Commonwealth Science Conference
-
బెంగళూరు భేష్
‘ఐటీ హబ్’ మాత్రమే కాదు.. సైన్స్ హబ్‌గానూ రాణింపు అనేక ప్రముఖ పరిశోధనా సంస్థలు ఇక్కడే యువ శాస్త్రవేత్తలకు ఈ సదస్సు చాలా ఉపయుక్తం సీఎన్ రావు వంటి శాస్త్రవేత్తను చూసి దేశం గర్వపడుతోంది ‘కామన్వెల్త్ సైన్స్ కాన్ఫరెన్స్’ ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరు ఐటీ హబ్‌గానే కాక సైన్స్ హబ్‌గా కూడా అభివృద్ధి చెందుతోందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభివర్ణించారు. దేశంలోనే ఎంతో ఉత్తమమైన పరిశోధనా సంస్థలు బెంగళూరులో ఉన్నాయని, ఈ సంస్థల నుంచే దేశానికే గర్వకారణమైన చాలా మంది శాస్త్రవేత్తలు భారత్‌కు లభించారని పేర్కొన్నారు. అలాంటి బెంగళూరు నగరం మొట్టమొదటి కామన్వెల్త్ దేశాల సైన్స్ కాన్ఫరెన్స్‌కు ఆతిథ్యమివ్వడం చాలా సంతోషంతో పాటు గర్వకారణంగా కూడా ఉందని తెలిపారు. మంగళవారమిక్కడి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్ ప్రాంగణంలోని జేఎన్ టాటా ఆడిటోరియంలో ‘కామన్వెల్త్ సైన్స్ కాన్ఫరెన్స్’ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. కామన్వెల్త్ దేశాలకు చెందిన యువ శాస్త్రవేత్తలకు ఈ సమావేశం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. భారత పరిశోధనా రంగంలో ఒక తారలా మెరిసిన ప్రముఖ శాస్త్రవేత్త సీఎన్ఆర్ రావును చూసి భారతదేశం చాలా గర్వపడుతోందని తెలిపారు. ఆయన ఆలోచన ఈ విధంగా కార్యరూపం దాల్చడం ఎంతైనా అభినందనీయమని పేర్కొన్నారు. ఇక భారత్‌లో శాస్త్ర, సాంకేతిక రంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. ఇందులో భాగంగానే ‘ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్ష్యూ ఫర్ ఇన్స్పైర్డ్ రీసర్చ్’(ఐఎన్ఎస్పీఐఆర్ఈ-ఇన్స్పైర్) పేరిట శాస్త్ర సాంకేతిక రంగంలోని విద్యార్థులకు అవార్డులను అందజేస్తున్నట్లు తెలిపారు. కామన్వెల్త్ దేశాల మధ్య సంబంధాలు మరింత దృఢం కావడంతో పాటు పరిశోధనలకు సంబంధించిన సమాచార వినిమయానికి ఈ సదస్సు దోహదపడుతుందని పేర్కొన్నారు. అనంతరం ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు మాట్లాడుతూ...తన జీవితంలో అధికభాగం సైన్స్ ఆక్రమించిందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సమానత్వాన్ని రూపొందించేందుకు, శాంతి, సామరస్యాలు నెలకొల్పేందుకు సైతం సైన్స్‌ను వినియోగించాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్థన్, కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ రుడాభాయ్ వాలా, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ది రాయల్ సొసైటీ ప్రసిడెంట్ సర్ పాల్ నర్స్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కూడా నిద్రేనా.... కామన్వెల్త్లోని 30కి పైగా దేశాలకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు, ప్రతినిధుల మధ్య కామన్వెల్త్ దేశాల చరిత్రలోనే మొట్టమొదటి సైన్స్ కాన్ఫరెన్స్‌లో దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి ప్రసంగిస్తుంటే అందరూ ఎంతో నిబద్ధతతో ప్రసంగాన్ని వింటున్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రం నిద్రలోకి జారుకున్నారు. అది వేదికపైనే.. రాష్ర్టపతి పక్కనుండగానే.. ఆయన మరెవరో కాదు మన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే. అవును, కామన్వెల్త్ సైన్స్ కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవ వేదికపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పక్కనే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆసీనులయ్యారు. సమావేశం ప్రారంభమైనప్పటి నుంచే ఆయన కాస్తంత నిద్రలోకి జారుతూ, మళ్లీ మేలుకుంటూ కనిపించారు. ఇక రాష్ట్రపతి ప్రసంగం ప్రారంభం కాగానే సిద్ధరామయ్య పూర్తిగా నిద్రలోకి జారుకున్నారు. దీన్ని గమనించిన వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు సిద్ధరామయ్య తీరును గురించి వింతగా మాట్లాడుకోవడం కనిపించింది. ఇక మీడియా మిత్రులైతే ‘సిద్ధరామయ్యకిది మామూలేగా’ అంటూ నవ్వుకున్నారు. -
నేటి నుంచి కామన్వెల్త్ సైన్స్ కాన్ఫరెన్స్
సాక్షి, బెంగళూరు: సైన్స్ పరిశోధనలపై కామన్వెల్త్ దేశాల మధ్య సహకారం పెంపొందించేందుకు ‘కామన్వెల్త్ సైన్స్ కాన్ఫరెన్స్’ మంగళవారం ప్రారంభం కానుంది. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్(ఐఐఎస్సీ) ప్రాంగణంలోని జె.ఎన్.టాటా ఆడిటోరియంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. సోమవారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో సైన్స్ కాన్ఫరెన్స్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు, ప్రముఖ శాస్త్రవేత్త, భారతరత్న ప్రొఫెసర్ సి.ఎన్.ఆర్.రావు కాన్ఫరెన్స్ వివరాలను వెల్లడించారు. 30కిపైగా కామన్వెల్త్ దేశాలకు చెందిన దాదాపు 300 మంది శాస్త్రవేత్తలు కాన్ఫరెన్స్‌కి హాజరు కానున్నారని తెలిపారు. కామన్వెల్త్ దేశాల మధ్య వైజ్ఞానిక అంశాలు, పరిశోధనల సమాచార వినిమయానికి, సైన్స్ పరిశోధనలో వెనుకంజలో ఉన్న దేశాలకు చేయూతనందించేందుకు సదస్సు దోహదపడుతుందని వివరించారు. భారత ప్రభుత్వం, యూకేకు చెందిన ది రాయల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 28 వరకు ఈ సదస్సు జరుగుతుందన్నారు. -
సైన్స్ సందడి
- నేటి నుంచి బెంగళూరులో ‘కామన్వెల్త్ సైన్స్ కాన్ఫరెన్స్’ - హాజరుకానున్న 30కి పైగా దేశాల నుంచి 300 మంది శాస్త్రవేత్తలు - నాలుగు రోజుల పాటు కొనసాగనున్న సైన్స్ కాన్ఫరెన్స్ - సమావేశాన్ని ప్రారంభించనున్న రాష్ట్రపతి సాక్షి, బెంగళూరు : కామన్వెల్త్ దేశాల మొట్టమొదటి ‘కామన్వెల్త్ సైన్స్ కాన్ఫరెన్స్’ మంగళవారం నుంచి నగరంలో ప్రారంభమవుతున్నట్లు సైన్స్ కాన్ఫరెన్స్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు, ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు తెలిపారు. సోమవారం ఆయనిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. నగరంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్ (ఐఐఎస్సీ) ప్రాంగణంలోని జేఎన్ టాటా ఆడిటోరియంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ కాన్ఫరెన్స్‌ను ప్రారంభిస్తారన్నారు. భారత ప్రభుత్వంతో పాటు యూకేకి చెందిన ది రాయల్ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో ఈ సైన్స్ కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం ప్రారంభమయ్యే ఈ కాన్ఫరెన్స్ ఈనెల 28 వరకు కొనసాగుతుందని చెప్పారు. కామన్వెల్త్ దేశాల్లోని 30కి పైగా (మొత్తం కామన్వెల్త్ దేశాల సంఖ్య 53) దేశాలకు చెందిన దాదాపు 300 మంది శాస్త్రవేత్తలు ఈ సైన్స్ కాన్ఫరెన్స్‌కి హాజరవుతున్నట్లు తెలిపారు. కామన్వెల్త్ దేశాల మధ్య వైజ్ఞానిక పరమైన అంశాలు, పరిశోధనలకు సంబంధించిన సమాచార వినిమయానికి ఈ సదస్సు చాలా ఉపయోగపడుతుందని అన్నారు. ఇక సైన్స్ విషయంలో పరిశోధనలకు సంబంధించి వెనకంజలో ఉన్న దేశాలకు సైతం చేయూతనందించేందుకు కూడా ఈ సైన్స్ కాన్ఫరెన్స్‌ను ఒక వేదిక అవుతున్నట్లు చెప్పారు వివిధ రంగాల ప్రముఖులతో చర్చాగోష్టి ఇక కామన్వెల్త్ సైన్స్ కాన్ఫరెన్స్‌లో భాగంగా నగరంలోని లలిత్ అశోకా హోటల్లో వివిధ అంశాలపై చర్చాగోష్టి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు రావు తెలిపారు. సైన్స్ కాన్ఫరెన్స్‌లో రెండో రోజైన బుధవారం ‘ఎంటర్‌పెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ ఇండియా’ అనే అంశంపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ చర్చా కార్యక్రమంలో బయోకాన్ సంస్థ చైర్మన్ కిరణ్ మజుందార్ షా(ఫార్మా), ఇన్ఫోసిస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్ఆర్ నారాయణమూర్తి (ఐటీ), ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కస్తూరిరంగన్ (స్పేస్ రీసర్చ్) ప్రసంగిస్తారని తెలిపారు. ఇక అంతర్జాతీయ సమాజాన్ని వణికిస్తున్న భయంకర ‘ఎబోలా’ వైరస్‌పై సైతం ఈ కాన్ఫరెన్స్‌లో చర్చిస్తారని ది రాయల్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ డాక్టర్ జూలీ వెల్లడించారు. అనంతరం కాన్ఫరెన్స్‌లో మూడో రోజైన గురువారం ‘రెసిలీన్స్ టు ఎక్స్ట్రీమ్ వెదర్’ అనే అంశంపై ది రాయల్ సొసైటీ రూపొందించిన రిపోర్ట్‌ను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. కరువులు, వరదల వంటి వాతావరణ విపత్తులు సంభవించే సమయాల్లో అందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాలేవో ముందుగా కనుగొనగలిగితే విపత్తును చాలా వరకు నిరోధించగలిగే అవకాశం ఉందని ఆమె తెలిపారు. ఇదే అంశంపై ది రాయల్ సొసైటీ జరిపిన పరిశోధనల నివేదికను ఈ సందర్భంగా విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.