన్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, సాలిడ్ స్టేట్ అండ్ స్ట్రక్చరల్ కెమిస్ట్రీ.
 ఎమ్మెస్సీ (ఇంజనీరింగ్), పీహెచ్‌డీ ఇంజనీరింగ్: ఏరోస్పేస్ ఇంజనీరింగ్, అట్మాస్ఫియరిక్ అండ్ ఓషియానిక్ సెన్సైస్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఆటోమేషన్, ఎర్త్ సెన్సైస్, ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మేనేజ్‌మెంట్ స్టడీస్, మెటీరియల్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ప్రొడక్ట్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, సస్టైనబుల్ టెక్నాలజీస్, సూపర్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్.
 పీహెచ్‌డీ ఇన్ ఇంటర్ డిసిప్లినరీ ఏరియాస్: బయో ఇంజనీరింగ్, ఎనర్జీ, మ్యాథమెటికల్ సెన్సైస్, నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్.
 
 అర్హత: రీసెర్చ్ కోర్సుల్లో ప్రవేశానికి ఇంజనీరింగ్/ టెక్నాలజీ/ ఆర్కిటెక్చర్/ మెడిసిన్/ అగ్రికల్చర్/ ఫార్మసీ/ వెటర్నరీ సెన్సైస్‌లో ద్వితీయ శ్రేణిలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. లేదా బయో టెక్నాలజీలో ఎమ్మెస్సీ లేదా ఎకనామిక్స్, జాగ్రఫీ, సోషల్ వర్క్, సైకాలజీ, మేనేజ్‌మెంట్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కామర్స్, ఆపరేషన్స్ రీసెర్చ్, కంప్యూటర్ సైన్స్/ అప్లికేషన్స్‌లో ద్వితీయ శ్రేణితో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
 ఎంపిక విధానం: నిర్దేశిత కటాఫ్ తేదీ నాటికి సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ జేఆర్‌ఎఫ్/యూజీసీ నెట్ జేఆర్‌ఎఫ్/ డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ జేఆర్‌ఎఫ్/ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ జేఆర్‌ఎఫ్; జెస్ట్, ఎన్‌బీహెచ్‌ఎం లేదా ఐఐఎస్సీ ఎంట్రెన్స్ టెస్ట్ లేదా గేట్‌లో స్కోర్ సాధించి ఉండాలి.
 
 కెరీర్ స్కోప్
 
 అసిస్టెంట్ ప్రొఫెసర్స్: సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ పూర్తిచేసి.. మూడేళ్ల పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ ఎక్స్‌పీరియన్స్ ఉండి.. 35 ఏళ్లలోపు ఉన్న అభ్యర్థులు అసిస్టెంట్ ప్రొఫెసర్స్.. ఆ పైస్థాయి పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పీబీ-3 కేడర్‌లో ప్రారంభంలో పే స్కేల్ రూ.15,600 -  రూ. 39,100తోపాటు గ్రేడ్ పే రూ. 8000,ఇతర అలవెన్స్‌లుంటాయి. మూడేళ్ల సర్వీస్ తర్వాత పీబీ-4 కేడర్‌లో నెలకు రూ. 37,400 - రూ. 67,000లతోపాటు గ్రేడ్ పేగా రూ. 9,000, ఇతర అలవెన్స్‌లు అందిస్తారు.
 
 హయ్యర్ పొజిషన్స్: ప్రతిభావంతులైన విద్యార్థులను ఇన్‌స్టిట్యూట్‌లో జరిగే వివిధ ప్రతిష్టాత్మక పరిశోధన ప్రాజెక్టుల్లో నియమించడంతోపాటు డాక్టోరల్ కోర్సులు చదువుతున్న వారికి గైడ్‌గా కూడా నియమిస్తారు. పని అనుభవంతో, ప్రతిభతో అసోసియేట్ ప్రొఫెసర్‌గా నియమితులైనవారికి పీబీ-4 కేడర్‌లో నెలకు రూ. 37,400 -  రూ. 67,000లతోపాటు నెలకు రూ. 9,500 గ్రేడ్‌పే, ఇతర అలవెన్స్‌లుంటాయి. ప్రొఫెసర్‌గా నియమితులైనవారికి నెలకు రూ. 37,400 - రూ. 67,000 స్కేల్ లభిస్తుంది. గ్రేడ్ పేలో తేడా ఉంటుంది. పరిశోధనలు చేసేవారికి రీసెర్చ్ గ్రాంట్, వివిధ జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొనడానికి ఇతర ఖర్చులు చెల్లిస్తారు.
 
 క్యాంపస్ ప్లేస్‌మెంట్స్: ఇన్‌స్టిట్యూట్‌లో చదివిన విద్యార్థులకు ఇతర ప్రభుత్వ సంస్థలు, బహుళజాతి సంస్థలు, పరిశ్రమలు చక్కని ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. ఇందుకోసం ఐఐఎస్సీ ప్రత్యేకంగా ప్లేస్‌మెంట్ సెల్‌ను ఏర్పాటు చేసింది. ఈ సెల్ విద్యార్థులకవసరమైన గెడైన్స్‌ను అందించడంతోపాటు వీరికున్న కెరీర్ అవకాశాలను వివరిస్తుంది. సంబంధిత సంస్థల్లో చేరడానికి రిఫరెన్స్ ఇస్తుంది. అంతేకాకుండా వివిధ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్స్‌తో సంప్రదించి ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement