చీరాలరూరల్, న్యూస్‌లైన్ : స్థానిక ఎల్‌బీఎస్ నగర్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల కోసం రూ 3 కోట్లు వెచ్చించి అన్ని వసతులతో కూడిన ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మించనున్నట్లు సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డెరైక్టర్ కే సరస్వతి తెలిపారు. ఆదివారం చీరాల వచ్చిన ఆమె స్థానిక సహాయ సాంఘిక సంక్షేమాధికారి కార్యాలయంలో చీరాల డివిజన్‌లోని హాస్టల్ వార్డెన్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఉన్న విద్యార్థులకు స్టడీ మెటీరియళ్లు, కాస్మోటిక్ చార్జీలు, ప్లేట్లు, గ్లాసులు, దుప్పట్లతో పాటు ఒక్కో విద్యార్థికి నాలుగు జతల దుస్తులు అందజేసినట్లు చెప్పారు. హాస్టళ్లలో విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకోవాలని వార్డెన్లకు సూచించారు.
పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పబ్లిక్ పరీక్షలకు సిద్ధం చేయాలని చెప్పారు. ఐదు నుంచి పదో తరగతి వరకు విద్యనభ్యసిస్తున్న ఎస్సీ విద్యార్థులకు స్కాలర్‌షిప్ దరఖాస్తు విధానాన్ని తెలియజేసేందుకు 30 పాఠశాలలకు ఒక హాస్టల్ వార్డెన్‌ను నియమించినట్లు తెలిపారు. ప్రస్తుతం చీరాల ఎల్‌బీఎస్ నగర్‌లో ఉన్న ఎస్సీ, బీసీ హాస్టల్‌ను, శిథిల భవనాలను తొలగించేందుకు ప్రభుత్వం రూ 12 లక్షలు మంజూరు చేసిందని, నెల రోజుల్లో ఆ భవనాలను తొలగించి వాటి స్థానంలో రూ 3 కోట్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మించనున్నట్లు వివరించారు.
ప్రస్తుతం వేటపాలెంలో రూ 18 లక్షలతో ఎస్సీ బాలికల వసతి గృహాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. సహాయ సాంఘిక సంక్షేమ శాఖాధికారి ఎన్‌జీవీ ప్రసాద్ అధ్యక్షత నిర్వహించిన సమావేశంలో చీరాల, వేటపాలెం, పర్చూరు, చెరుకూరు, కారంచేడు, ఎన్‌జీపాడు, అమ్మనబ్రోలు హాస్టల్ వార్డెన్లు, సిబ్బంది పాల్గొన్నారు.