అర్హులందరికీ న్యాయం చేస్తాం
సంగం: అర్హులైన పింఛన్‌దారులందరికీ న్యాయం చేస్తామని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి భరోసా ఇచ్చారు. మండలంలోని జెండాదిబ్బ, అన్నారెడ్డిపాళెం, దువ్వూరు, మక్తాపురం గ్రామాల్లో వారు బుధవారం విస్తృతంగా పర్యటించి గ్రామీణలు సమస్యలను తెలుసుకున్నారు.
ఈ నాలుగు గ్రామాల్లో నిర్వహించిన సభల్లో వారు మాట్లాడుతూ అర్హత ఉండి పింఛన్ కోల్పోయిన వారికి సంబంధిత అధికారులతో మాట్లాడి న్యాయం చేసేలా చర్యలు చేపడతామన్నారు. భూమిలేని నిరుపేదలకు భూమి ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయిస్తామన్నారు. తాము అండగా ఉంటామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఏ సమస్యనైనా తమ దృష్టికి తేవాలని సూచించారు. గ్రామవీధుల్లో నడుస్తూ సమస్యలపై ఆరా తీశారు.
అన్నారెడ్డిపాళెంలో డ్రైనేజీ నిర్మాణానికి కృషి చేస్తామన్నా. గ్రంథాలయ మరమ్మతులకు నిధులు మంజూరు అంశాన్ని పరిశీలిస్తామని వారు హామీ ఇచ్చారు. దువ్వూరులో పలువురు వృద్ధులు, వితంతువులు, దళితులు, గిరిజనులు తమ సమస్యలను వారి దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మక్తాపురంలో ఇందిరమ్మ గృహాలు మంజూరు కాలేదని, ఎంతో కాలంగా కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకునే నాథులే లేరని బాధితులు వాపోయారు.
ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు నిలిపివేస్తున్నారని, పథకాన్ని పునరుద్ధరించగానే అర్హులకు ఇళ్లు మంజూరు చేసేలా కృషి చేస్తామన్నారు. ఎంపీ ల్యాడ్స్ నిధులు మంజూరుచేసిన రహదారులు వేసే ప్రాంతాలను కూడా వారు పరిశీలించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి మల్లు సుధాకర్ రెడ్డి, సంగం జెడ్పీటీసీ దేవసహాయం, సంగం మండల ప్రచార కమిటీ కన్వీనర్ మెట్టుకూరు వాసుదేవరెడ్డి, సూరి మదన్‌మోహన్‌రెడ్డి, కోటంరెడ్డి బాలకృష్ణారెడ్డి, దగ్గుమాటి మధుసూదన్ రెడ్డి, పులంగం శంకర్‌రెడ్డి, షేక్ మైమున్నీసా, రఘునాథరెడ్డి, జెక్కా సుబ్బారెడ్డి, యానాదిరెడ్డి, ఫణికుమార్‌రెడ్డి, మనోజ్ రెడ్డి, సుధాకర్‌రెడ్డి, సూరి ఇందిరమ్మ, ఎంపీటీసీ సభ్యులు రంగయ్య, లక్ష్మీప్రసన్న, ముడి మల్లికార్జునరెడ్డి, శంకరయ్య, చిన్నా, మోహన్, దయాకర్ రెడ్డి, ఓబుల్, వెంకటేశ్వర్లు రెడ్డిపాల్గొన్నారు.