
టీడీపీతో పొత్తు వద్దు: రాజ్‌నాథ్‌తో బీజేపీ తెలంగాణ కమిటీ
సాక్షి, హైదరాబాద్: టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో భారీగా నష్టపోతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌కు ఆ పార్టీ తెలంగాణ ఉద్యమ కమిటీ విన్నవించింది. పార్టీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ నాయకత్వంలో పార్టీ నేతలు ఎన్.వేణుగోపాల్‌రెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి తదితరులు గురువారమిక్కడ రాజ్‌నాథ్‌సింగ్‌ను కలసి ఈమేరకు వినతిపత్రాన్ని అందజేశారు. 2004లో పొత్తులో భాగంగా పార్టీ 9 పార్లమెంటు, 27 అసెంబ్లీ సీట్లకు పోటీ చేస్తే, రెండు అసెంబ్లీ సీట్లే వచ్చాయని పేర్కొన్నారు.
అదే 2009లో ఎటువంటి పొత్తులు లేకుండా పోటీ చేసినా అవే రెండు అసెంబ్లీ సీట్లు గెలిచామని, అందువల్ల టీడీపీతో పొత్తు కన్నా లేకుండా ఉండడమే ప్రస్తుత పరిస్థితుల్లో మేలని తెలిపారు. తెలంగాణ సాధన కోసం పార్టీ చేసిన ఉద్యమాల వల్ల ఆ ప్రాంతంలో పార్టీ బలం పెరిగిందని వివరించారు. ఈనేపథ్యంలో ఒంటరి పోరుకే అనుమతించాలని కోరారు. అదే సమయంలో రెండు సార్లు ఎన్నికల బరిలో నిలిచి గెలవలేకపోయిన పార్టీ అభ్యర్థులకు మరో అవకాశం ఇవ్వొద్దని కూడా సూచించారు. వీరి వాదనను విన్న రాజ్‌నాథ్ సింగ్ ఈ సూచనలు, సలహాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
ఆర్‌ఎస్‌ఎస్ భేటీకి రాజ్‌నాథ్, గడ్కరీ: రెండు రోజులుగా కీసరలోని ఓ రిసార్టులో జరుగుతున్న ఆర్‌ఎస్‌ఎస్ కేంద్ర కమిటీ సమావేశానికి రాజ్‌నాథ్‌తో పాటు పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, వెంకయ్య నాయడు, ప్రధాన కార్యదర్శులు సౌధాన్ సింగ్, మురళీధర్‌రావు హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను, గత ఆరు నెలల్లో ఆర్‌ఎస్‌ఎస్, దాని అనుబంధ సంస్థలు చేపట్టిన కార్యక్రమాలను సమక్షించారు. సమావేశం వివరాలను గోప్యంగా ఉంచారు. ఆర్‌ఎస్‌ఎస్ సర్ కార్యవాహ్ (అధినేత) మోహ న్‌భగవత్, వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కొందరు ముఖ్యనేతలు మాత్రమే సమావేశంలో పాల్గొన్నట్లు తెలిసింది. కాగా, అస్వస్థతతో ఉన్న పార్టీ నేత బంగారు లక్ష్మణ్‌ను రాజ్‌నాథ్‌సింగ్ పార్టీ నేతలతో కలిసి పరామర్శించారు.
చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి: బీసీలకు చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని పలు బీసీ సంఘాలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరాయి. ఈ మేరకు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నాయకత్వంలోని ప్రతినిధి బృందం రాజ్‌నాథ్‌ను కలసి చర్చలు జరిపింది.