Lakshmana Reddy
-
వ్యసన విముక్తి కేంద్రాలను బలోపేతం చేయాలి
నెహ్రూ నగర్ (గుంటూరు ఈస్ట్): ప్రభుత్వ ఆసుపత్రులలో ఏర్పాటు చేసిన వ్యసన విముక్తి (డీ అడిక్షన్) కేంద్రాలను బలోపేతం చేయాలని ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. మంగళవారం గుంటూరుకు విచ్చేసిన ముఖ్యమంత్రిని కలిసి ఆయన ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో 50 పడకల డీ–అడిక్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో బహిరంగ మద్య సేవనాన్ని పూర్తిగా నిర్మూలించాలని, అన్ని టోల్గేట్ల వద్ద బ్రీత్ ఎనలైజర్ టీమ్స్‌ను ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను నిర్మూలించాలని కోరారు. ఇందుకు సీఎం జగన్ సానుకూలంగా స్పందిస్తూ ఈ అంశాలపై సరైన చర్యలు చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి కార్యాలయ ప్రిన్సిపల్ కార్యదర్శి ముత్యాలరాజును ఆదేశించారు. -
ప్రాంతానికో ఉప లోకాయుక్త
బి.కొత్తకోట: రాష్ట్ర లోకాయుక్తలో 5 వేలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఏపీ లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి చెప్పారు. వీటిని పరిష్కరించి ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు వీలుగా ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు మూడు ఉప లోకాయుక్తలను నియమించాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశామని తెలిపారు. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్ వచ్చిన ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో మూడేళ్లు లోకాయుక్త నియామకం జరగలేదని, దీనితో కేసుల సంఖ్య పెరిగిందని చెప్పారు. పైసా ఖర్చు లేకుండా, న్యాయవాది అవసరం లేకుండా ఫిర్యాదులకు న్యాయం చేస్తామని.. దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బోగస్ ఫిర్యాదులకు ఆధార్‌తో చెక్.. బోగస్ ఫిర్యాదుల వల్ల తమ విలువైన సమయం వృథా అవుతోందని, వీటిని నివారించేందుకు ఫిర్యాదుదారు ఫొటో, ఆధార్ నంబర్ జత చేసేలా నిబంధన విధించాలని ఆలోచిస్తున్నామని జస్టిస్ లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో ప్రతిభ చూపిన వారికి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకం రూ.50 లక్షలకు మించకూడదనే నిబంధన ఉందని, ఒకరికి ఎక్కువ, మరొకరికి తక్కువ ఇచ్చే పద్ధతి పాటించకుండా అందరినీ సమంగా చూసే విధంగా నిబంధనలు పాటించాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చామని తెలిపారు. పంచాయతీల పరిధిలోని ప్రభుత్వ భూములు, ఆస్తుల రక్షణ బాధ్యత రెవెన్యూ శాఖకు ఉందని, దీనిపై 2011లో జారీ అయిన జీవో అమలుకావడం లేదని పేర్కొన్నారు. దీనిపై జిల్లా, డివిజన్ స్థాయి అధికారిక కమిటీలు సమావేశాలు, సమీక్షలు జరిపి ఆస్తులను కాపాడాలని కలెక్టర్లకు లేఖలు రాశామన్నారు. హార్సిలీహిల్స్ సహకార గృహ నిర్మాణ సంఘానికి ప్రభుత్వం విక్రయించిన భూమి ఏ స్థితిలో ఉంది, భూమి కేటాయింపు, ఆక్రమణలపై సమగ్ర విచారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టు భూ పరిహారం, నిర్వాసితులకు అందాల్సిన ఆర్థిక సహాయంపై బోగస్ లబ్ధిదారులు పుట్టుకొచ్చినట్టు ఫిర్యాదులు అందాయని, దీనిపై పోలవరంలో క్యాంపు ఏర్పాటు చేసి విచారణ చేపడతామని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ ఆలయాలకు చెందిన భూములు అన్యాక్రాంతమైనట్టు ఆ శాఖ కమిషనర్ నివేదిక ఇచ్చారని, దీనిపై చర్యలకు ఆదేశిస్తామని చెప్పారు. లోకాయుక్తకు చేసే ఫిర్యాదుల విషయంలో దళారులను అశ్రయించవద్దని కోరారు. -
మద్యం వినియోగం తగ్గింది
కర్నూలు: ప్రభుత్వం చేపట్టిన బహుముఖ కార్యక్రమాల ఫలితంగా రాష్ట్రంలో మద్యం వినియోగం భారీగా తగ్గిందని ఆంధ్రప్రదేశ్ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ లక్ష్మణరెడ్డి తెలిపారు. కర్నూలులోని హరిత హోటల్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలను జాగృతం చేయడం ద్వారానే మద్యం నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. మద్యం అక్రమాలపై 14500 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేస్తే సత్వర చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. డ్రగ్స్, మత్తు పానీయాలపై విద్యార్థులు, యువకులను జాగృతం చేసేందుకు కర్నూలు నగరం నుంచి నవంబర్ నెల 1వ తేదీన కళాజాత ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. -
పోలవరం పరిహారంలో అక్రమాలు
బి.కొత్తకోట (చిత్తూరు జిల్లా): పోలవరం భూ నిర్వాసితులకు చెల్లించిన పరిహారంలో అక్రమాలు వెలుగుచూసినందున వాటిని సమగ్రంగా పరిశీలించాల్సిందిగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసినట్లు రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి వెల్లడించారు. ఈ చెల్లింపులన్నీ గత ప్రభుత్వ హయాంలో జరిగిన సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలం చెన్నరాయునిపల్లెలో శనివారం జస్టిస్ లక్ష్మణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తమకు అందిన ఫిర్యాదుల్లో హౌస్‌ఫెడ్, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, పోలవరం పరిహారంలో అక్రమాలు వెలుగుచూశాయని చెప్పారు. పోలవరం పరిహారంపై పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నివేదిక చూశాక సీఐడీ ద్వారా సమగ్ర విచారణకు ఆదేశించనున్నట్లు చెప్పారు. నిర్వాసితులకు మరో రూ.30 వేల కోట్లకు పైగా పరిహారం ఇవ్వాల్సి వున్నందున అనర్హుల ఏరివేతతో ప్రభుత్వంపై భారం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వ హయాంలోని వివిధ అంశాలపై జస్టిస్ లక్ష్మణరెడ్డి వెల్లడించిన వివరాలివీ.. ► పోలవరం ప్రాజెక్టు భూ నిర్వాసితుల్లో నిరక్ష్యరాస్యులు ఉండడంతో అక్రమాలు జరిగినట్లు తేలింది. మాకు అందిన ఫిర్యాదులను డీఎస్పీ ద్వారా క్షేత్రస్థాయిలో విచారణ చేయించాం. ఓ రేషన్ షాపు డీలర్ భార్య పేరుతో రూ.64 లక్షల పరిహారం పొందారు. దీన్ని విచారిస్తే ప్రభుత్వ భూమిని సొంత పట్టా భూమిగా చూపి పరిహారం పొందినట్లు నిర్ధారణ అయింది. ఆ సొమ్మును రికవరి చేశాం. ఇలాంటి అక్రమాలను బాధితులు మా దృష్టికి తెచ్చారు. ► గుంటూరు, కృష్ణా జిల్లాల్లో బోగస్ పట్టాలు, పట్టాదారు పాసుపుస్తకాలతో బ్యాంకుల నుంచి రుణాలు పొందారు. ఇలా ఇంకెన్ని మోసాలు జరిగాయో నిగ్గు తేల్చాలని కలెక్టర్లకు లేఖలు రాశాం. ► తూర్పు గోదావరి జిల్లా తొండంగి గ్రామంలో 90 శాతం మంది రైతులు ప్రైవేటు వ్యాపారుల నుంచి అప్పులు తీసుకుని తాము వ్యవసాయం చేస్తున్నామని, ఇక్కడి ప్రాథమిక సహకార పరపతి సంఘంలో తమ పేర్లతో రుణాలు పొందినట్లు అనుమానిస్తూ రైతులు ఫిర్యాదు పంపారు. దీనిపై విచారణ జరపాలని కలెక్టర్‌కు ఆదేశాలిచ్చాం. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలపై విచారణ జరపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశాం. ► అలాగే, వైఎస్సార్ జిల్లాకు చెందిన గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ రుణగ్రహీతలు చెల్లించిన రుణాలను తన సొంతానికి వాడుకున్న కేసు విచారణలో ఉంది. అనంతపురం జిల్లా కదిరికి చెందిన ఓ వ్యక్తి ఇంటిపై రూ.75వేల రుణం తీసుకుని చెల్లించినా, ఇంకా రూ.6.96 లక్షల రుణం ఉందంటూ హౌస్‌ఫెడ్ అధికారులు నోటీసిచ్చారు. కాబట్టి.. హౌస్‌ఫెడ్‌కు చెల్లిస్తున్న వాయిదాల రసీదులను రుణగ్రహీతలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ► గ్రంథాలయ సెస్సు చెల్లించకుండా స్థానిక సంస్థలు నిర్లక్ష్యం చేశాయి. దీంతో రాష్ట్రంలోని మున్సిపాలిటీల నుంచి రూ.60 కోట్ల సెస్సును గ్రంథాలయ సంస్థకు చెల్లించేలా చేశాం. అలాగే, స్థానిక సంస్థలకు అందాల్సిన సీవరేజి చార్జీలను ప్రభుత్వ శాఖల నుంచి రూ.100 కోట్లకు పైగా వసూలుచేసి వాటికి జమచేశాం. ► చెరువుల ఆక్రమణలపై చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి విన్నవించాం. ప్రస్తుతం జరుగుతున్న సమగ్ర భూ సర్వేలో చెరువులకూ సర్వే జరపాల్సిన అవసరం ఉంది. లోకాయుక్త సేవలను కోస్తా వాసులు సది్వనియోగం చేసుకొంటున్నారు. ఈ విషయంలో రాయలసీమ వెనుకబడింది. ప్రభుత్వాధికారులు సేవలను అందించడంలో నిర్లక్ష్యం చేసినా, నష్టం కలిగించినా లోకాయుక్తను ఆశ్రయించవచ్చు. ఇటీవల ఎక్సైజ్ శాఖలోని సెక్యూరిటీ గార్డులకు వేతనాలు, ఈఎస్ఐ, పీఎఫ్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న కేసును పరిష్కరించి తొమ్మిది మందికి న్యాయం చేశాం. -
‘రాష్ట్రంలో తగ్గిన 60 శాతం బీర్ వినియోగాలు’
సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన బహుముఖ కార్యక్రమాల ఫలితంగా రాష్ట్రంలో 40 శాతం లిక్కర్ వినియోగం తగ్గిందని మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి అన్నారు. అలాగే 60 శాతం బీర్ వినియోగం కూడా తగ్గందన్నారు. గుంటూరు రేంజ్ డీఐజీగా నియమితులైన డా. త్రివిక్రమ వర్మను బుధవారం వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి అభినందించారు. ఈ మేరకు బుధవారం డీఐజీ కార్యాలయంలో డా. త్రివిక్రమ వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో నేరాలు సైతం 18 శాతం తగ్గాయని డీఐజీకి వివరించారు. రాష్ట్రంలో దశల వారీ మద్య నిషేధం అమలులో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పాత్ర గణనీయంగా పెరిగిందన్నారు. పోలీస్ పాత్ర పెరగటం హర్షణీయమని, తద్వారా సత్ఫలితాలు వస్తున్నాయని వివరించారు. చదవండి: వారి రక్షణే మా ప్రాధాన్యం: సీఎం జగన్ "సెబ్ " ఏర్పడక ముందు జనవరి 2020 నుంచి మే15 వరకు సగటున ప్రతి నెల 3,800 కేసులు నమోదయ్యాయని, 3500 మంది అరెస్టు అయ్యారని వల్లరెండ్డి లక్ష్bమణ రెడ్డి తెలిపారు. ప్రతి నెల ఆరు వేల లీటర్ల అక్రమ మద్యం దొరికిందని, 700 వాహనాలను పట్టుకున్నారని అన్నారు. అదే "సెబ్ " ఏర్పడిన తర్వాత మే 15 నుంచి అక్టోబర్ 20 వరకు ప్రతి నెలా సగటున 10, 200 కేసులు నమోదు అవుతున్నాయని, 12800 మంది అరెస్టు అవుతున్నారని పేర్కొన్నారు. ప్రతి నెల 82 వేల లీటర్ల అక్రమ మద్యం దొరుకుతుందని, ప్రతి నెల 3600 వాహనాలను పట్టుకోవడం జరుగుతుందని తెలిపారు. మద్యం అక్రమార్కులపై "సెబ్ " ఉక్కుపాదం మోపుతుందన్నారు. దీనిపై డీఐజీ స్పందిస్తూ.. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఎలాంటి అక్రమాలు జరిగినా తమ దృష్టికి తీసుకొస్తే సత్వర చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. -
కరోనా: ‘ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు’
సాక్షి, గుంటూరు : పేదల ఆరోగ్య పరిరక్షణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అడుగు వేసిందని ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. కరోనా వైరస్ విస్తృతమవుతున్న వేళ కీలక నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. ఈమేరకు గురువారం లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రజలకు తెలిపారు. కరోనా బాధితులకు ప్రైవేటు చికిత్స అందించేందుకు సిద్ధమైందని, వైద్యం కోసం ఆరోగ్య శ్రీ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించడం శుభపరిణామమన్నారు. దానికి అనుగుణంగా వైద్య ఆరోగ్యశాఖ తరుపున జీవో 77 విడుదలైందని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయడంతో ప్రజలకు ఉపశమనం ఖాయమని తెలియజేశారు. (కరోనా టెస్టుల్లో దూసుకుపోతున్న ఏపీ..) ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కరోనా వైద్యాన్ని ఆరోగ్య శ్రీలో చేర్చుతూ నిర్ణయం తీసుకున్నారని.. తాజాగా ఆయా ఆసుపత్రుల వర్గీకరణ, వైద్యానికి ధరలు నిర్ణయించడంతో మార్గం సుగమం అయిందన్నారు. ఇటీవల తెలంగాణలో కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు కరోనా వైద్య సహాయం పొందుతున్న వారి నుంచి లక్షల్లో వసూలు చేస్తున్న ఫీజుల వ్యవహారం కలవరం కలిగించిందని, చాలామందిని ఆందోళనకు గురిచేసిందని గుర్తుచేశారు. ప్రభుత్వ ఆసుపత్రులలో తగిన వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయకుండా, ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షల్లో ఫీజులు గుంజుతున్న తీరుపై తెలంగాణలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వివరించారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం కరోనా బాధితుల పట్ల ఊరటనిచ్చే నిర్ణయం తీసుకోవడాన్ని ప్రతీఒక్కరూ గుర్తించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల విధుల నిర్వహణకు సిబ్బంది నియామకం.. వైద్యుల రిక్రూట్మెంట్ చేయడంతో పాటు సదుపాయాలు కల్పించేందుకు వివిధ ఏర్పాట్లు చేస్తోందని వివరించారు. అదే సమయంలో ఉచితంగా కరోనా సేవలు అందించేందుకు ఎంపిక చేసిన ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతినిస్తోందని లక్ష్మణరెడ్డి తెలిపారు. (అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై దళిత నేతల హర్షం) బాధితులకు తగిన చికిత్స అందించేందుకు అవకాశం ఉన్న ఆసుపత్రులను ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయా ఆసుపత్రిలో వైద్యానికి అయ్యే ఖర్చుని ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారు. నాన్ క్రిటికల్ పేషెంట్లకు రోజుకి రూ.3250 క్రిటికల్ కేర్ ఐసీయూలో వెంటిలేటర్ , ఎఐవీ అవసరం లేకుండా రోజుకి రూ.5,480.. ఐసీయూలో ఎన్ఏవీ చికిత్స రూ. 5980 అని తెలిపారు. అలాగే ఐసీయూలో వెంటిలేటర్ తో చికిత్స రూ. 9,580.. వెంటిలేటర్ లేకుండా సెప్సిస్ చికిత్స రూ. 6,280 వెంటిలేటర్‌తో సెప్సిస్ చికిత్స రూ.10,380 ..నాన్ క్రిటికల్ పేషెంట్లు ఎవరైనా ప్రత్యేక రూమ్ కావాలని ఆశిస్తే అదనంగా రోజుకి రూ.600 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తూ ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించనున్నట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా వైద్య సేవలు మరింత విస్తృతమవడమే కాకుండా ప్రజల్లో ఆందోళన తొలగి, కరోనాని ఎదుర్కొనే అవకాశం దక్కుతుందని లక్ష్మణరెడ్డి తెలియజేశారు. -
‘రాష్ట్రేతరులను కూడా జగన్ ఆదరించారు’
సాక్షి, గుంటూరు: విశ్రాంతి శిబిరాల్లో ఏర్పాట్లు బాగున్నాయని మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి కొనియాడారు. గుంటూరు ఆర్వీఆర్ జేసీ కాలేజీలో ఉంటున్న వలస కార్మికులకు ఆయన బుధవారం మామిడి పండ్లు, భోజనం పంపిణీ చేశారు. అభ్యుదయ ఆదర్శ రైతు నారాయణరెడ్డి తన పదెకరాల తోటలో పండించిన ఆర్గానిక్ మామిడి పండ్లను అందించారు.అదేవిధంగా వైఎస్ఆర్ సీపీ సేవాదళ్ జిల్లా చైర్మన్ మెట్టు వెంకటప్పారెడ్డి ఆధ్వర్యంలో భోజనం ప్యాకెట్లు సమకూర్చారు.కార్మికులకు అన్నిరకాల వసతులతో విశ్రాంతి శిబిరాలను ఏర్పాటు చేసి వారిని గమ్యస్థానాలకు చేర్చడంలో ప్రభుత్వ పనితీరు భేష్ అని కొనియాడారు. (విజయవాడ చేరుకున్న 156 మంది ప్రవాసాంధ్రులు) బుధవారం స్థానికి చౌడవరం ఆర్వీఆర్ జేసీ కాలేజీలో ఆయన మాట్లాడుతూ... వేల కిలోమీటర్ల మేర కాలినడకన, సైకిళ్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ మీదుగా పోయే వలస కార్మికులను చేరదీసి ప్రభుత్వం విశ్రాంతి శిబిరాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. రవాణా ఏర్పాట్లు సమకూర్చే వరకు శిబిరాల్లో వారిని ఉంచి ఉచిత భోజనం తదితర వసతులు కల్పించడం మంచి నిర్ణయమన్నారు. రాష్ట్రేతర వ్యక్తులను సైతం ఆపదలో ఆదుకొంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మానవత్వం ఆదర్శనీయమన్నారు. ఒరిస్సా, కలకత్తా, శ్రీకాకుళం తదితర ప్రాంతాలకు చెందిన వలస కార్మికులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహాయ కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ గుంటూరు సీఐ వి.రేఖ, గుంటూరు రూరల్ ఆర్ఐ రాజా, వీఆర్వోలు పాల్గొన్నారు. (త్రీస్టార్.. తిరుపతి వన్) -
‘సీఎం జగన్ మనసున్న మారాజు’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో చిక్కుకుపోయిన వేలాది మంది వలస కూలీలను తరలించేందుకు ఏర్పాట్లు చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మనసున్న మారాజులా వ్యవహరిస్తున్నారని జనచైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఒక ప్రకటనలో అభినందించారు. వివిధ రాష్ట్రాల నుంచి ఏపీ మీదుగా కాలినడకన వెళుతున్న వలస కూలీల కష్టాలను చూసిన ఏపీ ప్రభుత్వం వారిని సురక్షితంగా సొంత ప్రాంతాలకు పంపడంలో ప్రత్యేక శ్రద్ధ వహించడం గొప్పవిషయమన్నారు. దీని పై సర్వత్రా హర్షం వ్యక్తమౌతోందని పేర్కొన్నారు. వలస కూలీలకు భోజన, వసతి సౌకర్యాలను కల్పించి శ్రామిక్ రైళ్లల్లో వారి సొంత రాష్ట్రాలకు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. వలస కూలీల దారి ఖర్చుల కోసం ఒక్కొక్కరికి రూ.500 లను ఇవ్వడం మామూలు విషయం కాదని పేర్కొన్నారు. ఉపాధి కోసం వేలాది కిలోమీటర్లు వెళ్లిన వలస కూలీలు ఆయా రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందేన్నారు. లాక్‌డౌన్‌తో చేతిలో చిల్లిగవ్వ లేక పరాయి రాష్ట్రాల్లో అష్టకష్టాలు పడుతున్న వలస కూలీలు ప్రాణాలకు తెగించి సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు తమ కాళ్లనే నమ్ముకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోని చిత్తూరు మీదుగా తరలివస్తున్న కూలీలను మానవతా దృక్పధంతో ఆదుకోని ఇక్కడ వారి కోసం ప్రభుత్వం ఆశ్రయం కల్పించడం అభినందిచాల్సిన విషయమని కొనియాడారు. వారికి వసతి, ఆహారం అందించడంతో పాటు వైద్యపరీక్షలు చేసి ఆరోగ్యధృవీకరణలు అన్ని చేసిన తరువాత రవాణా సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చి సొంత ప్రాంతాలకు పంపుతున్నట్లు లక్ష్మణరెడ్డి వివరించారు. ఏపీ నుంచి ఇప్పటి వరకు 1,10,000 మంది వలస కూలీలను వారి సొంత జిల్లాలకు పంపారని తెలిపారు. ఇప్పటి వరకు పరాయి రాష్ట్రంలో సొంతవారికి దూరంగా వేదనాభరిత జీవనాన్ని కొనసాగించిన వలస కూలీలు సొంత ఊళ్లకు చేరుకోవడంతో వారి కళ్లల్లో వెలకట్టలేని ఆనందం కనిపిస్తోందని లక్ష్మణరెడ్డి తెలిపారు. -
‘శాసన మండలి రద్దు ను స్వాగతిస్తున్నాం’
సాక్షి, అమరావతి : ప్రజల తీర్పును తిరస్కరిస్తూ పెద్దల కనుసన్నలలో నడుస్తున్న శాసనమండలిని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ చేసిన తీర్మానాన్ని జనచైతన్య వేదిక ఆంధ్ర ప్రదేశ్ కమిటీ అధ్యక్షులు వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి స్వాగతించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని శాసన మండలి రద్దు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ‘భారతదేశంలో కేవలం ఆరు రాష్ట్రాలలో మాత్రమే కొనసాగుతున్న శాసనమండలి వ్యవస్థ వలన ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంవత్సరానికి 60 కోట్లు ప్రజాధనం వృధా అవుతుంది. 50 శాతం ప్రజలు ఓట్లతో 154 మంది శాసనసభ్యులు బలపరిచిన పలు ప్రజా ఉపయోగ బిల్లులకు శాసనమండలి అడ్డుకట్ట వేయడం దుర్మార్గం. రాజకీయ పునరావాస కేంద్రంగా మారిన శాసనమండలిని దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు గతంలోనే చరమగీతం పాడాయి. మేధావులు, గ్రాడ్యుయేట్స్, ఉపాధ్యాయుల ప్రాతినిధ్యం కోసం ఏర్పడిన పెద్దల సభ ఆచరణలో గ్యాలరీ లో కూర్చుని రిమోట్ కంట్రోల్ తో నడిచే విధంగా మారటం శాసన మండలి డొల్లతనానికి నిదర్శనం. ఆచరణలో ఆరొవ వేలుగా మిగిలిన శాసనమండలిని చరమగీతం పాడటాన్ని హర్షిస్తున్నాం’ అని వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు. -
దీక్ష సరే...అవినీతిపై నోరు విప్పరేం?
సాక్షి, అమరావతి: నవ నిర్మాణ దీక్ష పేరిట ఆర్భాటం చేస్తున్న సీఎం చంద్రబాబు తన నాలుగేళ్ల పాలనలో జరిగిన అవినీతిపై నోరెందుకు విప్పడం లేదని జన చైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి ప్రశ్నించారు. రాజధాని పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. ఈ మేరకు శనివారం ఆయన 20 ప్రశ్నలతో ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎంకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వీటిపై స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలోని 50 వేల నగరాల్లో ఒకటిగా లేని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో ఐదో స్థానంలోకి తెస్తానని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని తెలిపారు. కేంద్రీకృత అభివృద్ధి ధోరణి మంచిది కాదని పేర్కొన్నారు. రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయకపోవడం న్యాయమా? అని ప్రశ్నించారు. ఏపీని అవినీతిలో అగ్రస్థానంలో నిలబెట్టారని మండిపడ్డారు. -
పార్టీ ఫిరాయింపులపై 26న చర్చా గోష్టి
సీతంపేట: ‘పార్టీ ఫిరాయింపులు, ప్రమాదంలో ప్రజాస్వామ్యం’ అనే అంశంపై ఈనెల 26వ తేదీన ద్వారకానగర్‌లోని విశాఖ పౌరగ్రంథాలయంలో మధ్యాహ్నం రెండు గంటలకు చర్చాగోష్టి జరుగుతుందని జనచైతన్య వేదిక రాష్ర్ట అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి తెలిపారు. ఈ చర్చా గోష్టిలో విశ్రాంత ఐఏఎస్ అధికారి ఇ.ఎ.ఎస్.శర్మ, ప్రొఫెసర్లు వి. బాలమోహన్‌దాస్, కె.ఎస్.చలం, ప్రసన్నకుమార్, కె.తిమ్మారెడ్డి, జి.హరగోపాల్, బాబీవర్ధన్, సీనియర్ పాత్రికేయుడు వి.వి..రమణమూర్తి, ఉత్తరాంధ్ర రక్షణ వేదిక అధ్యక్షుడు శివశంకర్ పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఆశించే అభ్యదయకాముకులు, ప్రజా సంఘాల నేతలు, మేధావులు చర్చా గోష్టిలో పాల్గొనవలసిందిగా కోరారు. -
భూములివ్వాల్సిన అవసరం లేదు
