ఎన్నికల విధుల్లో వివక్ష వద్దు | Do not want to discrimination on election duty | Sakshi
Sakshi News home page

ఎన్నికల విధుల్లో వివక్ష వద్దు

Published Wed, Apr 2 2014 3:19 AM | Last Updated on Sat, Sep 2 2017 5:27 AM

Do not want to discrimination on election duty

 ఒంగోలు, న్యూస్‌లైన్ : ఎన్నికల విధుల నిర్వహణలో ఎటువంటి వివక్షకు తావుండరాదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ్‌కుమార్ సంబంధిత అధికారులు, సిబ్బందికి స్పష్టం చేశారు. ఎన్నికల విధులకు సంబంధించి ఏమైనా ఆరోపణలు వస్తే వారిపై విచారణ తప్పదని హెచ్చరించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ అధికారులతో స్థానిక రంగాభవన్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

 ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులతోగానీ, రాజకీయ పార్టీలతోగానీ ఒప్పందా లు చేసుకుని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (ఎంసీసీ)ను అమలు చేసే సమయంలో పూర్తిస్థాయిలో నిబద్ధతతో వ్యవహరించాలన్నారు. ఎక్కడైనా అధికారులు, ఉద్యోగులు ఒక పార్టీకిగానీ, ఒక అభ్యర్థికిగానీ అనుకూలంగా వ్యవహరిస్తే విచారణకు ఆదేశిస్తామని తెలిపారు. స్వతంత్ర దర్యాప్తులో ఆరోపణ వాస్తవమని తేలితే కఠిన చర్యలు తప్పవని చెప్పారు.

 జిల్లాలో 2,881 పోలింగ్ కేంద్రాలు...
 ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు జిల్లాలో 2,805 పోలింగ్ కేంద్రాలు, వాటికి అనుబంధంగా మరో 76 పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. ఒక సమస్యాత్మక పోలింగ్ స్టేషనున్న గ్రామాలు 1,278, రెండు సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లున్న గ్రామాలు 380, ఐదు, అంతకంటే ఎక్కువ సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లున్న గ్రామాలు 18 ఉన్నాయని వివరించారు. అయితే, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకుగానూ 35 పారామిలటరీ బలగాలు జిల్లాకు రానున్నాయన్నారు. ఒక్కో కంపెనీలో 3 ప్లటూన్లు ఉంటాయని, ఒక్కో ప్లటూన్లో 3 సెక్షన్లు ఉంటాయని పేర్కొన్నారు.

ప్రతి సెక్షన్‌లోనూ ఒక అధికారి, మరో 8 మంది సాయుధ సిబ్బంది ఉంటారని వెల్లడించారు. వారంతా స్థానికంగా ఉన్న పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో పనిచేస్తారన్నారు. అయితే, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలను ముందుగానే గుర్తించి సంబంధిత గ్రామాల్లో ఎంపీడీవో, తహసీల్దారు, పోలీసు అధికారులు కలిసి సమన్వయంతో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేలా చర్య లు తీసుకోవాలని సూచించారు. అవాంఛనీయ సంఘటనలు జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ముందుగా పోలీసు కవాతు నిర్వహించి హెచ్చరికలు జారీచేయాలని చెప్పారు. గతంలో ఎన్నికల సమయంలో నేరాలకు పాల్పడిన వారిని బైండోవర్ చేయాలని, అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

 నగదు, మద్యం పంపిణీపై దృష్టిపెట్టాలి...
 రాష్ట్రవ్యాప్తంగా పరిశీలిస్తే నగదు, మద్యం నిల్వల సీజ్ విషయంలో మనజిల్లా వెనుకబడి ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ నెల 6, 11 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల దృష్ట్యా ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిస్టికల్ సర్వైవలెన్స్ కమిటీలు పకడ్బందీగా వ్యవహరించి నగదు, మద్యం పంపిణీ, నిల్వలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ రెండు కమిటీల్లో నిత్యం వీడియో గ్రాఫర్ అందుబాటులో ఉండాలన్నారు. తనిఖీల సమయంలో పూర్తిస్థాయిలో వీడియో తీయించాలన్నారు. కేవలం నగదు, మద్యం కోసమే కాకుండా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద యూనిఫాం కలిగిన పోలీసు సిబ్బంది ఒకరుంటారని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఒక అధికారి, మరో ఇద్దరు సిబ్బంది, అత్యంత సమస్యాత్మక కేంద్రాల వద్ద ఒక అధికారి, నలుగురు సాయుధ సిబ్బంది ఉంటారని కలెక్టర్ వివరించారు.

 ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ దేవకుమార్ మాట్లాడుతూ తమశాఖ ఇప్పటికే దాడులను తీవ్రం చేసిందని తెలిపారు. గట్టి నిఘా కూడా పెట్టినట్లు తెలిపారు. గత నెలలో లక్ష్యం కన్నా తక్కువ శాతం మద్యం విక్రయాలు జరిగాయన్నారు. యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు తదితర ప్రాంతాల్లో నాటుసారా తయారుచేసే అవకాశం ఉందని, అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ యాకూబ్‌నాయక్, అదనపు జాయింట్ కలెక్టర్ ప్రకాష్‌కుమార్, డీఆర్‌వో గంగాధర్‌గౌడ్, జిల్లా పరిషత్ ఏవో ఎం.వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement