విశాఖపట్నం: దేశీయ విమాన సర్వీసులకు లైన్‌క్లియర్ అయింది. తొలి దశలో మంగళవారం నుంచి నాలుగు డొమెస్టిక్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. రెండు నెలల తరువాత ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూర్‌ల నుంచి విమానాలు విశాఖ విమానాశ్రయానికి వస్తున్నాయి. కరోనా మహమ్మారి నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం మార్చి 23వ తేదీ నుంచి ఇప్పటి వరకు నాలుగు దఫాలుగా లాక్ డౌన్‌ను అమలు చేస్తూ వస్తోంది. అదే నెల 25వ తేదీ నుంచి అంతర్జాతీయ, దేశీయ విమాన సర్వీసులను సైతం నిలిపివేసింది. కేవలం కార్గో విమానాలకు మాత్రమే అనుమతి ఇచ్చింది.
తాజాగా లాక్‌డౌన్ 4.0లో కేంద్రం కొన్ని సడలింపులతో ఈ నెల 25వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి విమానాల రాకపోకలకు మార్గం సుగమమైంది. అయితే ప్రయాణికుల విషయంలో నిర్ధిష్టమైన మార్గదర్శకాలు విడుదల కాకపోవడంతో విమాన సర్వీసులు తొలి రోజు ప్రారంభం కాలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికుల సౌకర్యంతో పాటు వారి భద్రతను దృష్టిలో పెట్టుకొని కొన్ని మార్గదర్శకాలతో దేశీయ విమాన సర్వీసులకు అనుమతులిచ్చింది. దీంతో మంగళవారం నుంచి విశాఖ విమానాశ్రయం నుంచి విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి.
అధికారుల సుదీర్ఘ సమావేశం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం విశాఖ నుంచి విమాన సర్వీసుల ప్రారంభానికి అన్ని శాఖల అధికారులు సోమవారం సమావేశమయ్యారు. నావికాదళం, రెవెన్యూ, పోలీసు, ఇమిగ్రేషన్, ఎయిర్‌టైన్ మేనేజర్లు, ఎయిర్‌పోర్ట్ అథారిటీ సీనియర్ ఆఫీసర్లు, విమానాశ్రయం డైరెక్టర్, జిల్లా వైద్య, పోలీస్.. ఇలా అన్ని శాఖల అధికారులు విమానాశ్రయంలో సాంకేతికపరమైన అంశాల అమలుతో పాటు ప్రయాణికుల భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు.
నాలుగు విమానాలకే అనుమతి
తొలి దశలో నాలుగు దేశీయ విమానాలకే అనుమతులు లభించింది. మంగళవారం ఉదయం 6.55 గంటలకు బెంగళూరు నుంచి ఇండిగో విమానం, సాయంత్రం 7 గంటలకు ఢిల్లీ నుంచి ఇండిగో విమానంతో పాటు రాత్రి 9 గంటలకు బెంగుళూరు నుంచి ఎయిర్ ఏషియా విమానాలు విశాఖ విమానాశ్రయానికి రానున్నాయి. ఉదయం 11.50 గంటలకు హైదరాబాద్ నుంచి ఇండిగో విమానం రానుంది. ఎయిర్‌పోర్ట్‌లో సాంకేతికాంశాలతో పాటు, ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని దశల వారీగా ఈ సర్వీసులను పెంచేందుకు విమానయాన అధికారులు చర్యలు చేపడుతున్నారు.
వారికి ఇన్‌స్టిట్యూషన్ క్వారైంటన్ తప్పనిసరి
దేశంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చిన విమాన ప్రయాణికులందరినీ తప్పనిసరిగా క్వారంటైన్ కేంద్రాలకు తరలించనున్నారు. ప్రధానంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా వారం రోజుల పాటు క్వారంటైన్ కేంద్రాల్లో ఉండాల్సి ఉంటుంది. మంగళవారం రాత్రికి ఢిల్లీ నుంచి వచ్చే విమాన ప్రయాణికులు ఇన్‌స్టిట్యూషన్ క్వారంటైన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలకు గానీ, ప్రైవేట్ హోటళ్లలో గానీ వారి కోరిక మేరకు తరలించి.. ఆరోగ్య పరిస్థితిని వైద్యాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. వారం రోజుల తరువాత వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. అందులో నెగిటివ్‌గా వచ్చిన వారిని ఇళ్లకు పంపించనున్నారు. ఒకవేళ పాజిటివ్‌గా నిర్ధారణైతే వారిని కోవిడ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించనున్నారు.
స్వాబ్ పరీక్షల తర్వాతే బయటకు..
బెంగళూరు నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్‌తో పాటు కరోనా నిర్ధారణ కోసం స్వాబ్ తీసుకొని ఆ తర్వాతే ఇళ్లకు పంపించనున్నారు.
ప్రయాణికులందరికీ ప్రాథమిక పరీక్షలు
విశాఖ విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులందరికీ వైద్యాధికారులు ప్రాథమిక పరీక్షలు నిర్వహించనున్నారు. ముందుగా వారికి థర్మల్ స్క్రీనింగ్ ద్వారా ఉష్ణోగ్రతలు పరీక్షించనున్నారు. అలాగే బ్యాగేజీల నుంచి బోర్డింగ్ పాస్‌లు.. తనిఖీలు ఇలా ప్రతీ చోటా భౌతికంగా కాకుండా సాంకేతికంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. తొలి దశలో రెండు విమానాలకే అనుమతులు లభించినప్పటికీ.. సాంకేతికంగా ఎటువంటి ఇబ్బందులు లేకపోతే త్వరలోనే దశల వారీగా సర్వీసులు పెంచనున్నారు.
– రాజ్‌కిశోర్, విశాఖ విమానాశ్రయం డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment