సొమ్ముంటేనే... సేవలు
Published Mon, Dec 30 2013 3:05 AM | Last Updated on Sat, Sep 2 2017 2:05 AM
చీపురుపల్లి, న్యూస్‌లైన్: మెరకముడిదాం మండలం బిల్లల వలస గ్రామానికి చెందిన గర్భిణి వెంకటలక్ష్మికి జనవరి 12వ తేదీని డెలివరీ టైమ్‌గా వైద్యులు చెప్పారు. అయితే ఆమెను చెకప్ కోసం శుక్రవారం చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకువచ్చారు. పరీక్షలు నిర్వహించిన వైద్యుడు తక్షణమే ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలన్నారు. అందుకు ఆమె కుటుంబసభ్యులు సరేనన్నారు. సరే అంటే సరిపోదు. శస్త్రచికిత్స చేయాలంటే రూ.4 వేలు అవుతుందని వైద్యుడు చెప్పాడు. బిడ్డకు ఏమౌతుందోనని కుటుంబ సభ్యులు మళ్లీ సరే అన్నారు. అలాగే చీపురుపల్లి మండలంలోని పర్ల గ్రామానికి చెందిన పొదిలాపు సూరమ్మకు కడుపులో కాయకాసింది. మామూలుగా వైద్యునికి చూపిద్దామని ఆమె భర్త చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకు వచ్చారు. తక్షణమే ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పారు.
దానికి రూ.4 వేలు అవుతుందన్నారు. పండగ తరువాత చేయించుకుంటామని భర్త చెప్పడంతో ఆ తరువాత అయితే ఏం జరుగుతుందో మాకు తెలియదని వైద్యుడు భయపెట్టడం తో అప్పుచేసి రూ.4 వేలు ఇచ్చి ఆపరేషన్ చేయించుకున్నారు. దానికి తోడు మరో రూ.400 పెట్టి మందులు కొనుక్కున్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలంలోని బాతువ గ్రామానికి చెందిన గర్భిణి పద్మను కుటుంబసభ్యులు ఆస్పత్రి కి తీసుకొస్తే గర్భసంచి తీసెయ్యాలని డాక్టర్ చెప్పారు. అందుకు రూ.4 వేలు అవుతుందని చెప్పగానే ఇచ్చి ఆపరేషన్ చేయించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో అయితే రూ.10 వేలు అవుతుందన్నారు. ఇక్కడైతే రూ.4వేలని చేయించామని రోగి బం ధువులు చెబుతున్నారు. ఇదంతా చీపురుపల్లి ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న తీరు.పేరుకే సర్కారు దవాఖానా..కానీ ఇక్కడి తీరు మాత్రం కార్పొరేట్ ఆస్పత్రులను తలపిస్తుంది.
ఒక్క రూపాయి కూడా ఆశించకుండా వైద్య సేవలు అందించాల్సిన వైద్యులే డబ్బులు ఖర్చు పెట్టాలని చెబుతుంటే పేద, మధ్యతరగతి రోగులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. తమరిష్టం బాబూ..తమరెలా చెప్తే అలాగే..అంటూ చీపురుపల్లి సర్కార్ ఆస్పత్రికి వెళ్లే రోగులు, బంధువులు అక్కడి వైద్యుడు చెప్పిందానికి తలాడిస్తూ అతి కష్టం మీద అప్పులు చేసి డబ్బులు వదిలించుకుంటున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వం ఆస్పత్రులకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. కానీ చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి వచ్చిన వారికి తక్షణమే ఆపరేషన్ చేయాలని అందుకు రూ.4 వేలు అవుతుందని, ముందే చెల్లించాలని అక్కడికి నూతనంగా వచ్చిన వైద్యుడు డిమాండ్ చేస్తుండడంతో సర్కారీ దవాఖానా కాస్తా వసూళ్ల కేంద్రంగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం మండలాలతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని జి.సిగడాం, లావేరు తదితర మండలాలకు చెందిన ప్రజలు వైద్య సేవలకు చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రిపై ఆధారపడతారు. అత్యధికంగా గర్భిణులు ప్రసవం నిమిత్తం ఇక్కడకు వస్తుంటా రు. ఇదే అదునుగా తీసుకున్న వైద్యాధికారి క్యాష్ చేసుకోవాలని భావించారు. ప్రతి శస్త్ర చికిత్సకు ఓ రేటు ఖరారు చేశారు. శస్త్రచికిత్స చేయించాలంటే బయిట నుంచి వైద్యుడిని తీసుకురావాలని, అంతేకాకుండా ప్రైవేటు ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకుంటే రూ.పది వేలు నుంచి రూ.20 వేల వరకు ఖర్చు అవుతుందని రూ.4 వేలు ఇవ్వలేరా? అంటూ ప్రసవాల నిమిత్తం వస్తున్న గర్భిణుల కుటుంబ సభ్యులను మోటివేట్ చేసి మరీ ఒప్పిస్తున్నారు.
స్థానిక ఆస్పత్రిలో నెలకు కనీసం 100 నుంచి 150 ప్రసవాలు జరుగుతున్నాయి. ఇందులో చాలా మంది గర్భిణులకు సాధారణ ప్రసవం జరగాల్సి ఉన్నప్పటికీ డబ్బుల కోసం శస్త్రచికిత్స తప్పదని భయపెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన నెలకు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూళ్ల పర్వం నడుస్తోంది. శస్త్రచికిత్సల దందా ఇలా ఉండగా ఇక్కడ ప్రసవించేందుకు వస్తున్న గర్భిణులకు కనీసం మం దులు కూడా ఇవ్వకపోవడం దారుణం. ప్రసవ సమయంలో మందులు కొనుక్కోమని చెబుతూ, కనీసం బ్లేడు, సబ్బు కూడా ఆస్పత్రి వర్గాలు ఇవ్వడం లేదని రోగుల బంధువులు వాపోతున్నారు. అంతేకాకుండా ధనిక వర్గాల కు చెందిన వారు ఎవరైనా తగిలితే అలాంటి వారి నుంచి డబ్బులు తీసుకుని వివిధ రకాల ఆపరేషన్లు స్థానిక ప్రభుత్వాసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్‌లో నిర్వహించి, మందులు కూడా అందజేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ తీసుకుంటున్నాం...
ఈ విషయమై ప్రభుత్వాస్పత్రి ఇన్‌చార్జి మెడికల్ ఆఫీసర్ సునీల్ ‘న్యూస్‌లైన్’తో మాట్లాడు తూ ప్రభుత్వాస్పత్రికి వచ్చిన రోగుల నుంచి ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ మాత్రమే తీసుకుంటున్నామని చెప్పారు. ఇక్కడ వైద్యులు లేరని, శస్త్రచికిత్స చేయించాలంటే బయట నుంచి వైద్యుడిని తీసుకురావాలని, ఆయన ఊరకనే రారుకదా అన్నారు. ఇవే శస్త్ర చికిత్సలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేయించాలంటే చాలా ఖర్చు అవుతుందన్నారు. తన సొంత నిధులతో ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్‌ను అభివృద్ధి చేశానని చెప్పారు. పత్రికల్లో రాస్తే ఇక్కడ ఎవ్వరూ పని చేసేందుకు ముందుకు రారని, అయినా వార్త రాసి చెడ్డ చేస్తే ఒక్కరోజు మాత్రమే ఉంటుంద ని, పత్రిక హైలెట్ అవ్వడం తప్ప అంతకన్నా ఉపయోగం ఉండదన్నారు. మందులు కూడా బయట కొనుక్కోమని రోగులకు చెబుతున్నారట అని ప్రశ్నించగా..ఆపరేషన్‌కు అవసరమ య్యే చాలా మందుల సరఫరా లేదని, అవి వారే కొనుక్కోవాలన్నారు.
Advertisement
Advertisement