సైన్స్ సందడి
- నేటి నుంచి బెంగళూరులో ‘కామన్‌వెల్త్ సైన్స్ కాన్ఫరెన్స్’
- హాజరుకానున్న 30కి పైగా దేశాల నుంచి 300 మంది శాస్త్రవేత్తలు
- నాలుగు రోజుల పాటు కొనసాగనున్న సైన్స్ కాన్ఫరెన్స్
- సమావేశాన్ని ప్రారంభించనున్న రాష్ట్రపతి
సాక్షి, బెంగళూరు : కామన్‌వెల్త్ దేశాల మొట్టమొదటి ‘కామన్‌వెల్త్ సైన్స్ కాన్ఫరెన్స్’ మంగళవారం నుంచి నగరంలో ప్రారంభమవుతున్నట్లు సైన్స్ కాన్ఫరెన్స్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు, ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సీఎన్‌ఆర్ రావు తెలిపారు. సోమవారం ఆయనిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. నగరంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్ (ఐఐఎస్‌సీ) ప్రాంగణంలోని జేఎన్ టాటా ఆడిటోరియంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ కాన్ఫరెన్స్‌ను ప్రారంభిస్తారన్నారు. భారత ప్రభుత్వంతో పాటు యూకేకి చెందిన ది రాయల్ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో ఈ సైన్స్ కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
మంగళవారం ప్రారంభమయ్యే ఈ కాన్ఫరెన్స్ ఈనెల 28 వరకు కొనసాగుతుందని చెప్పారు. కామన్‌వెల్త్ దేశాల్లోని 30కి పైగా (మొత్తం కామన్‌వెల్త్ దేశాల సంఖ్య 53) దేశాలకు చెందిన దాదాపు 300 మంది శాస్త్రవేత్తలు ఈ సైన్స్ కాన్ఫరెన్స్‌కి హాజరవుతున్నట్లు తెలిపారు. కామన్‌వెల్త్ దేశాల మధ్య వైజ్ఞానిక పరమైన అంశాలు, పరిశోధనలకు సంబంధించిన సమాచార వినిమయానికి ఈ సదస్సు చాలా ఉపయోగపడుతుందని అన్నారు. ఇక సైన్స్ విషయంలో పరిశోధనలకు సంబంధించి వెనకంజలో ఉన్న దేశాలకు సైతం చేయూతనందించేందుకు కూడా ఈ సైన్స్ కాన్ఫరెన్స్‌ను ఒక వేదిక అవుతున్నట్లు చెప్పారు
వివిధ రంగాల ప్రముఖులతో చర్చాగోష్టి
ఇక కామన్‌వెల్త్ సైన్స్ కాన్ఫరెన్స్‌లో భాగంగా నగరంలోని లలిత్ అశోకా హోటల్‌లో వివిధ అంశాలపై చర్చాగోష్టి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు రావు తెలిపారు. సైన్స్ కాన్ఫరెన్స్‌లో రెండో రోజైన బుధవారం ‘ఎంటర్‌పెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ ఇండియా’ అనే అంశంపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ చర్చా కార్యక్రమంలో బయోకాన్ సంస్థ చైర్మన్ కిరణ్ మజుందార్ షా(ఫార్మా), ఇన్ఫోసిస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్‌ఆర్ నారాయణమూర్తి (ఐటీ), ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కస్తూరిరంగన్ (స్పేస్ రీసర్చ్) ప్రసంగిస్తారని తెలిపారు.
ఇక అంతర్జాతీయ సమాజాన్ని వణికిస్తున్న భయంకర ‘ఎబోలా’ వైరస్‌పై సైతం ఈ కాన్ఫరెన్స్‌లో చర్చిస్తారని ది రాయల్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ డాక్టర్ జూలీ వెల్లడించారు. అనంతరం కాన్ఫరెన్స్‌లో మూడో రోజైన గురువారం ‘రెసిలీన్స్ టు ఎక్స్‌ట్రీమ్ వెదర్’ అనే అంశంపై ది రాయల్ సొసైటీ రూపొందించిన రిపోర్ట్‌ను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. కరువులు, వరదల వంటి వాతావరణ విపత్తులు సంభవించే సమయాల్లో అందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాలేవో ముందుగా కనుగొనగలిగితే విపత్తును చాలా వరకు నిరోధించగలిగే అవకాశం ఉందని ఆమె తెలిపారు. ఇదే అంశంపై ది రాయల్ సొసైటీ జరిపిన పరిశోధనల నివేదికను ఈ సందర్భంగా విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.