The public schools
-
19 మంది లోపున్న బడులు మూసివేత
విద్యార్థులు లేకుంటే సమీపంలోని పాఠశాలల్లో విలీనం ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు ఉత్తర్వులు జారీ హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హేతుబద్దీకర ణ (రేషనలైజేషన్)కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ మేనేజ్మెంట్ల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఉండాల్సిన విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య ను ఉత్తర్వుల్లో పొందుపరిచారు. 2013-14 డైస్ లెక్కల ఆధారంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హేతుబద్దీకరణ కోసం జిల్లా స్థాయిలో సాధికారిక కమిటీని ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాలో జిల్లా స్థాయి సాధికారిక కమిటీకి చైర్మన్‌గా ఆ జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తారు. జిల్లా విద్యాశాఖాధికారి సభ్య కార్యదర్శిగా, జాయింట్ కలెక్టర్, జెడ్పీ సీఈవో, ఐటీడీఏ పీవో, ఆర్వీఎం పీవో సభ్యులుగా ఉంటారు. రేషనలైజేషన్ ప్రక్రియ అమలుకు షెడ్యూల్, మార్గదర్శకాలు, సూచనలను జారీ చేయాల్సిందిగా పాఠశాల విద్యా కమిషనర్‌ను ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం 19 మం దిలోపు పిల్లలున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను కిలోమీటరు పరిధిలోని ఇతర పాఠశాలల్లో విలీనం చేస్తారు. ఆ స్కూళ్లలోని ఉపాధ్యాయ పోస్టులను విద్యార్థులున్న పాఠశాలలకు బదిలీ చేస్తారు. గిరి జన ప్రాంతాల్లో 19 మందిలోపు విద్యార్థులు ఉన్నా, లేకపోయినా కిలోమీటరు పరిధిలోని ఉన్న మరో ప్రభుత్వ లేదా సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాలలో విలీనం చేస్తారు. ఒకవేళ కిలోమీటర్ పరిధిలో మరో పాఠశాల లేకపోతే కనీసం 15 మంది విద్యార్థులున్నా ఆ పాఠశాలను కొనసాగిస్తారు. ఇక ఈ హేతుబద్దీకరణపై 29న విద్యాశాఖ అధికారులు సమావేశమై షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నారు. వచ్చే నెల చివరలో ఈ రేషనలైజేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు. ఇవీ మార్గదర్శకాలు.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హేతుబద్దీకరణలో భాగంగా ఉన్న పోస్టుల సర్దుబాటును మాత్రమే చేపడతారు. ఒక్క కొత్త పోస్టు కూడా సృష్టించరు. ప్రాథమిక పాఠశాలల్లో.. 19 మంది కంటే తక్కువ సంఖ్యలో విద్యార్థులున్న పాఠశాలలను కిలోమీటరు పరిధిలో ఉన్న మరో పాఠశాలలో విలీనం చేస్తారు. 20 నుంచి 60 మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు ఎస్జీటీని ఇస్తారు. ఆ తరువాత ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ను కేటాయిస్తారు. విద్యార్థుల సంఖ్య 151కి మించి ఉంటే ఒక ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంను ఇస్తారు. ఇక గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలలను విలీనం చేయాల్సి వస్తే ఐటీడీఏ స్కూళ్లలో విలీనం చేస్తారు. పోస్టులను మాత్రం సంబంధిత యాజమాన్యంలోనే సర్దుబాటు చేస్తారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో.. ప్రాథమికోన్నత పాఠశాలలకు సంబంధించి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రాథమిక పాఠశాల నిబంధనలే వర్తిస్తాయి. 6, 7, 8 తరగతుల్లో 19 మందికన్నా తక్కువగా విద్యార్థులు ఉంటే.. మూడు కిలోమీటర్ల పరిధిలోని ఉన్న మరో ప్రాథమికోన్నత పాఠశాలలో విలీనం చేస్తారు. 20 నుంచి 100 మంది విద్యార్థులున్న స్కూళ్లలో ఒక గణితం, ఒక ఆర్ట్స్ స్కూల్ అసిస్టెంట్, రెండు భాషా పండిట్ పోస్టులు ఉంటాయి. 101 నుంచి 140 మంది విద్యార్థులున్న స్కూళ్లలో గణితం టీచర్ పోస్టును అదనంగా ఇస్తారు. ఆ తరువాత ప్రతి 35 మంది విద్యార్థులకు ఒక స్కూల్ అసిస్టెంట్ పోస్టును అదనంగా ఇస్తారు. ఈ స్కూళ్లలో సీనియర్ అయిన స్కూల్ అసిస్టెంట్ ప్రధానోపాధ్యాయుడిగా వ్యవహరించాలి. స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు వారి సబ్జెక్టులను బోధిస్తూనే, అవసరమైతే ప్రాథమిక తరగతుల్లో బోధించాలి. ఉన్నత పాఠశాల్లో.. 6 నుంచి పదో తరగతి వరకు 75 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలల(ఇంగ్లిష్ మీడియంతో సహా)ను మూసివేసి విద్యార్థులను సమీపంలోని స్కూల్లో నమోదు చేస్తారు. 75 నుంచి 220 మంది విద్యార్థుల వరకు ఉంటే.. ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో టీచర్ చొప్పున 9 మందిని ఇస్తారు. ఆ తరువాత ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ను అదనంగా ఇస్తారు. ఉన్నత పాఠశాలల్లో ఒక తరగతిలో కనీస విద్యార్థుల సంఖ్య 40 మంది. 60కి మించితే రెండో సెక్షన్‌ను, 100 మందికి మించితే మూడో సెక్షన్‌ను ఏర్పాటు చేయాలి. పోస్టులను ఒక స్కూల్ నుంచి మరో పాఠశాలకు మా ర్చే పక్షంలో విద్యార్థుల నమోదు, సెక్షన్లను దృష్టిలో పెట్టుకొని కమిటీ నిర్ణయం తీసుకోవాలి. ప్రాంతీయ సంయుక్త సంచాలకుడి అనుమతి లేకుం డా జెడ్పీ, మున్సిపల్ స్కూళ్లలో నిర్వహిస్తున్న అదన పు సెక్షన్లను క్రమబద్దీకరిస్తూ ఉత్తర్వులు జారీచేయాలి. మరికొన్ని నిబంధనలు.. బాలికల పాఠశాలలను ఎట్టి పరిస్థితుల్లో కో-ఎడ్యుకేషన్/ బాలుర పాఠశాలల్లో విలీనం చేయొద్దు. ఇంగ్లిషు మీడియం ఉన్న పాఠశాలల్లో 75 మందిలోపు పిల్లలు ఉంటే ఇంగ్లిషు మీడియం కోసం అదనంగా పోస్టులను ఇవ్వరు. 75 నుంచి 220 మంది వరకు పిల్లలున్న స్కూళ్లలో భాషేతర స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 4, 221 నుంచి 260 వరకు 6, 261 నుంచి 340 వరకు 7 పోస్టులు అదనంగా కేటాయిస్తారు. రేషనలైజేషన్‌లో సీనియారిటీ ప్రకారం జూనియర్ అయిన వారిని అదనపు టీచర్‌గా గుర్తిస్తారు. -
ఏవీ.. ఆ సీట్లు..!
పేద పిల్లలకు ప్రైవేటు విద్య అందని ద్రాక్షేనా సుప్రీంకోర్టు ఆదేశాలూ బేఖాతరు ప్రైవేటు స్కూళ్లలో 25శాతం సీట్లు హుళక్కే అమలు కాని విద్యాహక్కు చట్టం ప్రభుత్వ పాఠశాలలు ఎన్ని ఉన్నా..అందరికీ ఇప్పుడు ‘పైవేటు’ అడుగులు తప్పడం లేదు. పేదరికంలో మగ్గుతున్న వారు సైతం తమ బిడ్డలు కాస్త డాబుగా ఉండే స్కూళ్లలో చదివితే నాలుగు అక్షరాలు నేర్చుకుంటారనే తపనతో పస్తులుండీ మరీ చదివి స్తుంటారు. ఫీజులు వారికి భారమైనా మోస్తుంటారు. దీన్ని అధిగమించేందుకు సాక్షాత్తూ ‘సుప్రీమే’ స్పందించి పేద పిల్లలకు ప్రైవేటు స్కూళ్లలో ఓ 25శాతం సీట్లను కేటాయించాలని తీర్పునిచ్చింది. దీని అమలు బాధ్యత జిల్లా విద్యాశాఖ చూడాలి. అలాంటి దాఖలాలు మచ్చుకైనా కానరాని దుస్థితి నెలకొంది. చదువులు ‘ఖరీదు’ చేసుకోలేని స్థితి ఏర్పడుతోంది. పాలమూరు : పేద, మధ్యతరగతి వర్గాల ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక చట్టాలను రూపొందిస్తున్నప్పటికీ.. వాటి అమలు లో నెలకొన్న నిర్లక్ష్యంగా కారణంగా క్షేత్రస్థాయిలో వాటి లబ్ధి చేకూరడంలేదు. ప్రె ైవేటు విద్యా సంస్థల్లో పేద పిల్లలకు 25 శాతం సీట్లు కల్పించాలని, ఇది విద్యాహక్కు చట్టంలో భాగమేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి ఏడాదిన్నర కావస్తున్నా నేటికీ అమలుకు నోచుకోవడం లేదు. గత ప్రభుత్వం సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేయడంతో పేదవర్గాలకు ఇబ్బందిగా మారింది. కొత్తగా ఏర్పడిన కేంద్ర ప్రభుత్వమైనా ఈ విషయంపై స్పందించాలని పేదకుటుంబాలకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. అన్ని వర్గాల వారికీ విద్యను అందించాలన్న ఉద్ధేశంతో ప్రవేశ పెట్టిన ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం అమలు తీరు సర్కారు.. నిర్లక్ష్యం వల్ల జిల్లాలో ప్రశ్నార్థకంగా మారింది. దీన్ని ప్రవేశపెట్టి అయిదేళ్లు పూర్తయినా అమలుకు నోచుకోవడం లేదు. ప్రైవేటు పాఠశాలల్లో పేద, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రయోజనం కలిగించే వి ధంగా ప్రత్యేకంగా సీట్లు కెటాయించాలని విద్యా హక్కు చట్టం జీఓను ప్రభుత్వం జారీ చేసింది. అయితే ఇప్పటిదాకా జి ల్లాలో చట్టాన్ని అమలు చేయకపోవడం శోచనీయం. 2010లో ఆ జీవో విడుదల యింది. నాలుగేళ్లు పూర్తికావస్తున్నా.. ఆ విధాన్ని అమలుపర్చకపోవడంతో పేద విద్యార్థులు నష్టపోవాల్సి వస్తోంది. దీనిపై ప్రతిస్పందనగా.. ప్రతి ప్రైవేటు విద్యా సంస్థలో కేజీ నుంచి పదోతరగతి వరకు 25 శాతం సీట్లను పేద పిల్లలకోసం కెటాయిం చాలని విద్యాహక్కు చట్టంలోని నిబంధన. దీనిపై గతేడాది ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పును వెలువరించింది. విద్యాహక్కు చట్టాన్ని