integrated hostel
-
నాణ్యతకు చెల్లుచీటీ!
ఇష్టానుసారంగా సమీకృత వసతిగృహ భవన నిర్మాణం ఇసుకకు బదులు రాతి పౌడర్ వినియోగం కొరవడిన అధికారుల పర్యవేక్షణ కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా మెదక్: సమీకృత వసతి గృహ భవన నిర్మాణంలో నాణ్యతకు మంగళం పాడుతున్నారు. సిమెంట్, ఇసుకతో నిర్మించాల్సిన భవనాన్ని చౌకగా లభించే రాతి పౌడర్‌ను కలిపి నిర్మాణాలు సాగిస్తున్నారు. పది కాలాలపాటు మన్నికగా ఉండాల్సిన ఈ భవనం ఎన్నాళ్లపాటు ఉంటుందో ఎవరికి అంతుబట్టని ప్రశ్న. అదే సమయంలో కోట్లాది రూపాయల ప్రజాధనం మట్టిపాలవుతుంది. మెదక్ పట్టణంలోని జంబికుంట ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలు ఉన్నాయి. అవి శిథిలావస్థకు చేరడంతో ఈ మూడు వర్గాలకు చెందిన హాస్టళ్లను ఒకేచోట సమీకృత వసతి గృహ భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం రూ.2.27కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను ఆన్లైన్ ద్వారా చేజిక్కించుకున్న సదరు కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా నిర్మిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. భవన నిర్మాణానికి నాణ్యమైన ఇసుకతోపాటు సిమెంట్ కలిపి నిర్మిస్తారు. కాని ఈ కాంట్రాక్టర్ మాత్రం ఇసుక సిమెంట్‌తోపాటు రాతి పౌడర్‌ను సైతం కలుపుతున్నారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు. కాంట్రాక్టర్ ఓ వ్యక్తికి బాధ్యతలు అప్పగించారు. గోడలు, మరుగుదొడ్లను మాత్రమే నిర్మిస్తున్నామని సదరు వ్యక్తి పేర్కొన్నారు. ఇంతపెద్ద భవనాన్ని నిర్మిస్తున్న సంబంధిత శాఖ అధికారులు అక్కడ లేకపోవడం గమనార్హం. ఈ భవనంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన పేద విద్యార్థులు వందలాది మంది వసతి పొందుతారు. ఇంతటి ప్రాధాన్యత గల భవన నిర్మాణంపై నిర్లక్ష్యపు నీడలుకమ్ముకున్నాయి. మార్కెట్లో అతి చౌకగా లభించే రాతిపౌడర్ చూడటానికి సిమెంట్లాగే ఉంటుంది. అందులో ఎంతపౌడర్ కలిపినా గుర్తించేందుకు వీలుకాదు. సిమెంట్, ఇసుకతో నిర్మిస్తేనే ఏ భవన నిర్మాణమైనా పదికాలాలపాటు మన్నికగా ఉంటుందని ఇంజినీర్లు పేర్కొంటున్నారు. కానీ రాతిపౌడర్ను కలిపితే నాణ్యత దెబ్బతింటుందని చెబుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తగుచర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది. ఈ విషయమై విద్యాశాఖ ఏఈ అంసర్ అలీని సాక్షి వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. -
కేబినెట్లో చర్చిస్తా
సిద్దిపేట జోన్: మంత్రివర్గ సమావేశంలో సంక్షేమ వసతి గృహాల్లోని సమస్యల గురించి ప్రస్తావించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని మంత్రి హరీష్‌రావు హామీ ఇచ్చారు. శనివారం రాత్రి ఆయన సిద్దిపేటలోని ఇంటిగ్రేటెడ్ వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం విద్యార్థులతో సమావేశమై వసతి గృహంలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ, ప్రస్తుతం ఇస్తున్న కాస్మొటిక్ ఛార్జీలు తమకు సరిపోవడం లేదని, వాటిని రూ.100కు పెంచితే బాగుంటుందని తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి హరీష్‌రావు గతంలో కూడా అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఒప్పించి పేద విద్యార్థుల కోసం కాస్మొటిక్ ఛార్జీల పెంపునకై ప్రభుత్వంతో కొట్లాడటం జరిగిందని, ప్రస్తుతం అధికారంలో టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నందున తప్పకుండా పెంచి తీరుతామన్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగే మంత్రి వర్గ సమావేశంలో వసతి గృహంలో విద్యార్థుల కాస్మొటిక్ ఛార్జీలను వంద రూపాయలకు పెంచాలని, ప్రతి వసతి గృహంలో ఫిల్టర్ వాటర్‌ను ఏర్పాటు చేయాలని, వసతి గృహాల్లో ట్యూషన్ టీచర్ల ఆవశ్యకతను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటిని అమలు చేసేందుకు కృషి చేస్తానంటూ విద్యార్థులకు హామీనిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల అభివృద్ధి కోసం కృషి చేస్తోందని, కష్టపడి చదివి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారికి అవసరమైతే రూ.10 లక్షల ఆర్థిక సాయం చేసేందుకు సైతం ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అనంతరం వసతి గృహంలోని విద్యార్థుల సంఖ్య, మెనూ వివరాలు, మౌలిక వసతుల గురించి ఆరా తీశారు. దోమల బెడద అధికంగా ఉందన్న విద్యార్థుల ఆవేదనను గుర్తించి, వెంటనే వసతి గృహంలోని అన్ని కిటకీలకు తలుపులకు దోమజాలిని ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులకు ఉచితంగా దుప్పట్లు పంపిణీ చేసి వారితో పాటు శనివారం రాత్రి హాస్టల్లోనే నిద్రించారు. ఆయన వెంట సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, తహశీల్దార్ ఎన్వై గిరి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, నాయకులు దేవేందర్‌రెడ్డి, గుండు శ్రీను, శేషుకుమార్ తదితరులున్నారు. సరిగ్గా ఏడాది క్రితం.. ఏడాది క్రితం కూడా హరీష్‌రావు సిద్దిపేట వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. వెంటనే కొద్ది రోజులకే ప్రతిపక్ష ఉప నాయకుడి హోదాలో శాసన సభలో వసతిగృహ విద్యార్థుల వ్యథలపై శాసనసభలో గళం విప్పాడు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు అందించే కాస్మొటిక్ ఛార్జీలు సరిపోవడం లేదని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వాటి పెంపునకు కృషి చేశారు. -
వసతి గృహాలకు పెద్దపీట
కాళ్ల, న్యూస్‌లైన్: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో విద్యతోపాటు వసతిగృహాల నిర్మాణానికి అధిక ప్రాధాన్యమిచ్చారు. శిథిలావస్థకు చేరిక హాస్టళ్ల స్థానంలో అధునాతన సౌకర్యాలతో కూడిన భవనాలను నిర్మించారు. ఈ కోవకు చెందుతుంది కాళ్లలోని బాలికల సమీకృత వసతి గృహం (ఇంటిగ్రేటెడ్ హాస్టల్). కాళ్ల మండలంలో కాళ్ల, బొండాడలో బాలికల వసతి గృహాలు ఉండేవి. వీటిలో ఈ ప్రాంతంతో పాటు కృష్ణా జిల్లాలోని శివారు గ్రామాలకు చెందిన బాలికలు వసతి పొందేవారు. అయితే ఇక్కడ హాస్టళ్లకు సొంత భవనాలు లేకపోవడంతో విద్యార్థినులు అవస్థలు పడేవారు. 2007లో అప్పటి ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు ఈ విషయాన్ని మహానేత వైఎస్సార్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన మహానేత కాళ్లలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మాణానికి రూ.1.68 కోట్ల నిధులు మంజూరుచేశారు. 2008 జనవరిలో ఈ హాస్టల్ నిర్మాణ ప్రారంభమైంది. ఎనిమిది విశాలమైన గదులు, డైనింగ్‌హాల్, కిచెన్ హాల్, వెయిటింగ్ రూమ్, ఆఫీస్ రూమ్ వంటి అత్యాధునిక సౌకర్యాలతో హాస్టల్ రూపుదిద్దుకుంది. ఇది గ్రామంలో వైఎస్ ముద్రగా నిలిచిపోయింది. -
చీరాలలో రూ 3 కోట్లతో ఇంటిగ్రేటెడ్ హాస్టల్
చీరాలరూరల్, న్యూస్‌లైన్ : స్థానిక ఎల్బీఎస్ నగర్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల కోసం రూ 3 కోట్లు వెచ్చించి అన్ని వసతులతో కూడిన ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మించనున్నట్లు సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డెరైక్టర్ కే సరస్వతి తెలిపారు. ఆదివారం చీరాల వచ్చిన ఆమె స్థానిక సహాయ సాంఘిక సంక్షేమాధికారి కార్యాలయంలో చీరాల డివిజన్లోని హాస్టల్ వార్డెన్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఉన్న విద్యార్థులకు స్టడీ మెటీరియళ్లు, కాస్మోటిక్ చార్జీలు, ప్లేట్లు, గ్లాసులు, దుప్పట్లతో పాటు ఒక్కో విద్యార్థికి నాలుగు జతల దుస్తులు అందజేసినట్లు చెప్పారు. హాస్టళ్లలో విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకోవాలని వార్డెన్లకు సూచించారు. పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పబ్లిక్ పరీక్షలకు సిద్ధం చేయాలని చెప్పారు. ఐదు నుంచి పదో తరగతి వరకు విద్యనభ్యసిస్తున్న ఎస్సీ విద్యార్థులకు స్కాలర్షిప్ దరఖాస్తు విధానాన్ని తెలియజేసేందుకు 30 పాఠశాలలకు ఒక హాస్టల్ వార్డెన్‌ను నియమించినట్లు తెలిపారు. ప్రస్తుతం చీరాల ఎల్బీఎస్ నగర్లో ఉన్న ఎస్సీ, బీసీ హాస్టల్‌ను, శిథిల భవనాలను తొలగించేందుకు ప్రభుత్వం రూ 12 లక్షలు మంజూరు చేసిందని, నెల రోజుల్లో ఆ భవనాలను తొలగించి వాటి స్థానంలో రూ 3 కోట్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మించనున్నట్లు వివరించారు. ప్రస్తుతం వేటపాలెంలో రూ 18 లక్షలతో ఎస్సీ బాలికల వసతి గృహాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. సహాయ సాంఘిక సంక్షేమ శాఖాధికారి ఎన్జీవీ ప్రసాద్ అధ్యక్షత నిర్వహించిన సమావేశంలో చీరాల, వేటపాలెం, పర్చూరు, చెరుకూరు, కారంచేడు, ఎన్జీపాడు, అమ్మనబ్రోలు హాస్టల్ వార్డెన్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆ కాస్తా నిర్మిస్తే..
ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: ఇబ్రహీంపట్నం సమీపంలో వినోబానగర్ వద్ద ఇంటిగ్రేటెడ్ హాస్టల్ భవన నిర్మాణం పనులను పూర్తి చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. భవన సముదాయానికి శంకుస్థాపన చేసి ఐదేళ్లు అవుతున్నా ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 126 ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లు ఏర్పాటు చేయాలని 2008లో ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా జిల్లాలో ఇబ్రహీంపట్నం, శంషాబాద్, వికారాబాద్, తాండూరు ప్రాంతాల్లో హాస్టళ్ల భవనాలను నిర్మించాలని సంకల్పించారు. ఒక్కో హాస్టల్ భవనానికి రూ.కోటీ 60 లక్షలు మంజూరయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర హాస్టళ్లన్నింటినీ ఒకే సముదాయంలో ఉంచాలన్న ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వినోబానగర్ వద్ద భవన నిర్మాణానికి భూదాన్ భూమిని కేటాయించారు. ఫిబ్రవరి 19, 2009న అప్పట్లో గనుల శాఖా మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి ఈ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ భవ న నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏడాదిలోగా నిర్మాణం పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కానీ ఇప్పటికీ అరకొర పనులు జరిగాయి. గ్రౌండ్‌ఫ్లోరులో కొన్ని భవనాల నిర్మాణం పూర్తి కాగా మొదటి ఫ్లోరులో భవనాల నిర్మాణాలు కేవలం స్లాబ్‌కే పరిమితమయ్యాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యమో, అధికారుల అలసత్వమో తెలియదు గానీ కొన్నాళ్లుగా పనులే జరగడం లేదు. ఇదిలా ఉండగా గ్రౌండ్‌ఫ్లోర్‌లో నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాల్లోకి ఇబ్రహీంపట్నంలోని ఎస్సీ, ఎస్టీ బాలికల హాస్టళ్లను తరలించాలని అధికారులు ఇటీవలే నిర్ణయించారు. ఈ రెండు హాస్టళ్లలో దాదాపు 300 మంది బాలికలున్నారు. అయితే వీరికి గదులు సరిపోకపోవడంతోపాటు ఇతరత్రా పలు సమస్యలు ఎదురయ్యాయి. ఈ భవనాలకు ప్రహరీ నిర్మించకపోవడం సమస్యగా మారింది. బాలికల హాస్టళ్లకు ప్రహరీ గోడలు తప్పనిసరి. దీంతో బాలికల హాస్టళ్ల తరలింపును విరమించుకున్నారు. ఇదిలాఉంటే హాస్టళ్లకు ప్రహరీలు నిర్మాణానికి కలెక్టర్ శ్రీధర్ కొన్నాళ్ల క్రితమే నిధు లు మంజూరు చేసినట్లు సాంఘిక సంక్షేమ శాఖాధికారి ఒకరు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ప్రహరీ నిర్మాణం పనులు పూర్తికాగానే హాస్టళ్లను అక్కడికి తరలించడం జరుగుతుందన్నారు. -
‘భోజనం’ వద్దే వద్దు..
మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ : మంచిర్యాల పట్టణంలోని సున్నంబట్టి వాడలో గల ఇంటిగ్రేటెడ్ హాస్టల్ (సమీకృత హాస్టల్)కు చెందిన విద్యార్థులు సరైన భోజనం పెట్టడం లేదని గురువారం రాత్రి హాస్టల్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ప్రతిరోజు మాడిపోయిన, పురుగులతో ఉండి, ఉడికి ఉడకని అన్నంను వడ్డిస్తున్నారని, రాగిజావలో మొత్తం పురుగలే ఉంటున్నాయని విద్యార్థులు ఆరోపించారు. కూరగాయలు లేని, నీళ్లతో కూడిన పప్పుతోనే మాకు భోజనం పెడుతున్నారని, అన్నం కూడా సరిపడా వేయడం లేదన్నారు. గదులు, హాస్టల్ పరిసరాలు శుభ్రంగా ఉండడం లేదని, మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉపయోగించేరీతిలో లేకపోవడంతో తాము రోజు ఆరుబయటకు వెళ్లాల్సి వస్తుందన్నారు. వార్డెన్లు ఉండకపోవడంతో వంటచేసేవారు, పనివారు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, ఇదే విషయమై వార్డెన్లకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతోనే తాము ఆందోళన చేస్తున్నామన్నారు. విద్యార్థులకు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు తోడుకావడంతో గంటసేపు హాస్టల్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. విద్యార్థుల డిమాండ్లకు తగినట్లుగా భోజనం అందిస్తామని వార్డెన్లు తెలపడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. భోజనం విషయమై వార్డెన్ షబ్బీర్‌ను వివరణ కోరగా తమ హాస్టల్లో ఎస్టీలు 89, ఎస్సీలు 104, బీసీలు 76, ఓసీ 1 మొత్తం 270 మంది విద్యార్థులు ఉన్నారని, వీరి ఆహారం కోసం ప్రతి ఏడాది ప్రభుత్వం టెండర్లు వేసి కాంట్రాక్టు అప్పగిస్తుందని, ఈ ఏడాది ఎవరికి కాంట్రాక్టు ఇవ్వకపోవడంతో, వంటచేసే వారు సరుకులు కొనుక్కువస్తున్నారన్నారు. ఇకనైనా నాణ్యతతో కూడిన పదార్థాలు కొనుగోలు చేసి పెట్టేలా జాగ్రత్తలు తీసుకుంటామని, ప్రతి విద్యార్థికి సరిపడా భోజనం అందేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు టీఎన్ఎస్ఎఫ్ ఎడ్ల శ్యాం, టీవీఎస్ రవి, పీడీఎస్‌యూ తోకల తిరుపతి, ఎన్ఎస్యూఐ తిరుమల్, టీఆర్ఎస్వీ సోహైల్‌ఖాన్ పాల్గొన్నారు.