ప్రజల ఆకాంక్షల మేరకే ధర్నా
చంద్రబాబు ప్రభుత్వం హామీలన్నీ నిలబెట్టుకునేంత వరకు వైఎస్సార్ సీపీ పోరాడుతుందని..ప్రజల ఆకాంక్షల మేరకే డిసెంబర్ 5న ఒంగోలు కలెక్టరేట్ వద్ద మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ తెలిపారు.
ఒంగోలు: ‘సామాజిక కార్యకర్తల పేరుతో టీడీపీ తరఫున పోటీచేసి ఓడిపోయిన వారిని నియమించారు. తమకు ఓట్లేయని వారిని గుర్తించి వారిపై కక్ష తీర్చుకునే అవకాశం కల్పించడం కోసమే గ్రామ, మండల కమిటీల్లో స్థానం కల్పించారు. 70 ఏళ్ల అవ్వా, తాతలనే కాకుండా 90 శాతం వికలత్వం ఉన్నవారికి కూడా పెన్షన్లలో కోత పెట్టారు. ఇటువంటి దుర్మార్గాలను చూస్తూ ఉండలేక..వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపునకు స్పందించి జిల్లాలోని వృద్ధులు, రుణమాఫీ అవుతుందని నమ్మి మోసపోయిన రైతన్నలు అంతా డిసెంబర్ 5వ తేదీ ఒంగోలు కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాకు తరలిరావాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సంతనూతలపాడు శాసనసభ్యుడు ఆదిమూలపు సురేష్ పిలుపునిచ్చారు.
ధర్నా వాల్‌పోస్టర్‌ను స్థానిక కర్నూల్‌రోడ్డులోని తన కార్యాలయంలో ఆదివారం రాత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్లను 5 రెట్లు పెంచామని గొప్పలు చెబుతున్నారే కానీ, తీసేసిన పెన్షన్లు ఎన్ని అనేది లెక్కచెప్పడం లేదని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 9.16 లక్షల మంది పెన్షన్లు తీసేశారని, అందులో జిల్లాకు సంబంధించి 70 వేల పెన్షన్లు ఉన్నాయన్నారు. ఒక్క సంతనూతలపాడు నియోజకవర్గంలోనే 4500 ఉన్నాయని, వీటిపై తిరిగి దరఖాస్తు చేసుకున్నా మళ్లీ గ్రామకమిటీలకు పంపుతామంటూ అధికారులు చెప్పడం అర్థరహితమన్నారు.
పోయిన పెన్షన్లలో అత్యధికం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలవేనన్నారు. లక్షకోట్ల రుణాలపై నేడు మరో రూ.14 వేల కోట్లు అపరాధ రుసుము పెనుభారంగా మారిందని, రుణమాఫీ చేస్తామంటూ ప్రకటనలే కానీ, ఎప్పుడు తీరుస్తారో...ఎలా తీరుస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరో వైపు ఇంటింటికీ ఉద్యోగం ఇస్తామని, అలా కాని పక్షంలో ప్రతినెలా రూ.2 వేలు నిరుద్యోగభృతి ఇస్తామన్న ప్రభుత్వం ఆ హామీనే పట్టించుకోకపోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోందన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తొలగింపునకు గురైన ప్రతి ఒక్కరి పెన్షన్ పునరుద్ధరించేంత వరకు, ప్రతి రైతుకు రుణమాఫీ చేసేంత వరకు, చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేంత వరకు నిరంతర పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పారు.
ఇప్పటికే టీడీపీకి ఓట్లు వేసి దగాకు గురైన వారు ఎంతోమంది తమ చెప్పులతో తామే కొట్టుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయని, ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై పార్టీలకు అతీతంగా ధర్నాకు కదిలిరావాలని కోరారు. ప్రభుత్వం చేస్తున్న వంచనలు, దుర్మార్గాలకు వ్యతిరేకంగా 2015 జనవరి 6,7 తేదీల్లో గోదావరి జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టనున్న దీక్షలను కూడా జయప్రదం చేయాలని ఈ సందర్భంగా ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట వివిధ మండలాల పార్టీ కన్వీనర్లు దుంపా చెంచిరెడ్డి, మండవ అప్పారావు, దివి పున్నారావు, మద్దిపాడు మాజీ సర్పంచ్ సంజీవరావు, జీ.ఓబుల్‌రెడ్డి, దేవిరెడ్డి కృష్ణారెడ్డి ఉన్నారు.