భూములివ్వాల్సిన అవసరం లేదు
విశ్రాంత న్యాయమూర్తి లక్ష్మణరెడ్డి స్పష్టీకరణ
తాడేపల్లి: రాజధాని నిర్మాణానికి రైతులు భూములు ఇవ్వాల్సిన అవసరం లేదని విశ్రాంత న్యాయమూర్తి లక్ష్మణరెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి రైతులకు మంగళవారం రాత్రి ఆయన న్యాయ సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 9.2, 9.3 ఫారాలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని, ప్రభుత్వం వ్యాపారం చేసేందుకు, మూడు పంటలు పండే భూములను తీసుకోవడానికే.. ఈ ఫారాలు ప్రవేశపెట్టింది తప్ప అవేమీ చట్టాలు కావని తెలిపారు. ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చిన రైతులు ఆ భూములపై సర్వ ఆధికారాలు కోల్పోతారని జస్టిస్ లక్ష్మణరెడ్డి వివరించారు.
అడంగల్‌లో సైతం భూ యజమాని పేరును తొలగిస్తారన్నారు. ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటే రైతులు కోర్టులను ఆశ్రయించవచ్చని తెలిపారు. భూ సమీకరణ పూర్తికాక ముందే రెండో పంట వేయొద్దని ఏ విధంగా చెప్పారో సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్ రైతులకు వివరించాలన్నారు. భూ సమీకరణ తర్వాత ఆగ్రిమెంటుపై రైతు సంతకాలు చేస్తేనే ప్రభుత్వానికి అధికారం ఉంటుందనీ, అంతవరకు పంటలు వేయొద్దని ఎవరు చెప్పినా పట్టించుకోనవసరం లేదని స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ ఢిల్లీలో కనిపించకుండా పోయిందని గుర్తుచేశారు.