దివాకర్‌ ట్రావెల్స్‌ డ్రైవర్‌ అసభ్య ప్రవర్తన | Diwakar Travels Bus Driver Misbehaviour With Lady Passenger | Sakshi
Sakshi News home page

దివాకర్‌ ట్రావెల్స్‌ డ్రైవర్‌ అసభ్య ప్రవర్తన

Published Wed, Feb 20 2019 10:09 AM | Last Updated on Wed, Feb 20 2019 10:09 AM

Diwakar Travels Bus Driver Misbehaviour With Lady Passenger - Sakshi

డ్రైవర్‌తో బాధితురాలికి క్షమాపణ చెప్పిస్తున్న దృశ్యం

సాక్షి, అమరావతి బ్యూరో : హైదరాబాద్‌ నుంచి విజయవాడకు టికెట్‌ బుక్‌ చేసుకున్న ఓ మహిళా ప్రయాణికురాలిపై డ్రైవర్‌ చేయి చేసుకున్న ఘటన మంగళవారం హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఆపై దారి పొడవునా తిడుతూ.. నీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు గురిచేసిన వైనంపై ఆ ప్రయాణికురాలు ‘సాక్షి’కి వెల్లడించిన వివరాలు మేరకు.. విజయవాడకు చెందిన ఉప్పలపాడు లత తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఆమె మంగళవారం విజయవాడకు వచ్చేందుకు అభీబస్‌ యాప్‌ ద్వారా దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సులో టికెట్‌ బుక్‌ చేశారు. ఆ బస్సు కొండాపూర్‌ నుంచి మధ్యాహ్నం 2.20 గంటలకు  బయలుదేరాల్సి ఉంది. అయితే ఆ సమయానికి బస్సు అక్కడికి చేరుకోకపోవడంతో ఆమె మరో స్టేజ్‌ అయిన గచ్చిబౌలికి తన మిత్రుడి సాయంతో కారులో చేరుకున్నారు.

అక్కడికి కూడా బస్సు సమయానికి రాకపోవడంతో అభీబస్‌కు ఫోన్‌ చేసి విషయం చెప్పారు. దీంతో వారు బస్సు డ్రైవర్‌తో మాట్లాడించే ప్రయత్నం చేయగా.. టోలిచౌక్‌ దాటిందని.. లక్డీకపూల్‌ రావాలని డ్రైవర్‌ సమాధానం చెప్పి ఫోన్‌ పెట్టేశాడు. లక్డీకపూల్‌కు చేరుకున్న లత అక్కడ బస్సు ఆపకపోవడంతో మెహదీపట్నం వరకు కారులో ఛేజ్‌ చేసి బస్సుకు అడ్డంగా నిలవగా.. బస్సు డ్రైవర్‌ ఆమెను  పత్రికలో రాయలేని భాషలో తిట్టడం ప్రారంభించాడు. ఈ మాటలు బయట ఉన్న ఆమెకు వినిపించలేదు. బస్సు ఎక్కాక ఆమెతో పాటు అతని స్నేహితుడిని సైతం ఇదే పద్ధతిన తిడుతుండటంతో ఆమె డ్రైవర్‌పై చేయి చేసుకుంది. దీంతో డ్రైవర్‌ సైతం ఆమెపై చేయి చేసుకుని.. బూతులు తిట్టాడు. ఇదంతా బస్సులో ప్రయాణిస్తున్న కొందరు వీడియో కూడా తీశారు. ఇదే విషయంపై ఆమె 100కు ఫోన్‌ చేయగా వారు సూర్యరావుపేట పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఆమెతో ఫోన్‌ మాట్లాడి.. ఇక్కడ బస్సు ఆపితే అందరూ ఇబ్బంది పడతారని.. కాబట్టి మీరు విజయవాడకు వెళ్లాక అక్కడే కేసు నమోదు చేయాలని సూచించారు. ఆ తర్వాత ఆమె వీడియోను.. జరిగిన విషయాన్ని లత తన తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి చెప్పగా ఆమె బంధువులంతా గవర్నరుపేటలోని మమతా హోటల్‌ సమీపంలో బస్సు ఆగగానే డ్రైవర్, అతని సహాయకుడిపై విరుచుకుడి దేహశుద్ధి చేశారు. 

అనంతరం వారిద్దరితో ఆమె కాళ్లు పట్టించి క్షమాపణలు చెప్పించారు. ఇలాగే ఎవరితోనూ వ్యవహరించకూడదని డ్రైవర్‌కు బుద్ధి చెప్పినట్లు లత తండ్రి మీడియాకు వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement