కాంగ్రెస్‌లో ‘యుద్ధ’ కాండ
సాక్షి, కొత్తగూడెం/కారేపల్లి, న్యూస్‌లైన్
కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు వీధికెక్కాయి. ఇప్పటి వరకు మాటలతోనే సరిపెట్టుకున్న ఎంపీ రే ణుకాచౌదరి, మంత్రి రాంరెడ్డి వర్గీయులు ప్రత్యక్షంగా ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. టేకులపల్లి, కారేపల్లి మండలాల్లో రేణుక పర్యటన రచ్చరచ్చగా మారింది. మంత్రి వర్గీయులకు తోడు తెలంగాణవాదులు కూడా ఆమె పర్యటనపై నిరసన తెలిపారు. రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు ముదరడంతో భద్రాచలం జైత్రయాత్ర పేరుతో ఆమె చేసిన పర్యటన ఆదివారం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసి యుద్ధకాండను తలపించింది.
టేకులపల్లిలో ఏర్పాటు చేసిన రేణుక సభకు తరలివస్తున్న ఆమె వర్గీయులు, మంత్రి అనుచరులకు ముందుగా ముత్యాలంపాడు క్రాస్‌రోడ్డు వద్ద ఘర్షణ జరిగింది. కొత్తగూడెం నుంచి రతన్‌నాయక్, భూక్యా నాగేందర్‌తో పాటు మరికొందరు రేణుకను కలిసేందుకు టేకులపల్లి వస్తున్నారు. వీరిపై మంత్రి వర్గీయులు ముత్యాలంపాడు వద్ద దాడి చేశారు. ఇలా పరస్పరం దాడులు జరిగాయి. ఈ దాడిలో రేణుక అనుచరులు ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. అనంతరం మంత్రి అనుచరులు వీరిని టేకులపల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి.. తమపై దాడి చేశారని ఫిర్యాదు చేశారు.
కాగా, టేకులపల్లిలో ఏర్పాటు చేసిన సభలో రేణుక మాట్లాడుతూ ‘మూతి మీద మీసం ఉంటే మగాడు కాదు.. మహిళలను ఆదరించి ముందుకు నడిపేవాడే మగాడు అవుతాడు. నాతో పనులు చేయించుకున్నప్పుడు ఎక్కడి ఆడబిడ్డనో గుర్తుకు రాలేదా..?’ అంటూ మంత్రి రాంరెడ్డిపై పరోక్ష విమర్శలు చేశారు. ఇలా ఆమె ప్రసంగమంతా మంత్రిపై పరోక్ష విమర్శలతోనే కొనసాగింది. సభ అనంతరం ఆమె కారేపల్లి పయనం కాగా, వైఎస్సార్ సెంటర్‌లో ఆమె వాహనాన్ని అడ్డుకోవడానికి మంత్రి వర్గీయులు యత్నించారు.
తెలంగాణ ద్రోహి అని నినాదాలు చేశారు. పోలీసులు వారిని తొలగించడంతో ఆమె వాహనం వెళ్లిపోయింది. ఇల్లెందు వరకు వెళ్లిన తర్వాత తన వర్గీయులపై దాడి జరగిందని రేణుకకు సమాచారం అందింది. వెంటనే ఆమె మళ్లీ టేకులపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. తమపై దాడి జరిగిన తీరును గాయపడిన వారు వివరిస్తూ ఆమె కాళ్లపై పడి ఏడ్చారు. దీంతో ఆమె కూడా కొంత ఉద్వేగానికి లోనయ్యారు. రేణుక సూచన, బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు 50 మందిపై కేసు నమోదు చేశారు. మంత్రి వర్గీయుడు కోయగూడెం సర్పంచ్ పూనెం సురేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే రేణుక సర్పంచ్‌ను కులం పేరుతో దూషించారని.. ఆమెపై కేసు నమోదు చేయాలని, సర్పంచ్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి వర్గీయులు టేకులపల్లి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. టేకులపల్లి నుంచి రేణుక ఇల్లెందు మీదుగా ఆమె కారేపల్లి వెళ్లాల్సి ఉండగా అక్కడ టీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్‌వీ శ్రేణులు కాన్వాయ్‌ను అడ్డకోవడానికి సమాయత్తం కావడంతో ఇల్లెందు రాకుండానే విద్యుత్ కార్యాలయం రోడ్డు నుంచి కారేపల్లి వెళ్లారు.
కారేపల్లిలోనూ రచ్చరచ్చ..
సమైక్యవాది అంటూ ఇటు మంత్రి వర్గీయులు, అటు టీఆర్‌ఎస్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ శ్రేణులు కారేపల్లిలో ఆమె పర్యటనను అడ్డుకున్నారు. మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వచ్చిన రేణుకకు సినిమాహాల్ సెంటర్ వద్ద అనుచరులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరారు. బస్టాండ్ సెంటర్‌లో రేణుక పర్యటనను నిరసిస్తూ ఒకరోజు దీక్ష చేస్తున్న మంత్రి అనుచరుడు కొనకండ్ల సత్యనారాయణ రోడ్డుకు అడ్డంగా పడుకున్నాడు. దీంతో రేణుక, మంత్రి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. అతనికి తోడుగా టీఆర్‌ఎస్, ఎన్డీ కార్యకర్తలు ‘తెలంగాణ ద్రోహి రేణుక గ్యోబాక్’ అంటూ నినదించారు.
‘భద్రాచలం మాది.. పెద్దాపురం మీది’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇలా రేణుక కాన్వాయ్‌పై దూసుకొస్తున్న ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఈ పరిస్థితుల్లోనే ఆమె పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ ‘ నిద్రపోతున్న పులిని లేపారు.. నా చేతికి ఉన్నవి గాజులు కాదు.. విష్ణుచక్రాలు, రౌడీ వేషాలు వేస్తే ఆ విష్ణుచక్రాలు లేచి మీ తలలను నరికేస్తాయి’ అని ఆమె మంత్రి అనుచరులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ ముగించుకొని ఖమ్మం వైపు వెళ్తున్న ఆమె వాహనంపై బస్టాండ్ సెంటర్‌లో మంత్రి వర్గీయులు, టీఆర్‌ఎస్, ఎన్డీ, సీపీఐ కార్యకర్తలు కోడిగుడ్లు విసిరారు. అక్కడున్న రేణుకాచౌదరి ఫ్లెక్సీలను కూడా చించారు. అయితే పోలీసులే దగ్గర ఉండి ఆందోళనకారులతో గుడ్లు వేయించారని రేణుక వర్గీయులు ఆరోపించారు.
విభేదాలు బహిర్గతం..
ఇన్నాళ్లూ అంతర్గతంగా రగులుతున్న వార్ రేణుక పర్యటనతో ప్రత్యక్షంగా బయటపడింది. మంత్రి, రేణుక వర్గీయులు ఒకరిపై ఒకరు ప్రత్యక్షంగా టేకులపల్లి, కారేపల్లిలో దాడులకు దిగడంతో కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు ముదిరాయి. ఓవైపు మంత్రి వర్గీయుల నిరసనలు, మరోవైపు తెలంగాణవాదుల ఆందోళనలతో భద్రాచలం జైత్రయాత్ర రసాభాసగా ముగిసింది. రేణుక పర్యటన తన అనుచరుల్లో కొంత ఉత్సాహాన్ని నింపినా, యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఇక ప్రత్యక్ష వార్ మొదలైందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా పాలేరులో కూడా రేణుక తన ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు వ్యూహాత్మకంగానే శంకుస్థాపన చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రి ఇలాకాలో ఆయనకు తొలనొప్పి పుట్టేంచేలా రేణుక ఇక ప్రత్యక్షంగా ఎత్తులు వేస్తున్నారని ఆమె వర్గీయులు చర్చించు కుంటున్నారు.