మాట్లాడుతున్న బాధిత దంపతులు
నెల్లూరు, వాకాడు: ప్రభుత్వ వైద్యుడు నగదు తీసుకుని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశానని మోసం చేశాడని మండలంలోని దుర్గవరం అరుంధతీయవాడకు చెందిన భారతి అనే మహిళ వాపోయింది. శుక్రవారం ఆమె భర్త సోము సుధాకర్‌తో కలిసి వివరాలు వెల్లడించింది. సుధాకర్, భారతిలు నిరుపేదలు. వారికి ఇప్పటికే ముగ్గురు సంతానం ఉన్నారు. భారతి అనారోగ్యం, బలహీనంగా ఉంటూ తరచూ ఫిట్స్‌తో బాధపడుతోంది. ఈ క్రమంలో మళ్లీ గర్భం దాల్చడంతో ఇక సంతానం వద్దనుకుని జూలై 8వ తేదీన కోటలోని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడిని భార్యాభర్తలు సంప్రదించారు.
డాక్టర్ ముందుగా అబార్షన్ చేసి, ఆపై కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తానని చెప్పాడు. అందుకోసం రూ.10 వేలు ఖర్చవుతుందన్నాడు. ఆయన చెప్పిన విధంగానే దంపతులు తమ పొలాన్ని తాకట్టుపెట్టి వైద్యుడికి నగదు చెల్లించారు. దీంతో డాక్టర్ తన సొంత క్లీనిక్‌లో ట్రీట్‌మెంట్ చేసి ప్రభుత్వాస్పత్రిలో చేసినట్లుగా సర్టిఫికెట్ ఇచ్చి 12వ తేదీన డిశ్చార్జి చేశాడు. మూడు నెలల తర్వాత వైద్యుడి నిర్వాహకం బయట పడింది. భారతికి పొట్ట పెరుగుతుండటంతో తిరిగి అదే డాక్టర్‌ను దంపతులు సంప్రదించారు. నెల్లూరుకు వెళ్లి స్కానింగ్ చేయించుకురావాలని అతను చెప్పారు. దీంతో సుధాకర్ మళ్లీ అప్పు చేసి భార్యకు స్కానింగ్ చేయించాడు. రిపోర్ట్‌లో ఆమె గర్భవతి అని తేలడంతో ఇద్దరూ ఆందోళన చెందారు. వెంటనే ఆపరేషన్ చేసిన వైద్యుడిని నిలదీశారు. అయితే అను సమాధానం చెప్పకుండా తిట్టి పంపేశాడని భార్యాభర్తలు విలపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment