
'రైతుల ఆత్మాభిమానాన్ని కించపరచొద్దు'
భాగ్యనగరం వేదికగా నిన్న ప్రారంభమైన ప్రపంచ వ్యవసాయ సదస్సులో రైతు సంఘం నాయకులకు అవమానం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ నాగిరెడ్డి ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్లో నాగిరెడ్డి మాట్లాడుతూ... రైతు సంఘం నాయకులకు డిలిగేట్ పాస్ ఉన్న పోలీసులు లోపలికి అనుమతించకపోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
రైతుల ఆత్మాభిమానాన్ని కించపరచవద్దని నాగిరెడ్డి ఈ సందర్బంగా అటు ప్రభుత్వానికి ఇటు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. రైతుల పేరుతో సదస్సులు నిర్వహిస్తున్న ప్రభుత్వం రైతులనే అవమానపరచడం సరైన పద్దతి కాదని ఆయన వ్యాఖ్యానించారు. తమది రైతు ప్రభుత్వం అని కిరణ్ చెప్పుకుంటున్నారని, రైతు ప్రభుత్వం అంటే ఇదేనా అని నాగిరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ప్రపంచ వ్యవసాయ సదస్సు పేరుతో రూ.2.50 కోట్లు మేర నిధులను ప్రభుత్వం దుర్వీనియోగం చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారికంగా తనను ఆహ్వానించారు, అయిన పోలీసులు తనను సదస్సు లోపలికి అనుమతించకపోవడం అత్యంత దారుణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ నాగిరెడ్డి వ్యాఖ్యానించారు.