కేబినెట్‌లో చర్చిస్తా
సిద్దిపేట జోన్: మంత్రివర్గ సమావేశంలో సంక్షేమ వసతి గృహాల్లోని సమస్యల గురించి ప్రస్తావించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని మంత్రి హరీష్‌రావు హామీ ఇచ్చారు. శనివారం రాత్రి ఆయన సిద్దిపేటలోని ఇంటిగ్రేటెడ్ వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం విద్యార్థులతో సమావేశమై వసతి గృహంలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను గురించి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ, ప్రస్తుతం ఇస్తున్న కాస్మొటిక్ ఛార్జీలు తమకు సరిపోవడం లేదని, వాటిని రూ.100కు పెంచితే బాగుంటుందని తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి హరీష్‌రావు గతంలో కూడా అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఒప్పించి పేద విద్యార్థుల కోసం కాస్మొటిక్ ఛార్జీల పెంపునకై ప్రభుత్వంతో కొట్లాడటం జరిగిందని, ప్రస్తుతం అధికారంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వమే ఉన్నందున తప్పకుండా పెంచి తీరుతామన్నారు.
ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగే మంత్రి వర్గ సమావేశంలో వసతి గృహంలో విద్యార్థుల కాస్మొటిక్ ఛార్జీలను వంద రూపాయలకు పెంచాలని, ప్రతి వసతి గృహంలో ఫిల్టర్ వాటర్‌ను ఏర్పాటు చేయాలని, వసతి గృహాల్లో ట్యూషన్ టీచర్ల ఆవశ్యకతను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటిని అమలు చేసేందుకు కృషి చేస్తానంటూ విద్యార్థులకు హామీనిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల అభివృద్ధి కోసం కృషి చేస్తోందని, కష్టపడి చదివి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారికి అవసరమైతే రూ.10 లక్షల ఆర్థిక సాయం చేసేందుకు సైతం ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
అనంతరం వసతి గృహంలోని విద్యార్థుల సంఖ్య, మెనూ వివరాలు, మౌలిక వసతుల గురించి ఆరా తీశారు. దోమల బెడద అధికంగా ఉందన్న విద్యార్థుల ఆవేదనను గుర్తించి, వెంటనే వసతి గృహంలోని అన్ని కిటకీలకు తలుపులకు దోమజాలిని ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులకు ఉచితంగా దుప్పట్లు పంపిణీ చేసి వారితో పాటు శనివారం రాత్రి హాస్టల్‌లోనే నిద్రించారు. ఆయన వెంట సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, తహశీల్దార్ ఎన్‌వై గిరి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, నాయకులు దేవేందర్‌రెడ్డి, గుండు శ్రీను, శేషుకుమార్ తదితరులున్నారు.
సరిగ్గా ఏడాది క్రితం..
ఏడాది క్రితం కూడా హరీష్‌రావు సిద్దిపేట వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. వెంటనే కొద్ది రోజులకే ప్రతిపక్ష ఉప నాయకుడి హోదాలో శాసన సభలో వసతిగృహ విద్యార్థుల వ్యథలపై శాసనసభలో గళం విప్పాడు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు అందించే కాస్మొటిక్ ఛార్జీలు సరిపోవడం లేదని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వాటి పెంపునకు కృషి చేశారు.