బెంగళూరు భేష్ | IT hub of Bangalore, but also the development of science hub | Sakshi
Sakshi News home page

బెంగళూరు భేష్

Published Wed, Nov 26 2014 2:40 AM | Last Updated on Thu, Sep 27 2018 3:58 PM

బెంగళూరు  భేష్ - Sakshi

బెంగళూరు భేష్

‘ఐటీ  హబ్’ మాత్రమే కాదు..
సైన్స్ హబ్‌గానూ రాణింపు
అనేక ప్రముఖ పరిశోధనా సంస్థలు ఇక్కడే
యువ శాస్త్రవేత్తలకు ఈ సదస్సు చాలా ఉపయుక్తం
సీఎన్ రావు వంటి శాస్త్రవేత్తను చూసి దేశం గర్వపడుతోంది
‘కామన్‌వెల్త్ సైన్స్ కాన్ఫరెన్స్’ ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి

 
బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరు ఐటీ హబ్‌గానే కాక సైన్స్ హబ్‌గా కూడా అభివృద్ధి చెందుతోందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభివర్ణించారు. దేశంలోనే ఎంతో ఉత్తమమైన పరిశోధనా సంస్థలు బెంగళూరులో ఉన్నాయని, ఈ సంస్థల నుంచే దేశానికే గర్వకారణమైన చాలా మంది శాస్త్రవేత్తలు భారత్‌కు లభించారని పేర్కొన్నారు. అలాంటి బెంగళూరు నగరం మొట్టమొదటి కామన్‌వెల్త్ దేశాల సైన్స్ కాన్ఫరెన్స్‌కు ఆతిథ్యమివ్వడం చాలా సంతోషంతో పాటు గర్వకారణంగా కూడా ఉందని తెలిపారు. మంగళవారమిక్కడి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్ ప్రాంగణంలోని జేఎన్ టాటా ఆడిటోరియంలో ‘కామన్‌వెల్త్ సైన్స్ కాన్ఫరెన్స్’ను  ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. కామన్‌వెల్త్ దేశాలకు చెందిన యువ శాస్త్రవేత్తలకు ఈ సమావేశం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. భారత పరిశోధనా రంగంలో ఒక తారలా మెరిసిన ప్రముఖ శాస్త్రవేత్త సీఎన్‌ఆర్ రావును చూసి భారతదేశం చాలా గర్వపడుతోందని తెలిపారు. ఆయన ఆలోచన ఈ విధంగా కార్యరూపం దాల్చడం ఎంతైనా అభినందనీయమని పేర్కొన్నారు. ఇక భారత్‌లో శాస్త్ర, సాంకేతిక రంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. ఇందులో భాగంగానే ‘ఇన్నోవేషన్ ఇన్ సైన్స్  పర్‌ష్యూ ఫర్ ఇన్‌స్పైర్డ్ రీసర్చ్’(ఐఎన్‌ఎస్‌పీఐఆర్‌ఈ-ఇన్‌స్పైర్) పేరిట శాస్త్ర సాంకేతిక రంగంలోని విద్యార్థులకు అవార్డులను అందజేస్తున్నట్లు తెలిపారు.

కామన్‌వెల్త్ దేశాల మధ్య సంబంధాలు మరింత దృఢం కావడంతో పాటు పరిశోధనలకు సంబంధించిన సమాచార వినిమయానికి ఈ సదస్సు దోహదపడుతుందని పేర్కొన్నారు. అనంతరం ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సీఎన్‌ఆర్ రావు మాట్లాడుతూ...తన జీవితంలో అధికభాగం సైన్స్ ఆక్రమించిందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సమానత్వాన్ని రూపొందించేందుకు, శాంతి, సామరస్యాలు నెలకొల్పేందుకు సైతం సైన్స్‌ను వినియోగించాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్థన్,  కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ రుడాభాయ్ వాలా, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ది రాయల్ సొసైటీ ప్రసిడెంట్ సర్ పాల్ నర్స్ తదితరులు పాల్గొన్నారు.

ఇక్కడ కూడా నిద్రేనా....

కామన్‌వెల్త్‌లోని 30కి పైగా దేశాలకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు, ప్రతినిధుల మధ్య కామన్‌వెల్త్ దేశాల చరిత్రలోనే మొట్టమొదటి సైన్స్ కాన్ఫరెన్స్‌లో దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి ప్రసంగిస్తుంటే అందరూ ఎంతో నిబద్ధతతో ప్రసంగాన్ని వింటున్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రం నిద్రలోకి జారుకున్నారు. అది వేదికపైనే.. రాష్ర్టపతి పక్కనుండగానే.. ఆయన మరెవరో కాదు మన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే. అవును, కామన్‌వెల్త్ సైన్స్ కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవ వేదికపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పక్కనే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆసీనులయ్యారు. సమావేశం ప్రారంభమైనప్పటి నుంచే ఆయన కాస్తంత నిద్రలోకి జారుతూ, మళ్లీ మేలుకుంటూ కనిపించారు. ఇక రాష్ట్రపతి ప్రసంగం ప్రారంభం కాగానే సిద్ధరామయ్య పూర్తిగా నిద్రలోకి జారుకున్నారు. దీన్ని గమనించిన వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు సిద్ధరామయ్య తీరును గురించి వింతగా మాట్లాడుకోవడం కనిపించింది. ఇక మీడియా మిత్రులైతే ‘సిద్ధరామయ్యకిది మామూలేగా’ అంటూ నవ్వుకున్నారు.
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement