సభాపతి స్థానాన్ని కించపర్చొద్దు: భట్టివిక్రమార్క
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013పై శాసనసభలో చర్చ ప్రారంభమే కాలేదంటూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క తోసిపుచ్చారు. శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) తీసుకున్న నిర్ణయం మేరకే.. రాష్ర్టపతి పంపిన బిల్లును సభ ముందుంచడంతో పాటు చర్చను కూడా ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వంతో మాట్లాడాకే శాసనసభ షెడ్యూల్‌ను ప్రకటించామన్నారు. శాసనసభాపతి స్థానాన్ని అగౌరవపరిచేలా ఎవరూ మాట్లాడొద్దని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. ‘‘ఈ నెల 11న జరిగిన బీఏసీ సమావేశానికి అనుగుణంగానే రాష్ట్రపతి పంపిన బిల్లును సభలో టేబుల్ చేశాం. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు చర్చను ప్రారంభించారు. ప్రభుత్వంతో మాట్లాడిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నాం.
ఎవరికైనా ఏవైనా అనుమానాలుంటే రికార్డులను పరిశీలించుకోవచ్చు. అలాగే 17న జరిగిన బీఏసీ నిర్ణయంలో భాగంగానే శాసనసభ షెడ్యూల్‌ను రూపొందించి ప్రకటించాం. ఆ రోజు సమావేశంలో సీఎం కూడా ఉన్నారు’’ అని భట్టి గుర్తు చేశారు. సభను అడ్డుకోవడమంటే ప్రజాస్వామ్యాన్ని అడ్డుకున్నట్లుగానే భావించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇకనైనా ఉన్న సమయాన్ని వినియోగించుకుని స్పష్టంగా, హుందాగా అభిప్రాయాలు చెబుతారని ఆశిస్తున్నట్లు చెప్పారు. సభలో చర్చ జరగకుండా సభ్యులు కాగితాలను విసరడం బాధాకరమన్నారు.