విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ) : స్విమ్స్ (శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) డైరెక్టర్ కమ్ వైస్ చాన్స్లర్‌గా ప్రముఖ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ టి.ఎస్.రవికుమార్ నియమితులు కానున్నారు. ఈ మేరకు సోమవారం ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేయనుంది. రవికుమార్ మద్రాస్ మెడికల్ కళాశాలలో ఎంఎస్ సర్జన్‌గా వైద్య విద్య నభ్యసించారు. అనంతరం దాదాపు 36 ఏళ్ల పాటు అమెరికాలో క్యాన్సర్ సర్జన్‌గా, హార్వర్డ్ మెడికల్ స్కూల్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ వంటి ప్రముఖ యూనివర్సిటీలలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. స్వదేశంలో పబ్లిక్ సెక్టార్‌లో పనిచేయాలన్న ఆలోచనతో 2012లో భార త్‌కు చేరుకున్న డాక్టర్ రవికుమార్‌ను ఇనిస్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్‌గా ఉన్న జిప్‌మర్ (పాండిచ్చేరి)కి డెరైక్టర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది.
ఇంతకు ముందు స్విమ్స్ డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్ బి.వెంగమ్మ తన పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే. దీంతో ఆమె స్థానంలో జిప్‌మర్ డెరైక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న డాక్టర్ టీఎస్ రవికుమార్‌ను నియమించేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు శనివారం డాక్టర్ టీఎస్ రవికుమార్ సీఎం చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని సందర్శించి వర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ టి.రవిరాజుతో భేటీ అయ్యారు. యూనివర్సిటీలో జరిగిన ఏపీ మెడికల్ కౌన్సిల్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.
మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, డీఎంఈ డాక్టర్ శాంతారావు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులతో కాసేపు ముచ్చటించారు. ఎటువంటి తారతమ్యం లేకుండా సామాన్యుడికి కూడా తక్కువ ఖర్చుతో క్వాలిటీతో కూడిన వైద్యం అందించాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. ఆరోగ్యవంతమైన సమాజం తయారు కావాలన్నారు. వైద్య విద్యార్థులు నిరంతర విద్యార్థులుగా ఉండాలని చెప్పారు. పరిశోధనల వైపు దృష్టి సారించాలని పేర్కొన్నారు. స్విమ్స్‌లో పనిచేయడం తన అదృష్టంగా భావిస్తానన్నారు.