విజయవాడ, న్యూస్‌లైన్ : రాష్ర్ట విభజన జరిగితే విద్యుత్ రంగం తీవ్ర సంక్షోభం ఎదుర్కోవలసి వస్తుందని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఆర్.సాయిబాబా అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విభజన జరిగితే సీమాంధ్ర ప్రాంతంలోని విద్యుత్ కేంద్రాలు మూతపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తే థర్మల్ కేంద్రాలకు బొగ్గును దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని చెప్పారు.
ఇప్పటికే విద్యుత్ చార్జీల భారం అధికంగా ఉందని, బొగ్గును దిగుమతి చేసుకోవాల్సి వస్తే మరింత భారం పడుతుందన్నారు. ఇక జల విద్యుత్ కేంద్రాలు ఉనికి కోల్పోవలసి వస్తుందని తెలిపారు. అందువల్లే రాష్ట్ర విభజనను విద్యుత్ ఉద్యోగుల జేఏసీ వ్యతిరేకిస్తుందని చెప్పారు. విద్యుత్ సంక్షోభం తలెత్తకుండా ఉండాలంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమొక్కటే శరణ్యమని తెలిపారు. 16వ తేదీనే తాము సమ్మె నోటీసు ఇచ్చామన్నారు. ప్రభుత్వం చర్చలు జరుపుతుందని, అవి విఫలమైతే సెప్టెంబర్ 2 తర్వాత ఏ రోజైనా తాము నిరవధిక సమ్మెకు దిగే అవకాశాలున్నా యని చెప్పారు.
ప్రభుత్వానికి ఆగస్టు 30 డెడ్‌లైన్ విధించామని చెప్పారు. ఆలోగా సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలని, ఆంటోని కమిటీని రద్దుచేసి విభజన ప్రకటన వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో మంత్రులు, ఎంపీల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తామన్నారు. సెప్టెంబర్ 2వ తేదీ తర్వాత తాము చేపట్టబోయే నిరవధిక సమ్మెతో రాష్ట్రం అంధకారమవుతుందన్నారు. గ్రిడ్ ట్రిప్ చేస్తే హైదరాబాద్‌తోపాటు చైన్నై, కర్నాటక రాష్ట్రాలకూ విద్యుత్ సరఫరా నిలిచి పోతుందన్నారు.
విద్యుత్ ఉద్యోగుల సహనాన్ని పరిక్షీంచడం మాని ప్రభుత్వం తక్షణమే విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పీ శ్రీనివాసరావు, కో కన్వీనర్ సీహెచ్.సాయిబాబు, ఎం.పూర్ణచంద్రరావు, వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి సత్యానందం తదితరులు పాల్గొన్నారు.
విభజన జరిగితే విద్యుత్ సంక్షోభమే
Published Sat, Aug 24 2013 12:54 AM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM
Advertisement