విశ్రాంత న్యాయమూర్తి లక్ష్మణరెడ్డి స్పష్టీకరణ తాడేపల్లి: రాజధాని నిర్మాణానికి రైతులు భూములు ఇవ్వాల్సిన అవసరం లేదని విశ్రాంత న్యాయమూర్తి లక్ష్మణరెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి రైతులకు మంగళవారం రాత్రి ఆయన న్యాయ సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 9.2, 9.3 ఫారాలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని, ప్రభుత్వం వ్యాపారం చేసేందుకు, మూడు పంటలు పండే భూములను తీసుకోవడానికే.. ఈ ఫారాలు ప్రవేశపెట్టింది తప్ప అవేమీ చట్టాలు కావని తెలిపారు. ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చిన రైతులు ఆ భూములపై సర్వ ఆధికారాలు కోల్పోతారని జస్టిస్ లక్ష్మణరెడ్డి వివరించారు. అడంగల్‌లో సైతం భూ యజమాని పేరును తొలగిస్తారన్నారు. ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటే రైతులు కోర్టులను ఆశ్రయించవచ్చని తెలిపారు. భూ సమీకరణ పూర్తికాక ముందే రెండో పంట వేయొద్దని ఏ విధంగా చెప్పారో సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ రైతులకు వివరించాలన్నారు. భూ సమీకరణ తర్వాత ఆగ్రిమెంటుపై రైతు సంతకాలు చేస్తేనే ప్రభుత్వానికి అధికారం ఉంటుందనీ, అంతవరకు పంటలు వేయొద్దని ఎవరు చెప్పినా పట్టించుకోనవసరం లేదని స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ ఢిల్లీలో కనిపించకుండా పోయిందని గుర్తుచేశారు. -
విభజన జరిగితే సీమాంధ్రకు నష్టం
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్:రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, అందువల్ల సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ వి.లక్ష్మణరెడ్డి పిలుపునిచ్చారు. శ్రీకాకుళం ప్రెస్‌క్లబ్‌లో ఆది వారం వేదిక జిల్లా కన్వీనర్ పొన్నాడ వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ పెత్తనం కోసం తెలుగుజాతిని విచ్ఛిన్నం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు చేస్తున్న యత్నాలను తిప్పికొట్టాలన్నారు. రాష్ట్రాన్ని విభజించాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్-3ని సవరించాల్సి ఉంటుందన్నారు. సమైక్యాంధ్ర కోసం ఎన్జీవోలు చేసిన సమ్మె అభినందనీయమని, అయితే అందరినీ కలుపుకొనిపోలేకపోయారన్నారు. సీమాంధ్ర ప్రజలు ఇంతగా ఉద్యమిస్తున్నా సోనియాగాంధీ విభజనకే కంకణం కట్టుకోవడం దురదృష్టకరమన్నారు. సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులు ఉద్యమాన్ని పట్టించుకోకుండా విభజన జరిగిపోయిందంటూ సమైక్యవాదాన్ని విచ్ఛిన్నం చేసేందుకు యత్నిస్తున్నారన్నారు. సమైక్యాంధ్ర కోసం అసెంబ్లీ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ సీమాంధ్ర మంత్రులు అధికారాన్ని ఉపయోగించి ఆస్తులు కూడగట్టుకున్నారని, విభజన జరిగితే పోయేది సామాన్య ప్రజలే కదా అనే భావన వారిలో ఉందని విమర్శించారు. ఉద్యమ తీవ్రతను పెంచి రాష్ట్ర సమైక్యత కోసం కృషి చేద్దామన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గుంట తులసీరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజనలో శాస్త్రీయత లేదన్నారు. శ్రీలంకలో తమిళ ప్రజలపై జరిగిన దాడులకు నిరసనగా శ్రీలంక పర్యటన రద్దు చేసుకోవాలన్న తమిళ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గిన ప్రధాన మంత్రి, కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రజల మనోభావాలను మాత్రం పట్టించుకోవడంలేదని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సమైక్యాంధ్రకు అనుకూలమో? ప్రతికూలమో? చెప్పలేని దుస్థితిలో ఉన్నారని విమర్శించారు. పరిరక్షణ వేదిక ప్రతినిధి దామోదరరెడ్డి మాట్లాడుతూ బలమైన రాష్ట్రం ఉండకూడదనే దురుద్దేశంతోనే కాంగ్రెస్ రాష్ట్ర విభజనకు పాల్పడుతోందన్నారు. మరోసారి ఉద్యమిస్తే విభజన ఆగిపోతుందన్నారు. వేదిక ప్రతినిధులు జామి భీమశంకర్, కాళీప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు రాజకీయ పార్టీలే కారణమన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దుప్పల రవీంద్ర మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం ఉద్యమించిన ఎన్జీవోలు సమ్మె విరమించడం ప్రభుత్వకుట్రగా అభివర్ణించారు. గ్రామీణస్థాయిలో ప్రజలను సమైక్య ఉద్యమంలో భాగస్వాములను చేయాలన్నారు. జిల్లా పరిరక్షణ కమిటీ ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ కమిటీ జిల్లా కమిటీని ప్రకటించారు. కన్వీనర్‌గా పొన్నాడ వెంకట రమణారావు, చైర్మన్‌గా గుంట తులసీరావు, వైస్ చైర్మన్‌గా జామి భీమశంకర్, కో-కన్వీనర్‌గా కొంక్యాన వేణుగోపాలరావు, సభ్యులుగా దుప్పల వెంకట్రావు, గేదెల ఇందిరాప్రసాద్, గీతాశ్రీకాంత్, ఎస్.వి.ఎస్.ప్రకాష్, వాన కృష్ణచంద్, శిష్టురమేష్, జి.కృష్ణప్రసాద్, కె.ఉషారాణి, సరళకుమారి, ఇతర అన్ని జేఏసీ ప్రతినిధులు వ్యవహరిస్తారు. ఈ సమావేశంలో పూజారి జానకిరాం, పైడిరెడ్డి, అంబటి ప్రకాష్, ఇతర జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఏపి రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ప్రాంతీయ సదస్సులు
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో వచ్చే నెల 3 నుంచి ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తామని వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ రెడ్డి చెప్పారు. అక్టోబరు 3న ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో తొలి ప్రాంతీయ సదస్సు జరుగుతుందన్నారు. ఈ సదస్సుకు రాయలసీమతోపాటు నెల్లురు జిల్లా సమైక్యవాదులు హాజరుకావాలని కోరారు. అక్టోబర్ 5న గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రెండో సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. దీనికి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల సమైక్యవాదులు హాజరుకావాలని కోరారు. అక్టోబర్ 7న మూడో ప్రాంతీయ సదస్సు విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తామన్నారు. దీనికి తూర్పుగోదావరి, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల సమైక్యవాదులు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్ర కోసం కట్టుబడటాన్ని స్వాగతిస్తున్నామని లక్ష్మణ రెడ్డి చెప్పారు. టీడీపీ కూడా సమైక్యాంధ్రకు కట్టుబడాలని ఆయన కోరారు. -
సమైక్యాంధ్ర జేఏసీ సమన్వయకర్తగా లక్ష్మణరెడ్డి
హైదరాబాద్: సమైక్యాంధ్ర జేఏసీ సమన్వయకర్తగా జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి ఎంపికయ్యారు. సమైక్య రాష్ట్రం కోసం జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం ఈరోజు ఇక్కడ జరిగింది. ఈ సమావేశంలో రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లక్ష్మణ రెడ్డి, డి.గోపాలకృష్ణ, ఎన్యూ మాజీ వీసీ వేణుగోపాల్‌రెడ్డి, ఆర్థిక నిపుణుడు ఎం.ఎల్.కాంతారావు, ఏపీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు పూర్ణచంద్రరావు, ప్రముఖ వైద్యులు పద్మాచౌదరి, వ్యవసాయరంగ నిపుణులు అక్కినేని భవానీప్రసాద్ పలువురు నిపుణులు, విద్యార్థి సంఘ నేతలు హాజరయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఈ సమావేశం డిమాండ్ చేసింది.