అనుసరించి ప్రతి ప్రైవేటు పాఠశాలలో 25 శాతం సీట్లను పేద పిల్లల కు ఉచితంగా కేటాయించాలని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మొట్టికాయలు వేసింది. కానీ ఇది ఏడాదిన్నర కాలంగా కాగితాలకే పరిమితమైపోయిం ది. అత్యున్నత నాయ్యస్థానం ఇచ్చిన తీ ర్పును సైతం పక్కనబెట్టి ఓవైపు ప్రైవేటు విద్యా సంస్థలన్నీ ఇదివరకు తమ సీట్లన్నీ భర్తీ చేసుకున్నారు. 2014-15 విద్యా సం వత్సరం ఇప్పటికే ప్రారంభమైంది. అం తకుముందుగానే జిల్లాలోని ప్రైవేటు వి ద్యా సంస్థలన్నీ తమ సీట్లన్నింటిని ప్రవేశ ఫీజుల తో భర్తీ చేసుకున్నాయి. ఇందులో ఏ ఒక్క పిల్లవానికి కూడా ఉచితంగా సీ టు అందించిన దాఖలాల్లేవు. దీనిపై ఏ డాది కాలంగా కేంద్ర ప్రభుత్వం నా న్చుడు ధోరణి కారణంగా.. పేద పిల్లలకు ప్రైవేటు విద్య అందని ద్రాక్షలా మారిపోయింది. వేలాది మందికి లబ్ది సుప్రీం తీర్పును అనుసరించి కేంద్ర ప్ర భుత్వం తక్షణమే దీనిపై మార్గదర్శకాలు జారీ చేస్తే జిల్లాల్లోనూ వేలాది మంది పేద పిల్లలకు ప్రయోజనం చేకూరే అవకాశాలున్నాయి. గతేడాది విద్యా సంవత్సరంలో గుర్తింపు పొందిన పాఠశాలల సం ఖ్య 850 వరకు ఉంటుంది. మరో 50 వర కు సాధారణ ప్రైవేటు పాఠశాలలు ఏర్పా టు చేశారు. అయితే వీటిల్లో 25 శాతం సీ ట్లు పేద పిల్లల కోసం కెటాయిస్తే ఎంతో మంది పిల్లలకు ప్రత్యక్షంగా లబ్దిచేకూరనుంది. ఒక్కో పాఠశాలలో కనీసం 20 మంది పేద పిల్లలను చేర్చుకున్నా.. 18000 దాటుతుంది. ఇదంతా జిల్లా స్థాయిలో ఉండే విద్యాశాఖ అధికారులు పాఠశాల యాజమాన్యాల నిర్వహణ క మిటీ సమక్షంలో ఎంపిక చేయాల్సి ఉం టుందని గతంలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది. దీనికితోడు ఈ పిల్లలను ఇతర విద్యార్థులతో సమానం గా కూర్చోబెట్టడంతోపాటు అన్ని రకాల వసతుల్ని సరిసమానంగా అందించాలి. కేంద్ర ప్రభుత్వం ద్వారా నడుస్తున్న రాజీవ్ విద్యామిషన్ ద్వారా స్పష్టమైన ఆదేశాల్లో ఆచరణలోకి తీసుకొచ్చి ప్రతీ పేద పిల్లవానికి ప్రైవేటు విద్య అందేలా చూడాలని ఈ సందర్భంగా పలువురు కోరుతున్నారు. -
అంగట్లో విద్య
‘జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలన్నీ నిబంధనలకు అనుగుణంగా గవర్నింగ్ బాడీ తీర్మానించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలి. ఆ వివరాలను నోటీసు బోర్డులో పొందుపర్చాలి. పిల్లలకు ఎలాంటి ప్రవేశ పరీక్షలు నిర్వహించరాదు. డొనేషన్లు వసూలు చేయకూడదు. ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు.’ - కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి మూడు రోజుల క్రితం చేసిన ప్రకటన ఇది. సాక్షి, కర్నూలు: ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలను కాలరాస్తున్నాయి. ఫీజుల వసూలులో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఈ విషయంలో జిల్లా సర్వోన్నతాధికారి ఆదేశాలనూ ఖాతరు చేయకపోవడం గమనార్హం. విద్యా హక్కు చట్టం కాగితాలకే పరిమితం కాగా.. పర్యవేక్షించాల్సిన అధికారులు సైతం మీనమేషాలు లెక్కిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.1 ప్రకారం ప్రైవేట్ పాఠశాలలు అర్హత, ప్రవేశ పరీక్షలు నిర్వహించడం నిషేధం. అయితే ప్రస్తుతం జిల్లాలో పరిస్థితి అందుకు భిన్నంగా సాగుతోంది. జిల్లాలో 1,050 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా.. కర్నూలుతో పాటు నంద్యాల, డోన్, ఆదోని, ఎమ్మిగనూరులో ఫీజుల మోత మోగుతోంది. ఒక్క కర్నూలులోనే 100 పైగా ప్రైవేట్ పాఠశాలలు నిర్వహిస్తుండగా.. 20 పైగా పాఠశాలల్లో డొనేషన్లు ఇవ్వనిదే సీటు దక్కని పరిస్థితి నెలకొంది. ఫీజుల నియంత్రణకు పాఠశాలలోని పిల్లల తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, యాజమాన్యం, డెరైక్టర్లు, ప్రధానోపాధ్యాయుడితో కూడిన గవర్నింగ్ బాడీ ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. మే, జూన్, జులై నెలల్లో ఈ కమిటీ పలు దఫాలుగా సమావేశమై ఫీజులను నిర్ణయించాల్సి ఉంది. తీర్మానం చేసిన అనంతరం ఆ వివరాలను నోటీసు బోర్డులో పొందుపర్చాలి. ఇందుకు సంబంధించిన ప్రతిని విద్యా శాఖ అధికారులకు పంపాలి. ఇవేవీ చేయకుండానే పాఠశాలల యాజమాన్యాలు అడ్డూఅదుపు లేని ఫీజులతో తల్లిదండ్రులను బెంబేలెత్తిస్తున్నాయి. ఇకపోతే టెక్నో, గ్లోబల్ స్కూళ్ల పేరిట ప్రచారం చేయరాదని విద్యా శాఖ గతంలోనే ప్రకటించింది. అయినప్పటికీ కరపత్రాలు, ఫ్లెక్సీలతో పాటు వివిధ మార్గాల్లో టెక్నో, గ్లోబల్ స్కూల్, డిజిటల్ తరగతుల పేరిట ప్రచారం మారుమోగుతోంది. ఈ సౌకర్యాల మాటున ఫీజుల దోపిడీ కొనసాగుతోంది. ప్రైవేట్ పాఠశాలలు వసూలు చేస్తున్న ఫీజులు, డొనేషన్లను పరిశీలిస్తే ఓ విద్యార్థి ఒకటి నుంచి 10వ తరగతి చదువు పూర్తి చేసేందుకు రూ.4 లక్షలకు పైగానే ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పీహెడ్డీ పూర్తి చేసినా ఇంత మొత్తం ఖర్చు కాదనేది జగమెరిగిన సత్యం. అయితే పిల్లలకు కార్పొరేట్ విద్యను అందించడంతో పాటు బంగారు భవిష్యత్‌కు బాటలు వేయాలనే తల్లిదండ్రుల ఆశను ప్రైవేట్ యాజమాన్యాలు తమ ఆదాయ వనరుగా మలుచుకోవడం ఆందోళన కలిగిస్తోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు ప్రభుత్వ నిబంధనల మేరకే ఫీజులు వసూలు చేయాలి. గవర్నింగ్ బాడీ తీర్మానించిన ఫీజులకు మించి వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు. వసూలు చేసిన ఫీజుకే రశీదు ఇవ్వాలి. తల్లిదండ్రులు కచ్చితమైన ఆధారాలతో ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందిస్తాం. - కె.నాగేశ్వరరావు, డీఈఓ