మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ : మంచిర్యాల పట్టణంలోని సున్నంబట్టి వాడలో గల ఇంటిగ్రేటెడ్ హాస్టల్ (సమీకృత హాస్టల్)కు చెందిన విద్యార్థులు సరైన భోజనం పెట్టడం లేదని గురువారం రాత్రి హాస్టల్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ప్రతిరోజు మాడిపోయిన, పురుగులతో ఉండి, ఉడికి ఉడకని అన్నంను వడ్డిస్తున్నారని, రాగిజావలో మొత్తం పురుగలే ఉంటున్నాయని విద్యార్థులు ఆరోపించారు. కూరగాయలు లేని, నీళ్లతో కూడిన పప్పుతోనే మాకు భోజనం పెడుతున్నారని, అన్నం కూడా సరిపడా వేయడం లేదన్నారు. గదులు, హాస్టల్ పరిసరాలు శుభ్రంగా ఉండడం లేదని, మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉపయోగించేరీతిలో లేకపోవడంతో తాము రోజు ఆరుబయటకు వెళ్లాల్సి వస్తుందన్నారు. వార్డెన్లు ఉండకపోవడంతో వంటచేసేవారు, పనివారు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, ఇదే విషయమై వార్డెన్లకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతోనే తాము ఆందోళన చేస్తున్నామన్నారు. విద్యార్థులకు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు తోడుకావడంతో గంటసేపు హాస్టల్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. విద్యార్థుల డిమాండ్లకు తగినట్లుగా భోజనం అందిస్తామని వార్డెన్లు తెలపడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.
భోజనం విషయమై వార్డెన్ షబ్బీర్‌ను వివరణ కోరగా తమ హాస్టల్‌లో ఎస్టీలు 89, ఎస్సీలు 104, బీసీలు 76, ఓసీ 1 మొత్తం 270 మంది విద్యార్థులు ఉన్నారని, వీరి ఆహారం కోసం ప్రతి ఏడాది ప్రభుత్వం టెండర్లు వేసి కాంట్రాక్టు అప్పగిస్తుందని, ఈ ఏడాది ఎవరికి కాంట్రాక్టు ఇవ్వకపోవడంతో, వంటచేసే వారు సరుకులు కొనుక్కువస్తున్నారన్నారు. ఇకనైనా నాణ్యతతో కూడిన పదార్థాలు కొనుగోలు చేసి పెట్టేలా జాగ్రత్తలు తీసుకుంటామని, ప్రతి విద్యార్థికి సరిపడా భోజనం అందేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు టీఎన్‌ఎస్‌ఎఫ్ ఎడ్ల శ్యాం, టీవీఎస్ రవి, పీడీఎస్‌యూ తోకల తిరుపతి, ఎన్‌ఎస్‌యూఐ తిరుమల్, టీఆర్‌ఎస్వీ సోహైల్‌ఖాన్ పాల్గొన్నారు.
‘భోజనం’ వద్దే వద్దు..
Published Fri, Aug 30 2013 3:03 AM | Last Updated on Fri, Sep 1 2017 10:14 PM
Advertisement
Advertisement