హైదరాబాద్ మాది.. వాటా అడగొద్దు | Don't ask share in Hyderabad: KCR | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ మాది.. వాటా అడగొద్దు

Published Mon, Aug 19 2013 2:00 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

హైదరాబాద్ మాది.. వాటా  అడగొద్దు - Sakshi

హైదరాబాద్ మాది.. వాటా అడగొద్దు

* ఆదాయాన్ని పంచుకోవడం కుదరదు.. శాంతి భద్రతలూ మా పరిధిలోనే..
* కేంద్రం చూస్తామంటే అంగీకరించం.. కిరికిరి చేస్తే రణరంగమే: టీఆర్‌ఎస్
* పదేళ్లకాలంలో కూడా ‘తాత్కాలిక ఉమ్మడి రాజధాని’ అనే పిలవాలి
* ‘హమారా హైదరాబాద్’ పేరుతో కార్యక్రమాలు
* కాంగ్రెస్‌పై ఎదురుదాడికి కేసీఆర్ వ్యూహం.. జిల్లాల పర్యటన
* ప్రజాప్రతినిధులు, జిల్లా అధ్యక్షులతో ఫామ్ హౌస్‌లో భేటీ
* తెలంగాణ వారిపై సీమాంధ్రలో దాడులు దారుణం
* అక్కడ సాగుతున్నది ప్రజా ఉద్యమం కాదు: నాయిని
 
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌పై మెలికలు పెట్టి కిరికిరి చేయాలనుకుంటే రణరంగమే అవుతుందని టీఆర్‌ఎస్ హెచ్చరించింది. పది జిల్లాలతో కూడిన తెలంగాణకు తప్ప మరే ప్రత్యామ్నాయానికీ ఒప్పుకునేది లేదని స్పష్టం చేసింది. ‘‘హైదరాబాద్ ఆదాయంలో వాటా అడిగినా, పదేళ్ల పాటు శాంతి భద్రతలు కేంద్రం పరిధిలో ఉంటాయన్నా అంగీకరించే ప్రసక్తే లేదు’’ అంటూ కుండబద్దలు కొట్టింది. ఆదివారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్‌లోని ఫామ్ హౌస్‌లో టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, పొలిట్ బ్యూరో సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో అధినేత కేసీఆర్ జరిపిన అత్యవసర సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అంతేగాక పదేళ్ల కాలం పాటు కూడా హైదరాబాద్‌ను ‘తాత్కాలిక ఉమ్మడి రాజధాని’ అని మాత్రమే పేర్కొనాలంటూ డిమాండ్ చేయాలన్న భావన వ్యక్తమైంది.

భేటీ అనంతరం టీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఇవే విషయాలను పునరుద్ఘాటించారు. 13 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడూ లేని భౌతిక దాడుల సంస్కృతి ప్రస్తుత సీమాంధ్ర ఉద్యమంలో కనిపిస్తోందంటూ ఆయన విమర్శించారు. తెలంగాణవాదులపై అక్కడ దాడులు పెరుగుతుండటం ఆందోళనకరమన్నారు. ‘‘సోనియాగాంధీ చిత్రపటాలపై చెప్పులతో దాడి చేసినా, మహా నేతల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ స్పందించడమే లేదు. కిరణ్‌కు బుద్ధీ జ్ఞానముంటే వీటిని అదుపు చేయాలి. లేకుంటే రాజీనా మా చేయాలి’ అని డిమాండ్ చేశారు. సీమాంధ్ర నేతలే దాడులను ప్రోత్సహిస్తున్నారని నాయిని ఆరోపించారు.

‘‘తెలంగాణలో రోడ్లెక్కిన వారినల్లా అరెస్టులతో నిర్బంధించిన పాలకులు ఇప్పుడు సీమాంధ్రలో ఆందోళనకారులను అదుపు చేయకపోవడం సహించరానిది’’ అని అన్నారు. సీమాంధ్రలో నడుస్తున్నది ప్రజా ఉద్యమం కానే కాదని నాయిని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలన్న సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని కేంద్రం తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ దిశగా కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు విజయోత్సవాలకు పరిమితమవడం సిగ్గుచేటంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేత వీహెచ్‌తో పాటు పలువురిపై జరిగిన దాడిని టీఆర్‌ఎస్ సంస్థాగత, శిక్షణా శిబిరాల కమిటీ చైర్మన్ కడియం శ్రీహరి ఖండించారు. ఇలా రెచ్చగొట్టి తెలంగాణ ప్రకటనను అడ్డుకోవడానికి సీమాంధ్ర నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంటు సమావేశాలను పొడిగించి తెలంగాణ బిల్లును ఆమోదించాలని మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు.

