విభజన హామీలు అమలు చేయాల్సిందే.. | Division guarantees should be implemented | Sakshi
Sakshi News home page

విభజన హామీలు అమలు చేయాల్సిందే..

Published Mon, Jul 17 2017 4:19 AM | Last Updated on Tue, Oct 16 2018 3:40 PM

విభజన హామీలు అమలు చేయాల్సిందే.. - Sakshi

విభజన హామీలు అమలు చేయాల్సిందే..

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను, రాజ్యసభలో అప్పటి ప్రధాని ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని అమలు చేయాల్సిందేనని వైఎస్సార్‌సీపీ కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. సోమవారం నుంచి వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకా నున్న నేపథ్యంలో ఆదివారం పార్లమెంటు లైబ్రరీ హాల్‌లో అఖిలపక్ష సమావేశం జరిగింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అరుణ్‌ జైట్లీ, రాజ్‌నాథ్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ తరఫున పార్టీ లోక్‌సభా పక్షనేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వి.వి జయసాయిరెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం లాంటివాటితో పాటు విభజన హామీలన్నింటినీ త్వరితంగా అమలు చేయాలని కోరామన్నారు. సరైన వర్షపాతం లేక రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రైతులకు పంట చేతికందడం లేదని, పండిన అరకొరా పంటకు సైతం సరైన ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.కేంద్ర ం రైతులను ఆదుకొనేందుకు స్వామినాథన్‌ సిఫార్సులకు అనుగుణంగా పెట్టుబడిపై యాభై శాతం అధికంగా మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. నదీ జలాల పంపకాలను కేంద్రమే చేపట్టడం వల్ల నదీ పరీవాహక ప్రాంతాల్లోని రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని తెలియజేశామన్నారు.  జీఎస్టీ నుంచి హ్యాం డ్‌లూమ్,టెక్స్‌టైల్‌ రంగాలకు మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామన్నారు.
 
ఫిరాయింపుల నిరోధక చట్టంలో లొసుగుల్ని సవరించండి..
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఉన్న లొసుగులను సవరించాలని కేంద్రాన్ని కోరినట్టు మేకపాటి తెలిపారు. ఈ చట్టంలో ఫిరాయింపుదారులపై ఎన్నిరోజుల్లో చర్యలు తీసుకోవాలి అన్న విషయంలో నిర్దిష్ట గడువు ఏదీ విధించలేదన్నారు. దీనివల్ల పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు కోరినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఫిరాయింపుదారులపై మూడు మాసాల్లో చర్యలు తీసుకొనే విధంగా చట్ట సవరణ చేయాలని కోరామన్నారు. అన్ని పార్టీల అభిప్రాయాలను సావధానంగా విన్న ప్రధాని మోదీ.. అందరి విజ్ఞప్తులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. సోమవారం రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్‌ జరగనున్న నేపథ్యంలో వైఎస్సార్‌ సీపీ ఎంపీలు ఉదయం మేకపాటి నివాసంలో సమావేశం కానున్నారు. అనంతరం అందరూ కలసి పార్లమెంటుకు వెళ్లి ఓటింగ్‌లో పాల్గొంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement