వారిద్దరినీ విడిచిపెట్టొద్దు
- శివకుమార్, ఎమ్మెల్యే బొండాను శిక్షించాలని విపక్షాల డిమాండ్
- చిన్నారి సాయిశ్రీ మృతిపై వెల్లువెత్తిన సానుభూతి
సాక్షి, అమరావతి బ్యూరో: చికిత్సకు నోచుకోక దయనీయ స్థితిలో విజయవాడలో ప్రాణాలు విడిచిన బాలిక సాయిశ్రీ ఉదంతం సభ్యసమాజాన్ని కలచివేసింది. అందుకు కారకులైన ఆమె తండ్రి మాదంశెట్టి శివకుమార్, టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుపై ఆగ్రహం వెల్లువెత్తింది. సాయిశ్రీపై తండ్రి శివకుమార్ లైంగిక వేధింపులకు కూడా పాల్పడ్డాడని తల్లి సుమశ్రీ కన్నీటి పర్యంతమవుతూ చెప్పడంతో అంతా నిశ్చేష్టులయ్యారు. వైఎస్సార్ సీపీతోపాటు ఇతర ప్రతిపక్షా లు, ప్రజాసంఘాలు సుమశ్రీకి సంఘీభావం గా కదలివచ్చాయి. శివకుమార్, బొండా ఉమాపై చర్య తీసుకోవాలని డిమాండు చేస్తూ విజయవాడలో ర్యాలీ నిర్వహించాయి.
అంతిమ యాత్రలో ఉద్రిక్తత: సాయిశ్రీ మృతదేహం అంతిమయాత్ర సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. దుర్గానగర్‌లోని నివాసం నుంచి ప్రజా సంఘాలు వెంట రాగా అంతిమయాత్ర బయలు దేరింది. మొగల్రాజపురంలోని ఎమ్మెల్యే బొండా ఉమా నివాసం సమీపంలో సాయిశ్రీ మృతదేహాన్ని ఉంచి డప్పులు మోగిస్తూ బాధితులు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే నివాసం ఎదుట కూడా నిరసన తెలపాలని భావించగా పోలీసులు అడ్డుకున్నారు. స్వర్గపురి శ్మశానవాటిక వద్ద సాయిశ్రీకి దహన సంస్కారాలు నిర్వహించారు. సాయిశ్రీ మృతికి కారకులైన ఆమె తండ్రి శివకుమార్, టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమాపై కఠిన చర్యలు తీసుకోవాలని సుమశ్రీ విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు.
చిన్నారి మృతిపై హెచ్చార్సీ సీరియస్
నాంపల్లి : కన్నుమూసిన చిన్నారి సాయిశ్రీ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్‌గా స్పందించింది. దీనిపై ఈ నెల 20లోగా నివేదిక ఇవ్వాలని విజయవాడ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది.