‘కొణతాలను టీడీపీలో చేర్చుకోవద్దు’
అనకాపల్లి రూరల్: గోబ్యాక్.. గోబ్యాక్.. కొణతాల గోబ్యాక్..., మాకొద్దు బాబోయ్.. కొణతాల రామకృష్ణ మాకొద్దు బాబోయ్... అంటూ పట్టణ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. తెలుగుదేశం పార్టీలోకి కొణతాల రామకృష్ణను టీడీపీలో చేర్చుకోవద్దని స్థానిక నెహ్రూచౌక్ జంక్షన్‌లో సోమవారం సాయంత్రం ఆందోళన, రాస్తారోకో, దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహించారు. ఈసందర్భంగా పట్టణ టీడీపీ నాయకుడు బుద్ధ నాగ జగదీశ్వరరావు మాట్లాడుతూ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎన్టీఆర్ పేరు పెడితే దానిని తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి కొణతాల అన్నారు. తెలుగుదేశం కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు.
సత్తా, దమ్ము, సిగ్గు ఉంటే ప్రతిపక్షంలో ఉండి పోరాటాలు చేయాలని హితవుపలికారు. కబ్జా చేసిన భూములను కాపాడుకోవడానికే కొణతాల అధికార పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. అనంతరం ఆ పార్టీ శ్రేణులు మానవహారం నిర్వహించి, కొణతాల దిష్టిబొమ్మను దహనం చేశారు. బి.ఎస్.ఎం.కె. జోగినాయుడు, కొణతాల శ్రీను, బొలిశెట్టి శ్రీను, గుత్తా ప్రభాకర్ చౌదరి, బొద్దపు ప్రసాద్, వాకాడ కోటి తదితరులు పాల్గొన్నారు.
కశింకోటలో రాస్తారోకో
కశింకోట: మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవద్దని అధిష్టానాన్ని కోరుతూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం సాయంత్రం ఆందోళనకు దిగారు. స్థానిక పోలీస్‌స్టేషన్ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఆందోళనకు జెడ్పీటీసీ సభ్యురాలు మలసాల ధనమ్మ, విశాఖ డెయిరీ డెరైక్టర్ మలసాల రమణారావు, ఎంపీపీ పెంటకోట సుబ్బలక్ష్మి, టీడీపీ నాయకుడు పెంటకోట రాము నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీలో కొణతాల చేరికను తాము అంగీకరించబోమని, తరిమి కొడతామని హెచ్చరించారు.
తమ అభిమతానికి విరుద్ధంగా ఆయనను పార్టీలో చేర్చుకుంటే బస్సుల్లో హైదరాబాద్‌కు తరలివెళ్లి తీవ్ర నిరసన తెలియజేస్తామన్నారు. కొణతాల చేరిక యత్నాలకు వ్యతిరేకంగా మంగళవారం అనకాపల్లిలో నిర్వహించే సమావేశానికి కార్యకర్తలు,సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు తరలి రావాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ డెరైక్టర్ ప్రసాద్, సర్పంచ్ కర్రి దుర్గినాయుడు, ఎంపీటీసీ మాజీ సభ్యులు అద్దంకి సతీష్, మళ్ల సూర్యారావు, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.