అంగట్లో విద్య | Donation should not charged | Sakshi
Sakshi News home page

అంగట్లో విద్య

Published Tue, Jun 17 2014 1:46 AM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM

అంగట్లో విద్య - Sakshi

అంగట్లో విద్య

 ‘జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలన్నీ నిబంధనలకు అనుగుణంగా గవర్నింగ్ బాడీ తీర్మానించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలి. ఆ వివరాలను నోటీసు బోర్డులో పొందుపర్చాలి. పిల్లలకు ఎలాంటి ప్రవేశ పరీక్షలు నిర్వహించరాదు. డొనేషన్లు వసూలు చేయకూడదు. ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు.’ - కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి మూడు రోజుల క్రితం చేసిన ప్రకటన ఇది.
 
 సాక్షి, కర్నూలు: ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలను కాలరాస్తున్నాయి. ఫీజుల వసూలులో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఈ విషయంలో జిల్లా సర్వోన్నతాధికారి ఆదేశాలనూ ఖాతరు చేయకపోవడం గమనార్హం. విద్యా హక్కు చట్టం కాగితాలకే పరిమితం కాగా.. పర్యవేక్షించాల్సిన అధికారులు సైతం మీనమేషాలు లెక్కిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.1 ప్రకారం ప్రైవేట్ పాఠశాలలు అర్హత, ప్రవేశ పరీక్షలు నిర్వహించడం నిషేధం. అయితే ప్రస్తుతం జిల్లాలో పరిస్థితి అందుకు భిన్నంగా సాగుతోంది.
 
 జిల్లాలో 1,050 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా.. కర్నూలుతో పాటు నంద్యాల, డోన్, ఆదోని, ఎమ్మిగనూరులో ఫీజుల మోత మోగుతోంది. ఒక్క కర్నూలులోనే 100 పైగా ప్రైవేట్ పాఠశాలలు నిర్వహిస్తుండగా.. 20 పైగా పాఠశాలల్లో డొనేషన్లు  ఇవ్వనిదే సీటు దక్కని పరిస్థితి నెలకొంది. ఫీజుల నియంత్రణకు పాఠశాలలోని పిల్లల తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, యాజమాన్యం, డెరైక్టర్లు, ప్రధానోపాధ్యాయుడితో కూడిన గవర్నింగ్ బాడీ ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. మే, జూన్, జులై నెలల్లో ఈ కమిటీ పలు దఫాలుగా సమావేశమై ఫీజులను నిర్ణయించాల్సి ఉంది. తీర్మానం చేసిన అనంతరం ఆ వివరాలను నోటీసు బోర్డులో పొందుపర్చాలి. ఇందుకు సంబంధించిన ప్రతిని విద్యా శాఖ అధికారులకు పంపాలి.
 
ఇవేవీ చేయకుండానే పాఠశాలల యాజమాన్యాలు అడ్డూఅదుపు లేని ఫీజులతో తల్లిదండ్రులను బెంబేలెత్తిస్తున్నాయి. ఇకపోతే టెక్నో, గ్లోబల్ స్కూళ్ల పేరిట ప్రచారం చేయరాదని విద్యా శాఖ గతంలోనే ప్రకటించింది. అయినప్పటికీ కరపత్రాలు, ఫ్లెక్సీలతో పాటు వివిధ మార్గాల్లో టెక్నో, గ్లోబల్ స్కూల్, డిజిటల్ తరగతుల పేరిట ప్రచారం మారుమోగుతోంది. ఈ సౌకర్యాల మాటున ఫీజుల దోపిడీ కొనసాగుతోంది. ప్రైవేట్ పాఠశాలలు వసూలు చేస్తున్న ఫీజులు, డొనేషన్లను పరిశీలిస్తే ఓ విద్యార్థి ఒకటి నుంచి 10వ తరగతి చదువు పూర్తి చేసేందుకు రూ.4 లక్షలకు పైగానే ఖర్చు చేయాల్సి వస్తోంది.

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పీహెడ్‌డీ పూర్తి చేసినా ఇంత మొత్తం ఖర్చు కాదనేది జగమెరిగిన సత్యం. అయితే పిల్లలకు కార్పొరేట్ విద్యను అందించడంతో పాటు బంగారు భవిష్యత్‌కు బాటలు వేయాలనే తల్లిదండ్రుల ఆశను ప్రైవేట్ యాజమాన్యాలు తమ ఆదాయ వనరుగా మలుచుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
 
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
ప్రభుత్వ నిబంధనల మేరకే ఫీజులు వసూలు చేయాలి. గవర్నింగ్ బాడీ తీర్మానించిన ఫీజులకు మించి వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు. వసూలు చేసిన ఫీజుకే రశీదు ఇవ్వాలి. తల్లిదండ్రులు కచ్చితమైన ఆధారాలతో ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందిస్తాం.          -  కె.నాగేశ్వరరావు, డీఈఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement