న్యాయం చేయండి | Do justice | Sakshi
Sakshi News home page

న్యాయం చేయండి

Published Thu, Jul 24 2014 12:01 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

న్యాయం చేయండి - Sakshi

న్యాయం చేయండి

సాక్షి, గుంటూరు: ‘మేం పైసా పైసా కూడబెట్టుకోని స్థలం కొనుకున్నాం. అప్పు, సప్పు చేసి లోన్లు పెట్టుకొని, కష్టార్జితంతో ఇల్లు కట్టుకొన్నాం. 30,40 ఏళ్లుగా నివాసం ఉంటున్నాం. ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఇళ్లు ఖాళీ చేయాలని దౌర్జ్యనం చేస్తున్నారు. ఆడవాళ్లను కూడా దారుణంగా బెదిరిస్తున్నారు’ అని మంగళగిరి నియోజకవర్గం యర్రబాలెం అంబటినగర్  కాలనీ వాస్తవ్యులు వాపోయారు.
 
 స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వారంతా బుధవారం కలెక్టర్ కాంతిలాల్ దండేను కలిసి సమస్యను వివరించారు. భూమికి సంబంధించిన రికార్డులను కలెక్టర్‌కు చూపించారు.1967లొనే ఫ్లాట్లకు పంచాయతీ నుంచి అనుమతి పొందామని వివరించారు. ఇప్పుడు సింగ్‌నగర్ నుంచి  రౌడీలు వచ్చి స్థలాలు ఖాళీ చేయాలని  బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంటి గేట్లు తోసుకొని లోపలికి వచ్చేస్తున్నారని, సింగ్‌నగర్ వచ్చి మాట్లాడాలని వేధిస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసుల ద్వారా రక్షణ కల్పించాలని వేడుకున్నారు. రికార్డులు పరిశీలించి  న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
 
 బాధితులకు అండగా నిలిచిన ఆర్కే..
 అంబటినగర్‌కాలనీవాసులకు స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అండగా నిలిచారు. కాలనీవాసులు 20వ తేదీన విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. నకిలీ ధృవపత్రాలు సృష్టించి,  సబ్‌రిజిస్టార్‌పై ఒత్తిడి తెచ్చి రెండెకరాల స్థలాన్ని రిజిస్టర్ చేయించుకున్నారని వివరించడంతో స్పందించిన ఎమ్మెల్యే వెంటనే మంగళగిరి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి ఆరా తీశారు. బాధితులకు తగిన రక్షణ కల్పించాలని స్థానిక డీఎస్పీకి విజ్ఞప్తి చేశారు. బుధవారం బాధితులతో కలిసి కలెక్టర్‌కు ఆయన సమస్యను వివరించారు.
 
 కలెక్టర్ వెంటనే జిల్లా రిజిస్ట్రార్‌కు ఫోన్‌చేసి భూమి రికార్డులు తీసుకురావాలని సూచించారు. బాధితుల తరఫున న్యాయం ఉందని తేలితే ఆ ప్రాంతంలో తాత్కాలికంగా రిజిస్ట్రేషన్లు కూడా నిలుపుదల చేస్తామని హామీఇచ్చారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఆర్కే విలేకర్లతో మాట్లాడుతూ కాలనీలో మధ్యతరగతి ప్రజలు, విశ్రాంత ఉద్యోగులు 50 ఏళ్లుగా ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారని చెప్పారు. ఇప్పుడు విజయవాడ నుంచి కొంతమంది వచ్చి దౌర్జన్యంగా ఇళ్లు ఖాళీ చేయమంటున్నారన్నారు. బాధితులకు న్యాయం జరిగేవరకూ అండగా ఉండి పోరాటం చేస్తామని పేర్కొన్నారు.
 
 అవసరమైతే హైకోర్టును ఆశ్రయించి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.పాతగుంటూరు : కాలనీలోని 783ఎ, బి, సి సర్వేనంబర్లలో మొత్తం 11. 20 ఎకరాలు భూమి ఉంది. అందులో  విశాంత ఉద్యోగులు స్థలాలను కొనుగోలు చేసుకుని ఇళ్లు నిర్మించుకొని 150 కుటుంబాలు జీవిస్తున్నాయి. వారం రోజుల క్రితం కొందరు వ్యక్తులు వచ్చి ఇది ఓ జడ్జికి చెందిన భూమి అని బెదిరింపులకు దిగారు. అప్పటి నుంచి రోజు రోజుకు బెదిరింపులు పెరుగుతున్నాయి. ఆ వివరాలుబాధితుల మాటల్లోనే...
 
 రాజధాని ప్రచారంతోనే..
 రాజధాని అని ప్రచారం జరగటంతో ఈ ప్రాంతాల్లో భూదందాలు జరుగుతున్నాయి. 20 సంవత్సరాలుగా ఇక్కడే జీవనం కొనసాగిస్తున్నాం. నంబర్ ప్లేట్లు లేని కారుల్లో కొందరు రౌడీలు వచ్చి భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కూడా భూమి మేడందంటూ బెదిరిస్తున్నారు. మాకు న్యాయం చేయాలి.         
 - తాడేపల్లి లలిత
 
 ఎలా బతకాలి..
 50 సంవత్సరాల క్రితం  చాలీచాలని జీతాలతో తినితినక స్థలాలు కొనుగోలు చేసి గృహాలు నిర్మించుకున్నాం.ఇప్పుడు  ఖాళీచేయాలని బెదిరించటంతో ఎలా బతకాలో అర్థంకావటంలేదు. నా భర్త వికలాంగుడు. వికలాంగ పింఛన్‌తో జీవిస్తున్నాం. న్యాయం చేయాలి.
 - జానపాటి ఆదిలక్ష్మి
 
 పూర్తి పత్రాలు ఉన్నాయి
 న్యాయాన్ని కాపాడాల్సిన జడ్జి ఇటువంటి అక్రమాలకు పాల్పడుతుంటే మాలాంటి వారు ఎలా జీవించాలో అర్థంకావటంలేదు. పూర్తి పత్రాలు మా దగ్గర ఉన్నాయి. అయినా  మళ్లీ ఏవిధంగా రిజిస్టర్ చేస్తారు. దీనిపై విచారణ చేసి అధికారులు న్యాయం చేయయాలి.
 - తమ్మ తార
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement