సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ ఐటీ సంస్థపై బెంగళూరులోని కోరమంగళ పోలీసులు కేసు నమోదు చేశారు. తమ వద్ద 274 ల్యాప్‌టాప్స్ అద్దెకు తీసుకుని మోసం చేశారంటూ ఆ ప్రాంతానికి చెందిన కఠాన్ షా ఫిర్యాదు మేరకు అధికారులు దీన్ని రిజిస్ట్రర్ చేశారు. కఠాన్ షా కోరమంగళ ప్రాంతంలోని స్ఫుర్జ్ ఐటీ సరీ్వసెస్ (ఓపీసీ) ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ సంస్థ అనేక మంది వ్యక్తులతో పాటు సంస్థలకు ల్యాప్‌టాప్‌లు అద్దెకు ఇస్తుంటుంది.
కరోనా ప్రభావంతో అమల్లోకి వచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్‌తో తమ సేవల్ని ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. వీరికి గత ఏడాది హైదరాబాద్‌కు చెందిన ఫెబ్‌ట్రాక్స్ సంస్థ నుంచి ఓ ఈ–మెయిల్ వచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్‌తో పాటు విస్తరణ కోసం తమకు 274 అత్యాధునిక ల్యాప్‌టాప్‌లు కావాలంటూ కోరారు. ఆ సంస్థకు చెందిన ప్రతినిధులుగా చెప్పుకొన్న రాజేష్, రవి పలుమార్లు బెంగళూరుకు వెళ్లి కఠాన్ షాతో సంప్రదింపులు జరిపారు.
అద్దెలు ఖరారు చేసుకున్న తర్వాత ఒప్పందాలు రాసుకున్నారు. వీటి ప్రకారం స్ఫుర్జ్ సంస్థ నుంచి ఫెబ్‌ట్రాక్స్‌కు 274 ల్యాప్‌టాప్స్ అందాయి. తొలుత కొన్ని నెలల పాటు అద్దెను సక్రమంగా చెల్లించిన హైదరాబాద్ సంస్థ ఆ తర్వాత ఆపేసింది. దీనికి సంబంధించి కఠాన్ పలుమార్లు ప్రశ్నించిన సిటీ సంస్థ నుంచి సరైన స్పందన లేదు. దీంతో తమ ల్యాప్‌టాప్‌లు తిరిగి ఇచ్చేయాల్సిందిగా కోరినా ఫెబ్‌ట్రాక్స్ పట్టించుకోలేదు. ఈ పరిణామాలతో అనుమానం వచ్చిన కఠాన్ ఈ ఏడాది ఫిబ్రవరి 24న హైదరాబాద్‌కు వచ్చి ఫెబ్‌ట్రాక్స్ సంస్థ తమ చిరునామాగా చెప్పిన ప్రాంతానికి వెళ్లారు.
ఈ నేపథ్యంలోనే రాజేష్ ఆ సంస్థ వేరే వారికి విక్రయించినట్లు తెలిసింది. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన కఠాన్ షా గత వారం కోరమంగళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మోసంతో తాను రూ.70 లక్షలకు పైగా నష్టపోయినట్లు అందులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న కోరమంగళ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కేసు విచారణలో భాగంగా ప్రత్యేక టీమ్‌ను త్వరలో సిటీకి పంపనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment