'మిస్' ఫైర్!
ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరికి ఈ మధ్య కాలం కలిసి రావటం లేదు. అన్ని అపశకునాలే ఎదురవుతున్నాయి. ఎక్కడికి వెళ్లినా పరాభవమే ఎదురవుతోంది. అటు హస్తిన నుంచి ఖమ్మం గల్లీ వరకూ ఇదే పరిస్థితి. కార్పొరేటర్గా రాజకీయ ప్రస్ధానాన్ని ప్రారంభించి ఆ తర్వాత అంచెలంచలుగా కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన రేణుకా చౌదరి వ్యూహాలన్నీ ఇటివలీ కాలంలో మిస్ ఫైర్ అవుతున్నాయి. మళ్లీ ఖమ్మం నుంచి బరిలో దిగుతానని ముందు నుంచే ఫీలర్లు వదిలినా ఆమెను పార్టీ అధిష్టానం పట్టించుకోనట్లు కనిపిస్తోంది. ఆమెకు ఖమ్మం సీటుపై హామీ మాత్రం దొరకలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక తెలంగాణలో సీపీఐ...హస్తంతో పొత్తు పెట్టుకోవటంతో ఖమ్మం ఎంపీ సీటును ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణకు కేటాయించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ విడుదల చేసిన లోక్సభ అభ్యర్థుల జాబితాతో రేణుకా చౌదరి పేరు లేకపోవటం విశేషం. అయితే ఆవిషయాన్ని డైరెక్ట్గా ప్రస్తావించని రేణుకా... మరోవిధంగా తన అసంతృప్తిని వెళ్లగక్కారు.
పార్టీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో మహిళలు ఒక్కరికి కూడా చోటు కల్పించకపోవటం శోచనీయమని వ్యాఖ్యానించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మహిళా బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత కూడా వారికి ఎక్కడా గుర్తింపు లభించటం లేదని చెప్పుకొచ్చారు. మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని మైకుల ముందు మాట్లాడేవాళ్లు అమలు విషయానికి వచ్చేసరికి సొంత స్థానాన్ని కాపాడుకునేందుకు భార్య, బిడ్డలను పోటీకి దింపుతున్నారని విమర్శలు చేశారు.
ఇక ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లాకు అమావాస్యకో పౌర్ణమికో వెళ్లి హంగామా సృష్టించి ఫోటోలకు ఫోజులు ఇచ్చేవారని రేణుకా చౌదరిపై విమర్శలు ఉన్నాయి. దాంతో తమ పట్ల ఇంత ఉదాసీనంగా వ్యవహరించిన రేణుకకు 2009 ఎన్నికల్లో ఖమ్మం ఓటర్లు తగిన రీతిలో సమాధానం చెప్పారు.
అంతే కాకుండా ఆమెకు పార్టీలో అంతర్గత పోరు కూడా ఎక్కువ కావటం..రేణుక ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిస్తామని సొంతపార్టీ వాళ్లే చెప్పటం విశేషం. మరోవైపు అధికార ప్రతినిధి పదవి నుంచి తప్పించి హైకమాండ్ ఆమెకు పెద్ద షాక్ ఇచ్చింది. ఈ పరిణామాన్ని రేణుకా జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఖమ్మం ఆడపడుచును అని చెప్పుకునే రేణుకకు... కాంగ్రెస్ అధిష్టానం సీటు కేటాయిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.