‘తాత్కాలిక’ సంబోధన తప్పనిసరి
హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే సాకుతో అక్కడి ఆదాయం, శాంతిభద్రతల వంటివాటిని కేంద్రం పరిధిలో ఉంచుతామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించొద్దని అంతకుముందు కేసీఆర్ సమక్షంలో జరిగిన సమావేశంలో కూడా నిర్ణయించారు. హైదరాబాద్ ప్రజలదీ  అదే అభిప్రాయమని చెప్పడానికి ‘హైదరాబాద్ హమారా’ నినాదంతో రోజూ కార్యక్రమాలు చేపట్టాలని భేటీలో పాల్గొన్న టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, పొలిట్‌బ్యూరో సభ్యులు, జిల్లా అధ్యక్షులు అభిప్రాయపడ్డారు. విశ్వసనీయ సమాచారం మేరకు... తెలంగాణ ఏర్పాటుకు యూపీఏ, సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నాక సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం, ఆంటోనీ కమిటీ, టీఆర్‌ఎస్ నేతలపై కాంగ్రెస్ ఆకర్షణ వ్యూహాన్ని అధిగమించడం తదితరాలు ప్రస్తావనకు వచ్చాయి.

ముఖ్యంగా హైదరాబాద్ భవితవ్యంపై లోతుగా చర్చ జరిగింది. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పేర్కొంటుండటంలోనూ కుట్ర కోణం ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఉమ్మడి రాజధాని అంటే పదేళ్ల తర్వాత కూడా దాన్ని మరికొంత కాలం పొడిగించే ప్రయత్నం జరగవచ్చని నేతలన్నారు. కాబట్టి ఈ పదేళ్ల కాలంలో కూడా హైదరాబాద్‌ను ‘తాత్కాలిక ఉమ్మడి రాజధాని’ అని మాత్రమే పేర్కొనాలంటూ డిమాండ్ చేయాలన్న భావన వ్యక్తమైంది.

ఆంటోనీ కమిటీ పేరుతో కాలయాపన చేసినా, హైదరాబాద్‌పై మెలికలు పెట్టి కిరికిరి చేసినా కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం ప్రస్తావనే ఉండబోదని నేతలతో కేసీఆర్ అన్నారు. ‘‘పైగా కాంగ్రెస్ నిర్ణయం కోసం వేచి చూస్తూ మౌనంగా ఉంటే పార్టీ నేతల్లో, శ్రేణుల్లో నిస్పృహ పెరుగుతుంది. టీఆర్‌ఎస్‌ను బలహీనపరచడానికి పార్టీ నేతలను ఆకర్షించే ప్రయత్నాలను కూడా కాంగ్రెస్ కొనసాగిస్తూనే ఉంటుంది. కాబట్టి శ్రేణులను క్రియాశీలపరిచి కాంగ్రెస్‌పై ఎదురుదాడికి దిగాల్సిందే. తెలంగాణ బిల్లుపై, హైదరాబాద్‌పై అటూ ఇటూ చేస్తే మరోసారి ఉద్యమానికి సన్నద్దంగా ఉన్నామనే సందేశాన్నివ్వాల్సిందే’’ అని ఆయన ప్రతిపాదించారు. వీటిపై నేతల అభిప్రాయాలు తీసుకున్నారు.
 
నెలాఖరు నుంచి కేసీఆర్ జిల్లా యాత్రలు: కడియం
రాష్ట్ర విభజన నిర్ణయం తరవాత రాజకీయంగా, ఉద్యమపరంగా టీఆర్‌ఎస్ శ్రేణుల్లో నెలకొన్న అనుమానాలను తొలగించి క్రియాశీలం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. అందులో భాగంగా ఈ నెలాఖరు నుంచి ఆయన జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రతి జిల్లాలోనూ పార్టీ విస్తృత స్థాయి సమావేశాలను నిర్వహిస్తారు. పార్టీ నిర్మాణంపై దృష్టి కేంద్రీకరిస్తే కాంగ్రెస్‌లోకి వలసలను కూడా నివారించొచ్చని నేతలు సూచించారు.

ఇందుకోసం నెల రోజుల్లోగా కేసీఆర్ అన్ని జిల్లాల్లో పర్యటించి విస్తృత స్థాయి సమావేశాలను ఏర్పాటు చేయాలనుకున్నారు. కేసీఆర్ పర్యటనలు నెలాఖరులో కరీంనగర్ నుంచి మొదలవుతాయని కడియం విలేకరులకు తెలిపారు.  పూర్తి వివరాలను ఒకట్రెండు రోజుల్లో వెల్లడిస్తామన్నారు. మండల స్థాయిలోని పార్టీ శ్రేణులకు తెలంగాణ భవన్‌లో శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. ఈ భేటీలో టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్, పార్టీ నేత వేణుగోపాలచారి పాల్గొనలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement