బి.కొత్తకోట (చిత్తూరు జిల్లా): పోలవరం భూ నిర్వాసితులకు చెల్లించిన పరిహారంలో అక్రమాలు వెలుగుచూసినందున వాటిని సమగ్రంగా పరిశీలించాల్సిందిగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసినట్లు రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి వెల్లడించారు. ఈ చెల్లింపులన్నీ గత ప్రభుత్వ హయాంలో జరిగిన సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలం చెన్నరాయునిపల్లెలో శనివారం జస్టిస్ లక్ష్మణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తమకు అందిన ఫిర్యాదుల్లో హౌస్‌ఫెడ్, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, పోలవరం పరిహారంలో అక్రమాలు వెలుగుచూశాయని చెప్పారు. పోలవరం పరిహారంపై పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నివేదిక చూశాక సీఐడీ ద్వారా సమగ్ర విచారణకు ఆదేశించనున్నట్లు చెప్పారు. నిర్వాసితులకు మరో రూ.30 వేల కోట్లకు పైగా పరిహారం ఇవ్వాల్సి వున్నందున అనర్హుల ఏరివేతతో ప్రభుత్వంపై భారం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వ హయాంలోని వివిధ అంశాలపై జస్టిస్ లక్ష్మణరెడ్డి వెల్లడించిన వివరాలివీ..
► పోలవరం ప్రాజెక్టు భూ నిర్వాసితుల్లో నిరక్ష్యరాస్యులు ఉండడంతో అక్రమాలు జరిగినట్లు తేలింది. మాకు అందిన ఫిర్యాదులను డీఎస్పీ ద్వారా క్షేత్రస్థాయిలో విచారణ చేయించాం. ఓ రేషన్ షాపు డీలర్ భార్య పేరుతో రూ.64 లక్షల పరిహారం పొందారు. దీన్ని విచారిస్తే ప్రభుత్వ భూమిని సొంత పట్టా భూమిగా చూపి పరిహారం పొందినట్లు నిర్ధారణ అయింది. ఆ సొమ్మును రికవరి చేశాం. ఇలాంటి అక్రమాలను బాధితులు మా దృష్టికి తెచ్చారు. ► గుంటూరు, కృష్ణా జిల్లాల్లో బోగస్ పట్టాలు, పట్టాదారు పాసుపుస్తకాలతో బ్యాంకుల నుంచి రుణాలు పొందారు. ఇలా ఇంకెన్ని మోసాలు జరిగాయో నిగ్గు తేల్చాలని కలెక్టర్లకు లేఖలు రాశాం.
► తూర్పు గోదావరి జిల్లా తొండంగి గ్రామంలో 90 శాతం మంది రైతులు ప్రైవేటు వ్యాపారుల నుంచి అప్పులు తీసుకుని తాము వ్యవసాయం చేస్తున్నామని, ఇక్కడి ప్రాథమిక సహకార పరపతి సంఘంలో తమ పేర్లతో రుణాలు పొందినట్లు అనుమానిస్తూ రైతులు ఫిర్యాదు పంపారు. దీనిపై విచారణ జరపాలని కలెక్టర్‌కు ఆదేశాలిచ్చాం. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలపై విచారణ జరపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశాం.
► అలాగే, వైఎస్సార్ జిల్లాకు చెందిన గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ రుణగ్రహీతలు చెల్లించిన రుణాలను తన సొంతానికి వాడుకున్న కేసు విచారణలో ఉంది. అనంతపురం జిల్లా కదిరికి చెందిన ఓ వ్యక్తి ఇంటిపై రూ.75వేల రుణం తీసుకుని చెల్లించినా, ఇంకా రూ.6.96 లక్షల రుణం ఉందంటూ హౌస్‌ఫెడ్ అధికారులు నోటీసిచ్చారు. కాబట్టి.. హౌస్‌ఫెడ్‌కు చెల్లిస్తున్న వాయిదాల రసీదులను రుణగ్రహీతలు జాగ్రత్తగా ఉంచుకోవాలి.
► గ్రంథాలయ సెస్సు చెల్లించకుండా స్థానిక సంస్థలు నిర్లక్ష్యం చేశాయి. దీంతో రాష్ట్రంలోని మున్సిపాలిటీల నుంచి రూ.60 కోట్ల సెస్సును గ్రంథాలయ సంస్థకు చెల్లించేలా చేశాం. అలాగే, స్థానిక సంస్థలకు అందాల్సిన సీవరేజి చార్జీలను ప్రభుత్వ శాఖల నుంచి రూ.100 కోట్లకు పైగా వసూలుచేసి వాటికి జమచేశాం.
► చెరువుల ఆక్రమణలపై చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి విన్నవించాం. ప్రస్తుతం జరుగుతున్న సమగ్ర భూ సర్వేలో చెరువులకూ సర్వే జరపాల్సిన అవసరం ఉంది. లోకాయుక్త సేవలను కోస్తా వాసులు సది్వనియోగం చేసుకొంటున్నారు. ఈ విషయంలో రాయలసీమ వెనుకబడింది. ప్రభుత్వాధికారులు సేవలను అందించడంలో నిర్లక్ష్యం చేసినా, నష్టం కలిగించినా లోకాయుక్తను ఆశ్రయించవచ్చు. ఇటీవల ఎక్సైజ్ శాఖలోని సెక్యూరిటీ గార్డులకు వేతనాలు, ఈఎస్‌ఐ, పీఎఫ్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న కేసును పరిష్కరించి తొమ్మిది మందికి న్యాయం చేశాం.
పోలవరం పరిహారంలో అక్రమాలు
Published Sun, Mar 14 2021 4:26 AM | Last Updated on Sun, Mar 14 2021 4:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment