'దేశ రక్షణ విషయంలో కేంద్రానికి అండగా ఉంటాం'
ఢిల్లీ :
పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఆదివారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో జరిగిన ఈ సమావేశానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో రైతుల సమస్యలు, ప్రత్యేక హోదా, రైల్వేజోన్, కృష్ణా జలాల పంపకాలు, చేనేత, చిన్నతరహా పరిశ్రమలకు జీఎస్టీ మినహాయింపు, ఫిరాయింపు నిరోధక చట్ట సవరణ తదితర అంశాలను వారు ప్రస్తావించారు.
'రాష్ట్రంలో నెలకొన్న రైతు సమస్యలను లేవనెత్తాము. మిర్చికి గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏపీలో ఈశాన్య రుతుపవనాల వల్ల వర్షాలు పడలేదు. పంటలకు మద్దతు ధర కల్పించాలని కోరాము. నిష్పత్తి ప్రకారం నీటి పంపకాలు జరపాలని సూచించాము. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ సహా అన్ని హామీలు అమలు చేయాలని చెప్పాము. ఫిరాయింపు నిరోధక చట్టానికి సవరణ చేయాలని కోరాము' అని మేకపాటి రాజమోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
కాగా, అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారన్నారు. సభ సజావుగా నడిపేందుకు సహకరించాలని మోదీ కోరారని తెలిపారు. దేశ రక్షణ, ప్రజా సంక్షేమం విషయంలో కేంద్రానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటామన్నారు. చర్చల ద్వారా ఇండో-చైనా సరిహద్దు సమస్యను పరిష్కరించాలని కోరామని తెలిపారు. ఈ భేటీలో ప్రధాని నరేంద్రమోదీతోపాటు కేంద్రమంత్రులు, పలువురు ప్రతిపక్ష పార్టీలు నేతలు పాల్గొన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.